పులులను వేటాడే ఈ భారత ముస్లిం యువరాణి 37 ఏళ్ల వయసులో పాకిస్తాన్ ఎందుకు వెళ్లిపోయారు

అబిదా సుల్తాన్

ఫొటో సోర్స్, Shams Ur Rehman Alavi

ఫొటో క్యాప్షన్, భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ పెద్ద కూతురు అబిదా సుల్తాన్
    • రచయిత, చెరిలాన్ మొలన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి

అబిదా సుల్తాన్ అందరిలాంటి యువరాణి కాదు.

పొట్టి జుట్టుతో ఉండేవారు, పులులను కాల్చి చంపేవారు, పోలో ప్లేయర్ కూడా.

ఆమె విమానాలు నడిపారు, 9 ఏళ్లకే స్వయంగా రోల్స్ రాయిస్ కారులో చక్కర్లు కొట్టేవారు.

బ్రిటిష్ ఇండియాలో, ఉత్తరాది రాచరిక ప్రాంతాల్లో ఒకటైన భోపాల్‌ను శతాబ్దానికి పైగా పాలించిన ధైర్యవంతులైన 'బేగమ్స్' కుటుంబంలో 1913లో జన్మించారు అబిదా.

మహిళలు, మరీముఖ్యంగా ముస్లిం మహిళల చుట్టూ ఉన్న మూస సిద్ధాంతాలను ధిక్కరించి రాచరిక వారసత్వాన్ని కొనసాగించారు.

శరీరం కనిపించకుండా ముస్లిం మహిళలు, కొందరు హిందూ స్త్రీలు ధరించే పరదా సంస్కృతిని ఆమె వ్యతిరేకించారు.

పదిహేనేళ్లకే సింహాసనానికి వారసురాలు అయ్యారు.

అబిదా తన తండ్రి మంత్రివర్గాన్ని ఒక దశాబ్దానికి పైగా నడిపారు, దేశంలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులతో భుజం కలిపి నడిచారు.

1947లో దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పాటైన సమయంలో చెలరేగిన ద్వేషం, హింసను ప్రత్యక్షంగా చూశారు.

చిన్నప్పటి నుంచి పాలన పగ్గాలు చేపట్టే వరకు క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించే తన నానమ్మ సుల్తాన్ జెహాన్ మార్గదర్శకత్వంలో నడిచారు.

తన రోజువారీ జీవితం ఎలా గడిచేదో 2004లో విడుదలైన ఆమె ఆత్మకథ ''మెమోయిర్స్ ఆఫ్ ఏ రెబల్ ప్రిన్సెస్''లో అబిదా రాశారు. అందులో ఉదయం 4 గంటలకు నిద్రలేచి ఖురాన్ చదవడం దగ్గరి నుంచి.. ఆటలు, సంగీతం, గుర్రపు స్వారీతో పాటు ఇల్లు తుడవడం, స్నానపుగదులను శుభ్రం చేయడం వంటి వరకూ అన్ని పనులూ ఉన్నాయి.

''అమ్మాయి అనే కారణంగా ఎలాంటి వివక్షకూ గురికాలేదు. అంతా సమానమే. ఒక అబ్బాయికి ఎంత స్వేచ్ఛ ఉండేదో మాకూ అంతే. స్వారీ చేయొచ్చు, చెట్లెక్కొచ్చు, మాకు ఇష్టమొచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. ఎలాంటి ఆంక్షలూ లేవు'' అని తన బాల్యం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అబిదాకు స్వతంత్ర భావాలు ఉండేవి, 13 ఏళ్ల వయసులో పరదా వేసుకోవాలని తన నానమ్మ ఒత్తిడి చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.

ఎనలేని ఆత్మవిశ్వాసం, ఆమె తండ్రి విశాల దృక్పథంతో పరదా ధరించాలనే మూసపద్ధతి నుంచి ఆమె బయటపడ్డారు.

అప్పటికే భోపాల్ రాజ్యానికి వారసురాలైన అబిదాకు, పొరుగు రాజ్యమైన కుర్వాయి రాజకుటుంబంలో భాగమయ్యే అవకాశం వచ్చింది. 12 ఏళ్ల వయసులో.. తన చిన్ననాటి స్నేహితుడు, కుర్వాయి రాజు అయిన సర్వార్ అలీ ఖాన్‌తో ఆమెకు వివాహమైంది.

తనకు కనీస సమాచారం కూడా లేకుండా తన పెళ్లి ఎలా జరిగిందో ఆమె వివరించారు.

ఒకరోజు పిల్లలందరం కలిసి దిండుతో కొట్టుకుంటున్న సమయంలో, అబిదా నానమ్మ గదిలోకి వచ్చి, ఆమెను పెళ్లి దుస్తుల్లో సిద్ధం చేయాలని సూచించారు, అంతేకానీ తనే వధువు అనే సంగతి ఎవరూ ఆమెకు చెప్పలేదు.

''ఎలా ఉండాలో, ఏం చేయాలో నాకెవరూ చెప్పలేదు. దీంతో అడ్డుగా ఉన్న మహిళలను పక్కకు తోసుకుంటూ, నేరుగా నిఖా చాంబర్ (వివాహ మందిరం)లోకి వెళ్లా. నా ముఖంపై ఎలాంటి పరదాలు లేవు. మళ్లీ ఏదో కొత్త తంతు అనుకుంటూ విసుక్కుంటూ ఉన్నా'' అని ఆమె రాశారు.

ఆమె వివాహం క్షణాల్లో ఎలా జరిగిపోయిందో, అంతే త్వరగా ముగిసిపోయింది. అంటే, ఆమె వైవాహిక జీవితం దశాబ్దకాలం కూడా కొనసాగలేదు.

చిన్న వయస్సు కావడం, అత్యంత క్రమశిక్షణతో కూడిన పెంపకం కారణంగా తన వైవాహిక జీవితం అబిదాకు కష్టంగా మారింది.

శృంగారం గురించి అస్సలు అవగాహన లేకపోవడం, దానిని అసౌకర్యంగా భావించడం తన వైవాహిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఆమె వివరించారు.

‘పెళ్లైన వెంటనే, దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యల్లో చిక్కుకుపోయా. అది నన్ను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో, ఎంత భయాందోళనకు గురిచేస్తుందో, ఎంత అసహ్యకరమైన అనుభూతిని మిగులుస్తుందో ఊహించలేకపోయా’ అని ఆమె రాశారు. ''భార్యాభర్తల మధ్య ఉండే దాంపత్య జీవితాన్ని మళ్లీ ఊహించుకోలేకపోయా'' అని రాశారామె. దీంతో వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది.

అబిదా సుల్తాన్

ఫొటో సోర్స్, Shams Ur Rehman Alavi

ఫొటో క్యాప్షన్, అబిదా ఒక పోలో ప్లేయర్

తన భర్తతో సాన్నిహిత్యం గురించి అబిదా నిర్మొహమాటంగా వివరించడం గురించి 'దక్షిణాసియా ముస్లిం మహిళల ఆత్మకథలు, రచనల్లో సాన్నిహిత్యం, లైంగికత'‌పై ప్రచురించిన తన పేపర్‌లో సియోభన్ లాంబెర్ట్ - హర్లీ ప్రస్తావించారు.

శృంగారం గురించి రాయని ముస్లిం మహిళల మూస పద్ధతిని అబిదా పటాపంచలు చేశారని ఆమె పేర్కొన్నారు.

తన భర్త నుంచి విడిపోయిన తర్వాత, అబిదా కుర్వాయిలోని అత్తింటి నుంచి భోపాల్‌కు తిరిగొచ్చేశారు. అయితే, వారి ఒక్కగానొక్క కొడుకు షాహర్యార్ మొహహ్మద్ ఖాన్ ఎవరి దగ్గర ఉండాలనే విషయమై వివాదం తలెత్తింది.

చాలాకాలం పాటు ఈ వివాదం కొనసాగింది. అయితే, తన కొడుకును వదులుకోవడానికి ఇష్టపడని అబిదా.. ధైర్యంగా తన భర్తే వెనకడుగు వేసేలా చేశారు.

1935లో ఒక రోజు రాత్రి, అబిదా స్వయంగా కారు నడుపుకుంటూ నేరుగా కుర్వాయిలోని తన భర్త ఇంటికి వెళ్లారు. ఆయన పడక గదిలోకి వెళ్లి, రివాల్వర్‌ను ఆయన ఒళ్లోకి విసిరేసి ఇలా అన్నారు, ''నన్ను కాల్చి చంపేయండి, లేదంటే నేను మిమ్నల్ని చంపేస్తాను.''

ఆ తర్వాత, దంపతులు బాహాబాహీ తలపడ్డారు, అందులో అబిదా గెలవడంతో కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే వివాదం అంతటితో ముగిసిపోయింది.

వారసురాలిగా తన విధులు నిర్వర్తిస్తూనే, తల్లీతండ్రీ తానే అయ్యి తన కొడుకును పెంచారు. 1935 నుంచి 1949లో భోపాల్ రాజ్యం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనమయ్యేంత వరకూ ఆమె తన మంత్రివర్గాన్ని ముందుకు నడిపారు.

భారత‌ ప్రభుత్వ ఏర్పాటు కోసం బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన రౌండ్ - టేబుల్ సమావేశాలకు కూడా అబిదా హాజరయ్యారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి నాయకులను ఆమె కలిశారు.

హిందూ, ముస్లింల మధ్య సంబంధాలు దెబ్బతినడం, 1947లో దేశ విభజనానంతరం చెలరేగిన హింసను ప్రత్యక్షంగా చూశారు.

అబిదా సుల్తాన్

ఫొటో సోర్స్, Shams Ur Rehman Alavi

ఫొటో క్యాప్షన్, అబిదా 1950లో పాకిస్తాన్ వెళ్లిపోయారు

భోపాల్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి అబిదా తన పుస్తకంలో వివరించారు. తరతరాలుగా ఇక్కడే శాంతియుతంగా జీవించిన తన కుటుంబాన్ని ''పరాయివారి''గా చూడడం మొదలైంది. హిందూ ముస్లింల మధ్య జరిగిన హింస గురించి కలవరపరిచే ఒక ఘటన గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ముస్లిం శరణార్థులతో కూడిన రైలు భోపాల్‌కు వస్తుందని భారత ప్రభుత్వం నుంచి సమాచారం రావడంతో అక్కడి పరిస్థితులను పర్యవేక్షించేందుకు, ఒకరోజు ఆమె రైల్వే స్టేషన్‌కు వెళ్లారు.

''ఆ కంపార్ట్‌మెంట్లను తెరిచి చూస్తే, అందరూ చనిపోయి ఉన్నారు'' అని ఆమె చెప్పారు. ఆ హింస, విశ్వాసం సన్నగిల్లడం ఆమెను 1950లో పాకిస్తాన్‌కు వెళ్లిపోయేలా చేశాయి.

తన కొడుకు కోసం, అతని భవిష్యత్తు కోసం అబిదా వెళ్లిపోయారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం, మహిళల హక్కుల కోసం పోరాడారు. 2002లో, కరాచీలో అబిదా మరణించారు.

అబిదా పాకిస్తాన్ వెళ్లిపోయిన తర్వాత ఆమె సోదరిని భారత ప్రభుత్వం రాజవంశ వారసురాలిగా ప్రకటించింది. అయితే, ఇప్పటికీ భోపాల్‌లో అబిదా పేరు వినిపిస్తుంది. భోపాల్ ప్రజలు ఆమెను 'బియా హుజూర్' అని పిలుచుకుంటారు.

''కొన్నేళ్లుగా పెరిగిపోయిన మతపరమైన రాజకీయాలతో ఆమె వారసత్వం మరుగునపడింది. ఆమె పేరు పెద్దగా వినిపించడం లేదు'' అని భోపాల్ మహిళా పాలకులపై పరిశోధన చేస్తున్న జర్నలిస్ట్ షామ్స్ ఉర్ రహమాన్ అలావి అన్నారు.

''కానీ, ఇప్పట్లో ఆమె పేరు మర్చిపోయే అవకాశం మాత్రం లేదు.''

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)