నయనతార, ధనుష్‌ల మధ్య వివాదం.. అసలేమైంది?

ఫొటో సోర్స్, NAYANTHARA/Instagram
- రచయిత, వి. నందిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
నానుమ్ రౌడీ తాన్ (నేనూ రౌడీనే) సినిమా షూటింగ్ సమయంలో తీసిన 3 సెకన్ల వీడియో విషయంలో తమిళ సినీ స్టార్లు నయనతార, ధనుష్‌ల మధ్య వివాదం తలెత్తింది.
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ఈ వీడియోను ఉపయోగించినందుకు ఆ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ రూ. 10 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేయడం విచారకరమంటూ నయనతార శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
ధనుష్‌పై పలు ఆరోపణలతో నయనతార నవంబర్ 16న విడుదల చేసిన ఈ ప్రకటన సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ ఆరోపణలపై నటుడు ధనుష్ నేరుగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, నయనతారకు పంపిన నోటీసులో ధనుష్ తరఫున ఆయన న్యాయవాది అరుణ్ పలు వాదనలు చేశారు.

‘‘నానుమ్ రౌడీ తాన్ కాపీరైట్ యజమాని ‘వండర్‌బార్ ప్రొడక్షన్’ అనే విషయాన్ని నయనతార తరఫు వారు ఖండించలేదు. అంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్రీకరించిన ఫుటేజీకి ధనుష్ యజమాని అని నిర్ధారించడానికి ఇది సరిపోతుంది’’ అని నోటీసులో న్యాయవాది అరుణ్ పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో నయనతార ప్రకటన చేసిన తర్వాత చాలామంది నటీమణులు నయనతారకు మద్దతుగా ముందుకు వచ్చారు.
మరోవైపు, తన డాక్యుమెంటరీకి పబ్లిసిటీ సంపాదించుకోవడం కోసమే నయనతార ఇలా చేసిందని సోషల్ మీడియాలో కొందరు విమర్శిస్తున్నారు.
సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం నేపథ్యం ఏంటో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ
నయనతార కెరీర్, ప్రేమ, పెళ్లిపై రూపొందించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యు-డ్రామా నవంబర్ 18వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
2022 జూన్ 9న దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార వివాహం జరిగింది. వీరిది ప్రేమ పెళ్లి.
వీరి ప్రేమ, పెళ్లిపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ఇటీవల విడుదలైంది.
ట్రైలర్‌లో వాడిన 3 సెకన్ల వీడియోపై ధనుష్ తరఫు నుంచి నోటీసులు రావడంతో సోషల్ మీడియా వేదికగా నయనతార ఆయనపై పలు ఆరోపణలు చేశారు.

ఫొటో సోర్స్, Netflix India
నయనతార మూడు పేజీల ప్రకటన
నయనతార సోషల్ మీడియాలో పంచుకున్న మూడు పేజీల నివేదిక సారాంశం ఇది:
“నేను రౌడీనే సినిమా షూటింగ్ సమయంలో వ్యక్తిగత పరికరాల ద్వారా చిత్రీకరించిన 3 సెకన్ల వీడియోను మాత్రమే నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దీనికి పరిహారంగా ధనుష్ రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నోటీస్ పంపడంతో షాక్‌కు గురయ్యాం’’ అని ఆ ప్రకటనలో నయనతార పేర్కొన్నారు.
చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది తన శ్రేయోభిలాషులు ఈ డాక్యుమెంటరీకి సహకరించారని, తన సినిమాలకు సంబంధించిన జ్ఞాపకాలను ఇందులో ప్రదర్శించారని నయనతార ప్రకటనలో రాశారు.
డాక్యుమెంటరీ ట్రైలర్‌లో దర్శకుడు అట్లీ, నటి రాధిక, నటులు రానా దగ్గుబాటి, నాగార్జున, దర్శకుడు విష్ణువర్ధన్‌లతో పాటు నయనతారతో కలిసి పనిచేసిన ఇతరులు ఆమె గురించి మాట్లాడుతుండటం చూడొచ్చు.
ట్రైలర్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరూ తమ ప్రేమ, పెళ్లి గురించి చెప్పారు. ఆమె నటించిన సినిమాలలోని సన్నివేశాలు, పాటలు కూడా ట్రైలర్‌లో అక్కడక్కడ ఉపయోగించారు.

ఫొటో సోర్స్, VigneshShivN/Twitter
నేనూ రౌడీనే సినిమాలోని పాటలు, సన్నివేశాలు, ఫోటోలు వాడుకోవడానికి ధనుష్ అనుమతి కోసం రెండేళ్లు నిరీక్షించినప్పటికీ ఆయన నుంచి ఎన్‌ఓసీ రాలేదని నయనతార అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు ఉపయోగించుకోలేకపోయినందున డాక్యుమెంటరీని మళ్లీ ఎడిట్ చేసి ప్రస్తుత రూపానికి తీసుకొచ్చామని ఆమె పేర్కొన్నారు.
సినిమాలోని సాహిత్యాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో తన హృదయం బద్దలైందని ఆమె అందులో రాశారు.
"సెట్‌లో ఉండేవారి స్వేచ్ఛ, జీవితాన్ని నియంత్రించే అధికారం నిర్మాతకు ఉంటుందా?’’ అని నయనతార ప్రశ్నించారు.
ధనుష్ నోటీసుకు న్యాయపరంగా స్పందిస్తాం అని కూడా చెప్పారు.
తోటి నటీమణుల మద్దతు
సోషల్ మీడియాలో నయనతార చేసిన ఈ ప్రకటన పోస్టును అనుపమ పరమేశ్వరన్, అంజు కురియన్, ఐశ్వర్య లక్ష్మి సహా మరికొందరు నటీమణులు లైక్ చేశారు.
వృత్తిపర నియమాలు, ఆర్థికపరమైన అంశాల కారణంగా ఇలా చేసి ఉంటే అర్థం చేసుకునేవాళ్లమని, వ్యక్తిగత కక్షతో ఇలా చేయడం ఏమాత్రం తగదని అన్నారు.
మరోవైపు, ఒక ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ధనుష్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు.

ఫొటో సోర్స్, NAYANTHARA/Instagram
ధనుష్ నిర్మాతగా, 2015లో విడుదలైన ‘నేనూ రౌడీనే’ సినిమా నయనతారకు మంచి విజయాన్ని అందించింది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు ఇది రెండో సినిమా.
నయనతారతో పాటు విజయ్ సేతుపతి, రాధిక, పార్థిబన్, ఆనందరాజ్ ఈ సినిమాలో నటించారు. ఆర్జే బాలాజీ, తదితరుల కలయికలో కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఎన్నో విధాలుగా ఓ వింత అనుభూతిని ఇచ్చిందని అప్పట్లో సినీ విమర్శకులు వ్యాఖ్యానించారు.
ఈ చిత్రానికిగానూ నయనతార 2016లో ఉత్తమ తమిళ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.
అవార్డు వేదికపై నయనతార మాట్లాడుతూ విజయ్ సేతుపతి, విఘ్నేష్ శివన్, అనిరుధ్ సహా మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
ధనుష్ గురించి మాట్లాడుతూ, ''ఈ సినిమాలో నా నటనను ధనుష్ అసహ్యించుకున్నారు. అందుకు ధనుష్‌కి క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నారు.
నయనతార మాటలు విని ధనుష్ కూడా నవ్వారు. అప్పట్లో ఈ వీడియో బాగా పాపులర్ అయింది.

ఫొటో సోర్స్, VigneshShivN/Instagram
ధనుష్ తరఫు న్యాయవాది ఏమన్నారు?
రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ నయనతారకు ధనుష్ తరపు న్యాయవాది అరుణ్ పంపిన నోటీసును ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
ఈ నోటీసు ప్రకారం, “షూట్ సమయంలో తీసిన ఫోటోలు, ఫోటో షూట్‌లు, సినిమా ప్రమోషన్ కోసం తీసిన వీడియోలను మీడియాతో సహా ఏ ప్లాట్‌ఫారమ్‌లోనైనా ఉపయోగించుకునే హక్కు ఫిల్మ్‌మేకర్‌కు ఉంటుంది.
నేనూ రౌడీనే సినిమా కాపీరైట్ యజమాని వండర్‌బార్ ప్రొడక్షన్ అనే విషయాన్ని నయనతార ఖండించకపోవడమే ఆ షూటింగ్ సమయంలో తీసిన ఫుటేజీకి ధనుష్ ఓనర్ అని నిర్ధారించడానికి సరిపోతుంది.
షూట్ సమయంలో తీసిన వీడియోలు మేం డబ్బులిచ్చి నియమించుకున్న వ్యక్తి తీసినవి. వండర్‌బార్ ఫిల్మ్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 2015 అక్టోబర్ 22న ఈ షూటింగ్ వీడియోలు అప్‌లోడ్ అయ్యాయి.
10 ఏళ్లుగా ఈ వీడియోలు వాండర్‌బార్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. ఈ విషయం తనకు తెలియదని నయనతార చెప్పలేరు. ఆమెకు ఈ విషయం తెలియనది కాదు. నయనతార 'నెట్‌ఫ్లిక్స్ ఇండియా'ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు.
సినిమాకు సంబంధించిన ప్రతిదానికీ ధనుష్ ప్రత్యేక యజమాని అని లాయర్ నోటీసులో పేర్కొన్నారు.
24 గంటల్లోగా ఫుటేజీని తొలగించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో లాయర్ డిమాండ్ చేశారు.
చట్టం ఏం చెబుతోంది?
కాపీరైట్ చట్టం-1957 గురించి న్యాయవాది వెట్రిచెల్వన్, బీబీసీకి వివరించారు.
షూటింగ్ సమయంలో తీసిన వీడియోలపై చట్ట ప్రకారం ప్రొడ్యూసర్‌కే దానిపై హక్కు ఉంటుందని ఆయన చెప్పారు.
'నానుమ్ రౌడీతాన్' చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులు నిర్మాత ధనుష్‌కే దక్కే అవకాశం ఉందని ఆయన అన్నారు.
‘‘కాపీరైట్ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. సాహిత్య, పరిశోధనా ప్రయోజనాల కోసం పాటలు లేదా ఫుటేజీని అనుమతి లేకుండా 30 సెకన్ల వరకు ఉపయోగించవచ్చు. అయితే, వాణిజ్యపరంగా ఉపయోగిస్తే చట్ట ఉల్లంఘన అవుతుంది" అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














