నాగా ప్రజల ఆందోళనతో ఆగిన పుర్రె వేలం, బ్రిటన్ పురావస్తు కేంద్రానికి ఇది ఎలా చేరింది?

నాగా మానవుల అవశేషాలు

ఫొటో సోర్స్, Alok Kumar Kanungo

ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ పాలకులు భారత్ నుంచి నాగా మానవుల పుర్రెలను, ఇతర అవశేషాలను తీసుకువెళ్లారు
    • రచయిత, నెయాజ్ ఫారూకీ
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ ఆదివాసి తెగకు చెందిన 19వ శతాబ్దం నాటి పుర్రెను బ్రిటన్‌లో వేలం వేస్తారనే వార్త తెలిసి ఎల్లెన్ కొన్యాక్ కలత చెందారు.

యూరప్ వలస పాలకులు నాగాలాండ్ నుంచి తీసుకెళ్లిన వేలాది వస్తువులలో కొమ్ములతో ఉన్నఈ పుర్రె కూడా ఒకటి.

నాగా ఫోరమ్ ఫర్ రీకన్సిలియేషన్ (ఎన్ఎఫ్ఆర్)‌లో కొన్యాక్ సభ్యురాలు. బ్రిటిష్ పాలకులు నాగాలాండ్ నుంచి తీసుకెళ్లిన మానవ అవశేషాలను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

‘21వ శతాబ్దంలో కూడా మా పూర్వీకుల అవశేషాలను వేలం వేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇది అరాచకం, తీవ్రంగా బాధిస్తోంది’ అన్నారు కొన్యాక్.

బ్రిటన్‌లోని “ది స్వాన్ ఎట్ టెట్స్‌వర్త్” అనే పురావస్తు కేంద్రం ఈ పుర్రెను ‘ఆసక్తికర అమ్మకం’ అంటూ వేలానికి పెట్టింది.

దీన్ని 3,500 పౌండ్ల నుంచి 4 వేల పౌండ్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 3.75 లక్షల నుంచి రూ. 4.28 లక్షలు) మధ్య ధరకు విక్రయిస్తామని ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నాగా తెగ వ్యక్తి పుర్రెతో పాటు దక్షిణ అమెరికాలోని జివారో తెగ, పశ్చిమ ఆఫ్రికాలోని ఎకోయ్ తెగ ప్రజల అవశేషాలనూ వేలంలో ఉంచారు.

వేలాన్ని నాగా మేథావులు, నిపుణులు వ్యతిరేకించారు.

నాగాలాండ్ ముఖ్యమంత్రి దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

లేఖలో ఆయన దీన్ని ‘అమానవీయం, వలసవాద హింసకు కొనసాగింపు’ అన్నారు.

ఈ నిరసనలతో ‘ది స్వాన్ ఎట్ టెట్స్‌వర్త్’ వేలాన్ని నిలిపివేసింది.

అయితే ఈ ఘటన నాగా ప్రజలు ఎదుర్కొన్న హింసాత్మక గతాన్ని వారికి మరోసారి గుర్తుచేసింది. వారి పూర్వీకుల అవశేషాలను స్వదేశానికి తీసుకురావాలనే డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది.

పూర్వీకులు కొన్నిమానవ అవశేషాలను బహుమతులుగా, లేదా వస్తు మార్పిడిలో భాగంగా ఇచ్చి ఉండొచ్చు. మిగిలినవాటిని ఎవరి అంగీకారం లేకుండానే దోచుకొని ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

మానవ అవశేషాలు

ఫొటో సోర్స్, Alok Kumar Kanungo

ఫొటో క్యాప్షన్, మానవ అవశేషాలు మ్యూజియంలకు భారంగా మారాయి.

అవశేషాలను తిరిగి ఇస్తున్నారు

బ్రిటన్ పబ్లిక్ మ్యూజియాల్లో, ప్రైవేట్ కలెక్షన్ల రూపంలో దాదాపు 50,000 నాగా వస్తువులు ఉన్నాయని నాగా సాంస్కృతిక నిపుణుడు అలోక్ కుమార్ కనుంగో అంచనా వేశారు.

వీటిలో సుమారు 6,550 వస్తువులు సహా 41 మానవ అవశేషాలు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని పిట్ రివర్స్ మ్యూజియంలో ఉన్నాయి.

ఈ మ్యూజియంలో ఇతర రాష్ట్రాల నుంచి సేకరించిన బ్రిటిష్ ఇండియా కాలం నాటి అనేక మానవ అవశేషాలూ ఉన్నాయి.

ఇటీవల మానవ అవశేషాల సేకరణ, వాటి అమ్మకం, ప్రదర్శనలపై నైతికతకు సంబంధించిన ఆందోళనలు ఎక్కువైన నేపథ్యంలో, వీటిని సేకరించేవారు తమ విధానాన్ని పునఃసమీక్షించుకునే పనిలో పడ్డారు.

మానవ అవశేషాలు మ్యూజియంలకు భారంగా మారాయని కనుంగో చెప్పారు.

‘‘ఆ పుర్రెలకు సాంస్కృతిక ప్రాముఖ్యం ఉంది. వాటిని గౌరవంగా చూడాలే కానీ, లాభార్జనకు ఉపయోగించడం తగదు. నాగాలాండ్ ప్రజలను అనాగరికులుగా చూపే పనులు ఇక ఎంతమాత్రం చేయకూడదు. ఈ పుర్రెల వ్యాపారం నాగా ప్రజల భావోద్వేగ, రాజకీయ సమస్య’ అన్నారు.

న్యూజీలాండ్‌లోని మావోరీ, ఆస్ట్రేలియాలోని ఆదిమవాసులు, తైవాన్‌లోని ముడాన్ యోధులు, ఆదిమ హవాయియన్ల తెగలకు చెందిన అవశేషాలను మ్యూజియంలు తిరిగి ఇవ్వడం ప్రారంభించాయి.

అలాంటి 22 అవశేషాలను 2019లో ఇచ్చామని, ఇప్పుడా సంఖ్య 35కు పెరిగిందని పిట్ రివర్స్ మ్యూజియం(పీఆర్ఎం) ప్రతినిధి బీబీసీకి తెలిపారు. " వీటిని ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూఎస్, కెనడాకు తిరిగి ఇచ్చాం." అని చెప్పారు.

నాగా పుర్రెను 2020లో బహిరంగ ప్రదర్శనకు ఉంచిన మ్యూజియం, నాగా ఫోరం ఫర్ రీకన్సిలియేషన్ ఆందోళన తరువాత, నైతిక సమీక్షలో భాగంగా దానిని ప్రదర్శన నుంచి తొలగించింది.

తమ పూర్వీకుల అవశేషాలను, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన వస్తువులను తమకు అప్పగించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.

నాగా వారసుల నుంచి లాంఛనంగా ఎటువంటి అభ్యర్థనలను అందుకోలేదని మ్యూజియం తెలిపింది. మానవ అవశేషాలను తిరిగి ఇచ్చే ప్రక్రియలోని క్లిష్టత కారణంగా, ఆ పని పూర్తి కావడానికి 18 నెలల నుంచి అనేక సంవత్సరాలు పట్టొచ్చు అని మ్యూజియం తెలిపింది.

మానవ అవశేషాలు

ఫొటో సోర్స్, Pitt Rivers Museum

ఫొటో క్యాప్షన్, కళాకృతుల కంటే మానవ అవశేషాలను ఆయా దేశాలకు తిరిగి ఇవ్వడం చాలా కష్టం.

అవశేషాల అప్పగింత తేలిక కాదు

కళాకృతుల కంటే మానవ అవశేషాలను ఆయా దేశాలకు తిరిగి ఇవ్వడం చాలా కష్టం. అవశేషాలను నైతికంగా సేకరించారా లేదా అనే విషయం తెలుసుకోవాలి.

వారసులను గుర్తించాలి. మానవ అవశేషాలపై ఉన్న క్లిష్టమైన అంతర్జాతీయ నిబంధనలను పాటించాలి.

“రికవర్, రిస్టోర్, డీకోలనైజ్” అనే గ్రూప్‌ను ఇందుకోసమే ఎఫ్ఎన్‌ఆర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఆంత్రోపాలజిస్టులు డాలీ కికాన్, అర్కోటాంగ్ లాంగ్‌కుమెర్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు.

"ఇది డిటెక్టివ్ పని లాంటిది.. అవశేషాలుఎక్కడ నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు, మేం సమాచారాన్ని వివిధ రకాలుగా జల్లెడ పట్టాలి” అని లాంగ్‌కుమెర్ అన్నారు.

ఈ బృందం గ్రామాలలో తిరుగుతోంది. నాగా పెద్దలను కలిసి మాట్లాడుతోంది. అవగాహన కార్యక్రమాలలో భాగంగా కామిక్ పుస్తకాలు, వీడియోలను పంపిణీ చేస్తోంది.

స్వదేశానికి పంపిన అవశేషాలకు అంత్యక్రియల వంటి విషయాలపై ఏకాభిప్రాయం కోసం కూడా ప్రయత్నిస్తున్నారు.

చాలా మంది నాగా ప్రజలు ఇప్పుడు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు. కానీ, వారి పూర్వీకులు వివిధ ఇతర ఆచారాలను అనుసరించే వారు.

తమ పూర్వీకుల అవశేషాలు విదేశాల్లో ఉన్నాయని నాగా పెద్దలకు కూడా తెలియదనే విషయాన్ని రాష్ట్రంలో విస్తృతంగా తిరిగిన ఈ బృందం కనుగొంది.

2000 ప్రారంభంలో స్థానిక పత్రికలలో వాటి గురించి చదివే వరకు విదేశీ మ్యూజియాలలో పుర్రెల గురించి తనకు కూడా తెలియదని పురావస్తు శాస్త్రవేత్త టియాతోషి జమీర్ అన్నారు.

ఇది "పూర్వీకుల ఆత్మకు శాంతి కలగకుండా చేస్తుందని” ఒక పెద్ద తనతో చెప్పినట్లు జమీర్ చెప్పారు.

1832లో నాగా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న బ్రిటన్ 1873లో ప్రయాణికులను నియంత్రించేందుకు ఇన్నర్ లైన్ పర్మిట్ అనే ప్రత్యేక అనుమతిని అమలు చేసేవారు.

తిరుగుబాట్లను అణచివేయడానికి వలస పాలనాధికారులు నాగా గ్రామాలను తగులబెట్టారు. ఈ క్రమంలో వారి సాంస్కృతిక గుర్తులైన చిత్రాలు, ఇతర కళాకృతులు ధ్వంసమైనట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

తన గ్రామంలోని ఓ తెగకు చెందిన వ్యక్తి అవశేషాలు పిట్ రివర్స్ మ్యూజియంలో ఉన్నట్లు పీఆర్ఎం జాబితాలో ఉందని కొన్యాక్ చెప్పారు.

"ఇది నా పూర్వీకులలో ఒకరిది" అని ఆమె బీబీసీకి చెప్పారు. ఆ అవశేషాలు తిరిగి వచ్చాక అంత్యక్రియలు ఎలా నిర్వహించాలో ఆమె ఇంకా నిర్ణయించుకోలేదు.

‘మా పెద్దలను గౌరవించేందుకు మా పూర్వీకుల అవశేషాలు మాకు తిరిగి కావాలి’ అని కొన్యాక్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)