దిల్లీ ఎప్పుడు దేశ రాజధాని అయింది? వద్దని ఇప్పుడు కొందరు ఎందుకంటున్నారు

India Gate, Delhi

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి పెరిగిపోవడంతో ఈ నగరం ఇంకా దేశ రాజధానిగా కొనసాగాలా? అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు.

నవంబర్ నుంచి జనవరి మధ్య దిల్లీ అసలు నివాసయోగ్యంగానే ఉండదని, ఏడాదిలోని మిగతా నెలల్లోనూ దిల్లీలో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉంటాయని ఆయన ట్వీట్‌ చేశారు.

దిల్లీలో కొన్నేళ్లుగా పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా, కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని అన్నారు.

అత్యంత కాలుష్య నగరాల జాబితాను షేర్ చేసిన శశి థరూర్.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దిల్లీ మారిందని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాజధానిగా దిల్లీ నిర్మాణం

ఫొటో సోర్స్, indianculture.gov.in

ఫొటో క్యాప్షన్, 1929లో పార్లమెంట్, రెండు సెక్రటేరియట్ల నిర్మాణం పూర్తయింది

‘‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం దిల్లీ అనే విషయం అధికారికంగా తేలింది. ప్రమాదకర కాలుష్య స్థాయిలు నాలుగు రెట్లు పెరిగాయి.

కాలుష్య నగరాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఢాకా కంటే దిల్లీలో ప్రమాదకర కాలుష్య కారకాలు అయిదు రెట్లు ఉన్నాయి.

ఇలాంటి భయంకర పరిస్థితులను కొన్నేళ్లుగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం అసలేమీ పట్టించుకోవట్లేదు’’ అని ట్వీట్‌లో శశిథరూర్ పేర్కొన్నారు.

సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం, మంగళవారం ఉదయం 8 గంటలకు దిల్లీలో ఏక్యూఐ స్కోర్ 488గా ఉండటంతో ‘సివియర్ ప్లస్’ కేటగిరీలో చేర్చారు.

బుధవారం కూడా ఏక్యూఐ స్కోర్ 460గా ఉండటంతో తీవ్రమైన కాలుష్యంగా పేర్కొన్నారు.

అదే సమయంలో దేశంలోని ఇతర ప్రముఖ నగరాలైన ముంబయి (123), చెన్నై (126), హైదరాబాద్ (114), కోల్‌కతా (178)ల్లో ఓ మోస్తరు స్థాయిలో, బెంగళూరులో(96) సంతృప్తికర స్థాయిలో గాలి నాణ్యత నమోదైంది.

దిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఇలాంటి పరిస్థితుల్లోనూ దిల్లీ దేశ రాజధానిగా ఉండాలా?’’ అని శశి థరూర్ ప్రశ్నించారు.

శశి థరూర్ కంటే ముందు కూడా కొందరు నేతలు దిల్లీ ఇంకా రాజధానిగా ఉండాలా? అని ప్రశ్నించారు. మరికొందరు ఇతర నగరాలను దేశానికి రెండో రాజధాని చేయాలని కోరారు.

తమిళనాడు, కేరళ, ఇతర కొన్ని రాష్ట్రాలకు చెందిన నేతలు కొందరు రాజధానిని మార్చాలనో.. రెండో రాజధాని అవసరమనో చెప్పిన సందర్భాలున్నాయి.

ఇంతకూ దిల్లీ ఎప్పటినుంచి దేశానికి రాజధానిగా ఉంది?

ఎలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చారు? వంటి విషయాలు ఇక్కడ చూద్దాం.

దిల్లీ

ఫొటో సోర్స్, indianculture.gov.in

అప్పటి నుంచి దిల్లీయే రాజధాని

దిల్లీ ఒక చారిత్రక నగరం. దీనికి పెద్ద చరిత్ర ఉంది. శతాబ్దాల పాటు అనేక రాజ్యాలకు, సామ్రాజ్యాలకు ఇది రాజధానిగా కొనసాగింది.

భౌగోళికంగా కీలక స్థానంలో ఉండటం, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఈ నగరాన్ని అధికారానికి కేంద్రంగా మార్చాయి.

భారతదేశ రాజధాని నగరంగా దిల్లీ చారిత్రక ప్రయాణాన్ని తెలుసుకుందాం.

దిల్లీలో పొగమంచు

ఫొటో సోర్స్, Reuters

మహాభారతంలో మూలాలు

దిల్లీ మూలాలు మహాభారతంలో ప్రస్తావించిన పురాతన నగరమైన ఇంద్రప్రస్థ (1000BCE)లో కనిపిస్తాయి.

యమునా నది తీరంలో పాండవులు ఈ ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించారు. ఇది పాండవుల రాజధానిగా ఉండేదని పురాణాల్లో ఉంది.

ఆనాటి ఇంద్రప్రస్థ ఇప్పటి దిల్లీ అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

చరిత్రలో అనేక రాజవంశాలు, సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి.. పతనమయ్యాయి. అందులో ప్రతిదీ దిల్లీపై తనదైన ముద్రను వేసింది.

తోమర్, చౌహాన్, దిల్లీ సుల్తానులు దిల్లీని పాలించిన తొలి తరం రాజవంశాలు.

క్రీస్తు శకం 736 ప్రాంతంలో తోమర్ రాజవంశం దిల్లీని పాలించినట్లు భారత సాంస్కృతిక శాఖ వెబ్‌సైట్ పేర్కొంది.

ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, 12వ శతాబ్దం తొలినాళ్లలో అజ్మీర్‌లోని చౌహాన్‌లు తోమర్ రాజవంశీయులను ఓడించి దిల్లీని హస్తగతం చేసుకున్నారు.

తర్వాత దిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు.

దిల్లీ సుల్తానులు, మొగల్ సామ్రాజ్య కాలంలో దిల్లీ ఒక బలమైన అధికార కేంద్రంగా మారింది.

కుతుబుద్దీన్ ఐబక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, షాజహాన్ వంటి పాలకులు అద్భుతమైన కట్టడాలను నిర్మించి దిల్లీని ఒక గొప్ప నగరంగా మార్చారు.

మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లో బాబర్ స్థాపించారు. మొగలులు దిల్లీ ప్రాభవాన్ని మరింత పెంచారు.

ముఖ్యంగా షాజహాన్ హయాంలో దిల్లీ మరింత రంగులు అద్దుకుంది.

దిల్లీలో ఎర్రకోట, జామా మసీదుతో పాటు ఇక్కడికి సమీపంలోని ఆగ్రాలో తాజ్‌మహల్‌ను షాజహాన్ నిర్మించారు.

దిల్లీ దర్బారు

ఫొటో సోర్స్, indianculture.gov.in

ఫొటో క్యాప్షన్, 1911 దిల్లీ దర్బారులో కింగ్ జార్జ్ 5.. దిల్లీని కొత్త రాజధానిగా ప్రకటించారు

బ్రిటిష్ రాజ్, న్యూదిల్లీ పుట్టుక

బ్రిటిష్ పాలనలోని బ్రిటిష్ ఇండియాకు కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) రాజధానిగా ఉండేది.

1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్‌తో పాటు బెంగాల్ విభజన సంక్షోభం అనే రెండు ప్రధాన కారణాలతో రాజధానిని కలకత్తా నుంచి మార్చాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది.

రాజధాని కోసం అనేక ప్రాంతాలను పరిశీలించింది.

అయితే, దిల్లీకి ఉన్న చారిత్రక ప్రాధాన్యం, వ్యూహాత్మక స్థానం, రవాణా అంశాలు, రాజకీయంగా-సాంస్కృతికంగా దిల్లీకి పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చాలని నిర్ణయించింది.

అప్పటి వేసవి రాజధాని అయిన సిమ్లాకు కూడా దిల్లీ దగ్గరగా ఉండటం వారి నిర్ణయానికి మరింత బలం చేకూర్చింది.

1911 నాటి దిల్లీ దర్బారులో కింగ్ జార్జ్ 5, క్వీన్ మేరీ రాజధాని మార్పు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది న్యూదిల్లీ నగర నిర్మాణానికి పునాదులేసింది.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు ఎడ్విన్ లూటెన్స్, హెర్బర్ట్ బేకర్‌లు ఈ కొత్త రాజధాని నగరానికి రూపకల్పన చేశారు.

నగర లే అవుట్‌ను మూడు భాగాలుగా విభజించి నిర్మాణాలు చేపట్టారు.

మొదటి భాగంలో (న్యూ ఇంపీరియల్ క్యాపిటల్) నిర్మించిన ప్రభుత్వ భవనాలు, సెక్రటేరియట్లు, కమాండర్ ఇన్ చీఫ్ రెసిడెన్సీ, కౌన్సిల్ మెంబర్స్ రెసిడెన్స్, క్లర్కుల ఇల్లు, విశాలమైన అవెన్యూలు, రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, పార్కులు, పబ్లిక్ గార్డెన్లు భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ప్రతీకలుగా నిలిచాయి.

నగర నిర్మాణంలో ఈ మొదటి కేటగిరీకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రభుత్వం తర్వాతి కాలంలో నిర్మించబోయే భవనాలను రెండో కేటగిరీలో, ప్రైవేట్ ఏజెన్సీలు నిర్మించే భవనాలను మూడో కేటగిరీలో చేర్చారు.

1912లో దిల్లీ టౌన్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటైంది. అప్పుడు మొదలైన నగర నిర్మాణ పనులు 1929 డిసెంబర్ 31 నాటికి దాదాపుగా ముగిశాయి.

కొత్త రాజధాని ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ. 10,01,66,500 గా అనుకోగా ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి ఇది గణనీయంగా పెరగిందని భారత సాంస్కృతిక శాఖ పేర్కొంది.

6 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ కొత్త రాజధాని నగరాన్ని 1931లో ప్రారంభించారు. అప్పట్లో దీన్ని లూటెన్స్ దిల్లీగా పిలిచేవారు. ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌గా పిలుస్తున్న వైస్రాయ్ హౌస్‌లో తొలి నివాసి లార్డ్ ఇర్విన్.

బ్రిటిషర్ల సమ్మర్ క్యాపిటల్ సిమ్లా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిమ్లాలోని రాష్ట్రపతి నివాసం

సమ్మర్ క్యాపిటల్‌గా సిమ్లా

సిమ్లాను బ్రిటిష్ సామ్రాజ్యానికి వేసవి రాజధానిగా 1864లో సర్ జాన్ లారెన్స్ అధికారికంగా ప్రకటించారు.

సిమ్లా బజార్‌లోని ప్రముఖ క్రైస్ట్ చర్చ్ నుంచి ఈ రాజధాని ప్రాంతం 3 మైళ్ల దూరం విస్తరించింది. రాజధానిగా ప్రకటించిన వెంటనే అక్కడ అభివృద్ధి పనులు చేపట్టి దాన్ని ఒక బ్రిటిష్ పట్టణాన్ని తలపించేలా మార్చారు.

పోస్ట్ ఆఫీస్, టెలిగ్రాఫ్ ఆఫీస్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్, భారత ప్రభుత్వ సెక్రటేరియట్, ప్రెస్, క్లర్క్‌ల కోసం కాటేజ్‌లు, ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖ భవనాలను నిర్మించారు.

బ్రిటిష్ పాలకులు వేసవిలో రాజధాని కలకత్తా నుంచి సిమ్లాకు వెళ్లి పాలన సాగించేవారు. ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బ్రిటిష్ ప్రభుత్వం సిమ్లాను రాజధానిగా చేసుకొని పాలించింది.

ఈ నగరం కొన్ని చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. 1945లో సిమ్లా కాన్ఫరెన్స్, 1972 జులై 2న ‘ద సిమ్లా అగ్రిమెంట్’ వంటి చారిత్రక ఘటనలు ఇక్కడే జరిగాయి.

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

స్వాతంత్య్రం తర్వాత దిల్లీ వారసత్వం

భారత్‌కు 1947లో స్వాతంత్య్రం లభించిన తర్వాత కూడా న్యూ దిల్లీయే దేశ రాజధానిగా కొనసాగింది.

గొప్ప చరిత్ర, వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగా భారత సార్వభౌమత్వం, భవిష్యత్ ఆకాంక్షలకు దిల్లీ ప్రతీకగా మారింది.

రాజకీయ, ఆర్థిక అంశాలకు ప్రధాన కేంద్రంగా అవతరించింది. స్వాతంత్య్రం తర్వాత దిల్లీ వేగంగా అభివృద్ధి చెందింది.

ప్రపంచంలోని అతిపెద్ద, అత్యధిక జనాభాగల నగరాల్లో ఒకటిగా మారింది.

కాలం ముందుకు సాగుతున్న కొద్దీ దిల్లీలోని చారిత్రక కట్టడాలు, వాస్తుకళా అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.

హుమయూన్ టూంబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హుమాయూన్ టూంబ్

రాజధాని నగరంగా దిల్లీ ఎదగడంలో కీలక అంశాలు

వ్యూహాత్మక స్థానం: పురాతన, మధ్యయుగంలో వాయువ్య దిశ నుంచి అంటే అఫ్గానిస్తాన్ మీదుగా భారత్‌పై ఎక్కువగా దండయాత్రలు జరిగాయి.

వాయువ్య ప్రాంతాలకు దిల్లీ దూరంగా ఉండడంతో దండయాత్రల సమాచారం తెలుసుకుని సన్నద్ధం కావడానికి వీలుండేది.

యూరోపియన్ నౌకాదళాల నుంచి ముప్పు మొదలుకావడానికి ముందువరకు భారత్‌కు అప్పట్లో సముద్ర జలాల మీదుగా ఎలాంటి ముప్పు ఉండేది కాదు. అరేబియా సముద్రం, బలూచిస్తాన్, హిమాలయాలు వంటివి భారత రాజులకు, రాజ్యాలకు సహజ రక్షణగా ఉండేవి.

అలాగే వాణిజ్య మార్గాలకు కూడలిగానూ దిల్లీ ఉండేది. ఈ కారణాల వల్ల చరిత్రలోని పాలకులంతా రాజధానిగా దిల్లీ వైపే మొగ్గారు.

గొప్ప సాంస్కృతిక వారసత్వం: అనేక రాజవంశాలు, వివిధ మతాలకు చెందిన పాలకులతో ప్రభావితమైన నగర సాంస్కృతిక వారసత్వం దిల్లీకి ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది.

రాజకీయ ప్రాధాన్యం: చరిత్రలో అనేక రాజ్యాలకు, సామ్రాజ్యాలకు అధికార కేంద్రంగా ఉన్న దిల్లీ, స్వతంత్ర భారతావనికి కూడా సహజంగానే రాజధాని నగరంగా ఎంపికైంది.

మౌలిక వసతులు, కనెక్టివిటి: రవాణా, కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి చెందడం ప్రధాన అర్బన్ సెంటర్‌గా దిల్లీ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.

క్లుప్తంగా చెప్పాలంటే రాజధాని నగరంగా దిల్లీ ప్రయాణం చారిత్రక వారసత్వం, వ్యూహాత్మక స్థానం, గొప్ప సంస్కృతికి నిదర్శనం.

ప్రకృతి విపత్తుల ముప్పుకు దూరం: కలకత్తా, ముంబయి వంటివి సముద్ర తీర నగరాలు కావడంతో అక్కడ తుపాన్లు వంటి ప్రకృతి విపత్తుల ప్రభావం తరచూ ఉంటుంది. సముద్ర మార్గం నుంచి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. దిల్లీకి అలాంటి ప్రమాదం తక్కువనేది నిపుణుల అభిప్రాయం.

జైన్ టెంపుల్

ఫొటో సోర్స్, Rameen Khan

వాతావరణం అనుకూలమేనా?

అయితే, ఆధునాతన యుద్ధ సామగ్రి వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది.

అప్పట్లో భౌగోళికంగా దిల్లీకి ఉన్న సహజ రక్షణలు ఇప్పుడు లేవు.

భౌగోళికంగా చూస్తే పాకిస్తాన్, చైనా వంటి పొరుగు దేశాలకు దిల్లీ ఇప్పుడు సమీపంలోనే ఉంటుంది.

పెరుగుతున్న జనాభాతో పోలిస్తే దిల్లీలో వనరులు పరిమితంగానే ఉన్నాయని భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. దిల్లీలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతోపాటు, దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయని అందులో వెల్లడించారు.

గాలి, నీరు, ధ్వని కాలుష్యం వంటివి దిల్లీలో పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని తెలిపింది.

(ఆధారం: ఎకనమిక్ సర్వే ఆఫ్ దిల్లీ, మేకింగ్ ఆఫ్ ఏ కేపిటల్ - న్యూదిల్లీ)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)