సాలెపురుగుల ప్రపంచం: ఆ దీవిలో 70 కోట్ల స్పైడర్స్

చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే గ్వామ్‌లో 40 రెట్లు ఎక్కువ సాలెపురుగులు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, గువామ్‌లో భయపెట్టే సాలెపురుగులు
    • రచయిత, జరియా గోర్‌వెట్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

చుట్టుపక్కలున్న ఐలాండ్‌లతో పోలిస్తే గువామ్‌లో 40 రెట్లు కన్నా ఎక్కువగా సాలెపురుగులున్నాయి. భయంకరమైన పాములు విపరీతంగా ఉన్నాయి. అడవుల్లోని పక్షులన్నింటినీ అవి ఆరగించేశాయి.

ఐదేళ్ల క్రితం గువామ్‌ ఐలాండ్‌లో హాల్డ్రీ రోగర్స్ ఒక గెట్ టు గెదర్‌కు హాజరయ్యారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పచ్చని ప్రాంతం అది. ఫిలిప్పీన్స్ నుంచి 2,492 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అయితే అనుకోని ఓ అతిథి రాకతో ఆ పార్టీకి అంతరాయం కలిగింది.

సాయంకాలం గడిచిపోతోంది. బయట కాల్చిన పంది ఉంది. డిన్నర్‌ కోసం అది సిద్ధంగా ఉంది. మంటలు తగ్గాయి. అయినప్పటికీ వేడిగా ఉంది. అందరూ అలా బయట నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

వారు తిరిగొచ్చేసరికి పందిని చుట్టుకుని గోధుమరంగులో వంపుగా ఏదో కనిపిస్తోంది. కళ్లు, విశాలమైన నోరు, పొలుసులు పొలుసులతో ఉన్న శరీరం మెరుస్తోంది. ఆ జీవి పంది మాంసం ముక్కలను చీల్చి వాటిని అమాంతం మింగేస్తోంది. దాని పెద్ద నోటి నుంచి శరీరంలోకి పందిమాంసాన్నంతటినీ నెమ్మదిగా తనలోకి లాగేస్తోంది.

‘‘అది కచ్చితంగా 181కేజీలున్న పంది కాదు కానీ, ఓ పార్టీలో విందుకు సరిపోయే స్థాయిలో ఉంది’’ అని రోగర్స్ చెప్పారు. ఆమె అమెరికాలోని వర్జీనియా టెక్‌లో చేపలు, వన్యప్రాణుల పరిరక్షణ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 22 ఏళ్లగా గువామ్ జీవావరణంపై అధ్యయనం చేస్తున్నారు.

టేబుల్ మేనర్స్ లేకుండా పార్టీకి వచ్చిన ఆ అతిథి గోధుమరంగులో ఉన్న చెట్టుపాము. ఆ పాము ఈ ప్రాంతానికి చెందినది కాదు. గ్రహాంతర పాము. అంటే వేరే చోట నుంచి ఇక్కడకు వచ్చింది. బహుశా కార్గోషిప్‌లోకి దొంగచాటుగా చేరి 1940ల్లో గువామ్‌కు వచ్చి ఉంటుంది.

ఈ పాము ఇక్కడకు రాకముందు స్థానికంగా ఎన్నో పక్షులు ఉండేవి. ద్వీపంలోని సున్నపురాయి అడవుల్లో పెద్దసంఖ్యలో పక్షులుండేవి. ఈ పాములు కేవలం నాలుగు దశాబ్దాల్లో అడవుల్లోని పక్షులను ఖాళీ చేసేశాయి. మొత్తం 12 పక్షి జాతుల్లో 10 జాతులు ఇప్పుడు ఐలాండ్‌లో కనిపించడం లేదు. మిగిలిన రెండు జాతులు మారుమూల గుహల్లో, పట్ణణ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గోధుమరంగు చెట్టు పాములతో గ్వామ్ అడవులకు ముప్పు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పక్షులను, చనిపోయిన జంతువులను తినే పాములు

పక్షులను తుడిచిపెట్టేసిన పాములు

గువామ్‌లో పక్షుల జాతి అయిన ఏవియన్ కమ్యూనిటీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ దీవిలో 20లక్షల పాములు ఉండుంటాయి. నిజంగా అక్కడ పాముల సంఖ్య ఎంతో ఎవరికీ తెలియదు. ఈ పాములు వాటికి ఏది కనిపిస్తే వాటిని తినేస్తాయి. ఎలుకలు, చిట్టెలుకలు, బల్లులు ఏవైనా సరే...కొన్నిసార్లు మనుషులను కూడా ఇవి వదిలిపెట్టవు.

‘‘అంటే అవి..దేన్నయినా తింటాయి’’ అని దక్షిణ మైదాన ప్రాంతాల ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ పొలాక్ చెప్పారు. కొలరాడోకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇది. గతంలో గువామ్ జీవావరణంపై అధ్యయనం జరిపింది. పొలాక్ పాములు ‘‘ఒకదాన్నొకటి కూడా తినేస్తాయి’’ అన్నారు.

ఈ భయంకర పాములు అడవుల జీవవైవిధ్యం మొత్తాన్ని దెబ్బతీశాయి. ఇప్పుడు అడవుల్లో కిచకిచ ధ్వనులు, ఈలలు లాంటి శబ్దాలేవీ వినిపించడం లేదు. గతంలో ఎక్కువ సంఖ్యలో ఉండే ఆవులు లేవు.

జీవవైవిధ్యానికి చిరునామాగా ఉన్నప్పటికీ...అనేక రకాల పక్షులు, ఇతర జంతువుల నుంచి వచ్చే వింత శబ్దాలతో ఒకప్పుడు భూమిపై అత్యంత ధ్వనిపూరిత ప్రాంతంగా గువామ్ ఉండేది. కానీ ఐలాండ్‌లోకి పాముల చొరబాటుతో ఈ దీవి ఇప్పుడు పక్షులు లేని, భయంకర నిశ్శబ్దం రాజ్యమేలే అడవిగా మిగిలిపోయింది. ఒక పర్యావరణ ప్రయోగం ఇక్కడ ముగుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ నుంచి లాభపడిన ఏకైక జీవి...8 కాళ్లు, అనేక కళ్లు ఉన్న సాలెపురుగు మాత్రమే. అది దూరంలో ఉండగానే గుర్తించగలగడం ఈ ఐలాండ్‌లో ఒకే ఒక్క మంచి విషయం.

హంట్స్‌మాన్ స్పైడర్

ఫొటో సోర్స్, Ken Griffiths/Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోనే పెద్ద సాలెపురుగులు గువామ్ ద్వీపంలో కనిపిస్తాయి

అడుగడుగునా సాలెపురుగులు

రోగర్స్‌కు సాలెపురుగులంటే భయం లేదు. అన్నింటిలానే వాటినీ చూస్తారు.

మరియానా దీవులలోని చాలా వాటిలో వానా కాలంలో సాలెపురుగులు తక్కువగా కనిపిస్తాయి. వాతావరణం పొడిబారే కొద్దీ వాటి సంఖ్య పెరుగుతుంటుంది. కానీ గువామ్‌లో అలా కాదు. ఐలాండ్‌లోని సున్నపురాయి అడవుల్లో ఏడాదంతా ఓ పీడకలలా ఉంటుంది. వెండిదారాల్లాంటివి మైళ్ల పొడవునా కనిపిస్తుంటాయి. ఒక్కో సాలెగూడు..మరో సాలెగూడు దగ్గరకు మనల్ని తీసుకెళ్తుంటుంది.

అక్కడ పెద్ద, పసుపు రంగు సాలెపురుగులున్నాయి. వాటి బంగారు రంగు సాలెగూళ్లలో అవి కనిపిస్తుంటాయి. అవి వేటగాళ్లలాంటి సాలెపురుగులు. మనిషి చెయ్యి పరిమాణంలో ఉంటాయి. చెట్ల కొమ్మల మధ్య ఉన్న ఖాళీప్రదేశాల్లో పెద్ద పెద్ద గూళ్లు కట్టుకుంటాయి. రోగర్స్ ఆ సాలెగూళ్లను ‘‘కోండో’’ వెబ్‌గా పిలుస్తారు. దీనికి కారణం సాలెపురుగు గూడు... ఆ జీవి స్థాయికి ఓ అపార్ట్‌మెంట్‌లా ఉంటుంది.

‘‘ఈ పెద్ద సాలెగూడులో చాలా ఆడ సాలెపురుగులుంటాయి. చాలా మగ సాలెపురుగులు వాటిని చుట్టూ పట్టుకుని ఉంటాయి’’ అని రోగర్స్ చెప్పారు. ఈ పెద్ద గూళ్లు చిన్న అర్గీరోడ్స్ సాలెపురుగులకుకూడా ఇష్టమైనవి. వాటినుంచి ఎరను దొంగిలిస్తుంటాయి. వాటి అతిథులను అప్పుడప్పుడు తింటుంటాయి. ‘‘గువామ్ కోండో వెబ్స్ నేల నుంచి పైదాకా ఉంటాయి. అవి ఎక్కడైనా ఉండొచ్చు’’ అని ఆమె చెప్పారు.

ఎక్కువ సమయం ఈ అడవిమొత్తం ఎలా కనిపిస్తుందంటే...హాలోవీన్‌కోసం ఏర్పాటుచేసిన కృత్రిమ సాలెపురుగుల గూళ్ల ప్రపంచంలా అనిపిస్తుంది. ఎవరైనా ఇక్కడ నడవాలంటే..మన చుట్టూ చిక్కుకునే సాలెగూళ్ల దారాలను తొలగించుకుంటూ ముందుకు సాగాల్సిందే. లేకపోతే మనం ఆ గూళ్లల్లో చిక్కుకుపోతాం. నాకు ఇక్కడ నడవడం ఇష్టం. కానీ వాటిగుండా ముందుకెళ్లడం కాస్త కష్టంగా ఉంటుంది.

చెట్లమధ్య ఉన్న ఖాళీ ప్రదేశం మొత్తం సాలెగూళ్లతో నిండిపోయిఉంటుంది. అనేక జాతులకు చెందిన వందలాది సాలెపురుగులు కనిపిస్తుంటాయి. అవన్నీ రకరకరాల కోణాల్లో కాంతిని గ్రహిస్తాయి. వీటన్నింటినీ ఒకచోటకు చేరిస్తే ఒక గది పరిమాణం అంత ఉంటాయి. నా స్నేహితుడు ఒకతను గతంలో వాటి మధ్యలోకి వెళ్లి చిక్కుకుపోయారు. ఆ గూళ్ల దారాలన్నింటినీ చుట్టుకుని భయంకర ఆకారంలోకి మారారు. తనతో ఉన్నవాళ్లను భయపెట్టడానికి ఆయన ఇలా చేశారు.

మరో సందర్భంలో రోగర్స్ అసిస్టెంట్ ఒకరు ఫీల్డ్‌లో సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అడవిలో కేవలం రెండు కిలోమీటర్లు లోపలికి వచ్చిన వెంటనే ఆమె మనసు మార్చుకున్నారు. ‘‘నేను బయటకు వెళ్తాను...అన్నట్టు ఆమె మాట్లాడారు’’ అని రోగర్స్ చెప్పారు.

ఎటుచూసినా సాలెగూళ్లే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేటాడే సాలెపురుగులు

ఈ సాలెపురుగులు లేకపోయినప్పటికీ స్థానిక చమొర్రో భాషలో ‘సాన్‌యెయె’ అని పిలిచే ఓ రకమైన జీవులతో గువామ్ సున్నపురాయి అడవులు..భూమ్మీద మరెక్కడా లేని వింత, విచిత్ర ప్రాంతంగా ఉంటాయి.

తలపై ఎత్తయిన చెట్లు పెద్ద పెద్ద ఆకారంలో ఉంటాయి. బాదం, స్పైకి పాండనస్ చెట్లు వంటివి ఏపుగా పెరిగి ఉంటాయి. తరచూ తుపాన్లు వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ నేల మీద మట్టి చాలా తక్కువగా ఉంటుంది. సున్నపురాయి నిక్షేపాల నుంచి మొక్కలు నేరుగా పెరిగాయి. ఈ అడవి ఉన్న ప్రాంతం ఒక ప్రాచీన పగడపుదిబ్బలాంటిది. లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో ఇవన్నీ ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల భారీ గుహలు కనిపిస్తుంటాయి.

‘ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..ఇక్కడ నడక పదునైన బండరాళ్లమీద నడవడంలాంటిది . అలా నడిస్తే ఎలా ఉంటుందో ఊహించండి’’ అని రోగర్స్ చెప్పారు. ఇలాంటి చోట నడవడానికి అలవాటుపడడానికి సమయం కావాలన్నారు.

2012లో సాలెపురుగుల సంఖ్యపై సర్వే చేయాలని రోగర్స్ నిర్ణయించుకున్నప్పుడు అది సమస్యాత్మకమైన విషయమని ఆమెకు తెలుసు.

గువామ్ సాలెపురుగుల ప్రాంతమన్న ప్రచారం ఉండేది. ఆ సాలెపురుగులను తినే పక్షులు లేకపోవడం వల్ల వాటి సంఖ్య బహుశా పెరుగుతుండొచ్చు. ఐలాండ్ జనాభా దాదాపు 1,80,000 ఉంటుంది. వారంతా మరో వైపుఉన్న ఉత్తర మారియానా ఐలాండ్ వైపు అరుదుగా ప్రయాణిస్తారు. స్వయం పరిపాలన ఉన్న కామన్ వెల్త్‌ ప్రాంతాలవి. గువామ్ ఒక్కటే అమెరికా భూభాగం. దీంతో ఆ రెండు ప్రాంతాల మధ్య పోలికకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది. నిజానికి శాస్త్రవేత్తలు ఎప్పుడూ అలా చేయలేదు.

గువామ్‌పై ఎన్ని రకాల సాలెపురుగులున్నాయో తెలుసుకోవడానికి రోగర్స్, ఆమె సహచరులు ఐలాండ్ అడవుల్లో సర్వేలు జరిపారు. ఇందుకోసం వారు సురక్షితంగా ఉండే మార్గాన్ని ఎంచుకున్నారు. టేప్ రోల్ నేరుగా ఉంచి..దాని వెంట ప్రయాణించారు. ఆ మార్గంలో ఉన్న సాలెగూళ్లను జాగ్రత్తగా లెక్కించారు. అవి ఒక మీటరు లోపలకు ఉంటే..అది ఒక గూడుగా లెక్కించారు.

వర్షాలు కురిసే సమయంలో చుట్టుపక్కలున్న రోటా, టినియన్, సైపన్ ఐలాండ్‌లతో పోలిస్తే గువామ్ అడవుల్లో 40 రెట్లు ఎక్కువ సాలెపురుగులుంటాయని శాస్త్రవేత్తలు వేసిన లెక్కల్లో తేలింది. పొడి వాతావరణంలో 2.3 రెట్లు ఎక్కువ సాలెపురుగులున్నాయి. గువామ్‌లోని బనానా సాలెపురుగుల గూళ్లు కూడా దాదాపు 50శాతం పెద్దవి.

ఏడాది పొడవునా గువామ్ అడవులు సాలెగూళ్లతో మెరుస్తుంటాయి. వర్షాకాలంలో మీటరకు 1.8, పొడివాతావరణంలో 2.6 సాలెగూళ్లను రోగర్స్ బృందం గుర్తించింది. ఈ లెక్కలను గువామ్ అటవీప్రాంతం మొత్తానికి వర్తింపచేస్తే మొత్తం 503 నుంచి 733 మిలియన్ల సాలెపురుగులుంటాయి. వాటి గూళ్లల్లో అవి తిరుగుతుంటాయి. నేలకు రెండు మీటర్ల పరిధిపై ఉన్న సాలెగూళ్లనే లెక్కించారు. ఒక గూడుకు ఒక సాలెపురుగు ఉందనుకుంటే...మొత్తం అడవిలో 4,06,40,000 సాలెపురుగుల కళ్లు, అంతే సంఖ్యలో కాళ్లు ఉంటాయి.

గ్వామ్ అడవుల్లో పక్షులను తినేస్తున్న పాములు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, గోధుమరంగు చెట్టు పాములు

సాలెపురుగుల సంఖ్యను పెంచిన పాములు

రోటా, టినియన్, సైపన్‌ దీవులలో గోధుమరంగు చెట్ల పాములు లేవు. ఆ అడవుల్లో అనేక రకాల పక్షులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గువామ్‌ ద్వీపంలో సాలె పురుగుల సంఖ్య గతంలో ఇంత ఉండేది కాదని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. కొన్ని దశాబ్దాలుగా పక్షులు లేకపోవడంతో వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. బహమాస్‌లో చేసిన పరిశోధనతోనూ దీన్ని సరిపోల్చవచ్చు. ఈ ప్రాంతంలోని బల్లుల్లేని దీవులలో పదిరెట్లు ఎక్కువగా సాలెపురుగులున్నాయి.

గువామ్‌లోకి గోధుమరంగు చెట్టు పాములు వచ్చిన దగ్గరి నుంచి బనానా స్పైడర్ల ఉనికి సురక్షితంగా మారింది. ఓ రకమైన అంతుచిక్కని అలంకరణ కూడా ఇప్పుడు సాలెగూళ్లకు ఉండడం లేదు. తెల్లని దారాలతో జిగ్ జాగ్ విధానంలో సాలెపురుగులు వాటిని అల్లుతాయి. తమ గూళ్లు అక్కడ ఉన్నాయని పక్షులకు తెలియజేసేందుకు, అవి ఆ గూళ్లపై ఎగరకుండా ఉండేందుకు బహుశా అలా చేస్తుండొచ్చు.

ఇప్పుడు గువామ్ పక్షులు లేని ప్రాంతం కావడంతో అలాంటివి కనిపించడం లేదు.

పాముల వల్ల అంతరించిపోయిన పక్షులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గువామ్ అడవుల్లో ఒకప్పుడు 12 జాతుల పక్షులు ఉండేవి

జీవవైవిధ్యాన్ని దెబ్బతీసిన పాములు

రెండో ప్రపంచయుద్ధం జరిగిన కొన్నిరోజులకు గువామ్ అడవుల్లోకి ప్రవేశించిన గోధుమరంగు చెట్టు పాములు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఇప్పుడు తెలుసు. కానీ నాలుగు దశాబ్దాల పాటు ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. ఐలాండ్‌లో పక్షులు మొత్తం నశించిపోయాయని పర్యావరణ శాస్త్రవేత్తలు 1980 చివర్లో గుర్తించారు. కానీ ఎందుకిలా జరిగిందో ఎవరికీ తెలియదు.

పక్షులను ఏ పరిస్థితులు అంతమొందిస్తున్నాయో తెలుసుకోవాలని అప్పుడు పీహెచ్‌డీ స్టూడెంట్‌గా ఉన్న జూలీ సావిడేజ్ నిర్ణయించారు. పక్షులు లేకపోవడానికి క్రిమిసంహారకాలు లేదా వైరస్ కారణమని అనుమానించారు. కానీ 1987లో ప్రచురితమైన ఆమె పరిశోధన పక్షుల అంతానికి కారణం పాములు అన్న విషయాన్ని వెల్లడించింది. గువామ్ అడవుల్లో ఒకప్పుడు పాములు ఉండేవి కావు. దీంతో వాటికి ఆహారంగా మారకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్థానిక పక్షులకు తెలిసే పరిణామక్రమం లేదు. దీంతో తమను తాము రక్షించుకోవడం తెలియని స్థానిక పక్షులు చాలా వేగంగా పాములకు ఆహారంగామారిపోయి అంతరించిపోయాయి.

గువామ్ అడవుల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి సావిడేజ్ ప్రయత్నిస్తున్న సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గ్వామ్‌ ఫ్లై క్యాచర్ 1984లో అడవిలో చివరిసారి కనిపించింది. వెడల్పాటి కళ్లు ఉండే ఈ పక్షులు ఇప్పుడు అంతరించిపోయాయి. మరికొన్ని రకాల పక్షులు తప్పించుకోగలిగాయి.

ఈ ఏడాది మొదటి వరకు గువామ్ కింగ్ ఫిషర్ పక్షిని కూడా అంతరించిపోయిన జాబితాలో చేర్చారు. కానీ వాటి సొంత ప్రాంతం నుంచి 5,878 కిలోమీటర్ల దూరంలో పామూరా అటాల్ ఐలాండ్‌లో 9 పక్షులను గుర్తించారు. అలాగే గువామ్ రైలు అని భావించే పోరాడలేని మరో పక్షి ఉంది. దీన్ని స్థానికంగా ‘కోకో’ అని పిలుస్తారు. ఇది కూడా గువామ్ అడవుల్లో అంతరించిపోయిన పక్షుల జాబితాలో ఉంది. కానీ అవి ఇప్పుడు రోటా, కోకోస్ ఐలాండ్‌ల చుట్టూ కనిపిస్తున్నాయి. ఈ పక్షులు ఎర్రని, గోధుమరంగు శరీరంతో ఉంటాయి.

సాలెపురుగుల లెక్కింపు

ఫొటో సోర్స్, Ruth Hufbauer

ఫొటో క్యాప్షన్, రోగర్స్ బృందం
గోధుమరంగు చెట్టు పాముల నిర్మూలనకు ప్రయత్నాలు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, తప్పించుకుపోయే పాముల గుర్తింపు కోసం స్నిఫర్ కుక్కల వినియోగం

పాముల విధ్వంసం ఎప్పుడు తెలిసిందంటే..

గోధుమరంగు చెట్టు పాముల వల్ల జీవవైవిధ్యానికి ఎంత ప్రమాదం వాటిల్లుతోందో ఇటీవల సంవత్సరాల్లోనే పరిశోధకులకు తెలిసింది. ఈ సరీసృపాలు నిశ్శబ్దంగా గువామ్ అడవుల్లో, శివారు ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. నాలుకతో గాలి రుచి చూస్తూ...తినడానికి ఏమి దొరుకుతాయా అని వెతుకుతుంటాయి. కానీ వాటి ప్రయత్నాలు అన్ని సార్లూ ఫలించవు.

గోధుమరంగు చెట్టు పాములు సాధారణమైనవి కావు. ఇవి ఎలాంటి జంతువులను ఎంతమేర తింటాయి అనేదానికి కొన్ని లెక్కలున్నాయి. వాటి శరీర బరువులో 70శాతం ఉన్న జంతువులను తింటుంటాయి. అంటే 60 కేజీలున్న మనిషి ఒకేసారి ఒక చిన్న ఎర్ర కంగారూని తినడంతో దీన్ని పోల్చవచ్చు.

ఇటీవల రోగర్స్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఫ్లెజ్‌లింగ్ సాలి అనే అడవి పక్షి ఎలా జీవిస్తోందో పరిశీలించడం ప్రారంభించారు. ఉత్తర ఐలాండ్‌లోని అమెరికా ఫెసిలిటీ అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ దగ్గర ఇవి ఉన్నాయి. పక్షులకు పరిశోధకులు రేడియో మానిటర్లు ఏర్పాటుచేశారు. ఏం జరుగుతుంది అన్నది గమనించారు. ఈ రేడియో మానిటర్లు గోధుమరంగు చెట్టు పాముల జీర్ణవ్యవస్థలో కనిపించాయి. అయితే ఇంకో విషయం కూడా వెల్లడయింది. చనిపోయిన పక్షులను అవి తినలేదు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...చాలా ఫ్లెజ్‌లింగ్ పక్షులను పాములు చంపేశాయి. కానీ తర్వాత విడిచిపెట్టాయి. పక్షుల కళేబరాలను గమనించినప్పుడు వెండి రంగులో ఉన్న పాము లాలాజలంతో అవి నిండిపోయి ఉన్నాయి. పక్షులను చిన్నవిగా మార్చేందుకు పాములు ఇలా చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. మింగడానికి పెద్దగా ఉన్న పక్షులను చంపడంలో పాములు దాదాపు సగం సమయం వెచ్చిస్తాయి.

గోధుమరంగు పాములు చాలా బలమైన వేటగాళ్లలాంటివి. ఆహారాన్ని వెతుక్కోవడంలో అనేక విన్యాసాలు ప్రదర్శిస్తాయి. అవి వెళ్లలేని ప్రాంతాల్లో కూడా ఎరని గుర్తించగలవు. ఫ్లెడ్‌లింగ్ సాలి పక్షులను సురక్షితంగా ఉంచడానికి పర్యావరణ పరిరక్షకులు వాటికి గూడు తరహా బాక్సులు అమర్చారు. వాటికి ఇనుప కవచాల్లాంటివి అమర్చారు. జారే లక్షణమున్న ఈ బాక్సు మూడు అడుగుల పొడవు ఉంటుంది. చుట్టూరా 15 సెంటీమీటర్లుంటుంది. పాములు వాటిని ఎక్కలేవు. కానీ గోధుమరంగు పాముల ప్రత్యేకప్రతిభను పర్యావరణవేత్తలు అంచనావేయలేకపోయారు.

సావిడేజ్ నేతృత్వంలోని పరిశోధక బృందం 2021లో సైన్స్‌కు పూర్తిగా కొత్తదైన ‘‘లాసో క్లైంబింగ్’’ విధానం కనిపెట్టింది. సావిడేజ్ ఇప్పుడు అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో చేపలు, వన్యప్రాణుల సంరక్షణ విభాగం ప్రొఫెసర్‌గా ఉన్నారు.

‘‘గోధుమరంగు చెట్టుపాములు తమను తాము చుట్టుకుంటాయి. తలచుట్టూ తమ తోకను చుట్టుకుని, కొబ్బరిచెట్టుపైకి మనిషి ఎక్కుతున్నట్టుగా కనిపిస్తుంటాయి’’ అని ఈ పరిశోధనను అద్భుతమైనదిగా అభివర్ణించిన పొలాక్ చెప్పారు.

గోధుమరంగు చెట్టు పాము

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గువామ్ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసిన పాములు
గోధుమరంగు చెట్టు పాము

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, పాముల నుంచి పక్షులను రక్షించేందుకు ఏర్పాట్లు

ఊహించలేని మార్పు

పర్యావరణ పరిరక్షకులు, అధికారులు గువామ్ అడవుల నుంచి గోధుమరంగు చెట్టు పాములను నిర్మూలించేందుకు అనేక పద్ధతులు ఉపయోగించారు. కానీ మనుషుల ప్రయత్నాలపై ఆ సరీసృపాలే విజయం సాధిస్తున్నాయి. దృశ్యాల ఆధారంగా వెతకడం, వాటికి చికాకు కలిగించే పద్ధతులు, ఉచ్చు వేయడం, విష ప్రయోగం, ప్రాణాంతక రసాయనాలు వంటి ఎన్నో పద్ధతులు పరిశీలించారు.

ఇతర వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం కలిగించకుండా కేవలం గోధుమరంగు చెట్టు పాములను నిర్మూలించేందుకు జీవాయుధాలుగా ప్రయోగించగల వైరస్‌ల కోసం కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఫ్రాన్స్‌లో కుందేళ్లపై ఈ పద్ధతిని ప్రయోగించి చూశారు. కుందేళ్ల సంఖ్యను తగ్గించేందుకు ఆస్ట్రేలియాలో ఈ విధానాన్ని అక్రమంగా ఉపయోగించారు.

తీవ్రస్థాయిల్లో ప్రయత్నాలు చేసినప్పటికీ గోధుమరంగు చెట్టు పాములను పూర్తిస్థాయిలో తొలగించడం అసాధ్యమని తేలింది. ఇందుకోసం కేటాయించిన వార్షిక బడ్జెట్ 3.8మిలియన్ డాలర్లుంది. అయితే కొన్ని ప్రాంతాలకు దీన్నుంచి మినహాయింపు ఉంది. గువామ్‌లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఉన్న హాబిటాట్ మేనేజ్‌మెంట్ యూనిట్ సంగతే చూసుకుంటే ఇక్కడ పాముల సంఖ్య తగ్గించడంలో పర్యావరణ పరిరక్షకులు విజయం సాధించారు. పారాసెట్మాల్ ట్యాబ్లెట్ ఈ పాములకు విషపూరితమయింది. మనుషులు వాడే 500మిల్లీగ్రాముల ట్యాబ్లెట్‌లో ఆరో వంతు అయిన 80 మిల్లీగ్రాములు పారాసెట్మాల్‌ను విషపూరిత ఆహారంతో కలిపి ఇవ్వడం, పాములు దూరలేని ఇనుపకంచె చుట్టూ ఏర్పాటుచేయడం ద్వారా వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది.

గువామ్ అడవుల నుంచి చెట్ల పాములను తొలగించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిజానికి వాటిని తొలగించాల్సిన అవసరం చాలా ఉంది. వాటి వల్ల అడవి కూడా ప్రమాదంలో ఉంది.

దీనికి కారణం ఏంటంటే.. గువామ్ అడవుల్లోని చెట్లలో 70శాతం పక్షుల వల్లే మనుగడ సాగిస్తున్నాయి. చెట్ల విత్తనాలు అడవంతా పడాలంటే పక్షులే ఆధారం. ఇప్పుడక్కడ పక్షులు లేకపోవడంతో చెట్ల కాయలు కింద రాలి పడుతున్నాయి. ఈ పళ్లు ఎక్కువభాగం కుళ్లిపోతున్నాయి. అదే చెట్టు నీడలో విత్తనాలు పెరగవు. పక్షులు, ఇతర జీవుల జీర్ణవ్యవస్థలో భాగం కాని కొన్ని విత్తనాలు అసలు మొలకెత్తవు. దీనివల్ల ఏళ్లు గడిచేకొద్దీ వృక్షజాతులు అంతరించిపోతున్నాయి.

అడవుల్లో రంధ్రాలు కూడా పడుతున్నాయి. సాధారణంగా పర్యావరణం సమతుల్యంతో ఉండాలంటే..ఒక చెట్టు పడిపోయిన చోట అనేక మొక్కలు మొలకెత్తే అవకాశం ఉండాలి. న్యూయార్క్ నగరం మధ్యలో ఉన్న ఒక భవనాన్ని కూల్చివేస్తే అక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరో భవనం కట్టేందుకు పోటీపడుతుండడంలాంటిదే ఇది. గువామ్‌లో అలా జరగడం లేదు. పక్షులు విత్తనాలను ఒక చోట నుంచి మరో చోటకు విసర్జించకపోతే కొత్త మొక్కలు మొలవవు. చెట్లు పెరగకపోతే అడవి నిర్మాణం మారిపోతుంటుంది.

గువామ్ గోధుమ రంగు చెట్టు పాములు, సాలెపురుగుల ఆర్మీ ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నాయి. అవి ఇంకొంతకాలం సురక్షితంగా ఉండొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)