కంగువ మూవీ రివ్యూ: కనికరం లేకుండా చంపేది ఒకరు.. ప్రకృతి కోసం ప్రాణమిచ్చేది మరొకరు, వారిద్దరి పోరాటంలో గెలుపెవరిది?

కంగువ

ఫొటో సోర్స్, Studio Green/FB

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాట నుంచి పాన్ ఇండియా కలెక్షన్లలో తప్పక విజయం సాధిస్తామన్న స్టేట్ మెంట్ ప్రకటించి మరీ వచ్చిన సినిమానే కంగువ.

తెలుగు సినిమాలతో దర్శకత్వ పయనం మొదలుపెట్టిన తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌గా 'కంగువ' రూపొందింది.

సుమారు రెండున్నరేళ్ల కసరత్తు తర్వాత తమిళ స్టార్ సూర్య హీరోగా, దిశా పటాని, బాబీ డియోల్ ముఖ్య పాత్రలుగా వచ్చింది 'కంగువ.'

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కంగువ

ఫొటో సోర్స్, Studio Green/FB

రెండు కాలాల్లో నడిచే కథ

ఈ సినిమా రెండు కాలాల్లో నడుస్తుంది. ఒక కథ 2024 లో జరుగుతుంటే, ఇంకో కథ దాదాపు వెయ్యేళ్ల ముందు.. అంటే 1070లో జరుగుతుంది.

1070లో జన సంచారానికి దూరంగా పంచకోన ప్రాంతం ఉండేది. పంచ కోనలో ఐదు కోనలు ఉన్నాయి. అవి సాగరకోన, హిమకోన, అరణ్యకోన, కపాల కోన, ప్రణవాది కోన.

ఇందులో ప్రణవాది కోన జాతికి చెందిన ప్రజలు ప్రకృతి ప్రేమికులు, ధైర్యవంతులు. యుద్ధం వారి ధర్మం.

ఈ కోన నాయకుడే కంగువ(సూర్య). కపాల కోన నాయకుడు రుధిర(బాబీ డియోల్).

కనికరం లేకుండా చంపడం కపాల కోన ప్రజల లక్షణం.

ఈ రెండు దీవుల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? తన కోనను కాపాడుతూనే, ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం కంగువ ఎలాంటి పోరాటం చేశాడు అనేది ఒక కథ.

ఇక 2024లో కంగువ పోలికలతో ఉన్న ఫ్రాన్సిస్ ఎవరు? జీటా అనే బాలుడు ఎవరు? ఆ బాలుడుకి, కంగువకి, ఫ్రాన్సిస్ కు ఉన్న సంబంధం ఏమిటి? అనేదే రెండో కథ.

కంగువ-ఫ్రాన్సిస్ -జీటాల మధ్య వెయ్యేళ్ల కాల పరిధిలో కనెక్షన్‌ను ఎస్టాబ్లిష్ చేసే కథే 'కంగువ.'

కంగువ

ఫొటో సోర్స్, Studio Green/FB

ఎనర్జిటిక్‌గా సూర్యనటన

సూర్య ఫ్రాన్సిస్ పాత్రలో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు.

కంగువ పాత్రలో ఒక కొత్త మేకోవర్‌లో, కొత్త బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో తన పరిధి మేరకు సూర్య బాగా నటించారు.

బాబీ డియోల్ పాత్ర చిత్రణ అసహజంగా ఉండటంతో రుధిరగా ఆయన నటన ఊహించిన స్థాయిలో లేదు.

దిశా పటాని పాత్రకు కథలో అంతగా ప్రాధాన్యం లేకపోవడం వల్ల పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

జీటా పాత్ర చేసిన బాలుడు బాగా నటించాడు. ఈ సినిమాలో అతిథి పాత్రలో కార్తీ మెరిశాడు.

బలమైన కథే అయినా..

కథాపరంగా కంగువ బలంగా ఉంది. కొత్తదనం ఉన్న కథ కూడా. ఐదు కోనల ప్రజలకు భిన్న లక్షణాలు ఉన్నాయి. ఐదు కోనల్లో రెండు కోనలు కథలో ప్రధానమైనవి. అంతా ట్రైబల్ బ్యాక్ డ్రాప్.

వెయ్యేళ్ల కిందటి ఆయుధాలు, వేషధారణ, మ్యానరిజం, యుద్ధ వ్యూహాలు ఇవన్నీ కథను గొప్పగా ప్రెజెంట్ చేయడానికి స్కోప్ ఉన్న అంశాలు. కానీ ఈ కథను ఊహించిన స్థాయిలో స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.

అలాగే స్టోరీ కన్నా కూడా సూర్య యాక్షన్ సీక్వెన్సెస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా అవి కూడా అసహజంగా ఉన్నాయి. అందులోనూ కంగువ కాలంలో ఏ పాత్రకూ డబ్బింగ్ నప్పలేదు. కంగువ కాలమే సినిమాలో ముఖ్య కథా కాలమైనా , దీని కన్నా 2024 లో జరిగే కథే కొన్ని చోట్ల పర్లేదనిపించింది.

టెక్నికల్‌గా ఎక్కడా రాజీపడకుండా తీసిన సినిమా ఇది. కానీ కథ చాలా చోట్ల అసంపూర్ణంగా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల అనవసరంగా హింసా సన్నివేశాలు ఉండటం కూడా పెద్దగా నప్పలేదు. సినిమా చివరకు వచ్చేసరికి ప్రేక్షకులు బలంగా కంగువ పాత్రతో కనెక్ట్ అయ్యే ఎమోషనల్ ఫ్లో లేదు.

అనుకరణ ఛాయలు :

మంచి కథతో వచ్చిన సినిమా అయినా కంగువలో కొన్ని అనుకరణ ఛాయలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫ్రాన్సిస్ పాత్రలో సూర్య 'బౌంటి హంటర్'గా కనిపించడం కొంత కల్కిలో ప్రభాస్ పాత్రను గుర్తుకు తెస్తుంది.

అలాగే కల్కి లో హీరో కామిక్ ఓపెనింగ్ లానే ఫ్రాన్సిస్ పాత్ర ఓపెనింగ్ ఇందులో ఉంది.

దీని వల్ల ప్రేక్షకులకు ఈ పాత్ర ఎలా ఉండబోతుందో అని కలిగే సస్పెన్స్ మిస్ అయ్యింది.

అలాగే కామెడీ లో కొన్ని చోట్ల కొన్ని తెలుగు సినిమాలను అనుకరించినట్టు ఉంది.

కంగువ

ఫొటో సోర్స్, Studio Green/FB

త్రీడీ అనుభూతి

పీరియాడిక్, హిస్టారికల్, ఫాంటసీ, యాక్షన్ సినిమాలకు త్రీడీ అనుభూతి ప్రేక్షకులను కథాలోకంలోకి చాలా దగ్గర ఉన్న అనుభూతి కలిగిస్తుంది. 'కంగువ' లో ఫస్టాఫ్ లో అటువంటి ఎలిమెంట్స్ లేకుండా రొటీన్ స్టోరీ ఉంది. ఈ త్రీడీ ఎక్స్ పీరియన్స్ వల్ల ఫస్టాఫ్ లో రొటీన్ స్టోరీకి కూడా ఈ విజువల్ రిచ్ నెస్ ఉండటం ఒక ప్లస్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో కంగువ లోకంలో ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా ప్లస్ అయ్యింది.

ఫ్రాన్సిస్ పాత్రను కొంత జోష్ ఫుల్ గా చేసే ప్రయత్నంలో భాగంగా చొప్పించిన కామెడీ ట్రాక్స్ మాత్రం కొన్ని చోట్ల మిస్ ఫైర్ అయ్యాయి. సోషల్ మీడియా మీమ్స్‌ను పోలి ఉన్న కామెడీ ట్రాక్స్ సినిమాలో సీరియస్ టోన్‌ను పలచగా మార్చేశాయి.

పాటల్లో 'తనదే 'తప్ప మిగిలినవి పెద్ద ఆకట్టుకునేలా లేవు.

సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అద్భుతంగా ఉన్నాయి. టెక్నికల్ రిచ్ నెస్ సినిమాకు ప్లస్ పాయింట్.

ప్లస్ పాయింట్స్ :

1) టెక్నికల్ రిచ్ నెస్

2) 'తనదే 'పాట

3) కథ

4) త్రీడీ అనుభూతి

మైనస్ పాయింట్స్ :

1) కథను బలంగా ప్రెజెంట్ చేయలేకపోవడం

2)పాత్రల చిత్రీకరణ

3)వెయ్యేళ్ళ కిందటి నేపథ్య వాతావరణం బలంగా లేకపోవడం

4)డబ్బింగ్

భారీ ప్రమోషన్స్,ట్రైలర్ లో ఆసక్తి కలిగించే కథతో మంచి హైప్ తో వచ్చినప్పటికీ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సినిమా 'కంగువ.'

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)