సీజేఐ సంజీవ్ ఖన్నా: న్యాయవ్యవస్థలో ఎలాంటి మార్పులు తేగలరు?

సీజేఐగా జస్టిస్ సంజీవ్‌ ఖన్నా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సీజేఐగా జస్టిస్ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం
    • రచయిత, వి.వెంకటేశన్
    • హోదా, బీబీసీ హిందీ కోసం

జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఆయన ఈ పదవిలో 6 నెలల ఒక రోజు ఉంటారు. వచ్చే ఏడాది మార్చి 13న ఆయన పదవీ విరమణ చేస్తారు.

జస్టిస్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగేది స్వల్పకాలమే. అయినా, ఆయన సామర్థ్యం, న్యాయ నిర్ణయాలు, భారత న్యాయవ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న పరిమితుల దృష్ట్యా ఆయన పదవీ కాలం ఎలా ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

సుప్రీంకోర్టులో ఇలా తక్కువ కాలమే పదవిలో కొనసాగిన ప్రధాన న్యాయమూర్తులు సంస్కరణలకు దిశానిర్దేశం చేసేందుకు తగిన ముద్ర వేయగలరగని, తమ తదుపరి న్యాయమూర్తులు వాటిని అనుసరించగలరని చరిత్ర చెబుతోంది.

సుప్రీంకోర్టులో న్యాయపరమైన తప్పిదాలు, లోటుపాట్లను పరిహరించడంలో అటు పరిపాలనకు, ఇటు న్యాయ కుటుంబానికి పెద్దగా ప్రధాన న్యాయమూర్తి కీలక పాత్ర పోషిస్తారు.

అయితే వ్యవస్థకు ఉన్న పరిమితుల దృష్ట్యా కొన్ని అసమానతలు అనివార్యమైనప్పటికీ వాటిని కనిష్ఠస్థాయికి తగ్గించడానికి, వాటి ప్రభావాన్ని పరిమితంగా చూపడానికి ప్రధాన న్యాయమూర్తి కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు.

అయితే పెండింగ్ కేసులు ఒక్కటే సీజేఐను ఆందోళన పెట్టే అంశం కాదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, supreme court

ఫొటో క్యాప్షన్, ఎలక్టోరల్ బాండ్స్ కేసులో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయీ, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు.

జస్టిస్ ఖన్నా పేరును ఎలా సిఫార్సు చేశారు

సుప్రీం కోర్టు‌ అయిదుగురు న్యాయమూర్తుల కొలీజియం జస్టిస్ ఖన్నా నియామకాన్ని సిఫారసు చేసింది. ఆ సమయంలో జస్టిస్ ఖన్నా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.

అప్పట్లో మరో 32 మంది హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని (హైకోర్టు న్యాయమూర్తిగా నియమించిన తేదీకి సంబంధించి) కాదని, జస్టిస్ ఖన్నా పేరును ముందుకు తెచ్చారు.

కొలీజియం జస్టిస్ ఖన్నాను సిఫారసు చేయడానికి గల కారణాన్ని విశ్రాంత చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తన ఆటోబయోగ్రఫీలో వివరించారు.

ఇతర సీనియర్లతోపాటు పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఖన్నాకు ప్రధాన న్యాయమూర్తిగా పదవీవిరమణ చేయడానికి కనీసం ఆరునెలల సమయం ఉందని, అందుకే ఆయనను సిఫారసు చేసిందని రాశారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకాన్ని సిఫారసు చేయడానికి ఆయనకున్న సమర్థత, సమగ్రతను కాకుండా, పదవీకాలాన్ని కొలీజియం పరిగణనలోకి తీసుకోవడంపై వేర్వేరు వాదనలున్నాయి.

అయితే ఇటీవల ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలాన్ని పరిశీలించినప్పుడు, ప్రత్యేకించి ఎక్కవమందికి అర్హత ఉన్నప్పుడు ఇదొక అదనపు అంశంగా (పదవీకాలం) మారింది.

మరో విషయం ఏమిటంటే జస్టిస్ ఖన్నా దిల్లీ హైకోర్టుకు చెందినవారు కావడం. గత 20 ఏళ్లుగా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులెవరూ భారత ప్రధాన న్యాయమూర్తులు కాలేదు.

ఈ అంశం కూడా ఖన్నాకు అనుకూలంగా మారిందని గొగొయ్ రాశారు.

justice Sanjeev Khanna

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యాయవాదిగా 23 ఏళ్ల అనుభవం ఉన్న జస్టిస్ ఖన్నా 2006 ఫిబ్రవరిలో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.

23ఏళ్ల అనుభవం

జస్టిస్ ఖన్నా 2005లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006 ఫిబ్రవరిలో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

అంతకముందు ఆయనకు న్యాయవాద వృత్తిలో 23 ఏళ్ల అనుభవం ఉంది.

తొలుత దిల్లీలోని తీస్ హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టులో, దిల్లీ హైకోర్టు, ట్రిబ్యునళ్లలో పన్నులు, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టం, భూసేకరణ, ఆరోగ్యం, పర్యావరణం వంటి వివిధ రంగాల్లో దాదాపు 23 ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడానికి ముందు ఆయన ఆదాయ పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, తదుపరి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీకి ప్రాతినిధ్యం వహించారు.

ఇటీవల కాలంలో సీజేఐ కార్యాలయం ‘మాస్టర్ ఆఫ్ ది రోస్టర్’ కారణంగా తరచూ ప్రజాపరిశీలనలో ఉంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల రోస్టర్‌ను ప్రధాన న్యాయమూర్తి ‘మాస్టర్ ఆఫ్ ది రోస్టర్’గా నిర్ణయిస్తారు.

కంప్యూటర్ ద్వారా వివిధ కేసులను వివిధ న్యాయమూర్తులకు కేటాయిస్తారు. ఇది న్యాయమూర్తుల లభ్యత, వారి సీనియార్టీ ఆధారంగా క్రమం తప్పకుండా జరిగే కేటాయింపు.

కానీ ఎప్పటికప్పుడు ‘మాస్టర్ ఆఫ్ ది రోస్టర్’ కేసుల జాబితాను మార్చుతుంది. ఇది తరచుగా ఒక కేసు అనుకూల ఫలితంలో విచారణను నిర్ధరించడంలో మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అధికారాలు ఏకపక్షంగా, దుర్వినియోగానికి గురవుతాయనే విమర్శలకు దారితీస్తోంది.

రాజకీయ ఖైదీకి బెయిల్ విచారణ అయినా, చట్టసభ లేదా, ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేసినా, కొన్ని నమ్మకాలు, అభిరుచులున్న కొందరు న్యాయమూర్తుల ముందు కేసులను విచారణకు లిస్ట్ చేయడం పక్షపాత ఫలితాలకు దారితీసే అవకాశం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంజయ్ ఖన్నా, చంద్రచూడ్

ఫొటో సోర్స్, ANI

కొలీజియంపై ఏమన్నారు?

‘న్యాయవ్యవస్థ స్వతంత్రత పారదర్శకత అవసరానికి భిన్నంగా ఉండరాదు’ అని జస్టిస్ ఖన్నా ఓ తీర్పులో రాశారు.

మరి, జస్టిస్ ఖన్నా మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ గా, సుప్రీంకోర్టు, కొలీజియం వ్యవస్థలో తన అధికారాల వినియోగంలో మరింత పారదర్శకత ఉండేలా చూస్తారా అని పరిశీలకులు అడుగుతున్నారు.

సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మరింత పారదర్శకంగా ఉండాలని పలువురు ప్రధాన న్యాయమూర్తులు ప్రయత్నించినప్పటికీ దాని పనితీరు గోప్యంగానే ఉంది.

వివిధ హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకంపై ప్రభుత్వంతో కొనసాగుతున్న వివాదంలో, కొలీజియం తరచుగా కార్యనిర్వాహక వర్గానికి ప్రాధాన్యం ఇస్తుంది. చట్టప్రకారం కొలీజియం సిఫారసును పునరుద్ఘాటిస్తే అది ప్రభుత్వానికి కట్టుబడినట్టుగా కనిపిస్తుంది.

మరి జస్టిస్ ఖన్నా ఈ ధోరణికి పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటారా?

ఈ పదవిలో ఉన్న చాలా మంది ప్రధాన న్యాయమూర్తులు దీనిని పరిపాలనా సమస్యగా చూడటానికే ఇష్టపడతారు. కాబట్టి ప్రభుత్వాన్ని న్యాయపరంగా క్రమశిక్షణలో ఉంచే ఏ ప్రయత్నమైనా కొలీజియం సిఫార్సు చేసే నియామకాలను, బదిలీలను ఆలస్యం చేయడానికి దారితీస్తుంది.

చట్టం..

ఫొటో సోర్స్, Getty Images

జస్టిస్ ఖన్నా కీలక తీర్పులు

జస్టిస్ ఖన్నా కొన్ని చక్కని తీర్పులు ఇచ్చారు. అవి ఆయన న్యాయపరమైన తర్కాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే అవి ప్రభుత్వ అనుకూలమైనవని కొందరు పరిశీలకులు విమర్శిస్తుంటారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ద్వారా పోలైన ఓట్లను ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)తో నూటికి నూరు శాతం ధ్రువీకరించాలన్న అభ్యర్థనను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వీవీప్యాట్ పరిశీలిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తొలుత మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం 90 రోజులకు పైగా సుదీర్ఘ జైలు శిక్షను అనుభవించిన కారణంగా జులైలో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరైన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును పరిమితం చేస్తూ కోర్టు విధించిన షరతులు ఆయన రాజీనామాకు దారితీశాయి.

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును ఆయన సమర్థించారు. ఈ రద్దు ఫెడరల్ వ్యవస్థను నిర్వీర్యం చేయదని ఆయన వాదించారు. దేశంలోని ఇతర ప్రాంతాలలోని పౌరులమాదిరిగానే కశ్మీర్ పౌరులుకూడా జీవిస్తారని, వారు కూడా ఒకేరకమైన హోదాను అనుభవిస్తారని చెప్పారు.

లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటును సమర్థిస్తూ కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనను రికార్డు చేయడంపై ఆయన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో ఏకీభవించారు.

కానీ ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని, సమాఖ్య విధానానికి విఘాతం కలిగిస్తుందని ఆయన తన ప్రత్యేక తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు.

కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటును సమర్థించడానికి బలమైన కారణాలు అవసరమని, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కి కచ్చితంగా లోబడి ఉండాలని ఆయన అన్నారు. అయితే ఈ షరతులను ప్రభుత్వం నెరవేర్చిందో లేదో చెప్పలేదు.

దాతలకు గోప్యతాహక్కు లేదంటూ కేంద్ర ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్ ఖన్నా ప్రత్యేక అభిప్రాయాన్ని రాశారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపైనా ఆయన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జస్టిస్ ఖన్నా

ఫొటో సోర్స్, ANI

వివాదాలూ ఉన్నాయా?

జస్టిస్ ఖన్నా వివాదాలకు అతీతం కాదు.

సుప్రీం కోర్టు ఉద్యోగి ఒకరు అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌ (ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు) పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించడానికి ఓ శనివారం (ఏప్రిల్ 20, 2019) సమావేశమైన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్ ఖన్నా కూడా ఒకరు.

జస్టిస్ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రాల ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా ఉండటం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఆరోపణలపై సంయమనం పాటించాలని ధర్మాసనం మీడియాను ఆదేశించింది.

ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అంతర్గత విచారణ గొగోయ్‌కు క్లీన్ చిట్ ఇస్తూ తన నివేదికను గోప్యంగా ఉంచింది.

సీనియారిటీని పట్టించుకోవడంలేదనే విమర్శలను తోసిపుచ్చుతూ జస్టిస్ ఖన్నా పదోన్నతికి అప్పటి చీఫ్ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది.

పదవీవిరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ జస్టిస్ ఖన్నా నిష్పాక్షికత, సవాళ్ల సమయంలోనూ చిరునవ్వుతో ఉండగల సామర్థ్యాన్ని బహిరంగంగా ప్రశంసించారు

వ్యక్తిగతంగా జస్టిస్ ఖన్నా నిజాయితీకి మారుపేరైన న్యాయమూర్తుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఎమర్జెన్సీ సమయంలో దాఖలైన ఓ హెబియస్ కార్పస్ పిటిషన్‌పై... ప్రజల ప్రాథమిక హక్కులను సరైన కారణం లేకుండా నిలిపివేయలేమంటూ.. అసమ్మతిని రాసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హన్స్‌రాజ్‌ ఖన్నా సోదరుడి కుమారుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా.

ఆ తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం తదుపరి సీజేఐని నియమించే సమయంలో హన్స్‌రాజ్ ఖన్నా సీనియారిటీని విస్మరించింది. జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా తర్వాత రాజీనామా చేసినప్పటికీ సుప్రీంకోర్టు చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని పొందారు.

(వి. వెంకటేశన్ న్యాయవ్యవహారాల సీనియర్ పాత్రికేయుడు. ఆయన వ్యాసాలు దేశంలోని వివిధ పత్రికలలో ప్రచురితమవుతుంటాయి)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)