చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు వెళ్లకపోతే పాకిస్తాన్‌కు జరిగే నష్టం ఎంతంటే..

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.
సారాంశం
  • 2025 ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్తాన్‌లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.
  • ఒకవేళ భారత్ వెళ్లకపోతే పాకిస్తాన్‌లో టోర్నీ జరుగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
  • ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యాన్ని పాకిస్తాన్‌కు అప్పగించింది.
  • భారత జట్టు చివరిసారిగా 2008లో ఆసియా కప్‌ కోసం పాకిస్తాన్‌కు వెళ్లింది.

"భారత్‌తో పాకిస్తాన్ క్రికెట్ ఆడటం ఆపేయాలి. నేను పదవిలో ఉంటే ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉండేవాడిని"

పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలివి.

షెడ్యూల్ ప్రకారం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్తాన్‌లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగాలి. అయితే భారత పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య దేశంగా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2021లోనే ప్రకటించింది. అప్పటి నుంచి ఈ టోర్నీలో భారత్ ఆడటంపై సందేహాలున్నాయి. ఇప్పుడు టోర్నీ తేదీ దగ్గర పడుతుండటంతో పాకిస్తాన్‌ నుంచి నిరంతరం ప్రకటనలు వస్తున్నాయి.

ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్తాన్‌కు వెళ్లింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాక్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ

పాకిస్తాన్ ఏమంటోంది?

2009లో పాకిస్తాన్‌లో శ్రీలంక జట్టుపై దాడి జరిగింది. దీంతో భద్రత కల్పించడంలో పాకిస్తాన్ విఫలమైందంటూ అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి.

ఆ తర్వాత పాక్‌లో జరుగుతున్న అతిపెద్ద ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీనే. పాకిస్తాన్‌లో జరిగిన చివరి ప్రధాన టోర్నమెంట్ 1996 ప్రపంచ కప్. శ్రీలంక, భారత్‌తో కలిసి పాకిస్తాన్‌ దీనికి ఆతిథ్యం ఇచ్చింది.

పాకిస్తాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును పంపేందుకు భారత్ నిరాకరించిందని గత ఆదివారం నుంచి పాక్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు.

ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో కథనం ప్రకారం.. బీసీసీఐ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ ఈ విషయంలో దాని వైఖరి మారకపోవచ్చు. పాకిస్తాన్‌ వెళ్లేందుకు భారత ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఇప్పటికీ ఎదురుచూస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నవంబర్ 8న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘ భారత జట్టు రావడం లేదని అక్కడి మీడియాలో గత రెండు నెలలుగా కథనాలు వస్తున్నాయి. పర్యటనపై ఎలాంటి అభ్యంతరం ఉన్నా దానిని లిఖితపూర్వకంగా మాకు ఇవ్వండి. దాన్ని మా ప్రభుత్వానికి పంపిస్తాం" అని అన్నారు.

"ఈ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయమే పెద్ద సమస్య. జట్టు పాకిస్తాన్‌కు వెళ్లాలని బీసీసీఐ కోరుకుంటోంది. అయితే భారత్‌లో ఇది భద్రత సమస్య కంటే రాజకీయ సమస్యగా ఎక్కువుంది" అని సమా టీవీతో పీసీబీ మాజీ చైర్మన్ నజామ్ సేథీ అన్నారు.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియా మ్యాచ్‌లను వేరే దేశంలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.

భారత్‌ వెళ్లొద్దనుకుంటే టోర్నీ ఎలా?

ఒకవేళ పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్ సిద్ధంగా లేకుంటే హైబ్రిడ్ మోడల్ తీసుకురావచ్చు. ఇండియా మ్యాచ్‌లను వేరే దేశంలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.

ఇదే సమయంలో, హైబ్రిడ్ మోడల్‌పై ఇప్పటివరకు చర్చించలేదని, దానికి సిద్ధంగా కూడా లేమని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటించారు.

తొలిసారిగా 2023లో హైబ్రిడ్ మోడల్ తరహాలో ఆసియా కప్ జరిగింది. పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించడంతో భారత మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించారు.

హైబ్రిడ్ మోడల్‌ను పాకిస్తాన్ అంగీకరించకపోతే, మరోవైపు పాకిస్తాన్‌లో ఆడటానికి ఇండియా సిద్ధంగా లేకుంటే.. చాంపియన్స్ ట్రోఫీని వేరే దేశంలో నిర్వహించడం ఐసీసీకి మరొక ఆప్షన్. మరి దీనికి పాకిస్తాన్ అంగీకరిస్తుందా?

టోర్నీ మరో దేశానికి తరలిపోతే పాకిస్తాన్‌కు ఉన్న ఆప్షన్లపై నజామ్ సేథీ మాట్లాడుతూ.. "అటువంటి పరిస్థితులో పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీని బహిష్కరిస్తుంది లేదా వేరే దేశంలో ఆడటానికి అంగీకరించాలి. కానీ పాకిస్తాన్ వేరే దేశానికి వెళితే అది వారికి కష్టమైన పరిస్థితి. రాజకీయంగా ఇది పెద్ద సమస్య కావొచ్చు" అని అన్నారు.

చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి కరాచీలోని నేషనల్ స్టేడియం, లాహోర్‌లోని గద్ధాఫీ స్టేడియాలను పునరుద్ధరించడానికి పీసీబీ కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. మరి టోర్నీని వేరే దేశంలో నిర్వహిస్తే ఈ ఖర్చును ఎవరు భరిస్తారు?

భారత్, పాక్ దేశాలు ఏకాభిప్రాయానికి రాకపోతే చాంపియన్స్ ట్రోఫీని నిరవధికంగా నిలిపివేయడం ఐసీసీకి మూడో ఆప్షన్. అయితే దీని వల్ల పాకిస్తాన్‌కు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే టోర్నీకి ఆతిథ్యమిస్తాయని కరాచీ, లాహోర్, రావల్పిండీలలోని స్టేడియాలపై ఇప్పటికే పాకిస్తాన్ భారీగా ఖర్చు పెట్టింది.

"పాకిస్తాన్ తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. భావోద్వేగాల ఆధారంగా కాదు. బహిష్కరణ వెనుకున్న లాజిక్ ఇండియాకు తెలుసు, దాన్నే కొనసాగిస్తారు. వారు ఇంతకుముందూ చేశారు. ఐసీసీని బలవంతం చేస్తారు. పాకిస్తాన్ ఏం చేస్తుంది?" అని నజామ్ సేథీ అన్నారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2017లో పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.

పాకిస్తాన్‌కు ఎంత నష్టం?

చాంపియన్స్ ట్రోఫీ బడ్జెట్‌కు సంబంధించి క్రిక్‌బజ్ వెబ్‌సైట్ 2024 ఆగస్టులో ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం ఐసీసీ దాదాపు రూ.540 కోట్లు (65 మిలియన్ డాలర్లు) బడ్జెట్‌గా కేటాయించింది. దీనిలో పాకిస్తాన్ వెలుపల కొన్ని మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన ఖర్చులూ ఉన్నాయి.

పోటీల కోసం దాదాపు రూ. 295 కోట్లు (35 మిలియన్ డాలర్లు), జట్లు ఆడినందుకు, ప్రైజ్ మనీ కోసం మరో రూ. 168 కోట్లు (20 మిలియన్ డాలర్లు) కేటాయించారు. 20 రోజుల్లో 15 మ్యాచ్‌ల ప్రసారం కోసం దాదాపు రూ. 84 కోట్లు (10 మిలియన్ డాలర్లు) కూడా ప్రతిపాదించారు.

టోర్నమెంట్ షెడ్యూల్‌ను నవంబర్ 11న ప్రకటించాల్సి ఉందని, అయితే దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, ఐసీసీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

ఐసీసీ టోర్నీ ఏదైనా షెడ్యూల్ 100 రోజుల ముందే ప్రకటిస్తారు. ఆతిథ్య దేశం, బ్రాడ్‌కాస్టర్స్, ఇతర వాటాదారులకు సన్నద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వడం కోసం ఇలా చేస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)