తిరుమల లడ్డూ వివాదం: అయిదుగురు సభ్యులతో ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటుచేసిన సుప్రీంకోర్ట్

తిరుమల తిరుపతి దేవస్థానాలు

ఫొటో సోర్స్, Facebook/TTD

ఫొటో క్యాప్షన్, తిరుమల

తిరుమల తిరుపతి దేవస్థానాలలో ప్రసాదంగా అందించే లడ్డూల తయారీకి కల్తీ నెయ్యిని వాడారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం (అక్టోబర్ 4న) ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని (ఇండిపెండెంట్ సిట్) ఏర్పాటు చేసింది.

ఈ స్వతంత్ర దర్యాప్తు బృందం 'లడ్డూ కల్తీ వ్యవహారం'పై నిష్పాక్షికంగా విచారణ జరుపుతుందన్న నమ్మకం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.

అంతేకాదు అంతకుముందు ఈ కేసులో విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించిందని లైవ్‌లా వెబ్‌సైట్ పేర్కొంది.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ‘సిట్’లో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసే ఇద్దరు అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసే ఇద్దరు అధికారులతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కి చెందిన సీనియర్ అధికారి కూడా ఉంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సీబీఐ డైరెక్టర్ ఈ సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తారని కోర్టు పేర్కొన్నట్లు ‘లైవ్‌లా’ వెల్లడించింది.

కోట్లాది మంది తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ ఆదేశాలను జారీ చేస్తున్నామని కోర్టు పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఏర్పాటుచేసిన సిట్‌ సభ్యుల విశ్వసనీయత మీద ఎలాంటి సందేహాలు లేవని.. కానీ, స్వతంత్ర విచారణ కోరుతున్నారు కాబట్టి సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణలో బృందం ఏర్పాటు చేస్తున్నామని కోర్టు పేర్కొంది.

ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి తాము వెళ్లడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

"కోర్టును రాజకీయ యుద్ధభూమిగా ఉపయోగించుకోవడానికి మేం అనుమతించబోమని స్పష్టం చేస్తున్నాం" అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

టీటీడీ ఈవో శ్యామలారావు

ఫొటో సోర్స్, Facebook/TTD

ఫొటో క్యాప్షన్, తిరుపతి లడ్డూ తయారీని పరిశీలిస్తున్న టీటీడీ ఈవో శ్యామల రావు(కుడివైపు ఉన్న వ్యక్తి) (ఫైల్ ఫొటో)

తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారించింది.

ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూ వ్యవహారంపై బహిరంగ వ్యాఖ్యలు చేశారని, అలా చేసి ఉండాల్సింది కాదని సెప్టెంబర్ 30న జరిగిన విచారణలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ వ్యవహారంలో కేంద్రం దర్యాప్తు జరపాలన్న అంశంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కేసుపై కోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.

"ఈ కేసులో కోర్టు విచారణకు ఆదేశించడం వల్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా" అని జస్టిస్ గవాయి తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను కోర్టు ప్రశ్నించింది.

దీనికి లూథ్రా సమాధానమిస్తూ "న్యాయస్థానం పత్రికల్లో వచ్చిన కథనాలను విశ్వసించవద్దని కోరుతున్నా. టీటీడీ ఈవో ప్రకటనను కూడా పత్రికల్లో తప్పుదారి పట్టించేలా రాశారు" అని చెప్పినట్లు లైవ్‌లాపేర్కొంది.

ఈ రోజు జరిగిన వాదనల్లో భాగంగా స్వతంత్ర దర్యాప్తు అవసరమని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పారదర్శకంగా జరుగుతుందని ఆశించే పరిస్థితి లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారని లైవ్‌లా వెబ్‌సైట్ తెలిపింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, ANI

"కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సముచితం. ఆయన (చంద్రబాబు) ప్రకటన చెయ్యకపోయి ఉంటే వేరే విషయం. అయితే మాటలు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయి" అని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు.

లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాాడారన్న ఆరోపణలపైనా వాద ప్రతివాదనలు వాడివేడిగా సాగాయి.

నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమయంలో " ఆ నెయ్యిని ఉపయోగించారని ముఖ్యమంత్రికి ఎలా తెలుసు" అని కోర్టు ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు కౌంటర్‌గా ముకుల్ రోహత్గీ ల్యాబ్ రిపోర్టుల గురించి ప్రస్తావించారు.

అయితే ల్యాబ్ రిపోర్టులలో ' వెజిటబుల్ ఫ్యాట్స్ మాత్రమే ఉంది కదా' అని కపిల్ సిబల్ అనడంతో రిపోర్టులలో ఉన్న అంశాల గురించి రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం " ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు" ఆదేశాలు జారీ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

సుప్రీంకోర్ట్ ఆదేశాలను స్వాగతించిన చంద్రబాబు

తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు.

ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన ‘సీబీఐ, ఏపీ పోలీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ’ అంటూ పోస్ట్ చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)