వాయుకాలుష్యంతో దిల్లీని వీడిపోతున్న కుటుంబాలు, దీనికి పరిష్కారం లేదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నియాజ్ ఫారూఖీ
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
సౌరభ్ భాసిన్‌కు తాను పుట్టిన దిల్లీ నగరం అంటే చాలా ఇష్టం.దిల్లీలో విపరీతంగా ఉండే ఎండను తట్టుకోలేక, ఆయన చలికాలం కోసం ఎదురుచూసేవారు. కానీ ఏళ్లు గడిచేకొద్దీ ఆ ఎదురుచూపు భయంగా మారింది.
అక్టోబరు నుంచి జనవరి మధ్య వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయి దాటుతోంది. ఆకాశమంతా పొగమంచు కమ్ముకుంటోంది. గాలి విషతుల్యం అవుతోంది.
ఆరుబయట నడవడం, ఇంట్లో పిల్లలతో ఆడుకోవడం వంటి సాధారణ పనులు కూడా ప్రమాదకరంగా, ఆందోళనకరంగా అనిపించే పరిస్థితి.
పండుగలు, పెళ్లిళ్ల వంటి వేడుకలలో బాణాసంచా వినియోగాన్ని నిషేధించాలని కోరుతూ తన పసిబిడ్డ తరపున ఆరునెలల వయసున్న పిల్లలను కలిగిన ఇద్దరు తండ్రులతో కలిసి న్యాయవాది అయిన భాసిన్ సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
"దిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరస్థాయిలో క్షీణించడానికి కారణం ట్రాఫిక్ రద్దీ, విస్తృతమైన నిర్మాణాల వల్ల వచ్చే దుమ్ము, పారిశ్రామిక కాలుష్యం, బాణాసంచా వాడకం " అని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
బాణాసంచా వినియోగాన్ని నియంత్రించడానికి కోర్టు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ దిల్లీలో గాలి నాణ్యత క్షీణస్తూనే ఉంది.
నవంబర్ 2022లో, భాసిన్ కుమార్తెకు ఆస్తమా ఉన్నట్టు నిర్ధరణ అయింది. ఆ ఏడాది ప్రారంభంలో ఆయన కుటుంబంతో కలిసి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవాకు వెళ్లిపోయారు. ఇప్పుడు వారు అక్కడే ఉంటున్నారు.
కానీ తమ జీవనోపాధిని విడిచిపెట్టలేని లక్షలాదిమంది తప్పనిసరి పరిస్థితుల్లో దిల్లీ లోనే జీవించాల్సి వస్తోంది. అయితే కొద్దిమంది చలికాలంలోనూ, మరికొంతమంది శాశ్వతంగానూ దిల్లీని విడిచి వెళ్లిపోతున్నారు. వారిలో భాసిన్ కూడా ఒకరు.
“నా కుమార్తెను గోవాకు తీసుకురావడం వల్ల ఆమెకు ఉబ్బసం తగ్గుతుందనిపించింది. కానీ దిల్లీలోనే ఉంచితే ఆమె ఆరోగ్యం మరింత దిగజారిపోయేదని మేం అనుకుంటున్నాం” అని ఆయన చెప్పారు.


ఫొటో సోర్స్, Saurabh Bhasin
పరిష్కారం ఎక్కడ?
భాసిన్ ఆందోళనలు నిరాధారమైనవి కావు. కొన్నేళ్లుగా అక్టోబర్, జనవరి మధ్య దిల్లీ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
పేలవమైన గాలి నాణ్యత పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారినపడటంతోపాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారి మరణానికి దారితీయవచ్చు అని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన సిఫార్సులలో తెలిపింది.
గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరినప్పుడు ముఖ్యంగా రోగులుఇంట్లోనే ఉండాలని సూచించింది.
ఇలాంటి చర్యలన్నీ కంటితుడుపువని భాసిన్ భావిస్తున్నారు. ‘‘మీరు సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. లేదంటే పైపై మెరుగులతో దానిని అలాగే కొనసాగించవచ్చు. కానీ దీనికి తరతరాలు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’’ అని భాసిన్ చెప్పారు.
షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ 2022లో జరిపిన అధ్యయనంలో వాయుకాలుష్యం వల్ల దిల్లీ ప్రజల జీవితకాలం 10 సంవత్సరాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని తేలింది.
రేఖా మాథుర్ ప్రతి ఏడాది శీతాకాలంలో తాత్కాలికంగా దిల్లీని విడిచి డెహ్రాడూన్ శివార్లకు మకాం మార్చుతుంటారు. ఇటీవలే ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చారు.అందుకే దిల్లీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు. కానీ ఆమె భర్త మాత్రం వృత్తిరీత్యా దిల్లీలోనే ఉండాల్సి వస్తోంది. పిల్లల సంరక్షణ మాథుర్ చూసుకుంటారు.దీంతో అప్పుడప్పుడూ మాత్రమే ఆ బిడ్డ తన తండ్రిని చూడగలుగుతారు.
‘‘మా జీవితంలో చాలాభాగం దిల్లీతో పెనవేసుకుపోయింది. ఇంత తీవ్రమైన కాలుష్యం లేకుంటే నేనెప్పుడూ దిల్లీని వదిలేదాన్నే కాదు’’ అని ఆమె అన్నారు.
అయితే పిల్లవాడు స్కూల్‌కి వెళ్లే సమయం వస్తే పరిస్థితి ఏంటో అర్థం కావడంలేదు అని మాథుర్ అంటున్నారు.దిల్లీ వంటి నగరాలకే కాకుండా, డెహ్రాడూన్ వంటి అందమైన, చిన్న నగరాలకు కూడా కాలుష్యం వ్యాపించడం ఆమెకు ఆందోళన కలిగిస్తోంది .

ఫొటో సోర్స్, Getty Images
చర్చలకే పరిమితం
దిల్లీలో వాయుకాలుష్యంపై కొన్నేళ్లుగా కేవలం చర్చలు మాత్రమే జరుగుతున్నాయి.
నాలుగు దశాబ్దాలుగా, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కాలుష్య కారక పరిశ్రమలను తరలించాలని, వాణిజ్య డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలు వెదకాలని, ఇటుక బట్టీలను మూసివేయాలని, బైపాస్, ఎక్స్‌ప్రెస్‌వేలను వేగంగా నిర్మించాలని ఆదేశించింది.
ఈ శీతాకాలంలో, దిల్లీ, పరిసర ప్రాంతాలు పొగమంచుతో నిండిపోవడంతో అధికారులు నిర్మాణరంగం కార్యకలాపాలను నియంత్రించారు. కాలుష్యకారక పరిశ్రమల మూసివేత, రోడ్డుపై వాహనాల సంఖ్యను పరిమితం చేయడం వంటి ఆంక్షలను విధించారు.
అయినప్పటికీ, గాలి నాణ్యత పెద్దగా మెరుగుపడలేదు. ఏటా శీతాకాలం రాగానే వాయు కాలుష్యం గురించి తీవ్ర చర్చ జరుగుతుందని, కానీ ఫలితం లేదని స్థానికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీలో 15 సంవత్సరాలకు పైగా నివసించిన జర్నలిస్ట్, రచయిత ఓం థాన్వి మాట్లాడుతూ, మన దగ్గర మంత్ర దండం ఏమీ లేదని, ఆచరణీయమైన పరిష్కారాన్ని కనుగొనాలంటే, దీనిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రభుత్వం పరిగణించాలన్నారు.
థాన్వి 2018లో రాజస్థాన్‌కు వెళ్లారు. దిల్లీ కాలుష్యం కారణంగా ఆయన తిరిగి రావాలనుకోవడంలేదు.
“నేను దిల్లీలో ఇన్‌హేలర్‌ని ఉపయోగించాల్సి వచ్చింది. కానీ నేను రాజస్తాన్‌కి మారిన తర్వాత, అది ఎక్కడ ఉందో కూడా గుర్తు లేదు,”అని ఆయన చెప్పారు.
పరిస్థితులు మెరుగుపడే వరకు నగరాన్ని విడిచిపెట్టి వెళ్లండి అని ఆయన ఇతరులకు సలహా ఇస్తున్నారు.

అందరికీ ఆ అవకాశం లేదు
ఓం థాన్వి చెప్పినట్టు దిల్లీ విడిచి వెళ్లే పరిస్థితి అందరికీ లేదు.
సరితా దేవి పట్నానుంచి దిల్లీకి వలస వచ్చారు. ఆమె బట్టలు ఇస్త్రీ చేసి జీవిస్తుంటారు. శీతాకాలం, వేసవిలో తన బండివద్దే గంటల తరబడి గడుపుతారు.
“నేను పట్నాకు తిరిగి వెళ్ళలేను. ఎందుకంటే అక్కడ నేను డబ్బు సంపాదించలేను. నేను వెళ్ళినప్పటికీ, అది పెద్ద మార్పేమీకాదు’’ అని దేవి చెప్పారు.
నేను కొన్ని రోజుల క్రితం ఒక పండుగ కోసం పట్నాకి వెళ్లాను అక్కడ కూడా గాలి కాలుష్యం ఎక్కువగానే ఉంది అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఉత్తర భారత నగరాల్లో గాలి కాలుష్య తీవ్రత పెరిగిందని అర్థం అవుతుంది.
జూన్‌లో గోవాకు మారినప్పుడు, స్నేహితులు, కుటుంబ సభ్యులను విడిచిపెట్టడం చాలా కష్టంగా అనిపించిందని భాసిన్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం సరైనదేననే నమ్మకంతో ఉన్నారు.
"మా పిల్లల ఆరోగ్యానికి మూల్యం చెల్లించడానికి మేం సిద్ధంగా లేం."అని ఆయన చెప్పారు.
గోప్యత కోసం పేర్లు మార్చాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














