మాజీ యూట్యూబర్ చేతిలో ఓడిపోయిన మైక్ టైసన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కల్ సాజద్
- హోదా, బీబీసీ స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఏటీ అండ్ టీ స్టేడియం, టెక్సస్
టెక్సస్‌లో 70 వేల మంది అభిమానులు చూస్తుండగా, రెండుసార్లు హెవీవెయిట్ చాంపియన్ అయిన మైక్ టైసన్‌పై భారీ విజయాన్ని నమోదు చేశాడు యూట్యూబర్ నుంచి బాక్సర్‌గా మారిన జేక్ పాల్.
ఈ వివాదాస్పద పోటీని నెట్‌ఫ్లిక్స్‌లో లక్షలాది మంది వీక్షించారు.
19 ఏళ్లుగా ఎలాంటి పోటీలో పాల్గొనని 58 ఏళ్ల మైక్ టైసన్ ఈ పోటీలో తన పాత స్వభావానికి భిన్నంగా కనిపించారు.
పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ 27 ఏళ్ల జేక్ పాల్ చురుగ్గా కనిపించాడు. రెండు నిమిషాల చొప్పున 8 రౌండ్లలో జరిగిన ఈ పోటీలో కచ్చితమైన పంచ్‌లతో మైక్ టైసన్‌ను కోలుకోకుండా చేశాడు పాల్.
పోటీలో టైసన్ అంత చురుగ్గా కనిపించలేదు.
పోటీలోకి దిగేముందు వరకు టైసన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ, ముగింపు దశకు వచ్చేసరికి ప్రేక్షకులు నిరాశ చెందారు.

న్యాయనిర్ణేతలు స్కోర్ వివరాలు ప్రకటించక ముందే కొంతమంది అభిమానులు స్టేడియం నుంచి వెళ్లిపోయారు.
80-72, 79-73, 79-73 తేడాతో టైసన్ ఓడిపోయినట్లు న్యాయ నిర్ణేతలు ప్రకటించారు.
ఏడో రౌండ్‌లో ఓటమి తర్వాత కూడా, టైసన్.. పాల్ సోదరుడు లోగాన్‌ను పిలిచి మరో రౌండ్ పోటీకి రావొచ్చని అన్నారు.
అయితే, ఇద్దరూ ఈ పోటీని ఎంత సీరియస్‌గా తీసుకున్నారనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ, పోటీకి ముందు టైసన్ మాట్లాడుతూ, ''నేను ఫైట్ చేయడానికే వచ్చా'' అన్నారు.
ప్రో ఫైట్‌గా దీనికి అనుమతించిన టెక్సస్ కమిషన్ నిబంధనల మేరకు, ఇద్దరూ అదనపు ప్యాడింగ్‌తో కూడిన భారీ గ్లోవ్స్ ధరించారు. అయితే ఈ నిర్ణయం పోటీ తర్వాత హాస్యాస్పదంగా అనిపించింది.
తేలికగా ఉండే సాధారణ గ్లోవ్స్ వాడినా పెద్ద తేడా ఏం ఉండేది కాదు, నాకౌట్ దశకు చేరినా ఎలాంటి పంచ్‌లు పడలేదు.
పాల్ విసిరిన 78 పంచ్‌లతో పోలిస్తే, ఈ పోటీలో టైసన్ 18 పంచ్‌లు మాత్రమే విసరగలిగారు.
పాల్ బాక్సింగ్‌కి రాకముందు ప్రాంక్ వీడియోలతో వచ్చిన సోషల్ మీడియా ఫాలోయింగ్ ద్వారా సెలెబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పాల్ తన 11వ ప్రో ఫైట్ గెలిచారు. నిరుడు టామీ ఫ్యూరీ చేతిలో ఓడిపోయారు. మెక్సికన్ సూపర్ స్టార్ కానెలో అల్వారెజ్‌తో ఫైట్ చేయాలనే తన కోరికను మరోసారి వెలిబుచ్చారు పాల్.

ఫొటో సోర్స్, MIKE TYSON/FACE BOOK
వృద్ధుడు వర్సెస్ అనుభవం లేని బాక్సర్
ఇది బాక్సింగ్‌ను అపహాస్యం చేయడమేనని భావించిన విమర్శకులకు ఈ ఫలితం ఆశ్చర్యకరమేమీ కాదు.
2005లో కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓడిపోయినప్పుడే తన మనసు ఆటపై లేదని మైక్ టైసన్ అన్నారు.
ఆయన అరవై ఏళ్లకు చేరువైన వ్యక్తి అని అందరికీ తెలుసు. కొంత బలంగానే కనిపించినప్పటికీ, అంత చురుగ్గా లేరు.
టైసన్ గెలవాలంటే పాల్‌ను ముందుగానే పడగొట్టాల్సి ఉంటుందని అనుకున్నారు. అయితే, తొలుత కుడిచేత్తో ఫైట్ ప్రారంభించిన పాల్, ఆ తర్వాత మూడో రౌండ్‌కి వచ్చేసరికి అదనుచూసి ఎడమ చేత్తో టైసన్‌పై విరుచుకుపడ్డారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన పాల్, తన కంటే 31 ఏళ్లు సీనియర్ అయిన వ్యక్తిని రెచ్చగొట్టడం ప్రారంభించారు.
ఏడో రౌండ్‌లో టైసన్ మరింత వెనకబడ్డారు. అప్పటికే చాలా మంది అభిమానులు ఫైనల్ బెల్ వినేందుకు సిద్ధమయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














