అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే చైనా, కెనడా, మెక్సికో వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానన్న ట్రంప్, చైనా ఏమన్నదంటే..

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్ 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు.
    • రచయిత, పీటర్ హోస్కిన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే చైనా, మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై కొత్త సుంకాలు విధిస్తానని డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అమెరికాలోకి అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నివారణకు ఇవి సహాయపడతాయని ఆయన చెప్పారు.

మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 25 శాతం సుంకం విధించే ఉత్తర్వులపై జనవరి 20 సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు.

ఫెంటానిల్ స్మగ్లింగ్‌ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ట్రంప్ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ‘‘ఈ సుంకాల యుద్ధంలో ఎవ్వరూ గెలవరు. ట్రంప్ బెదిరింపులు ఆయన నిర్లక్ష్య ధోరణిని సూచిస్తున్నాయి’’ అని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

ట్రంప్ హెచ్చరికలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా కూడా స్పందించారు.

‘‘ఇలాంటి బెదిరింపులు సమస్యలను పరిష్కరించలేవు. ఒకవేళ ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, మేం కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద సుంకాలు విధిస్తాం'’ అని క్లాడియా అన్నారు.

తాజా పరిణామాల అనంతరం డోనల్డ్ ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫోన్‌లో మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డ్రగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి హానికరం

ఏమిటీ ఫెంటానిల్?

ఫెంటానిల్ అనే శక్తిమంతమైన డ్రగ్ కారణంగా గత ఏడాది దాదాపు 75,000 మంది అమెరికన్లు చనిపోయారు. దీంతో ఈ ఫెంటానిల్‌లో వాడే పదార్థాల తయారీని ఆపాలని బైడెన్ ప్రభుత్వం కూడా చైనాను కోరింది.

మెక్సికో, కెనడాలు మాదకద్రవ్యాలను ముఖ్యంగా ఫెంటానిల్, అక్రమ వలసలను అరికట్టేవరకూ సుంకాలను కొనసాగిస్తానని డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

రెండు దేశాలు ఈ సమస్యలను సులభంగా పరిష్కరించగలవని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.

"వారు పెద్ద మూల్యం చెల్లించాల్సిన సమయం ఇది" అని ట్రంప్ ఆ పోస్టులో తెలిపారు.

ట్రంప్, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ట్రంప్, షీ జిన్‌పింగ్ (ఫైల్ ఫొటో)

చైనాపై 60 శాతం సుంకాలు

మరో పోస్టులో ట్రంప్ చైనాపై విమర్శలు గుప్పించారు. ఫెంటానిల్ డీలర్లకు మరణశిక్ష విధిస్తామని చైనా హామీ ఇచ్చిందని కానీ, దాన్ని నిలబెట్టుకోలేకపోయిందన్నారు.

అమెరికా ఆరోపణలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి ఖండించారు. అమెరికాకు ఫెంటానిల్ పదార్థాల అక్రమరవాణా చైనాకు తెలిసే జరుగుతోందనేది నిజం కాదని తెలిపారు. చైనా, అమెరికాల మధ్య ఆర్థిక సహకారం రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆ ప్రతినిధి చెప్పారు. వాణిజ్య యుద్ధాలు లేదా సుంకాల యుద్ధాలు అందరికీ హాని కలిగిస్తాయని అన్నారు.

చైనాలో తయారైన అన్ని ఉత్పత్తులపై 60 శాతానికి పైగా సుంకాలు విధించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో చెప్పారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విధించిన పన్నుల కంటే ఇవి చాలా ఎక్కువ.

అంతేకాదు చైనాకు ఇచ్చిన "అత్యంత అభిమాన వాణిజ్య దేశ హోదాను తీసివేస్తానని ట్రంప్ చెప్పారు. ఈ హోదా వల్ల చైనాపై తక్కువ సుంకాలు, తక్కువ పరిమితులు ఉండేవి.

అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉద్యోగాల పరిరక్షణ, పన్ను ఆదాయం పెంపునకు సుంకాలు ఒక మార్గంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ సుంకాల వల్ల అమెరికన్లకు నష్టం జరగబోదని, దీని భారం పడేది ఇతర దేశాలపైనేనని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చాలామంది ఆర్థికవేత్తలు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు.

తన పాలసీ లక్ష్యాల కోసం టారిఫ్‌లను ఒక సాధనంగా ఉపయోగించుకుంటానని ట్రంప్ చేసిన ప్రచార వాగ్దానాలకు ఈ ప్రక్రియ సరిపోతుందని పాల్ త్సాయ్ చైనా సెంటర్ ఆఫ్ యేల్ లా స్కూల్‌లో సీనియర్ ఫెలో అయిన స్టీఫెన్ రోచ్ పేర్కొన్నారు.

ట్రెజరీ సెక్రటరీగా ట్రంప్ ఎంపిక చేసిన స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. ట్రంప్ అధిక సుంకాల బెదిరింపులు చర్చల వ్యూహంగా ఉండవచ్చని, ఆయన అంతిమంగా స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతిస్తారని అభిప్రాయపడ్డారు.

సరిహద్దు భద్రతపై ట్రంప్ చర్చలు

ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న రోజులతో పోలిస్తే ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. స్థిరాస్తి మార్కెట్ సంక్షోభం, బలహీనపడిన దేశీయ డిమాండ్, పెరుగుతున్న ప్రభుత్వ రుణం వంటి సవాళ్లతో చైనా సతమతమవుతోంది.

డోనల్డ్ ట్రంప్ సూచించిన కొత్త సుంకాల ప్రణాళిక అమెరికా-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందానికి (యూఎస్ఎంసీఏ) విరుద్ధంగా ఉండవచ్చు. ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేసిన తర్వాతే 2020లో అమల్లోకి వచ్చింది. ఇది మూడు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఎక్కువగా సుంకాలు లేకుండా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సుంకాలు పెంచుతామని ప్రకటించిన తరువాత ట్రంప్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో వాణిజ్యం, సరిహద్దు భద్రతపై చర్చించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

"మెక్సికో అమెరికా అగ్రస్థాయి వాణిజ్య భాగస్వామి. యూఎస్ఎంసీఏ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు కచ్చితమైన మార్గదర్శకాలు చూపుతుంది’’ అని మెక్సికో ఆర్థిక మంత్రిత్వశాఖ చెప్పింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)