'మట్కా' రివ్యూ: వాసు ఆడిన అంకెల ఆట ఎలా సాగింది?

ఫొటో సోర్స్, X/Varun Tej Konidela
- రచయిత, సాహితీ
- హోదా, బీబీసీ కోసం
'మట్కా'... ఈ పేరు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1970 - 1980 మధ్యకాలంలో ఈ ఆట ఓ వ్యసనంలా మారి మధ్యతరగతి జీవితాలతో ఆటాడుకుంది.
రోజుకు కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారేవి. భారతీయ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి ఈ ఆట కూడా తనవంతు కారణమైంది.
ఇప్పుడు దర్శకుడు కరుణ కుమార్ ఈ నేపథ్యంలో 'మట్కా' అనే సినిమా తీశారు.
వరుణ్‌తేజ్‌ని భిన్నమైన అవతారాల్లో చూపించిన చిత్రమిది.
టీజర్‌లు, అందులోని డైలాగులు ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలనుకొనేవాళ్ల ఆశలకూ మట్కా ఎన్ని రెక్కలిచ్చింది? చివరికి అదే ఆట ఆ ఆశల సౌధాన్ని ఎలా కూల్చింది? ఇంతకీ ఈ ఆటకీ వాసుకీ ఉన్న సంబంధం ఏమిటి? చేతిలో చిల్లిగవ్వ కూడా లేని వాసు - ఈ మట్కా ప్రపంచానికి రారాజులా ఎలా మారాడు? ఇవన్నీ తెలుసుకొనే ముందు 'మట్కా' కథలోకి వెళ్దాం.


ఫొటో సోర్స్, X/Varun Tej Konidela
మట్కా ఎలా పుట్టింది?
వాసు (వరుణ్‌తేజ్) చిన్నప్పుడే ఒకర్ని హత్య చేసి జైలుకెళ్తాడు. అక్కడ రాక్షసుల మధ్య రాక్షసుడిగా బతుకుతాడు.
జైలు నుంచి తిరిగొచ్చి, విశాఖపట్నం పూర్ణా మార్కెట్‌లో ఓ చిన్న పనికి కుదురుతాడు.
పూర్ణా మార్కెట్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, ఆధిపత్య పోరుని ఆసరాగా చేసుకొని మెల్లమెల్లగా ఎదుగుతాడు.
మార్కెట్‌పై ఆధిపత్యం కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న నాని బాబు (కిషోర్) వాసుని చేరదీస్తాడు.
క్రమంగా పూర్ణా మార్కెట్‌పై పట్టు సాధిస్తాడు వాసు. ఆ తరువాత వ్యాపారాలు మొదలెడతాడు.
ఓసారి ముంబయి వెళ్తే.. అక్కడ అంకెలతో ఆడుకొనే ఓ సరదా ఆట చూస్తాడు. దాన్ని జూదంగా మారిస్తే - కోట్లాది రూపాయలు సంపాదించొచ్చు అనే ఆలోచన వస్తుంది.
ఆ ఆటకు 'మట్కా' అనే పేరు పెడతాడు. మరి మట్కాని వాసు దేశవ్యాప్తంగా పాపులర్ ఎలా చేశాడు? దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసేంతగా 'మట్కా'ని ఎలా పెంచి పోషించాడు? ఈ ప్రయాణంలో ఎంతమంది శత్రువుల్ని సంపాదించుకున్నాడు? చివరికి వాసు కథ ఏమైంది? ఇదంతా 'మట్కా' చూసి తెలుసుకోవాల్సిందే.

ఫొటో సోర్స్, X/Varun Tej Konidela
వాసు పాత్రతో కనెక్షన్ ఉందా?
'మట్కా' అనేది ఓ జూదం. 1962లో ముంబయి కేంద్రంగా మట్కా దందా సాగేది.
అప్పట్లో రతన్ ఖత్రీని మట్కా కింగ్‌గా పిలుచుకొనేవారు.
సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని కాలంలో దేశవ్యాప్తంగా ఓ జూదాన్ని ఈ స్థాయిలో నడపడం ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం మట్కా ఆటపై నిషేధం విధించింది.
ఈ నేపథ్యమే కరుణ కుమార్‌ని 'మట్కా' కథ రాసేలా ప్రేరేపించి ఉంటుందేమో? అయితే మట్కా కథ మొత్తం కేవలం ఈ ఆట చుట్టూనే సాగుతుందనుకోవడం పొరపాటు. నిజానికి ఇది వాసు కథ.
జీరో నుంచి హీరోగా మారిన ఓ అనామకుడి కథ. దానికి మట్కా నేపథ్యంగా పనికొచ్చిందంతే.
ఓ సీబీఐ ఆఫీసర్ (నవీన్ చంద్ర) ఇన్వెస్టిగేషన్ కోణం నుంచి మట్కా కథ మొదలవుతుంది. 1958లో ఈ కథకు బీజం పడింది.
వాసు అనే కుర్రాడు.. మట్కా కింగ్ వాసుగా ఎలా మారాడు? అనేదే ఇతివృత్తం. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన మనుషులు, పరిస్థితులే సన్నివేశాలుగా మారాయి.
ఈ ప్రయాణం కొన్నిసార్లు ఉత్సాహంగా సాగితే, చాలాసార్లు స్పీడు తగ్గి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంటుంది.
అన్నం పొట్లం దగ్గర మొదలైన వాసు యుద్ధం.. దేశాన్ని కుదిపేసేంత ఆర్థిక శక్తిగా మారేంత వరకూ సాగుతుంది.
నిజానికి అండర్ డాగ్ కథలెప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
తెరపై ఒకడు ఎదుగుతుంటే, అది కూడా హీరో అయితే... ప్రేక్షకులే పైచేయి సాధిస్తున్నంత ఫీలింగ్ వస్తుంది.
సదరు హీరో అడ్డదారుల్లో ఎదిగినా సరే, ప్రేక్షకుల ఈగో సంతృప్తి చెందుతుంది. అలాంటి అనుభూతి ఇవ్వాల్సిన కథ ఇది.
కానీ దురదృష్టవశాత్తూ వాసు కథతో, ఇతి వృత్తంతో, తన ఎదుగుదలతో ప్రేక్షకుడికి ఎక్కడా ఎలాంటి కనెక్షన్ ఉండదు.
పాత్రతో ప్రేక్షకుడు మమేకం అయినప్పుడే ఆ పాత్రపై ప్రేమ, సానుభూతి కలుగుతాయి. హీరో పాత్ర ఎదిగినప్పుడు ఉత్సాహం, ఓడిపోయినప్పుడు దిగులు ఏర్పడతాయి. ఆ ఎమోషన్ ఈ సినిమాలో లేకపోవడం ప్రధానమైన లోటు.

ఫొటో సోర్స్, X/Varun Tej Konidela
దావూద్ ఇబ్రహీం వచ్చినా...
వాసు ఎదుగుదల.. చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాల్నే రిపీట్ చేసినట్టు కనిపిస్తుంది.
జైలు కథ.. కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. కానీ పూర్ణా మార్కెట్‌కి వచ్చి, అక్కడ విలన్ గ్యాంగ్‌ని కొట్టి, తాను హీరో కావడం అనే ఫార్ములా చాలా ఏళ్లుగా అరిగిపోయినదే.
మట్కా అంటే ఏమిటి? ఆ ఆట ఎలా ఆడతారు? అసలు ఆ ఆటకీ ఈ కథకీ ఉన్న సంబంధం ఏమిటి? అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
అయితే, ఈ విషయాలన్నీ కేవలం రెండు మూడు ఎపిసోడ్లకే పరిమితం అయ్యాయి. ఒకే ఒక్క పాటలో వాసు కాస్త, మట్కా కింగ్‌గా ఎలా ఎదిగాడో చూపించేస్తారు.
దాంతో ఆ ఆట తాలుకూ తీవ్రత, అందులో ఉన్న ఆపద ప్రేక్షకులకు పూర్తిగా అర్థం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసేంత శక్తి ఈ ఆటకు ఎలా వచ్చిందన్నది పూర్తిగా చూపించలేకపోయారు.
ఓ వ్యక్తి ఎంత తొందరగా ఎదుగుతాడో, అంతే తొందరగా తన పతనం ప్రారంభం అవుతుంది.
వాసు పతనం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే చివరికి ఎన్ని వ్యవస్థలు ఏకమైనా, శత్రువులంతా మూకుమ్మడిగా దాడి చేసినా, ప్రభుత్వమే స్పెషల్ ఆపరేషన్ చేసినా మట్కా కింగ్‌ని ఏమీ చేయలేకపోయాయని చూపించిన వైనం మరింత సినిమాటిక్‌గా సాగుతుంది.
చివర్లో దావూద్ ఇబ్రహీంని కూడా రంగంలోకి దింపి, సీక్వెల్‌కి మార్గం వేసుకొన్నారు.

ఫొటో సోర్స్, X/Varun Tej Konidela
వరుణ్ కష్టపడ్డాడు కానీ...
వరుణ్‌తేజ్ భిన్నమైన అవతారాల్లో కనిపించాడు. వయసుకి తగ్గట్టుగా తన శరీరాకృతి మార్చుకొంటూ వెళ్లాడు.
పాత్రకు తగ్గట్టుగా తన వాయిస్ మాడ్యులేషన్ కూడా మార్చాడు. తన కష్టం తెరపై కనిపిస్తుంది. వాచకంలో స్పష్టత నచ్చుతుంది. కొన్ని సంభాషణలు వరుణ్ గొంతులో మరింత అందంగా వినిపించాయి.
మీనాక్షి చౌదరి పాత్రకున్న ప్రాధాన్యం చాలా తక్కువ. తనని చూస్తుంటే 'లక్కీ భాస్కర్'లో కథానాయిక పాత్రే గుర్తుకు వస్తుంది.
ఈ కథలో లెక్కకు మించిన పాత్రలున్నాయి. కానీ, ఏ క్యారెక్టర్‌కి సరైన మార్క్ లేదు. ఆఖరికి విలన్ పాత్రలకు కూడా.
కెబీ పాత్రని ఇష్టమొచ్చినట్టు మలిచారు. ఆ పాత్ర ఎప్పుడు ఉగ్రరూపం దాలుస్తుందో, ఎప్పుడు సైలెంట్ అయిపోతుందో తెలీదు.
సోఫియాగా నౌరా ఫతేహీ కనిపించింది. తనది గ్లామర్ డాల్ పాత్ర మాత్రమే.
సత్యం రాజేశ్ మధ్యలోనే మాయమైపోతాడు. ఆ పాత్రని ఎందుకు హైడ్ చేశారో అర్థం కాదు.
అజయ్ ఘోష్, నవీన్ చంద్ర, కిషోర్.. ఇలా ప్రతీ పాత్రకూ పేరున్న వాళ్లనే తీసుకొన్నారు. కానీ ఆ పాత్రల్ని మలిచిన తీరు సరిగా లేదు.

ఫొటో సోర్స్, X/Varun Tej Konidela
సాంకేతికంగా చూస్తే... వరల్డ్ బిల్డింగ్ కోసం ఆర్ట్ విభాగం బాగా కష్టపడింది. పూర్ణ మార్కెట్, క్లబ్ సెటప్ అంతా బాగా తీశారు.
ప్రతీ వస్తువునీ పునః సృష్టించడం మామూలు విషయం కాదు. ఈ విభాగంలో అందరి కష్టం తెరపై కనిపిస్తుంది. పాటలు మరీ గొప్పగా లేవు. చివర్లో వినిపించిన జానపద గీతం హుషారుగా సాగింది.
కానీ.. రాంగ్ ప్లేస్‌మెంట్ అనిపించింది. ఆ పాట అయిపోగానే, మరో పాట ప్రత్యక్షమైపోయిందంటే స్క్రీన్ ప్లే ఎంత సాదా సీదాగా ఉందో అర్థం చేసుకోవొచ్చు.
నేపథ్య సంగీతంతో హుషారు తీసుకురావడానికి జీవీ ప్రకాష్ కుమార్ శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు.
ఓ డిఫరెంట్ సెటప్‌లో ఓ కథ చెప్పాలనుకొన్నాడు కరుణకుమార్. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు.
కానీ.. ఆ సెటప్ ద్వారా, హీరో క్యారెక్టరైజేషన్ ద్వారా తాను అనుకొన్న జోష్ మాత్రం తీసుకురాలేకపోయాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














