కేటీఆర్‌ను విచారించాలంటే గవర్నర్ అనుమతి కావాలా? చట్టం ఏం చెబుతోంది?

కేటీఆర్, బీఆర్ఎస్ , హైదరాబాద్

ఫొటో సోర్స్, @KTRBRS

    • రచయిత, బోడ నవీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు ఉంటాయి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో అన్నారు.

ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు. కేటీఆర్ మంత్రి పదవిలోనూ లేరు. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. అయినప్పటికీ, ఆయనపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవడం ఎందుకు? అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది.

అసలు కేటీఆర్‌పై ప్రభుత్వం ఏ కేసులో విచారణ జరపాలనుకుంటోంది? కేటీఆర్‌పై విచారణకు, గవర్నర్‌ అనుమతికి ఉన్న లింక్ ఏంటి? చట్టాలు ఏం చెబుతున్నాయి?

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫార్ములా ఈ-రేసు, హైదరాబాద్, కేటీఆర్

ఫొటో సోర్స్, @MinisterKTR

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-రేసులో కేటీఆర్

ప్రభుత్వం చెబుతున్న కేసు ఏంటి?

2023 ఫిబ్రవరిలో హైదారాబాద్‌లో తొలిసారిగా ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ నిర్వహణ బాధ్యతలను చూసుకున్నారు.

2024లోనూ హైదరాబాద్ కేంద్రంగా ఈ-రేసింగ్ నిర్వహించాలనుకున్నారు. అయితే, ప్రమోటర్‌గా బాధ్యత తీసుకున్న ఒక కంపెనీ డబ్బులు చెల్లించడానికి వెనుకాడటంతో హెచ్ఎండీఏ తన ఖజానా నుంచి రూ. 55 కోట్లు చెల్లించింది.

ఈ డబ్బులను ఎలాంటి అనుమతులూ లేకుండా చెల్లించారని, ఇది చట్ట విరుద్ధమని ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు ఆరోపిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై విచారణ కోసం గవర్నర్ అనుమతి రావాల్సి ఉందన్నారు.

“2024లో ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహించే వేదికల జాబితాలో హైదరాబాద్ పేరు లేకపోతే, దాని గురించి ప్రాసెస్ చేయమని అరవింద్ కుమార్‌కు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చాను. అందులో భాగంగా అత్యవసరంగా రూ.55 కోట్లు కట్టాలని అరవింద్ కుమార్ ఫైల్ పంపితే నేను సంతకం పెట్టాను. ఇందులో ఆయన తప్పేం లేదు. మంత్రిగా నాదే బాధ్యత” అని కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

“హెచ్‌ఎండీఏ స్వతంత్ర ప్రతిపత్తి గల బోర్డు. దానికి చైర్మన్‌గా సీఎం, వైస్ చైర్మన్‌గా మున్సిపల్ శాఖ మంత్రి ఉంటారు. హెచ్‌ఎమ్‌డీఏ నిధుల వినియోగానికి క్యాబినెట్, ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదు” అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ, గవర్నర్, జిష్ణు దేవ్ వర్మ

ఫొటో సోర్స్, @tg_governor

ఫొటో క్యాప్షన్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

గవర్నర్ అనుమతి ఎందుకు?

అవకతవకలు జరిగాయని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి విచారణ కోసం గవర్నర్ అనుమతి ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఒక చట్టం ఉంది.

ప్రభుత్వాలు మారినప్పుడు కక్షసాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిందంటూ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఈ కక్ష సాధింపుల నుంచి ప్రజా ప్రతినిధులకు కొంత రక్షణ కల్పించే దిశగా అవినీతి నిరోధక చట్టానికి 2018లో సవరణలు చేశారు.

ఆ చట్టంలోని సెక్షన్ 17-ఎ ప్రకారం..

ఎవరైనా పబ్లిక్‌ సర్వెంట్‌ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా, అధికారం దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపలు వచ్చినా, ఏ పోలీసు అధికారి కూడా అధీకృత వ్యక్తుల లేదా వ్యవస్థల అనుమతి లేకుండా విచారించడానికి వీలు లేదు.

అధీకృత వ్యక్తి అంటే సదరు పబ్లిక్ సర్వెంట్‌ ఏ సమయంలో అయితే అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో... ఆ సమయంలో అతడిని తొలగించే అధికారం ఎవరికి ఉంటుందో వాళ్లు అధీకృత వ్యక్తులు అవుతారు.

ఆ నిబంధనల ప్రకారం చూస్తే, ప్రస్తుత లేదా మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది.

విచారణకు అనుమతి కోరిన తర్వాత 3 నెలల్లోపు నిర్ణయం తెలపాల్సి ఉంటుంది. రాతపూర్వకంగా కారణాలను నమోదు చేయాలనుకుంటే, అవసరమనుకుంటే మరో నెల పాటు గడువు పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది.

“పబ్లిక్ సర్వెంట్ ఎవరు అనేది ఐపీసీ సెక్షన్ 21లో నిర్వచించారు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కార్యనిర్వహణలో పాలు పంచుకునే ప్రజా ప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పబ్లిక్‌ సర్వెంట్ నిర్వచనం కిందకు వస్తారు” అని హైకోర్టు సీనియర్ న్యాయవాది చింతపల్లి లక్ష్మీనారాయణ బీబీసీతో చెప్పారు.

“కేటీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ అనుమతి కోరడం లేదు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్. ఆయన పబ్లిక్ సర్వెంట్‌గా విధి నిర్వహణలో అవతకవలకు పాల్పడినట్లు రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకే, ఆ పబ్లిక్ సర్వెంట్ అనే ప్రాతిపదికన గవర్నర్ అనుమతిని వారు కోరుతున్నారు” అని విజయవాడకు చెందిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది రేగులగడ్డ వెంకటేశ్ తెలిపారు.

ఏసీబీ, అవినీతి నిరోధక శాఖ

ఫొటో సోర్స్, @TelanganaACB

ఆ సమయంలో ఈ సెక్షన్ వర్తించదు

కొన్ని సందర్భాల్లో ఈ సెక్షన్ వర్తించదు.

విధి నిర్వహణలో భాగంగా లంచాలు తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినా లేదా లంచం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పోలీసులు పట్టుకున్నా ఈ సెక్షన్‌ వర్తించదు.

రాజ్ భవన్, తెలంగాణ

ఫొటో సోర్స్, @tg_governor

ఫొటో క్యాప్షన్, తెలంగాణ రాజ్‌భవన్

ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే ప్రతిసారీ గవర్నర్ అనుమతి తీసుకోవాలా?

“అధికార దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడిన కేసుల్లో తప్ప, ఇతర ఏ కేసుల్లోనైనా ఎమ్మెల్యే, ఎంపీలను ముందస్తు అనుమతి లేకుండా విచారించవచ్చు. అంతెందుకు సీఎం, పీఎంలను కూడా విచారించవచ్చు. కేవలం రాష్ట్రపతికి, గవర్నర్‌కు మాత్రమే దీన్నుంచి మినహాయింపు ఉంది.” అని న్యాయవాది చింతపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు.

“ఇతర కేసుల్లో అంటే, రోడ్డుపై ఓ వ్యక్తిని ఒక ఎమ్మెల్యే కొట్టాడనుకోండి. కేసు నమోదు చేసి ఆ ఎమ్మెల్యేను నిరభ్యంతరంగా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే మాత్రం స్పీకర్‌ అనుమతితో ఆయనను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది” అని న్యాయవాది వెంకటేశ్ తెలిపారు.

సిద్ధరామయ్య, చంద్రబాబు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, @siddaramaiah and @ncbn/ X

ఫొటో క్యాప్షన్, సిద్ధరామయ్య, చంద్రబాబు విచారణ సమయంలో చర్చకు వచ్చిన సెక్షన్ -17 ఎ

చంద్రబాబు, సిద్ధరామయ్య విషయంలోనూ ఇదే జరిగిందా?

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోనూ ఈ తరహా ప్రశ్నలే ఎదురయ్యాయి.

అవినీతి నిరోధక సవరణ చట్టం-2018 ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండానే చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.

ఈ చట్టానికి 2018లో సవరణ జరిగింది. అంతకుముందు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నమోదైన కేసులకు ఈ సెక్షన్ వర్తించదని అప్పటి ప్రభుత్వ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు.

“యశ్వంత్ సిన్హా వర్సెస్ సీబీఐ, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తెజ్మల్ చౌదరీ కేసుల్లో హైకోర్టులు భిన్నమైన తీర్పులు ఇచ్చాయి. గవర్నర్ అనుమతి తప్పనిసరా? లేదా? అన్నదానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుత ప్రతీకార రాజకీయాల్లో ప్రభుత్వ పెద్దలు తలచుకుంటే ఎవరిని, ఎలాగైనా అరెస్ట్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి” అని న్యాయవాది చింతపల్లి లక్ష్మీ నారాయణ బీబీసీతో చెప్పారు.

మరోవైపు, పక్కనే ఉన్న కర్ణాటకలోనూ ఈ తరహా వివాదం నడుస్తోంది.

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. దీనిపై అవినీతి నిరోధక సవరణ చట్టం-2018, సెక్షన్ 17-ఎ కింద సిద్ధరామయ్యపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతిని పోలీసులు కోరారు. గవర్నర్ కూడా విచారణకు అనుమతించారు.

అయితే, గవర్నర్ నిర్ణయంపై సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఏకసభ్య ధర్మాసనం సెప్టెంబర్‌లో ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, దీనిపై సిద్ధరామయ్య అప్పీల్‌కు వెళ్లారు. దీనిపై నవంబర్ 23న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ఈలోపే లోకాయుక్త పోలీసులు విచారణకు పిలవడంతో నవంబర్ 6న సీఎం సిద్ధరామయ్య విచారణకు హాజరయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)