నెఫ్ట్ డాష్లారీ: ఓడలే పునాదులుగా సముద్రంలో ఈ నగరాన్ని ఎందుకు నిర్మించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలీసియా హెర్నాండెజ్
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
నమ్మశక్యం కాని ఉక్కు టవర్లు, తుప్పుపట్టిన పైపులు, చెక్క వంతెనలు, సోవియట్ కాలం నాటి భవనాలతో కాస్పియన్ సముద్రం మధ్యలో మనిషి తయారుచేసిన ఒక ద్వీపం ఉంది. అది మ్యాప్‌లలో కనిపించదు. దాని పేరు నెఫ్ట్ డాష్లారీ.
ఈ ద్వీపం చరిత్ర 1940ల నాటిది. కాస్పియన్ సముద్రపు అడుగుభాగంలో చమురు నిల్వలు కనుగొన్న తర్వాత జోసెఫ్ స్టాలిన్ ఈ ద్వీపాన్ని నిర్మించాలని ఆదేశించారు.
ఇది అజర్‌బైజాన్ తీరంలో బాకు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ‘‘ఆయిల్ రాక్స్’’ అనే పేరుతో పిలుస్తారు. ప్రపంచంలో సముద్రజలాల్లో చమురు నిల్వలున్న అతి పురాతన ప్రాంతం ఇదని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది.
కాప్ 29-ఐక్యరాజ్యసమితి క్లైమెట్‌ఛేంజ్ కాన్ఫరెన్స్ జరుగుతున్న బాకులోనే ఇది ఉంది.


ఫొటో సోర్స్, SOCAR
మునిగిపోయిన ఓడలపై నగరం
అజర్‌బైజాన్‌లో రెడ్ ఆర్మీ 1920ల్లో అడుగుపెట్టింది. ఆపైన అజర్ బైజాన్ సోవియట్ యూనియన్‌లో భాగమైంది. సోవియట్ యూనియన్ అధికారికంగా విడిపోయిన1991 అక్టోబరు వరకు అజర్ బైజాన్ సోవియట్ యూనియన్‌లో భాగం.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా ఇంధన వ్యూహంలో అజర్‌బైజాన్ కీలకపాత్ర పోషించింది. సోవియట్ యూనియన్ తూర్పుభాగంలో ఉపయోగించిన చమురులో ఎక్కువభాగం బాకు నుంచే వచ్చింది.
స్టాలిన్ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మొదట నెఫ్ట్ డాష్లారీని రూపొందించారు. సోవియట్ యూనియన్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం ఐదేళ్ల ప్రాజెక్టులు చేపట్టారు. ఈ పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలపై ఎక్కువగా దృష్టిపెట్టారు.సోవియట్ అధికార యంత్రాంగం వాటిని ప్రతిష్టాత్మకంగా భావించింది. అయితే అవి పూర్తికాలేదు. అనుకున్నలక్ష్యాలను సాధించడంలో స్టాలిన్ ప్రభుత్వం అప్పుడు విఫలమయింది.
1949 నవంబరు 7న చమురు నిల్వలు కనుగొన్నతరువాత సోవియట్ యూనియన్ ద్వీపం నిర్మాణం ప్రారంభించింది. తదుపరి ఈ ప్రాంతం మధ్య ఆసియాలో అతిపెద్ద చమురు నిల్వల కేంద్రంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏడు ఓడల ద్వీపం
‘‘నవంబరు 7న చమురు బావి నుంచి రోజుకు 100 టన్నుల ఇంధనం వెలికి తీశారు. ఇది ప్రపంచంలో మొదటి చమురు ఉత్పత్తి ప్రాంతం. కాస్పియన్ సముద్రంలో చమురు నిల్వలను వెలికి తీసిన తొలి ప్రాంతం అజర్‌బైజాన్’’ అని ఆ దేశ ఆయిల్ కంపెనీ ఎస్ఓసీఏఆర్ తెలిపింది.
కార్మికులు అక్కడ నివసించేందుకు ఓ చిన్న గృహ నిర్మాణంతో తొలి పనులు ప్రారంభమయ్యాయి. తర్వాత 1951 నుంచి అది అతిపెద్ద నిర్మాణంగా మారిపోయింది. ‘‘అది ఒక వాస్తు, సాంకేతిక అద్భుతం’’ అని 1990 చివర్లో ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఫిల్మ్ మేకర్ మార్క్ వోల్ఫన్స్‌బర్గర్ అభివర్ణించారు.
నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అక్కడ అసాధారణ విషయాలు కొన్ని జరిగాయి. పనికిరాని ఓడలను ముంచివేసి...వాటిని పునాదిలాగా ఉపయోగించారు. వాటిపైన భవనాల పిల్లర్లు నిర్మించారు.
ఇలా ఉపయోగించిన ఓడల్లో ప్రపంచంలోని తొలి ఆయిల్ ట్యాంకర్ జోరోయాస్టర్ ఒకటి. దీన్ని రూపొందించింది అల్బర్ట్ నోబెల్ సోదరుడు లుడ్విగ్ నోబెల్. 19వశతాబ్దం చివర్లో చమురు రవాణా కోసం దీన్ని నిర్మించారు.
‘‘1951లో ద్వీపాన్ని గాలులు, సముద్రపు అలల నుంచి రక్షించేందుకు ఖజర్‌టాంకర్, ఖజర్‌డొనాన్‌మా కంపెనీల నుంచి అదనంగా ఆరు ఓడలను తీసుకువచ్చి, వాటిని సగం మేర నీటిలో ముంచివేసి, ద్వీపం చుట్టూ కృత్రిమ బే నిర్మించారు. ఆ ఓడల క్యాబిన్లను భోజనాలకు, చికిత్సలకు, నిద్రపోవడానికి, చమురు వెలికితీసే వారి ఇతర అవసరాల కోసం ఉపయోగించారు. ఈ ప్రాంతానికి ఏడు ఓడల ద్వీపం అనే పేరు అలా వచ్చింది’’ అని ఎస్ఓసీఏఆర్ వెబ్‌సైట్ తెలిపింది.
తర్వాత ఈ కృత్రిమ దీవి ప్రస్తుతం నెఫ్ట్ డాష్లారీ పేరుతో ప్రఖ్యాతిగాంచింది.

ఫొటో సోర్స్, SOCAR
నివాసానికి అనుకూలం
ఏళ్లు గడిచేకొద్దీ...సముద్రంపై భారీ నగరంగా నెఫ్ట్ డాష్లారీ అభివృద్ధి చెందింది.
కార్మికుల కోసం బ్లాకులు నిర్మించారు. బేకరీ, షాపులు, వైద్య కేంద్రాలు, ఫుట్‌బాల్ పిచ్‌లు, హెలిపాడ్, చివరకు థియేటర్ కూడా నిర్మించారు.
‘‘సముద్రపు ఉపరితలంపై చాలా మీటర్ల ఎత్తున పిల్లర్లు వేశారు. సముద్రపు అడుగు భాగాన ఆ పిల్లర్ల కింద ఇనుప కడ్డీలు ఏర్పాటుచేశారు. ఆ పిల్లర్లపై నెఫ్ట్ డాష్లారీని నిర్మించారు’’ అని ఆయిల్ వర్కర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ మిర్వారి గహ్రమనాలి బీబీసీకి చెప్పారు. ఈ సంస్థ అజర్ బైజాన్ చమురు, సహజవనరుల రంగంలో మానవ హక్కుల కోసం పనిచేస్తోంది.
నివాసిత భవనాలు, ఆరోగ్య, పారిశుధ్య విభాగం, షాపులు ఇప్పటికీ ఉన్నాయి. వీటితో పాటు పార్కును సైతం నిర్మించారు.
‘‘ప్రపంచంలోనే సముద్రంపై నిర్మితమైన మొదటి ప్రాంతంగా నెఫ్ట్ డాష్లారీని భావిస్తారు. ఈ ప్రాంతం ప్రత్యేకత దృష్ట్యా ప్రపంచపు ఎనిమిదోవింతగా కూడా కొన్నిసార్లు పిలుస్తారు. ఏడు ఓడల ఐలాండ్, అద్భుతాల ఐలాండ్ అన్న పేర్లు కూడా ఈ ప్రాంతానికి ఉన్నాయి’’ అని గహ్రమనాలి చెప్పారు.
ఆయిల్ రాక్స్ 12 కిలోమీటర్లు పొడవు, 6కిలోమీటర్ల వెడల్పులో విస్తరించి ఉన్నాయని గహ్రమనాలి చెప్పారు. 2వేల బావులు, దాదాపు 200కిలోమీటర్ల ఓవర్‌పాస్‌లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి.
ప్రారంభంలో ఈ ఐలాండ్‌లో దాదాపు 5వేలమంది కార్మికులు పనిచేసేవారు. ఇప్పుడు 3వేలమంది పనిచేస్తున్నారని గహ్రమనాలి చెప్పారు. వారు 15 రోజులు సముద్రంలో పనిచేస్తే మరో 15 రోజులు బయట ఉంటారు.
నెఫ్ట్ డాష్లారీ అజర్ బైజాన్‌కు చెందిన చమురు కంపెనీ ఎస్ఓసీఏఆర్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ. చమురు ఉత్పత్తి, శుద్ధి, ఇంధన రవాణా, గ్యాస్ వెలికితీత అలాగే చమురు, గ్యాస్ ఉత్పత్తుల అమ్మకం వంటివి చేస్తుంది.
కాస్పియన్ చమురు ఉత్పత్తి కిరీటంలో ఈ ఐలాండ్ ఒక రత్నం లాంటిదని ఎస్‌ఓసీఏఆర్ తెలిపింది. 75 ఏళ్ల కాలంలో ఈ ఐలాండ్ నుంచి 180 మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తి అయింది. 1967లో రికార్డు స్థాయిలో 7.6మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తి చేసింది.
ప్రస్తుతం రోజువారీ చమురు ఉత్పత్తి సామర్థ్యం తగ్గింది. ఎస్ఓసీఏఆర్ జనవరిలో తెలిపిన వివరాల ప్రకారం రోజుకు 3వేల టన్నుల చమురు మాత్రమే ఉత్పత్తి అవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
తగ్గిన ద్వీప వైభవం
ఈ ఐలాండ్ ఒకప్పుడు వైభవంగా ఉండేది. ముఖ్యంగా 1960ల్లో. కానీ ఆ తరువాత దశాబ్దం నుంచి చమురు ధరల హెచ్చుతగ్గులు, సోవియట్ యూనియన్ వెనకపడిపోవడం వంటి కారణాలతో ఈ ద్వీప వైభవం క్షీణించడం మొదలుపెట్టింది.
2012 నాటికి 300 కిలోమీటర్ల రోడ్డులో 45 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణానికి వీలుగా ఉందని జర్మన్ న్యూస్ పేపర్ ‘డేర్ స్పీగెల్’ తెలిపింది. ఆయిల్ రాక్స్ – సిటీ ఎబోవ్ ది సీ డాక్యుమెంటరీలో ఫిల్మ్ మేకర్ మార్క్ వోల్ఫెన్స్‌బర్గర్ కొన్ని విషయాలను వివరించారు.
‘‘నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ బాగుండేవి’’ అని ట్రక్కుపై వెళుతూ ఓ స్థానిక కార్మికుడు చెప్పారు. అక్కడ పాడైపోయిన, దుమ్ముతో నిండిన భవనాలు కనిపిస్తున్నాయి.
‘‘ఈ ఐలాండ్ మునిగిపోయే ప్రమాదం ఏమీ లేదు. సముద్రంలో ఉన్న వ్యూహాత్మక ప్రాంతం నెఫ్ట్ డాష్లారీ. అక్కడ సీబెడ్స్, బావులు ఉన్నాయి. చమురు వెలికితీత జరుగుతోంది. డ్రిల్లింగ్, నిర్మాణాలు వంటివి జరుగుతున్నాయి’’ అని మిర్వారి గహ్రమనాలి చెప్పారు. ఐలాండ్ నిర్మాణం, వాతావరణ మార్పుల దృష్ట్యా మునిగిపోయే ప్రమాదాన్ని ఆయన తోసిపుచ్చారు.
ఆ ప్రాంతానికి సంబంధించిన కొత్త ఫోటోలు అంత తొందరగా దొరకవు.
ఈ ప్రాంతంలో తీసిన అన్ని సినిమాలను ఎస్ఓసీఏఆర్ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. 1990ల చివర్లో జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ ‘‘ద వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్’’ సహా అన్నీ ఇందులో ఉన్నాయి.
హెలికాప్టర్‌లోనో, పడవలోనో ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ పర్యటకులు అంత సులభంగా వెళ్లగలిగే ప్రాంతం కాదిది. అయితే చమురు ఉత్పత్తి తగ్గిపోతుండడంతో పాటు, ద్వీపంలో నిర్మాణాలూ తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో ఇది పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
కమ్యూనికేషన్స్ ఎర్త్, ఎన్విరాన్‌మెంట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 2,100 నాటికి కాస్పియన్ సముద్రం పరిధి 18 మీటర్లు తగ్గిపోవచ్చు. దీనివల్ల సముద్ర ఉపరితలం 34శాతం తగ్గిపోతుంది.
కాలుష్య వాయువుల ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలో కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి సముద్రం 9 నుంచి 18 మీటర్లు తగ్గిపోతుందని ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
ఆ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే భూమి ప్రస్తుత, భవిష్యత్ వాతావరణ స్థితిగతులపై కాప్ 29 చర్చిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














