జస్టిస్ చంద్రచూడ్: సీజేఐగా ఆయన పదవీకాలాన్ని ఎలా చూడాలి

చంద్రచూడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమంగ్ పోద్దార్
    • హోదా, బీబీసీ లీగల్ కరస్పాండెంట్

ఇటీవలి కాలంలో అత్యంత ప్రభావం చూపిన భారత ప్రధాన న్యాయమూర్తులలో సీజేఐ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఒకరు.

ఆయన నవంబర్ 10న పదవీ విరమణ చేశారు. రెండేళ్ల కిందట ఆయన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రశంసలు వెల్లువెత్తగా.. ఇప్పుడు పదవీ విరమణ సమయానికి విమర్శలు వినిపిస్తున్నాయి.

పదవి చేపట్టేనాటికి ఒక "రాక్ స్టార్" జడ్జిగా ఆయన్ను చూశారు. కోర్టు పనితీరును మార్చగలరని, మెజారిటీ వాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడగలరని.. సాధారణ పౌరులకు న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురాగలరని ఆయనపై చాలా అంచనాలు వ్యక్తమయ్యాయి.

బహుశా ఈ అంచనాలు మరీ ఎక్కువ కావడం వల్లో ఏమో ఆయన పదవీకాలంపై కొందరు నిరాశ చెందుతున్నారు.

న్యాయపరంగా ఆయన తీర్పులు, ఆదేశాలు; వ్యక్తిగతంగా ఆయన తీరు రెండూ విమర్శలకు దారితీశాయి.

చరిత్రలో అనేక మంది ఇతర న్యాయమూర్తుల కంటే చంద్రచూడ్ ఎక్కువగా మీడియా ఫోకస్‌లో ఉన్నారు.

ప్రసంగాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలతో తరచూ వార్తల్లో నిలిచారు.

అయితే, ఇటీవల జరిగిన రెండు సంఘటనలు న్యాయమూర్తిగా ఆయన తీరుపై తీవ్ర విమర్శలకు దారితీశాయి.

అందులో మొదటిది, అయోధ్య ఆలయ వివాదానికి పరిష్కారం కోరుతూ తాను “దేవుడి ముందు కూర్చున్నాను” అని చెప్పినప్పుడు కాగా.. రెండో సందర్భం.. చంద్రచూడ్ నివాసంలో ఆయనతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినాయక పూజ చేయడం.

ఈ రెండు ఉదంతాలూ - తమ తీర్పులను బహిరంగంగా సమర్థించుకోవడంలో కానీ, మతపరమైన కార్యక్రమాల కోసం రాజకీయ నాయకులను కలవడంలో కానీ - న్యాయమూర్తుల సాధారణ తీరుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఆంగ్లపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ‌తో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ గణేష్‌పూజా కార్యక్రమాన్ని ‘ప్రైవేటు కార్యక్రమం’గా చెబుతూ ‘అందులో తప్పేమీ లేదని’ చెప్పారు.

జస్టిస్ చంద్రచూడ్ తాను హిందువును అనేది బాహాటంగా ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించారనీ కొందరు ఆయనపై విమర్శలు చేస్తుంటారు.

ఇవన్నీ ఎలా ఉన్నా చంద్రచూడ్ పదవీకాలం అనేక సంక్లిష్టతలతో నిండి ఉంది.

చాలా మంది ఇతర న్యాయమూర్తుల మాదిరిగానే, స్వేచ్ఛకు అనుకూలం కావచ్చు, ప్రభుత్వానికి అనుకూలం కావచ్చు, ఆయన పదవీకాలాన్ని స్పష్టమైన పదాలతో నిర్వచించడం కష్టం.

ఆయన కొంత మంచి చేసినప్పటికీ.. తానే స్వయంగా నిర్దేశించుకున్న లక్ష్యాలతో సహా సవాళ్లను పరిష్కరించడంలో విఫలమైన ప్రధాన న్యాయమూర్తిగా కొందరు చూస్తారు. అదేసమయంలోప్రభుత్వానికి ఎదురొడ్డి హక్కులను విస్తరించిన తీర్పులు ఉన్నాయనీ చెప్తారు. అలాగే ఆయన ఇచ్చిన కొన్ని తీర్పులు హక్కులను కుచింపజేశాయన్న విమర్శలూ ఉన్నాయి.

కొన్ని తీర్పులు భవిష్యత్ కేసుల కోసం ఉన్నతమైన సూత్రాలను నిర్దేశించాయి కానీ అసలు కేసుకు ఎటువంటి ఉపశమనం ఇవ్వలేదనీ విశ్లేషిస్తారు కొందరు.

అంతేకాకుండా, ప్రభుత్వం గతంలో మాదిరిగానే న్యాయమూర్తుల నియామకాలపై న్యాయవ్యవస్థ మీద ఒత్తిడిని కొనసాగించడం.. రాజకీయంగా సున్నితమైన అనేక కేసులను కోర్టుల ముందు విచారణకు ఆయన లిస్ట్ చేసిన తీరుపైనా విమర్శలున్నాయి.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, Getty Images

రోస్టర్ మాస్టర్

న్యాయమూర్తిగా చంద్రచూడ్ ప్రశాంతంగా ఉంటారని, న్యాయవాదుల సీనియారిటీతో సంబంధం లేకుండా వారి వాదనలను ఆయన సహనంతో వింటారని పేరు.

అయితే, న్యాయమూర్తుల పదవీకాలాన్ని వారు ఇచ్చిన తీర్పులు, వారి పాలన తీరును బట్టి చూస్తారు.

ఇక చంద్రచూడ్ విషయంలోలా న్యాయమూర్తుల బహిరంగంగా ఎలా ఉంటారు అనేదీ గమనిస్తారు.

భారతదేశపు న్యాయవ్యవస్థలో అగ్రపీఠాన కూర్చునే భారత ప్రధాన న్యాయమూర్తికి చాలా అధికారం ఉంటుంది.

ఏ కేసు ఎప్పుడు విచారణకు రావాలి, ఎవరు విచారించాలని నిర్ణయించే పూర్తి అధికారం కలిగిన ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’ భారత ప్రధాన న్యాయమూర్తి.

కేసును ఏ న్యాయమూర్తి విచారిస్తున్నారనేది ఆ కేసు ఫలితాన్ని - అంటే తీర్పును ఒక్కోసారి ప్రభావితం చేస్తుంది. కొందరు న్యాయమూర్తులు సంప్రదాయవాదులు, మరికొందరు ఉదారవాదులు. ఏ న్యాయమూర్తి ఎటువైపు మొగ్గు చూపుతారనేది న్యాయ వర్గాలలో బాగానే తెలిసి ఉంటుంది. అందువల్ల, ప్రధాన న్యాయమూర్తి తనకు గల మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాన్ని ఉపయోగించి కేసు ఫలితాలను కూడా పరోక్షంగా ప్రభావితం చేయవచ్చు.

2017లో.. జస్టిస్ దీపక్ మిశ్రా చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు, రాజకీయంగా సున్నితమైన కేసులను సీజేఐ కొన్ని నిర్దిష్ట ధర్మాసనాలకు కేటాయిస్తున్నారంటూ.. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులు నలుగురు అప్పట్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఆరోపించారు.

అప్పటి నుంచి కేసుల కేటాయింపు అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది.

చంద్రచూడ్ పదవీకాలంలో కూడా కొన్ని కీలక కేసుల కేటాయింపు విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన సీజేఐగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, కోర్టులను మరింత పారదర్శకంగా మార్చాలనుకుంటున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే, కేసుల కేటాయింపు విషయానికి వచ్చేటప్పటికి అది కనిపించలేదనే విమర్శలున్నాయి.

ఆయన పదవీకాలంలో 33 రాజ్యాంగ ధర్మాసనం కేసులు పరిష్కారం కావడం ఒక సానుకూల విషయం.

ఇవి చట్టానికి సంబంధించిన జటిల ప్రశ్నలకు సంబంధించిన కేసులు. వీటి విచారణకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తుల ధర్మాసనం అవసరం.

ఆర్టికల్ 370 రద్దు, ఎలక్టోరల్ బాండ్లు వంటి అనేక కీలక అంశాలకు సంబంధించి ఐదుగురు, ఏడుగురు, తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనాలను ఆయన ఏర్పాటు చేశారు.

ఆయన పదవీకాలానికి ముందు.. సుప్రీంకోర్టు ఈ కేసులను పరిష్కరించకుండా నాన్చుతోందని సర్వోన్నత న్యాయస్థానం మీద ఉన్న ఒక పెద్ద విమర్శ ఉండేది.

కానీ ఈ కోణంలో ఆయన మిగతా అంశాలకన్నా కేసులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

క్వీర్ జంటల (స్వలింగ సంపర్కులు, ఇతరత్రా) వివాహానికి సంబంధించిన కేసులూ ఒక ఉదాహరణ.

గోప్యత హక్కు ఒక ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ, స్వలింగ సంపర్కం కూడా నేరం కాదని ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనంలో చంద్రచూడ్ ఉన్నారు.

దీనివల్ల, స్వలింగ సంపర్కులకు వివాహం చేసుకునే హక్కు కూడా ఇవ్వాలని భావిస్తున్నారని ఆయన మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని రికార్డు వేగంతో కోర్టు విచారణకు తీసుకురావడంతో పాటు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఇచ్చారు. ఈ ప్రక్రియలో, భారతదేశమంతటా ఇలాంటి కేసులన్నిటినీ కూడా సుప్రీంకోర్టు తనకు బదిలీ చేసుకుంది.

కానీ, తుది ఫలితం క్వీర్ కమ్యూనిటీకి ఏమాత్రం సంతృప్తికరంగా లేదు.

వివాహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కు లేదని ఐదుగురు న్యాయమూర్తులూ తీర్పు చెప్పారు.

ఇక కొత్త కేసులను చాలా వేగంగా విచారించగా.. మరికొన్ని అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి.

పౌరసత్వ సవరణ చట్టానికి రాజ్యాంగబద్ధత అంశంపైనా, వైవాహిక అత్యాచారానికి మినహాయింపు అంశంపైనా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, Getty Images

బెయిల్ అంశాలు

స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని నిర్దిష్ట కేసుల్లో చంద్రచూడ్ వేగంగా వ్యవహరించారు.

ఉదాహరణకు, సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాద్‌కు గుజరాత్ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించిన తరువాత, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా శనివారం రోజు విచారణ జరిపి ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

కానీ, ఐదేళ్లకు పైగా జైలు ఉన్న భీమా కోరెగావ్ కేసు నిందితుడు మహేష్ రౌత్ బెయిలు విషయం.. చంద్రచూడ్ పదవీకాలంలో స్వేచ్ఛను విస్మరించిన ఉదాహరణలలో ఒకటి.

ఈ కేసులో, కుల ప్రాతిపదికన హింసను ప్రేరేపించారని, నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో 16 మంది కార్యకర్తలు, మేధావులను జైలులో పెట్టారు.

మహేష్ రౌత్ 2023లో బొంబాయి హైకోర్టు నుంచి బెయిల్ పొందినప్పటికీ, ఆయన బెయిల్ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

అప్పటి నుంచి ఆయన బెయిల్ దరఖాస్తు సర్వోన్నత న్యాయస్థానం దగ్గర పెండింగ్‌లోనే ఉంది. సాధారణంగా, హైకోర్టులు మంజూరు చేసిన బెయిళ్లను సుప్రీంకోర్టు నిలిపివేయడం చాలా అరుదు.

జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విషయం పెండింగ్‌లో ఉంది.

దిల్లీ అల్లర్ల కేసులో నిందితుడైన ఉమర్ ఖలీద్ బెయిల్ విషయంలోనూ ఇలాంటి విమర్శ ఉంది.

ఇక, రితు చబ్బారియా కేసు.. ఏవైనా కేసుల్లో అసంపూర్ణ చార్జిషీట్లను దాఖలు చేయడం అనేది.. సదరు కేసుల్లో నిందితులు బెయిల్ పొందడానికి దానికదే ఒక ప్రాతిపదిక కావచ్చునని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. ఇది దర్యాప్తు కాలాన్ని పొడిగించడానికి దర్యాప్తు సంస్థలు ఉపయోగించే ఒక వ్యూహం.

అయితే, ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఉన్న చంద్రచూడ్, ఈ కేసును కేవలం మౌఖికంగా ప్రస్తావించి తన ధర్మాసనానికి బదిలీ చేసుకున్నారు. ఆ తర్వాత పై ఉత్తర్వు మీద స్టే విధించారు. ఇది న్యాయ నియమాలకు విరుద్ధమని తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.

"ధర్మాసనాల ఏర్పాటు, కేసుల కేటాయింపు విషయంలో ఇంకా చాలా జరగాల్సి ఉంది" అని సీజేఐ ఏడాది పదవీకాలం గురించి రాసిన దుష్యంత్ దవే పేర్కొన్నారు.

కేసులను విచారణకు కేటాయించకపోవడం వల్ల స్వేచ్ఛకు, జవాబుదారీతనానికి ఇబ్బంది కలిగించిన అనేక ఇతర ఉదంతాలు ఉన్నాయి.

ప్రతిపక్షాలు, ప్రభుత్వ విమర్శకుల మీద ప్రయోగించడం ద్వారా మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని తరచుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. ఈ చట్టానికి సంబంధించిన కేసును సమీక్షించాలన్న ఒక పిటిషన్ చంద్రచూడ్ పదవీకాలంలోనే పెండింగ్‌లో ఉండిపోయింది.

సుప్రీంకోర్టు 2022లో ఇచ్చిన ఒక తీర్పులో అరెస్టులు, దర్యాప్తులు, బెయిల్‌ల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు పూర్తి అధికారాలు ఇచ్చింది.

ఆ తీర్పు ఇచ్చిన వెంటనే దానిని సమీక్ష కోసం నివేదించారంటే.. ఆ ఆదేశాల తీవ్రత అర్థమవుతుంది.

ఇక, చండీగఢ్ మేయర్ ఎన్నికలకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన అనిల్ మాసికి వ్యతిరేకంగా దాఖలైన కేసు ఈ రోజుకూ వెలుగు చూడని మరో కేసు.

అనిల్ మాసి బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారనే ఆరోపణలతో.. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన మీద ఈ ఏడాది ఫిబ్రవరిలో పెర్జ్యురీ ప్రొసీడింగ్స్ ప్రారంభించింది.

ఈ విచారణ జరిగినప్పుడు అనిల్ మాసి విషయంలో చంద్రచూడ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో కోర్టు ఆయన్ను శిక్షిస్తుందనుకున్నారు. కానీ, ఈ కేసు అసలు విచారణకు రానేలేదు.

సీనియర్ న్యాయవాది సంజయ్ హెడ్జ్ .. "స్వేచ్ఛ, జవాబుదారీతనం అమలు అంశాలపై ఆయన పదవీకాలాన్ని సమీక్షిస్తే.. ఉమర్ ఖలీద్ జైలులోనే కొనసాగుతున్నారని, అనిల్ మాసి ఇంకా జైలుకు వెళ్లాల్సి ఉందని చెప్పవచ్చు" అన్నారు.

రాజ్యాంగ ధర్మాసనం కేసులు అంతకుముందు కంటే ఎక్కువగా పరిష్కారమైనప్పటికీ.. చంద్రచూడ్ పదవీకాలంలో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది.

ఆయన సీజేఐగా బాధ్యతలు స్వీకరించినప్పుడు 69,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ఆయన పదవీ విరమణ చేసేటప్పటికి పెండింగ్ కేసుల సంఖ్య 82,000 కి పెరిగింది. "పరిపాలనాపరంగా సమర్థవంతమైన సీజేఐ ఈ సంఖ్య సమస్యను పరిష్కరించగలరని నేను నమ్ముతున్నాను. ప్రస్తుత సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం కేసుల సవాళ్లను స్వీకరించారు. కానీ పెండింగ్ కేసుల సంఖ్యను నియంత్రించడంలో విఫలమయ్యారు" అని జస్టిస్ మదన్ లోకూర్ అన్నారు.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, ANI

కొలీజియం అధిపతిగా

చంద్రచూడ్ పదవీకాలంలో న్యాయ నియామకాల అంశం పెద్ద వైఫల్యం అని కొందరు భావిస్తున్నారు.

న్యాయ వ్యవస్థలో ఎవరిని నియమించాలనే దానిపై తుది అధికారం ఉన్నత న్యాయవ్యవస్థకు చెందిన సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియందేనని చట్టం స్పష్టం చేస్తోంది.

కొలీజియం సిఫారసు చేసిన పేర్లతో ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ఆ పేర్లను ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే సమీక్షకోసం తిప్పి పంపగలదు. కానీ కొలీజియం అవే పేర్లను మళ్లీ ప్రతిపాదిస్తే ప్రభుత్వం ఆమోదించి తీరాలి.

కొన్నేళ్లుగా, ప్రభుత్వం దీనిని బలంగా వెనక్కి నెడుతూ, న్యాయ నియామకాలలో తను పైచేయి పొందడానికి ప్రయత్నించింది.

ఇది తరచుగా నియామకాలను నిలిపివేయడం, లేదా ప్రభుత్వం ఆమోదించిన న్యాయమూర్తులను నియమించడానికి దారితీస్తుంది.

చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు, న్యాయవ్యవస్థలో ఖాళీలను విభిన్నత్వంతో కూడిన అభ్యర్థులతో భర్తీ చేయడం తన లక్ష్యాలలో ఒకటని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

కానీ ఈ నియామక ప్రక్రియను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడాన్ని చంద్రచూడ్ పదవీకాలం ఆపలేకపోయిందనే అభిప్రాయం కొందరు న్యాయ నిపుణులలో ఉంది.

"ఆయన ప్రభుత్వాన్ని తగినంతగా అడ్డుకోలేకపోయారు. నియామక ప్రక్రియ పరంగా ఇదొక పెద్ద సమస్య" అని చంద్రచూడ్‌తో కలిసి పనిచేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు అన్నారు. తన వివరాలు గోప్యంగా ఉంచాలని వారు కోరుకున్నారు.

"హైకోర్టులు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి" అని ఆ న్యాయమూర్తి చెప్పారు. చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు హైకోర్టులో 323 ఖాళీలుఉన్నాయి. అయితే, రెండు సంవత్సరాల తరువాత, ఖాళీలు 351 కి పెరిగాయి.

నియామకాల ప్రక్రియ సైతం పక్షపాత కేటాయింపులతో జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

నియామకాలు సాధారణంగా పరిపాలనాపరంగా జరుగుతాయి. అయితే, అరుదైన సందర్భంలో, నియామకాలపై ప్రభుత్వం చట్టాన్ని పాటించడం లేదంటూ న్యాయపరంగా ఒక కోర్టు ధిక్కార కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ కేసును విచారించారు. చట్టాన్ని పాటించకపోతే ప్రభుత్వ అధికారులను కోర్టు ధిక్కారం కింద విచారిస్తామని ఆయన ఈ కేసులో హెచ్చరించారు. అయితే, చంద్రచూడ్ పదవీకాలం ముగిసే సమయానికి, విచారణకు కేటాయించిన కేసును జాబితా నుండి తొలగించారు.

దీంతో ఆ న్యాయమూర్తి కూడా కంగుతిన్నారు. "నేను కేసును తొలగించలేదు... కొన్ని విషయాలు చెప్పకుండా వదిలేయడం మంచిది. ప్రధాన న్యాయమూర్తికి ఈ విషయం తెలుసని నేను ఖచ్చితంగా భావిస్తాను'' అని ఆయన అన్నారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. కౌల్ ఈ కేసును డిసెంబర్ 5 న తన ముందు విచారణకు పెట్టాలని గతంలో ఆదేశించారు.

అప్పటి నుండి ఈ కేసును విచారణకు కేటాయించలేదు.

న్యాయ శాఖ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. అప్పటి నుండి 30 కంటే తక్కువ మంది కొత్త హైకోర్టు న్యాయమూర్తులను నియమించారు.

ఆ నియామకాలలోనూ కొంతమంది న్యాయమూర్తుల స్థాయి పెంచడం, కొంతమంది జడ్జిల స్థాయి పెంచకపోవడం మీద ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎల్. విక్టోరియా గౌరికి సంబంధించిన ఉదంతం వీటిలో ఒకటి. ఆమె ప్రమాణ స్వీకారానికి ముందు, ఆమె మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగం చేశారనే అంశం ముందుకొచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయం కొలీజియం దృష్టికి తీసుకురాలేదంటూ జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసును మరుసటి రోజు విచారణకు కేటాయించారు. మరొక ధర్మాసనం ఈ కేసు విన్నప్పుడు, కొలీజియం అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుందని చెప్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇక స్థాయి పెంచే విషయంలో, పలువురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు నియమించకపోవటానికి కారణం వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చి ఉండటమేనన్న విమర్శలూ వచ్చాయి.

చంద్రచూడ్ పదవీకాలంలో ఇలాంటి ఒక ఉదంతం జస్టిస్ ఎస్.మురళీధర్ విషయం. దిల్లీ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ఎస్.మురళీధర్‌ను సుప్రీంకోర్టుకు నియమించకపోగా ఒడిశాకు బదిలీ చేశారు. దానికన్నా పెద్ద హైకోర్టుగాను, గణనీయమైనదిగానే పరిగణించే మద్రాస్ హైకోర్టుకు ఆయనను బదిలీ చేయగా, దానిని కూడా కేంద్రం అడ్డుకుంది. కొలీజియం ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

“సుప్రీంకోర్టులో రెండు ఖాళీలు ఉన్నా కూడా ఎస్.మురళీధర్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ ముగ్గురు న్యాయ కోవిదులు ఒక వ్యాసం రాశారు.

న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యానికి కొలీజియం వ్యవస్థ ప్రతీక అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ అభివర్ణించారు.

"నేడు, రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థ.. కాబోయే న్యాయమూర్తులు భవిష్యత్తును నిర్ణయిస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.

చంద్రచూడ్ విజయం సాధించిన ఒక అంశం సుప్రీంకోర్టు నియామకాలు. ఆయన పదవీకాలంలో 18 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించారు.

అయితే, ఈ క్రమంలో వైవిధ్యమైన నియామకాలు ఉంటాయనే తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చలేదు. నియమితులైన న్యాయమూర్తులందరూ పురుషులే.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, Getty Images

వ్యక్తిగా చంద్రచూడ్..

చంద్రచూడ్ పదవీకాలం ఆయన మీడియాలో కనిపించిన ఉదంతాల వల్ల కూడా గుర్తుండిపోతుంది. "ఆయనకు మీడియాపై విపరీతమైన నియంత్రణ ఉంది" అని సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే అన్నారు.

మీడియాలో ఆయన పాపులారిటీ వల్ల ఆన్‌లైన్ ట్రోల్స్‌కు కూడా ఆయన లక్ష్యంగా మారారు. ఆయనను "హిందూ వ్యతిరేకి" అని, "వోక్ ఫెమినిస్ట్" అని ముద్ర వేశారు.

"ఎవరైనా మీడియాతో అంతగా మిళితం అవుతున్నపుడు, జనం ఇష్టపడే మంచి పనులు చేయాలనుకుంటారు. కానీ నిజంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనుకోరు" అని దుష్యంత్ దవే అన్నారు.

మీడియాలో పలు సందర్భాలలో హిందువుగా ఆయన గుర్తింపు కూడా బాహాటంగా కనిపించింది. ఆయన గత జనవరిలో, గుజరాత్ లోని ద్వారక ఆలయాన్ని సందర్శించినప్పుడు, దేవాలయాలపై జెండా "మనందరినీ ఏకం చేస్తుంది" అంటూ.. దానిని రాజ్యాంగంతో పోల్చారు.

ఈ ఏడాది వినాయక చవితికి ఆయన ఇంట్లో పూజకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.

దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

అక్టోబర్‌లో, ఒక జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, రామజన్మభూమి కేసులో తాను దేవుణ్ణి ప్రార్థించానని, దాంతో తాను ఆ కేసుకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నానని చెప్పారు.

ఇవన్నీ తీవ్ర విమర్శలకు గురయ్యాయి.

ప్రధానమంత్రితో అంతటి సాన్నిహిత్యం ఉండటం, అది కేవలం జనం అనుకోవడమే అయినా కూడా మంచిది కాదని చాలా మంది న్యాయ నిపుణులు భావిస్తారు.

న్యాయస్థానాల ముందుకు వచ్చే కేసుల్లో ప్రభుత్వం అతిపెద్ద కక్షిదారు కాబట్టి, ఇది ఇతర న్యాయస్థానాలకు, ప్రజలకు కూడా తప్పుడు సందేశాన్ని పంపిందనేది కొందరి వాదన.

ఇదంతా అవసరమా అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు ప్రశ్నించారు. "మీ ఇంట్లో మీరు ప్రధానమంత్రితో కలిసి పూజ చేయాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ మీరు అలా చేసినా, దానిని మీడియాకు విడుదల చేయడం ఎందుకు?" అన్నారాయన.

‘నేను దేవునికి ప్రార్థించా’నని చెప్పడమంటే అది "అహేతుకత"లోకి వెళ్లడమేనని, ఇది న్యాయమూర్తులు పరిహరించాల్సిన విషయమని మరొక మాజీ న్యాయమూర్తి పేర్కొన్నారు. న్యాయమూర్తులు రాజకీయ కార్యనిర్వాహకులను కలుస్తుంటారు, కానీ తరచుగా కాదు. అది కూడా సాధారణంగా అధికారిక కార్యక్రమాల కోసం కలుస్తారు కానీ, ఎప్పుడూ పూజల కోసం కలవరు అని మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ వ్యాఖ్యానించారు.

అయితే ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రచూడ్.. ప్రధాని తన ఇంటికి రావడమనేది ప్రైవేట్ వ్యవహారమని చెప్పారు. ‘ప్రధాని మా ఇంటికి రావడం పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. సోషల్ లెవల్‌లో కూడా న్యాయవ్యవస్థలో ఉన్నవారు, కార్యనిర్వహాక వ్యవస్థలో ఉన్నవారు కలవడం అనేది తప్పేమీ కాదు’ అన్నారాయన.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, Getty Images

న్యాయమూర్తిగా చంద్రచూడ్

న్యాయమూర్తిగా, సీజేఐగా కూడా, చంద్రచూడ్ అనేక ముఖ్యమైన తీర్పులలో భాగమయ్యారు. కొన్ని తీర్పులు చట్టాల సూత్రాలను నిర్దేశించాయి. అవి రాబోయే సంవత్సరాల్లో గణనీయమైన ప్రభావం చూపుతాయి.

"ఆయన తీర్పులతో మున్ముందు చాలా కాలం పాటు పని ఉంటుంది" అని సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే అన్నారు.

భారతదేశంలో గోప్యత హక్కుపై తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం మెజారిటీ తీర్పును చంద్రచూడ్ రాశారు.

ఇది ప్రజా జీవితంలోని అనేక కోణాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. భారతదేశంలో స్వలింగ సంపర్కం, వ్యభిచారం నేరం కాదంటూ నేరాల జాబితా నుంచి తొలగించిన రాజ్యాంగ ధర్మాసనాలలో ఆయన భాగంగా ఉన్నారు.

పెళ్లికాని మహిళలకు కూడా గర్భస్రావాలకు అవకాశం కల్పించే తీర్పును కూడా ఆయనే రాశారు. శబరిమలలోకి ప్రవేశించడానికి మహిళలను అనుమతించిన తీర్పునూ ఆయనే ఇచ్చారు.

ఏ ప్రైవేట్ ఆస్తి అయినా సమాజ వనరుగా లెక్కించి, దానిని తిరిగి పంపిణీ చేసే అధికారం రాజ్యానికి లేదని స్పష్టంచేసిన తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును కూడా ఆయన రాశారు. అలా చేసే క్రమంలో.. గడచిన దశాబ్దాలుగా ప్రైవేటు ఆస్తులన్నీ సమాజ వనరులుగా భావించే సామ్యవాద వైఖరితో కూడిన చట్టనియమాన్ని కోర్టు మార్చింది.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలలో ఉప-కోటాను ఇవ్వడానికి ఆయన తన తీర్పుల ద్వారా అనుమతించారు.

జైళ్లలో కుల-ఆధారిత వివక్షను రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేశారు.

అస్సాం ఒప్పందాల రాజ్యాంగబద్ధతను సమర్థించారు, ఉత్తర ప్రదేశ్‌లో మదరసాలు నడవడానికి అనుమతించారు.

అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం మైనారిటీ సంస్థ కాదన్న తీర్పును రద్దు చేశారు.

పన్నుల సమస్యలు, మధ్యవర్తిత్వ సమస్యలకు సంబంధించిన నిర్ణయాలలో కూడా ఆయన భాగంగా ఉన్నారు.

ఆయన ఇచ్చిన కొన్ని తీర్పులలో, ప్రసార మాధ్యమాలకు, వాక్ స్వాతంత్య్రానికి అనుకూలంగా బలమైన ఆదేశాలిచ్చారు.

మలయాళం న్యూస్ చానల్ మీడియా వన్ ప్రసారాలపై నిషేధాన్ని ఆయన తోసిపుచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను నిలిపివేశారు.

జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి, జుబైర్ అహ్మద్‌కు బెయిల్ ఇచ్చారు.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, Getty Images

ఎలక్టోరల్ బాండ్ల కేసులో చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు చాలా పేరున్న తీర్పులలో ఒకటి.

ఆ కేసులో, ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాతల వివరాలను రాజకీయ పార్టీలతో సరిపోల్చడానికి వీలుగా.. బీజేపీ అతిపెద్ద లబ్ధిదారుగా ఉన్న ఈ పథకంలో సమాచారం మొత్తం విడుదల చేయాలని ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తెచ్చింది. ఇది స్వాగతించదగిన ఆదేశం.

అయితే, ఈ ఆదేశాలిచ్చింది గానీ, సోదాలు లేదా దాడుల తర్వాత బాండ్లు ఎలా బదిలీ అయ్యాయో, బాండ్ల బదిలీ తర్వాత ప్రయోజనాలు ఎలా లభించాయో అనే అంశాలపై ఉన్న ఆరోపణలను కోర్టు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.

కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ఒక సంస్థకు ప్రశాంత్ భూషణ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఈ కేసును నాలుగు నెలల తర్వాత మాత్రమే కోర్టు విచారణకు కేటాయించారు. ఒక విచారణ తర్వాత కేసును కొట్టివేశారు.

"ఎలక్టోరల్ బాండ్ల కేసులో తదుపరి చర్య ఆశించినదానికన్నా చాలా తక్కువగా ఉంది’’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు పేర్కొన్నారు.

ఈ కేసు "ఆపరేషన్ విజయవంతమైంది, రోగి చనిపోయాడు" అన్నట్లుందని దుష్యంత్ దవే అభివర్ణించారు.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, ANI

చంద్రచూడ్ తాను ముఖ్యమైనవని భావించిన అంశాలపై సుమోటోగా కేసులు తీసుకుంటూ, అవసరమైతే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలనే ఆదేశాలు కూడా ఇస్తున్న నేపథ్యంలో.. ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఈ వైఖరిని విమర్శకులు ప్రశ్నించారు.

ఉదాహరణకు, కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్ అత్యాచారం కేసును, మణిపూర్ లైంగిక వేధింపుల కేసును ఆయన సుమోటోగా తీసుకున్నారు.

మణిపూర్ హింస కేసులో సిట్ దర్యాప్తుకు కూడా ఆయన ఆదేశించారు.

అయితే, ఆయన ఇలాంటి కేసులు తీసుకుంటారు, లేదా ఇలాంటి కేసుల్లో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశిస్తారు అని భావించడానికి స్పష్టమైన నమూనాలు ఏవీ లేవు.

అలాగే, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ప్రపంచ చరిత్రలోనే "అతిపెద్ద కార్పొరేట్ మోసాన్ని" నడుపుతున్నాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ లేవనెత్తిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశించడానికి కూడా ఆయన తిరస్కరించారు. సెబీ దర్యాప్తు "విశ్వాసాన్ని ప్రేరేపిస్తుందని", దర్యాప్తును సెబీ నుండి బదిలీ చేయరాదని ఆయన తీర్పు పేర్కొంది. అయితే, సెబీ నిష్పాక్షికత మీదే సందేహాలు వ్యక్తమైన పరిస్థితుల్లో ఆయన తీర్పు మీద విమర్శలు వచ్చాయి.

శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి ఏక్‌నాథ్ శిందే వర్గానికి ఫిరాయించడానికి సంబంధించిన కేసు.

ఈ ఫిరాయింపు జూన్ 2022లో ఠాక్రే ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసింది.

చంద్రచూడ్ సీజేఐ కావడానికి ముందు కోర్టు ఈ విషయాన్ని విచారించడం ప్రారంభించినప్పటికీ, చంద్రచూడ్ పదవి చేపట్టిన ఆరు నెలల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది.

చివరకు ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, ఆయన అప్పటికే రాజీనామా చేసినందున కోర్టు ఏమీ చేయజాలదని పేర్కొంది.

"మహారాష్ట్రలో అది సజీవంగా ఉన్న కేసు. అప్పుడు ప్రభుత్వం పనిచేస్తున్నది. అందువల్ల ఆయన [ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా తిరిగి నియమించడం ద్వారా] చరిత్ర సృష్టించగలిగేవారు. కానీ అలా చేయాలని ఆయన భావించలేదు'' అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు చెప్పారు.

ఇది చండీగఢ్ మేయర్ ఎన్నికల కేసుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక్కడ కోర్టు ఈ విషయాన్ని త్వరగా విచారించి, ఎన్నికల ఫలితాలను తోసిపుచ్చింది.

అదేవిధంగా, దేశ రాజధాని దిల్లీలో పౌర సేవలపై దిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ ఉందని, లెఫ్టినెంట్ గవర్నర్‌కు కాదని చంద్రచూడ్ స్పష్టంచేశారు. అయితే, ఆయన తీర్పు వెలువడిన 10 రోజుల తరువాత ఒక ఆర్డినెన్స్ ద్వారా, ఆ వెంటనే ఒక చట్టం ద్వారా ఈ తీర్పు చెల్లుబాటు కాకుండా చేశారు. ఈ చర్యను కోర్టులో సవాల్ చేశారు. అది చంద్రచూడ్ పదవీకాలం ముగిసే వరకూ పెండింగ్‌లోనే ఉంది.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, @narendramodi

చంద్రచూడ్ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు .. అవివాహిత మహిళలకు కూడా గర్భస్రావం చేయించుకునే హక్కు ఉండాలని 2022లో తీర్పు చెప్పారు. "మహిళ శరీరంపై హక్కు ఉన్నది ఆమెకు మాత్రమే" అని, మానసిక ఆరోగ్యంతో సహా వివిధ కారణాల వల్ల గర్భస్రావం చేయించుకోవచ్చునని ఆయన స్పష్టంచేశారు.

అయితే, తానే స్వయంగా పేర్కొన్న సూత్రాన్ని 2023లో సడలించారు. చాలా చర్చ జరిగిన ఒక కేసులో.. 26 వారాల గర్భిణి అయిన వివాహితకు సుప్రీంకోర్టు ధర్మాసనం మొదట గర్భస్రావానికి అనుమతి ఇవ్వగా, చివరకు చంద్రచూడ్ ధర్మాసనం ఆమెకు గర్భస్రావం అనుమతిని నిరాకరించింది. తాను తీవ్రమైన మానసిక శారీరక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, తన గర్భం గురించి ఆలస్యంగా తెలుసుకున్నానని, అందువల్ల ముందుగా కోర్టును ఆశ్రయించలేకపోయానని ఆ మహిళ నివేదించారు. కానీ గర్భస్రావానికి కోర్టు ఆమోదం ఇవ్వలేదు. అది పిండం హక్కులకు విరుద్ధమని చెప్పింది.

ఈ కేసు భారతదేశంలో గర్భస్రావం హక్కుల విషయంలో ఒక వెనుకడుగుగా వ్యాఖ్యాతలు అభివర్ణించారు.

సమాఖ్య విషయానికి వచ్చినపుడు కూడా, ఖనిజాలపై పన్ను విధించే హక్కు, పారిశ్రామిక మద్యాన్ని నియంత్రించే హక్కు రాష్ట్రాలకు ఉందని చంద్రచూడ్ సమర్థించారు. కానీ ఆర్టికల్ 370 కేసులో, ఆర్టికల్ 370 రద్దును, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని ఆయన బలపరిచారు.

అలా చేస్తున్నక్రమంలో, ఒక రాష్ట్రాన్ని కేంద్రం విభజించగలదా, అది కూడా శాసనసభ లేనప్పుడు, రాష్ట్రపతి పాలనలో ఉన్నపుడు విభజించగలదా అనే అంశాన్ని ఆ తీర్పు పూర్తిగా పక్కనపెట్టిందన్న తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచే తీర్పుగా కొందరు అభివర్ణించారు.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, Getty Images

రామజన్మభూమి కేసులోనూ ఆయన ప్రమేయం గురించి చాలా రాశారు.

అనేక సమస్యలతో కూడిన ఆ తీర్పును వెలువరించిన ధర్మాసనంలో చంద్రచూడ్ భాగంగా ఉన్నారు.

మసీదును చట్టవిరుద్ధంగా కూల్చివేశారని స్పష్టంచేసినప్పటికీ.. ఆలయ స్థలంలో బాబ్రీ మసీదు ఉందని పురావస్తు శాఖ నిరూపించనప్పటికీ.. కోర్టు ఆ భూమిని హిందువులకు ఇచ్చింది. ముస్లింలకు మరో మసీదు నిర్మించడానికి ఐదు ఎకరాలు కేటాయించింది.

అయితే, తీర్పు ఎవరు రాశారనే ప్రస్తావన అందులో లేదు. చంద్రచూడ్ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఇది సుప్రీంకోర్టు తీర్పు అని, కాబట్టి రచయిత పేరు పెట్టకూడదని ధర్మాసనం నిర్ణయించిందని పేర్కొన్నారు.

ఆ తీర్పు.. రామ మందిరం నిర్మిస్తామన్న తన దీర్ఘకాల వాగ్దానాన్ని నెరవేర్చడానికి బీజేపీ ప్రభుత్వాన్ని వీలుకల్పించింది. ఆ తీర్పు మీద పలువురు న్యాయ నిపుణుల నుంచి విమర్శలు వచ్చాయి. రాజ్యాంగ నిపుణులు గౌతమ్ భాటియా, సుహ్రిత్ పార్థసారథి ఈ తీర్పును "చట్టపరంగానూ, న్యాయపరంగానూ సరిపోలేదు" అని అభివర్ణించారు .

అయితే, ఆ తీర్పు చట్టబద్ధతను పక్కనపెట్టినా కూడా, ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1992 ప్రాధాన్యం గురించి అందులో పలు పేరాలు ఉన్నాయి. అయోధ్య వివాదం తరువాత, ఒక ప్రార్థనా స్థలం మతపరమైన స్వభావాన్ని దేశ స్వాతంత్ర్యం తర్వాత మారకుండా ఉండేలా స్తంభింపజేయడానికి ఈ చట్టం చేశారు. స్థలం స్వభావాన్ని మార్చడానికి వ్యతిరేకంగా కేసులను కూడా ఈ చట్టం నిరోధిస్తుంది. భవిష్యత్తులో ఆలయం-మసీదు వివాదాలు తలెత్తకుండా ఇది ఆపుతుందని చాలా మంది భావించారు.

అయితే, జ్ఞానవాపి ఆలయ వివాదం చంద్రచూడ్ ముందుకు వచ్చినప్పుడు, ఆయన కేసులను కొనసాగించడానికి అనుమతించారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన 12 అంకెల ప్రత్యేక ఐడీ ఆధార్ రాజ్యాంగ విరుద్ధమని, దానిని రద్దు చేయాలని ఆయన ఇచ్చిన తీర్పు పట్ల చాలా హర్షం వ్యక్తమైంది.

అయితే, భారత ప్రభుత్వం తన విమర్శకుల మీద మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ పెగాసస్ ను ఉపయోగించినట్లు ఆరోపిస్తూ దాఖలైన కేసులు ఆయన పదవీకాలంలో పెండింగ్ లోనే ఉండిపోయాయి.

సుప్రీంకోర్టు, చంద్రచూడ్

ఫొటో సోర్స్, Getty Images

ఆధార్ కాకుండా, చంద్రచూడ్ తన ఇతర భిన్నాభిప్రాయాలకు కూడా ప్రసిద్ధి చెందారు.

కుల ప్రాతిపదికన హింసను ప్రేరేపించారని, నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపిణలతో 16 మంది కార్యకర్తలు, మేధావులను జైలులో పెట్టిన కేసు అటువంటి వాటిలో ఒకటి.

ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన ఆ తీర్పులో మెజారిటీ అయిన ఇద్దరు న్యాయమూర్తులతో చంద్రచూడ్ విభేదించారు.

ఈ కేసులో మహారాష్ట్ర పోలీసుల తీరు, వారి నిష్పాక్షికతపై సందేహాలను కలిగిస్తోందని, భీమా కోరెగావ్ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మళ్లీ దర్యాప్తు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, భీమా కోరెగావ్ కేసుల్లో విచారణ ప్రారంభం కాలేదు. ఆ కేసులో అరెస్టయిన వారిలో కనీసం ముగ్గురు ఆయన సీజేఐగా ఉండగా (ఇతర ధర్మాసనాల ద్వారా) బెయిల్ పొందారు.

అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్న సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తుండగా మరణించిన జిల్లా న్యాయమూర్తి బిహెచ్ లోయా కేసు విషయంలో, స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ చంద్రచూడ్ తీర్పు రాశారు.

ఆ తీర్పు మీద, ఆ కేసు విచారణకు కేటాయించడం మీద, కోర్టులో వాదనల మీద చాలా విమర్శలు వచ్చాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)