సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుని చరిత్ర సృష్టించిన నాసా అంతరిక్ష నౌక

ఫొటో సోర్స్, NASA
- రచయిత, రెబెక్కా మొరెల్లె, అలిసన్ ఫ్రాన్సిస్
- హోదా, సైన్స్ ఎడిటర్, సీనియర్ సైన్స్ జర్నలిస్ట్
సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లడం ద్వారా నాసా అంతరిక్షనౌక చరిత్ర సృష్టించింది. అంతరిక్ష నౌక నుంచి శుక్రవారం నాడు నాసా శాస్త్రవేత్తలకు సంకేతాలు అందాయి. నాసాకు చెందిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలను, విపరీతమైన రేడియేషన్‌ను తట్టుకుంటూ సూర్యుని సమీపానికి వెళ్లింది.
కొంతకాలంగా శాస్త్రవేత్తలకు ఈ నౌకతో సంబంధాలు లేవు. నౌక నుంచి అందే సిగ్నల్ కోసం శాస్త్రవేత్తలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
నౌక వేడి వాతావరణం నుంచి సురక్షితంగా బయటపడగలిగితే భారత కాలమాన ప్రకారం ఈ నెల 28న ఉదయం 5 గంటల సమయానికి సంకేతం అందుతుందని భావించారు. కానీ అనుకున్నదానికన్నా ఒక్కరోజు ముందే సంకేతాలు అందాయి.
ప్రోబ్ సురక్షితంగా ఉందని నాసా ప్రకటించింది. సూర్యుని ఉపరితలం నుంచి 61లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ప్రోబ్ సాధారణంగానే పనిచేస్తోందని తెలిపింది.


ఫొటో సోర్స్, NASA
ఈ నౌక ప్రయాణం ఎందుకు ప్రత్యేకం?
''శతాబ్దాలుగా మనిషి సూర్యునిపై అధ్యయనం జరిపాడు. అయితే మనం నిజంగా ఆ ప్రదేశానికి వెళ్లకపోతే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అర్థం కాదు'' అని నాసా సైన్స్ హెడ్ డాక్టర్ నికోలా ఫాక్స్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
''కాబట్టి సూర్యుని మీదుగా ప్రయాణించలేకపోతే మనం నిజంగా ఆ వాతావరణాన్ని అనుభూతి చెందలేం'' అన్నారు నికోలా.
సూర్యుడి దగ్గరకు ప్రయాణం కోసం పార్కర్ సోలార్ ప్రోబ్‌ను 2018లో తయారుచేశారు.
ఇప్పటికే అది సూర్యుడి వైపు 21 సార్లు ప్రయాణించింది. ఆ సమయంలో కొంచెంకొంచెంగా సూర్యుడి దగ్గరకు వెళ్లింది. కానీ ఈ క్రిస్మస్ సమయంలో చేసిన ప్రయాణం కొత్త రికార్డు సృష్టిస్తోంది.
ప్రోబ్ సూర్యుడికి దగ్గరగా వెళ్లడమంటే సూర్యుడి ఉపరితలం నుంచి 62 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాతావరణంలోకి వెళ్లడం.
ఇంత దూరం అంటే సూర్యుడికి దగ్గరగా వెళ్తున్నామని అనిపించదు. అయితే దీన్ని మరోలా వివరిస్తున్నారు నికోలా ఫాక్స్.
'మనం సూర్యుడికి 9.3 కోట్ల మైళ్ల(సుమారు 15 కోట్ల కిలోమీటర్ల) దూరంలో ఉన్నాం. ఉదాహరణకు మనం సూర్యుడిని, భూమిని ఒక మీటరు దూరంలో ఉంచితే... ఇప్పుడు పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి నాలుగు సెంటీమీటర్ల దూరంలోకి వెళ్తున్నట్లు.
దీన్నిబట్టి ప్రోబ్ సూర్యునికి ఎంత దగ్గరగా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు'' అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, NASA

ఫొటో సోర్స్, PA Media
లండన్ నుంచి న్యూయార్క్‌కు 30 సెకన్ల కన్నా తక్కువ సమయంలో వెళ్లగలిగే వేగం
ఈ ప్రోబ్ 1,400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను, అలాగే ఎలక్ట్రానిక్స్‌ను విచ్ఛిన్నం చేయగల రేడియషన్‌ను తట్టుకోవాల్సి ఉంటుంది.
ప్రోబ్‌కు రక్షణగా 11.5 సెంటీమీటర్ల మందపాటి కార్బన్ కాంపోజిట్ షీల్డ్ ఉంది. అయితే ఈ అంతరిక్ష నౌక సూర్యుడికి దగ్గరగా వెళ్లిరావడానికి అనుసరించే వ్యూహం.. వీలయినంత వేగంగా ఆ వాతావరణంలోకి ప్రవేశించి, అంతే వేగంగా వెనక్కిరావడం.
ఈ ప్రోబ్ ఊహించలేనంత వేగంతో ప్రయాణిస్తుంది. మనుషులు తయారుచేసిన ప్రయాణసాధనాలన్నింటికన్నా దీని వేగం చాలా ఎక్కువ. గంటకు 4,30,000 మైళ్ల(సుమారు 6 లక్షల 92 వేల కిలోమీటర్ల) వేగంతో దూసుకుపోతుంది.
ఈ వేగంతో ప్రయాణిస్తే లండన్ నుంచి న్యూయార్క్‌కు 30 సెకన్ల కంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చు.
సూర్యుడి వైపు ప్రయాణిస్తున్న సమయంలో లభించే ఆకర్షణ శక్తి నుంచి పార్కర్ ఆ వేగాన్ని పొందుతుంది.

ఫొటో సోర్స్, NASA
సూర్యుణ్ని తాకడానికి ఈ ప్రయత్నమంతా ఎందుకు చేయాలి?
అంతరిక్షనౌక సూర్యుడి ఉపరితల వాతావరణం-కరోనా-నుంచి ప్రయాణించడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న మిస్టరీని ఛేదించడానికి వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
''కరోనా..చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. అంత వేడికి గల కారణం తెలియదు'' అని వేల్స్‌లోని ఫిప్త్ స్టార్ ల్యాబ్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జెన్నిఫర్ మిలార్డ్ చెప్పారు.
సూర్యుడి ఉపరితలంపై వేడి 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. కానీ సూర్యుడి చుట్టూ ఉండే కరోనాపై లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. సూర్యునికి దూరంగా ఉన్నప్పటికీ ఆ వాతావరణం అంత వేడిగా ఎందుకు ఉంటుంది?
కరోనా నుంచి బయటకు వచ్చే సూక్ష్మకణాల స్థిరమైన ప్రవాహం- సౌరగాలిని అధ్యయనం చేయడానికి కూడా ఈ మిషన్ శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది.
ఈ కణాలు భూ అయస్కాంత క్షేత్రంలో కలిసినప్పుడు ఆకాశం మిరుమిట్లుగొలిపేలా ప్రకాశిస్తుంది.
అయితే ఈ వాతావరణం అనేక సమస్యలకూ కారణమవుతోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించిపోవడం, ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్‌లు ఆగిపోవడం వంటివి జరుగుతాయి.
''సూర్యుడిని, అంతరిక్ష వాతావరణాన్ని, సౌరగాలులను అర్ధం చేసుకోవడం భూమ్మీద మన రోజువారీ జీవితానికి చాలా అవసరం'' అని డాక్టర్ మిలార్డ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పేస్‌క్రాఫ్ట్‌పై శాస్త్రవేత్తల నమ్మకం
నౌక నుంచి సిగ్నల్ అందిన వెంటనే అంతా బాగానే ఉంది అన్న విషయాన్ని తెలియజేయడానికి తమ బృందం పచ్చని హృదయం సింబల్ పంపిస్తుందని నికోలా ఫాక్స్ చెప్పారు.
ఈ సాహసోపేతమైన ప్రయత్నం తనకు భయం కలిగిస్తోందని ఆమె అంగీకరించారు. అయితే ప్రోబ్‌పై తనకు నమ్మకముందని ఆమె అన్నారు.
''అంతరిక్షనౌక గురించి నాకు ఆందోళన ఉంది. అయితే ఈ కఠినమైన పరిస్థితులన్నింటినీ తట్టుకునేలా మేం నౌకను రూపొందించాం. ఇది చాలా క్లిష్టమైన చిన్న అంతరిక్షనౌక'' అని నికోలా ఫాక్స్ చెప్పారు. ఇప్పుడు ప్రోబ్ పై నికోలా ఫాక్స్ నమ్మకం నిజమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














