పౌర్ణమి రోజు 23 మంది విద్యార్థుల జుట్టును ప్రిన్సిపల్ ఎందుకు కత్తిరించారు? అసలేం జరిగింది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
“ప్రిన్సిపల్ జుట్టు కత్తిరిస్తున్నారని మేమంతా పారిపోయి బాత్రూంలలో, చెట్లు పక్కన, షెడ్లలో దాక్కుంటే.. లాక్కొచ్చి మరీ మా 23 మంది జుట్లు కత్తిరించారు” అని ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా జి. మాడుగుల మండలంలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు బీబీసీతో చెప్పారు.
‘‘రెండు జడలు వేసుకోకుండా పోనీ టెయిల్ (ఒక్క జడ) వేసుకున్నామని, ప్రిన్సిపల్ సాయి ప్రసన్న మేం చెప్పేది వినకుండా మా జుట్టు కత్తిరించారు. అంతే కాకుండా రెండు గంటల సేపు మమ్మల్ని ఎండలో నిలబెట్టి కొట్టారు’’ అని విద్యార్థినులు తెలిపారు.
“అవును నేను విద్యార్థినుల జుట్టు కత్తిరించడం తప్పే. కానీ నేను అలా చేయడానికి కారణముంది” అని ప్రిన్సిపల్ సాయి ప్రసన్న అంటున్నారు.
ఈ నెల 15వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు విచారణ చేపట్టడంతో విషయం బయటపడింది.
అసలు విద్యార్థినుల జుట్టు ప్రిన్సిపల్ ఎందుకు కత్తిరించారు? ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? ఇలాంటి సంఘటనలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?


పౌర్ణమి రోజు ఏం జరిగిందంటే...
ఈ ఘటన జరిగిన అల్లూరి జిల్లా జి. మాడుగుల మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయానికి (కేజీబీవీ) నవంబర్ 18న బీబీసీ వెళ్లింది. అక్కడ అధికారులు, విద్యార్థినులతో ఈ ఘటనపై మాట్లాడింది.
“ఆ రోజు పౌర్ణమి అండి. పౌర్ణమి కావడంతో అంతా పూజలు చేసుకోవచ్చునని బైపీసీ సెకండ్ ఇంటర్ చదువుతున్న మేమంతా తల స్నానం చేశాం. 270 మందిమి ఉన్నామండి. మాకు 16 బాత్రూంలు ఉండగా, అందులో రెండు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగతావన్నీ పాడైపోయాయి. దీంతో ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసి రావడానికి సమయం పట్టింది. టైమ్ సరిపోదని, రెండు జడలు వేసుకోకుండా పోనీ టెయిల్ వేసుకుని వెళ్లిపోయాం. దానికి జుట్టు విరబోసుకుని వెళ్లామని ప్రిన్సిపల్ మేడం అంటున్నారు. ఆ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ప్రిన్సిపల్ సాయి ప్రసన్న మేడం కత్తెర తెప్పించుకుని మా జుట్లు కత్తిరించడం మొదలుపెట్టారు” అని ఒక బాలిక బీబీసీకి తెలిపారు.
“అలా ఒకరి తర్వాత ఒకరు మొత్తం 23 మంది జుట్టు కత్తిరించారు. కొంతమందిమి భయపడి పారిపోయి చెప్పులు లేకుండా బాత్రూంలు, షెడ్లు, మామిడి చెట్ల పక్కకు వెళ్లి దాక్కున్నాం. మమ్మల్ని పట్టుకొచ్చి మరీ జుట్టు కత్తిరించారు. అంతే కాకుండా రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టి కర్రతో కొట్టారు కూడా” అని మరో విద్యార్థిని బీబీసీతో చెప్పారు.


జుట్టు కత్తిరించింది నేనే, అది తప్పే: ప్రిన్సిపల్ సాయి ప్రసన్న
ఈ ఘటనపై కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ సాయి ప్రసన్నతో బీబీసీ మాట్లాడింది. జుట్టు కత్తిరించింది తానేనని, అయితే తాను అలా చేయడానికి కారణముందని ఆమె చెప్పారు.
“అమ్మాయిల జుట్టు కత్తిరించడం పెద్ద తప్పే. కానీ, రెండు నెలలుగా ఆ పిల్లలు ప్రవర్తించిన తీరుతో విసిగిపోయి అలా చేశాను. వారు ఎవరి మాటా వినటం లేదు. స్టడీ అవర్స్‌లో కూర్చోవడం లేదు. కనీసం తినడానికి కూడా రావడం లేదు. వాష్ రూంలను శుభ్రంగా ఉంచడం లేదు. పైగా రాత్రి వేళల్లో ఫోన్లు, ట్యాబులు పట్టుకుని ఇన్‌స్టాగ్రామ్ చూసేవారు. ఇలా నాకు వాళ్లపై ఇతర టీచర్లు, సిబ్బంది నుంచి చాలా ఫిర్యాదులు అందాయి” అని ప్రిన్సిపల్ సాయి ప్రసన్న చెప్పారు.
“పౌర్ణమి రోజు మధ్యాహ్న భోజనానికి రమ్మంటే జుట్లు విరబోసుకుని తిరుగుతూ ఉన్నారు. ఇది ఒక విద్యాసంస్థ. క్రమశిక్షణ ఉండాలి. అందుకే క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంచెం జుట్టు కత్తిరించాను. ఎందుకంటే వీళ్లు ఎక్కువగా జుట్టు, ముఖం మీద దృష్టిపెడతారు కదా... అందుకే జుట్టు కట్ చేస్తే కాస్త సెట్ అవుతారేమో, పిల్లలకు క్రమశిక్షణ వస్తుందని అలా చేశాను. నేను 16 నుంచి 18 మంది జడ చివర్లు కట్ చేశాను. దీని వెనుక వేరే ఉద్దేశం ఏమీ లేదు” అని ప్రిన్సిపల్ సాయి ప్రసన్న బీబీసీకి వివరించారు.
అయితే, ఇలాంటి చర్యల వల్ల టీనేజర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని మానసిక వైద్య నిపుణులు ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు అంటున్నారు.
‘‘భావోద్వేగాలను నియంత్రించుకోలేని కొందరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇది బాధితులపై, ముఖ్యంగా టీనేజర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని రాజు చెప్పారు.

తల్లిదండ్రుల ఆందోళన
జుట్టు కత్తిరించారనే విషయం తెలియడంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కేజీబీవీకి వచ్చి ఆందోళన చేశారు. అదే సమయంలో అధికారులు ఘటనపై విచారణ జరిపేందుకు అక్కడికి వచ్చారు.
“కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం. పిల్లల నుంచి, తల్లిదండ్రుల నుంచి, స్టాఫ్ నుంచి, ప్రిన్సిపల్ నుంచి కూడా స్టేట్‌మెంట్లు తీసుకుని సమగ్రమైన రిపోర్ట్ కలెక్టర్‌కు సమర్పిస్తాం. ఆ నివేదికపై కలెక్టర్ ఆదేశాల మేరకు తప్పనిసరిగా చర్యలుంటాయి’’ అని అల్లూరి జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు చెప్పారు.

ఈ ఘటనతో పాటు ప్రాక్టికల్ మార్కులు తగ్గించేస్తామని, ఫెయిల్ చేస్తామని, పరీక్షలకు వెళ్లేందుకు హాల్ టికెట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారని ఎంక్వైరీ సమయంలో అధికారులకు విద్యార్థినులు తెలిపారు.
“జుట్టు కట్ చేసేంత తప్పు మా పిల్లలు ఏం చేశారు? మా పిల్లలు తప్పు చేసి ఉంటే మాకు చెప్పి ఉంటే మేం సరిదిద్దేవాళ్లం. మా అమ్మాయి ఆరోగ్యం సరిగా లేదు. అలాంటి అమ్మాయిని కొట్టి మోకాళ్ల మీద నిలబెట్టడం ఎంత వరకు కరెక్ట్? ప్రిన్సిపల్ చేసిన పనులు మాకు నచ్చలేదు. ఆమెతో పాటు పిల్లలను ఇబ్బంది పెట్టిన వారందరిపైనా చర్యలు తీసుకోవాలి” అని ఓ విద్యార్థిని తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది శిరోముండనం కిందే లెక్క: స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్
ఈ ఘటనపై స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌తో బీబీసీ మాట్లాడింది.
“ఘటనపై మూడు రోజుల్లో మాకు నివేదిక సమర్పించాలని అల్లూరి జిల్లా అధికారులను ఆదేశించాం. ఆ నివేదిక ఆధారంగా క్రమ శిక్షణా చర్యలతో పాటు వివిధ క్రిమినల్ చర్యలకు సిఫారసు చేస్తాం. ఆడ పిల్లల జుట్టు కత్తిరించడమనేది శిరోముండనం కిందే లెక్క. బాధ్యులపై కచ్చితంగా క్రిమినల్ చర్యలుంటాయి” అని స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యుడు గొండు సీతారాం బీబీసీకి తెలిపారు.

“టీనేజీలో ఉన్న అమ్మాయిల్లోనైనా, అబ్బాయిల్లోనైనా ఇలాంటి ఘటనలు సంఘర్షణకు దారి తీస్తాయి. తమను తాము తక్కువగా అనుకునే ప్రమాదం ఉంది. పైగా తమ ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా తమపై జరుగుతున్న దాడిగా భావించి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఇది వారి మానసిన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది” అని ప్రొఫెసర్ ఏంవీఆర్ రాజు బీబీసీతో చెప్పారు.
‘‘మందలింపుతో పోయేదానికి కూడా తీవ్రమైన శిక్షలు వేయడమనేది సరైనది కాదు, పరిస్థితులను నియంత్రణలో పెట్టుకోలేని వారు, ఏ సమస్యకు ఏ పరిష్కారమనే దానిని అంచనా వేయలేక, అన్నింటికీ కొట్టడం, తీవ్రంగా తిట్టడం ద్వారా పనులు జరుగుతాయని భావిస్తారు. కానీ అది బాధితుల చదువుపై, ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని ప్రొఫెసర్ ఏంవీఆర్ రాజు వివరించారు.

చర్యలు తీసుకోవాలి: విద్యార్థి సంఘాలు
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై మూడు రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఆందోళనలకు దిగుతామని విద్యార్థి సంఘాలు అధికారులను హెచ్చరించాయి.
“పిల్లలను కొట్టే హక్కు తల్లిదండ్రులకే లేదు. అలాంటిది ఆడ పిల్లల జుట్టు కత్తిరించడం, వారిని ఎండలో మెకాళ్లపై నిలబెట్టడం దారుణం. గిరిజనులపై జరుగుతున్న దాడిగా దీనిని పరిగణిస్తాం. ఘటనకు బాధ్యులైనవారిపై సత్వర చర్యలు ఆశిస్తున్నాం” అని ఏఐఎస్ఎఫ్ అల్లూరి జిల్లా కార్యదర్శి శేఖర్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














