ఇద్దరు మిత్రుల డెత్ మిస్టరీ.. వ్యాపార లావాదేవీలా? వివాహేతర సంబంధాలా

ఫొటో సోర్స్, Facebook
- రచయిత, ప్రియాంక జగ్‌తాప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వ్యాపారవేత్తలైన ఇద్దరు స్నేహితులు అకస్మాత్తుగా ఒకరి తర్వాత మరొకరు చనిపోయారు.
మొదట స్నేహం, వ్యాపార భాగస్వామ్యం, కుటుంబాల మధ్య సంబంధాలు, ఆ తర్వాత విభేదాలతో సంబంధాలు దెబ్బతిని, వారి జీవితాలు విషాదంగా ముగిశాయి.
ఇద్దరిలో ఒకరు హత్యకు గురికాగా, మరొకరు నదిలో శవమై తేలారు.
ఈ మర్డర్, అనుమానాస్పద మృతి కేసులను నాలుగు రాష్ట్రాల పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా హాంకోన్‌కి చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త వినాయక్ నాయక్, ఈ ఏడాది సెప్టెంబర్ 22న తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు.
ఈ హత్య జరిగిన సరిగ్గా మూడు రోజులకు, సెప్టెంబర్ 25న 55 ఏళ్ల వ్యాపారవేత్త గురుప్రసాద్ రాణే గోవాలోని మాండ్వీ నదిలో శవమై తేలారు.

అసలు కేసు ఏమిటి?
వ్యాపారవేత్త వినాయక్ నాయక్ కార్వార్ తాలూకాలోని హాంకోన్‌లో, తన నివాసంలో హత్యకు గురయ్యారు.
తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లతో వినాయక్‌పై దాడి చేశారని కార్వార్ పోలీసులు బీబీసీతో చెప్పారు. ఈ దాడిలో వినాయక్ భార్యకి కూడా గాయాలయ్యాయి.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇల్లంతా రక్తపు మడుగుగా మారడంతో పాటు నాయక్ భార్య అక్కడే శవమై కనిపించారు.
మూడు రోజుల తర్వాత గోవాలోని మాండ్వీ నదిలో గురుప్రసాద్ రాణే మృతదేహం దొరికింది.
గురుప్రసాద్ రాణేకి కూడా వ్యాపారాలున్నాయి. వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలతో పాటు భారీ ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా, ఈ ఇద్దరికీ ఒకరి భార్యతో మరొకరికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనకు ఆరు నెలల ముందు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారని వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది.
విభేదాల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని కార్వార్ పోలీసులు బీబీసీతో చెప్పారు. హత్యకు గురైన వినాయక్ నాయక్‌కు గురుప్రసాద్ రాణే భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తమ విచారణలో తేలిందని వారు తెలిపారు.

ఫొటో సోర్స్, GOPOLICE
పోలీసు విచారణ
ఈ హత్య దోచుకోవడం కోసం జరగలేదని, ఇతరుల ఆదేశాల మేరకే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఎందుకంటే, ఇంట్లో ఉన్న డబ్బు, వస్తువులు ఎక్కడివక్కడే ఉన్నాయి. హత్యకు పాల్పడిన దుండగులు నంబర్ ప్లేట్ లేని కారును వాడారు.
హత్యానంతరం నిందితులు గోవాకు పారిపోయి ఉంటారని అనుమానించిన కార్వార్ పోలీసులు, వెంటనే గోవా పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన గోవా పోలీసులు నిందితులను గుర్తించారు.
ఈ హత్యకు పాల్పడిన వారిలో ఒకరు గురుప్రసాద్ రాణేకు నమ్మకస్తులు కావడంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
''వినాయక్ నాయక్‌ను ఆయన నివాసంలోనే హత్య చేసిన బిహార్‌కు చెందిన మంజూర్ పూర్నియా, జాగీర్ అనే ఇద్దరిని దిల్లీ పోలీసుల సాయంతో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నాయక్ హత్యానంతరం వారిద్దరూ మడ్‌గావ్ నుంచి రైల్లోనే దిల్లీ పారిపోయారు'' అని గోవా పోలీసులు బీబీసీతో చెప్పారు.
దీంతో గోవా పోలీసులు దిల్లీ పోలీసులను సంప్రదించడంతో వారిద్దరినీ దిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.
''ఇందులో మరో వ్యక్తికి సంబంధముంది. అతని పేరు లక్ష్య జ్యోతినాథ్ కెనారామ్‌నాయ్. అతనిది అస్సాం. గురుప్రసాద్‌కు నమ్మకస్తుడు. గురుప్రసాద్ ఆదేశాలతోనే జ్యోతినాథ్ మరో ఇద్దరితో కలిసి వినాయక్ నాయక్‌ను హత్య చేశారు. హత్యానంతరం విమానంలో పారిపోతుండగా అరెస్టు చేశాం'' అని గోవా పోలీసులు తెలిపారు.
నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు గురుప్రసాద్ రాణే కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పర్వరీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ పరబ్ బీబీసీతో మాట్లాడుతూ, ''నదిలో ఒక మృతదేహం పైకితేలి కనిపిస్తున్నట్లు సెప్టెంబర్ 25 సాయంత్రం 4 గంటల సమయంలో మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం. డెడ్‌బాడీ జేబులో ఉన్న ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నాం. ఆయన భార్యను సంప్రదించిన తర్వాత నిర్ధారించుకున్నాం'' అని చెప్పారు.
గురుప్రసాద్ రాణేది ఆత్మహత్యా? లేక హత్యా? అనే విషయంపై కూడా స్పష్టత ఇచ్చారు ఇన్‌స్పెక్టర్ రాహుల్. ''ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. డెడ్‌బాడీ లభ్యమైన ప్రదేశానికి సమీపంలోనే ఆయన కారు కూడా ఉంది'' అని చెప్పారు.
''కార్వార్ పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. భయాందోళనతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు'' అని రాహుల్ అభిప్రాయపడ్డారు.
అలాగే, నీటిలో ముగినిపోవడం వల్లే చనిపోయినట్లు గురుప్రసాద్ రాణే పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని పోలీసుల తెలిపారు.
మిస్టరీగా మారిన మరణాలు
ఈ కేసును కవర్ చేసిన జర్నలిస్ట్ దీపక్ జాదవ్ ఈ ఇద్దరు వ్యాపారవేత్తల గురించి బీబీసీకి అదనపు సమాచారం అందించారు.
''వినాయక్ నాయక్, గురుప్రసాద్ రాణే ఇద్దరిదీ కార్వార్ తాలూకాలోని హాంకోన్ గ్రామం. వినాయక్ వ్యాపార నిమిత్తం పుణెకి వెళ్లగా, గురుప్రసాద్ రాణే గోవాలోని ఫోండా వెళ్లారు'' అని జాదవ్ చెప్పారు.
పుణెలో ఎలక్ట్రికల్స్ వ్యాపారంలో నాయక్ బాగా డబ్బు సంపాదించారు. తన సొంతూళ్లో పెద్ద ఇల్లు కూడా కట్టించారు. అప్పుడప్పుడూ ఊరికి వస్తుండేవారు.
గురుప్రసాద్ రాణే మద్యం వ్యాపారంలో బాగా సంపాదించారని జాదవ్ తెలిపారు. ఈ ఇద్దరికీ ఒకరి భార్యతో మరొకరికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా తెలుసని ఆయన అన్నారు. దీని గురించి వారి ఊళ్లో కూడా చర్చ ఉందని ఆయన తెలిపారు.
హత్యకు కారణమేంటని పోలీసులను అడిగినప్పుడు, వారి మధ్య భారీ ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండే అవకాశం కూడా ఉందని, ఆ కోణంలోనూ ఇది జరిగి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు.
వినాయక్ నాయక్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో కేసు మిస్టరీగా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














