‘‘ఆనందాన్నే కాదు, కష్టాన్నీ పంచుకునే నా స్నేహితులే నా కుటుంబ సభ్యులు’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
రతన్ టాటా మరణం తర్వాత ఆయనతో పాటు వార్తల్లో ఎక్కువగా కనిపించిన వ్యక్తి శంతను నాయుడు. ఈ శంతను నాయుడు టాటా ఫ్రెండ్ అనే వీడియోలు వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్యా సుమారు ఐదు పదుల వయసు వ్యత్యాసం ఉంది.
వీళ్లిద్దరికీ స్నేహం ఏమిటి అని అనిపించవచ్చు. కానీ, అక్కడ కలిసింది వాళ్ల హృదయాలు, ఆలోచనలు, లక్ష్యాలు. మన కళ్ల ఎదురుగా కనిపించిన స్నేహానికి రతన్ టాటా, శంతను ఒక ఉదాహరణగా నిలుస్తారు.
"జిందగీ నా మిలేగి దుబారా" సినిమాలో ముగ్గురు బాల్య స్నేహితులు తమ స్నేహాన్ని తిరిగి అన్వేషిస్తూ సాగిన ప్రయాణపు మధురిమ మాదిరిగా నిజ జీవితంలో స్నేహాలు ఉంటాయా? స్నేహం, ప్రేమ, కవుల కాల్పనికతకు లేదా రచయితల ఊహకు మాత్రమే పరిమితమా జీవితంలో ఉన్న విషయాలే తెర పై ప్రతిబింబిస్తాయి, స్నేహమూ, ప్రేమ రెండూ ఉంటాయి అని కొందరంటుంటారు.


ఫొటో సోర్స్, Niharika Reddy/Facebook
ఒంటరి ప్రయాణంలో తోడుగా
కుటుంబ వ్యవస్థ మారుతోంది. ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న కుటుంబాలు, సింగిల్ పేరెంట్ కుటుంబాలు పెరుగుతున్న నేపథ్యంలో స్నేహితులే చాలా మందికి కుటుంబంగా మారుతున్నారు. స్నేహాలు స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు దాటి కుటుంబానికి ఒక కొనసాగింపుగా మారుతున్నాయి.
డిజిటల్ యుగంలో స్నేహానికి నిర్వచనాలు కూడా మారుతున్నాయి.
ఉద్యోగ రీత్యా ఊళ్లు మారినప్పుడు బంధువులు, దగ్గరివారు ఎవరూ లేనప్పుడు చుట్టూ ఉన్న స్నేహితులే కుటుంబంగా మారుతున్నారు.
స్నేహానికి అర్ధాలూ మారుతున్నాయి. హలో, బై, లేదా ఒక ఆఫీసు పలకరింపుకు పరిమితం అవ్వడం లేదు. కష్టంలో, సుఖంలో మేమున్నాం అని చేయూత అందిస్తున్నారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మధ్య ఉండే ఆ సన్నని సరిహద్దులు కూడా చెరిగిపోతున్నాయి.
స్నేహితుల్లోనే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక అన్న, ఒక అత్తయ్య, ఒక మామయ్య కూడా ఉంటున్నారు. ముఖ్యంగా నగరాల్లో, మెట్రోల్లో ఈ ధోరణి పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
సినీనటుడు స్కాలర్‌షిప్ ఇస్తానంటే...
స్నేహితుల సమూహాన్ని తన కుటుంబంగా మలచుకుని, స్నేహితుల సహకారంతో తనకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నహైదరాబాద్ కు చెందిన నిహారిక రెడ్డితో బీబీసీ మాట్లాడింది.
నిహారిక అనంతపురం జిల్లా కదిరిలో పుట్టారు. పుట్టిన మూడు నెలలకే తల్లిని కోల్పోయారు. తండ్రి చిన్నప్పుడే తనను వదిలి వెళ్లిపోవడంతో పెద్దమ్మలు, పెదనాన్నల సంరక్షణలో కొంతకాలం పెరిగారు. 16వ ఏట హాస్టల్ ఫీజ్ కట్టడానికి డబ్బులు లేకపోయినప్పుడు స్కాలర్ షిప్పులు ఇస్తానని ఓ సినీనటుడి పేరుతో వచ్చిన పేపర్ ప్రకటన చూసి చేతికున్న ఉంగరం అమ్మి, హైదరాబాద్ బస్సు ఎక్కేసింది.
హైదరాబాద్ నగరంలో ఎవరూ తెలియదు. బంధువుల చిరునామాలేవీ లేవు. మహా నగరంలో అడుగుపెట్టి ఆటోలో అమాయకంగా సినీ నటుల ఇళ్లకు వెళ్లి గేటు ముందు నిలబడి, పేపర్ యాడ్ చూసి స్కాలర్ షిప్ కోసం వచ్చానని చెబితే, సెక్యూరిటీ సిబ్బంది రాంగ్ అడ్రస్ అని పంపేశారు.
దిక్కు తోచక అప్పుడు అధికారంలో ఉన్న ఒక పార్టీ ఆఫీసుకు వెళ్లి, తన కష్టం వివరిస్తే, జెమినీ టీవీలో ఫ్రీలాన్స్ యాంకర్‌గా పని చేసే అవకాశం ఇప్పించినట్లు నిహారిక చెప్పారు.
"ఆ పార్టీ ఆఫీసు అవుట్ హౌస్‌లో రెండు రోజులు గడిపాను, ఎలా అయినా అధికారులను కలిసి నా సమస్యకు పరిష్కారం చూపించమని అడగాలనుకున్నాను. ఇవాళ ఈ పార్టీ ఆఫీసు ముందు నుంచి కారులో వెళుతుంటే ఒక తెలియని బాధ, ఆనందం కూడా వస్తుంది. అంత అమాయకంగా పార్టీ ఆఫీసులో ఎలా ఉండిపోయానా? అని" అన్నారు.
నిహారికకు హైదరాబాదే తన ఇల్లుగా మారింది. ఆ మహానగరంలో అడుగుపెట్టినప్పుడు తనకు తెలిసిన స్నేహితులెవరూ లేరు. యాంకర్‌గా చేస్తున్నప్పుడే సినిమా డైరెక్టర్ తేజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం దొరికింది.
అక్కడే తనకు కొంత మంది స్నేహితులు అయ్యారు. అక్కడే కలిసిన ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. తన పెళ్లిపెద్ద డైరెక్టర్ తేజ అని చెప్పారు నిహారిక.

ఫొటో సోర్స్, Niharika Reddy/Facebook
ప్రతి మలుపులో కొత్త స్నేహాలు
నిహారికకు ఇద్దరు పిల్లలు పుట్టారు. డెలివరీకి వెళ్లేందుకు పుట్టిల్లు లేదు. అప్పటి వరకు పరిచయమైన కొందరు స్నేహితులే తనకు ఆపద్బాంధవులుగా మారారు.
"పక్క రూమ్ లో డెలివరీకి వచ్చిన తోటి గర్భిణితో అయిన స్నేహం ఇవాళ్టికీ కొనసాగుతోంది. అలా ఆమె ఒక స్నేహితురాలిగా, అక్కగా మారింది.దేశాలు మారినా, స్థాయిలు మారినా నేను ఆ బంధాన్ని మర్చిపోలేదు. హాస్పిటల్ రూమ్‌కి ఆమెతో పాటు నాకు కూడా అవసరమైన వస్తువులన్నీ వచ్చేవి. నా పాపకు న్యాపీలతో సహా. అదే పుట్టింటి సారెగా భావించాను" అని చెప్పారు.
"పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాను. కాలేజీ ఫీజుకు మరో స్నేహితురాలు సహాయం చేశారు. నెమ్మదిగా ఒక బొటిక్ పెట్టుకున్నాను. ఇల్లు కొనుక్కున్నాను.ఈ మొత్తం ప్రయాణంలో ఈ మహానగరంలో నా వెంట ఉండి నడిపించింది స్నేహితులే అని చెప్పొచ్చు. అందుకే నేను వాళ్ళను నా కుటుంబంలానే భావిస్తాను" అని నిహారిక అన్నారు.
"నా జీవితంలో ప్రస్తుతం ఉన్న స్నేహితులు చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళూ కాదు, లేదా నా వ్యాపార భాగస్వాములూ కాదు. మామూలుగా పరిచయమవుతారు. కొంత మంది నా దగ్గరకు క్లైంట్స్‌గా వచ్చి స్నేహితుల్లా మారతారు. కొంత మంది సోషల్ మీడియాలో పరిచయమై, ఇవాళ కుటుంబంలో భాగంగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు.’’ అని తెలిపారు నిహారిక.
"కొంత మంది స్నేహితులకు నా ఇంటి లాక్ ఓపెనింగ్ కోడ్ కూడా తెలుసు. నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా కుటుంబ సభ్యుల మాదిరిగానే లాక్ ఓపెన్ చేసుకుని వచ్చి, వాళ్ళ పనులు చూసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చావు, వెళ్ళావు? ఇలాంటి ప్రశ్నలేమీ ఉండవు."
"బంధువులు కూడా ఉన్నారు, కానీ, అర్ధరాత్రి ఆపద అంటే పరుగున వచ్చేది నా స్నేహితులే. బంధువులు ఊళ్లో ఉంటారు. వెంటనే రాలేరు, నేను కూడా అన్నిటికీ వాళ్ళ పై ఆధారపడలేను".
"నేను కోవిడ్ సమయంలో రోజుకు 500 మంది వరకు భోజనం పంపించాను. ఆ సమయంలో ఫుడ్ ప్యాకింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు స్నేహితులే నాకు సహాయం చేశారు. కొంత మంది ఆన్‌లైన్ స్నేహితులు డొనేషన్లు కూడా పంపారు". అని వివరించారు నిహారిక.

ఫొటో సోర్స్, Niharika Reddy/Facebook
నా స్నేహితులే నా కుటుంబం
నా స్నేహితులు నాకు అన్నింటిలో అండగా నిలబడ్డారు. నేను వారిని నా కుటుంబమనే అంటాను అని చెప్పారు నిహారిక.
"నేను నిహారిక ఫౌండేషన్ ప్రారంభించాను. అడగగానే చాలా మంది స్నేహితులు డొనేషన్లు పంపారు. వాళ్ళు చేసిన సహాయంతోనే ఖమ్మం వరదల్లో బాధితులకు నిత్యావసరాలు, వంట సామగ్రి, బ్రతికేందుకు అవసరమైన కొన్ని సామాన్లు ఇచ్చాం. ఇదంతా స్నేహితుల వల్లే సాధ్యం అవుతోంది. మరి వీళ్ళను నా కుటుంబం అనాలా వద్దా?" అని ప్రశ్నించారు నిహారిక.
"నా చుట్టూ చాలా మంది స్నేహితులం అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ, నేను మనసుకు దగ్గరగా, లేదా నా కుటుంబంలో భాగం అనుకునేది కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే వాళ్ళే ఉన్నారు. మాట సాయమే కాదు, ఆర్ధిక సాయానికీ ముందుకు వస్తారు".
"మంచి స్నేహితులంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక నమ్మకం, సంతోషంలో, దుఃఖంలో ఒక ఫోన్ కాల్ చాలు అని అనిపిస్తుంది. స్నేహానికైనా, ప్రేమకైనా నమ్మకమే పునాది. నేను కాల్ చేస్తే నా కోసం వీళ్ళు వస్తారు అనే ఫీలింగ్ నాకు చాలా ధైర్యాన్నిస్తుంది".
"ఇప్పుడు నాకొక కుటుంబం ఉంది, భర్త, పిల్లలు ఉన్నారు".
"కానీ, వీళ్ళతో పాటు నా స్నేహితులు కూడా ఉన్నారు. స్నేహితుల్లో అన్ని రకాల వాళ్ళు, అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఉన్నారు. మావి పార్టీలకు, సినిమాలకు మాత్రమే పరిమితమైన స్నేహాలు కాదు."
"నా భర్త కానీ, పిల్లలు కానీ ఎప్పుడూ ఏ స్నేహాన్ని ప్రశ్నించలేదు. అదే నాకు పెద్ద వరం. స్నేహితులతో టూర్లు వెళతాను, గుడికి వెళతాను, ముఖ్యమైన విషయాలను చర్చిస్తాను. ఎటువంటి ఫిల్టర్లు లేకుండా మాట్లాడుకోవడానికి మంచి స్నేహితులు వాసంత సమీరాల్లాంటి వాళ్ళు" అంటారు నిహారిక.
"ఈ స్నేహితుల సహకారమే లేకపోతే ఈ మహానగరంలో ఒంటరిగా, ఖాళీ చేతులతో వచ్చి ఈ రోజు నా కంటూ ఒక ఉనికిని సాధించుకోలేకపోయి ఉండేదానిని. వీళ్ళందరికీ నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇవాళ పది మందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. వీలైనంత మందికి సహాయం చేయగలుగుతున్నాను’’
"స్నేహితులతో గొడవలు లేవా అంటే, ఉన్నాయి, పొరపాట్లతో, విభేదాలతో దూరమైన స్నేహితులు కూడా ఉన్నారు. ఆలా, అని, నేను స్నేహంపై నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. నేను కొన్ని స్నేహాల వల్ల ఆర్ధికంగా కూడా నష్టపోయాను".
"మనుషుల్లో మంచీ చెడూ ఉన్నట్లే, స్నేహితుల్లో కూడా ఉంటారు. మనతో ప్రయాణం కుదరదనుకున్నవాళ్ళని పక్కన పెడుతూ, కలిసి నడిచేవాళ్లతో జ్ఞాపకాలను ఏరుకోవడమే నా ఫిలాసఫీ అని ముగించారు".

ఫొటో సోర్స్, Getty Images
లాకర్ రూమ్ దగ్గర మొదలైన స్నేహం..
స్నేహంగా మొదలైన పరిచయాలు కుటుంబ బంధాలుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. ఆఫీసు లాకర్ రూమ్ దగ్గర మొదలయిన స్నేహం తనకెంతో ప్రియమైన వస్తువును నాతో పంచుకునేంత దగ్గరయిందంటారు డాక్టర్ ప్రియాంక సర్కార్. తన స్నేహితురాలి పేరు యశ్వంతి. తను నాకు జీవితాన్ని కొత్తగా చూపించడం నేర్పించింది. తను నాకొక మానసిక బలం, ధైర్యం అని చెప్పారు ప్రియాంక సర్కార్. ప్రస్తుతం ఆమె స్పోర్ట్స్ సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.
ప్రియాంక పదేళ్ల కిందట ఓ ఐటీ కంపెనీలో పనిచేయడానికి బెంగళూరుకు వెళ్ళినప్పుడు యశ్వంతితో అనుకోకుండా మొదలయిన స్నేహం ఇవాళ ఒక దృఢమైన బంధంగా పెనవేసుకుంది.
"కొత్త ఊరు, కొత్త రాష్ట్రంలో ఆఫీసులో ఒక వ్యక్తి నన్ను లైంగికంగా వేధిస్తున్నప్పుడు నేను పాష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్) టీమ్‌కు ఫిర్యాదు చేసేందుకు అవసరమైన ధైర్యాన్ని ఇచ్చింది. నా మానసిక వేదనను అర్థం చేసుకుంది. నేనొక ముందడుగు వేసేలా చేసింది. ఫిర్యాదు రాసేందుకు సహాయం చేసింది. ఈ సంఘటన తర్వాత నా మేనేజర్లు నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి, ఉద్యోగంలో ఇబ్బందులు పెట్టడానికి చాలా ప్రయత్నించారు. కానీ, తను నా వెన్నంటి ఉండి, నా చేతిని వదలకుండా నడిపిస్తూ నేను నిజం మాట్లాడేలా ప్రోత్సహించింది".
"ఈ మధ్యలో తన తల్లితండ్రులిద్దరినీ కోల్పోయింది. మేమిద్దరం ఒకరికొకరంలా మారిపోయాం.2016లో బెంగళూరు వదిలి వచ్చేశాను కానీ, మా స్నేహం బీటలు వారలేదు. మేమిద్దరం నిశ్శబ్దంలో ఒకరినొకరిని అర్థం చేసుకున్నాం". అని చెప్పారు ప్రియాంక. ప్రియాంక పెళ్లి చేసుకోలేదు.
"జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నీ స్వభావాన్ని మాత్రం మార్చుకోకు అని తనిచ్చిన సలహా ఇవాళ నేను ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని, జీవితాన్ని గడిపే ధైర్యాన్ని ఇచ్చింది. నా భయాలను, కన్నీళ్లను, నా నిజాయితీని, నన్ను నన్నుగా ఆమోదించగలిగే స్నేహితురాలు దొరకడం నాకొక వరం. ఇవాళ ఆమె ఒక అక్క, ఒక బంధువు, అన్నిటికీ మించి ఒక బెస్ట్ సోల్ మేట్." అని ప్రియాంక ముగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














