కోచింగ్ సెంటర్స్: టాప్ ర్యాంకులన్నీ మావే అంటే కుదరదు, షరతులు వర్తిస్తాయి

విద్యార్థులు
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1, 1.. 2, 2.. 3, 3… 10. ఇవి అంకెలు మాత్రమే అనుకోకండి..

ఎంసెట్, నీట్, ఐఐటీ, సివిల్స్ వంటి పోటీ పరీక్షల ఫలితాలు వచ్చినప్పుడు టీవీల్లోనూ, పత్రికల్లోనూ వినిపించే, కనిపించే ప్రకటనల్లో చెప్పే ర్యాంకులు ఇవి.

ఇకపై ఇలా నంబర్లు చెప్పడమే కాదు, అది నిజంగా ఆ కోచింగ్ సెంటర్లో చదవడం వల్లనే వచ్చిందా.. ఒకవేళ చదివితే ఎన్ని నెలలు చదివారు, ఎంత ఫీజు వసూలు చేశారు.. ఇలా సమస్తం చెప్పాల్సిందే.

కోచింగ్ సెంటర్లు చేసే ప్రకటనలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

అయితే, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ లేనప్పుడు ఈ కొత్త మార్గదర్శకాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు.

ఇంతకీ ఆ మార్గదర్శకాలు ఏమిటి? తప్పుదోవ పట్టించే కోచింగ్ సెంటర్ల ప్రకటనలకు కేంద్ర కొత్త నిబంధనలతో అడ్డుకట్ట పడుతుందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
కోచింగ్ సెంటర్లు
ఫొటో క్యాప్షన్, కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు తెచ్చింది

ఇంతకీ కోచింగ్ అంటే..

విద్యాపరంగా చేసే బోధన, గైడెన్స్, సలహాలు, సూచనలు, విద్యాపరమైన కార్యక్రమాలు, ట్యూషన్లు వంటివి వస్తాయి.

కౌన్సెలింగ్, స్పోర్ట్స్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలు ఈ కోవలోకి రావు.

కనీసం 50 మంది కంటే ఎక్కువ మందికి కోచింగ్ ఇచ్చే కేంద్రాలే కోచింగ్ సెంటర్ల కిందకు వస్తాయి.

కోచింగ్ సెంటర్లు
ఫొటో క్యాప్షన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దోపిడీకి గురికాకుండా అడ్డుకోవడమే వీటి ఉద్దేశం

ఏటా పెరుగుతున్న ఫిర్యాదులు

కోచింగ్ సెంటర్లపై ఏటా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖకు వచ్చే ఫిర్యాదులు పెరుగుతున్నాయి.

కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ర్యాంకులను అడ్డుపెట్టుకుని విపరీతంగా వసూళ్లకు పాల్పడడం, సీట్లు అయిపోతాయంటూ విద్యార్థులపై ఒత్తిడి చేయడంతో పాటు సదుపాయాలు, ఫ్యాకల్టీ లేకపోయినా విద్యార్థులను మభ్యపెట్టడం.. ఇలా ఎన్నో రకాల ఫిర్యాదులు జాతీయ వినియోదారుల సహాయ కేంద్రం ద్వారా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖకు అందుతున్నాయి.

2021-22లో 4,815.. 2022-23లో 5,351.. 2023-24లో 16,276 ఫిర్యాదులు అందాయి.

2024లో ఇప్పటికే 6,980 ఫిర్యాదులు అందినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది.

కోచింగ్ సెంటర్లు
ఫొటో క్యాప్షన్, మార్గదర్శకాలను పాటించకపోతే వినియోగదారుల చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు భావిస్తామని సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే తెలిపారు

రంగంలోకి సీసీపీఏ

కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ - సీసీపీఏ) కోచింగ్ సెంటర్ల ప్రకటనలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.

కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న ప్రకటనలను నియంత్రించడం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దోపిడీకి గురికాకుండా అడ్డుకోవడమే దీని ఉద్దేశమని ఆ సంస్థ ప్రకటించింది.

ఇందుకుగానూ ‘గైడ్ లైన్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ కోచింగ్ సెక్టార్, 2024’ పేరుతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది సీసీపీఏ.

సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే నేతృత్వంలో సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, కేంద్ర విద్యాశాఖ, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తదితర సంస్థల ప్రతినిధులతో ఏర్పాటైన కమిటీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది.

‘‘కోచింగ్ పేరుతో విద్యార్థుల నుంచి జరిగే దోపిడీని అరికట్టడంలో ఈ మార్గదర్శకాలు ఒక ముందడుగు లాంటివి. వీటిని పాటించకపోతే 2019 వినియోగదారుల చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు భావిస్తాం’’ అని మీడియా సమావేశంలో నిధి ఖరే చెప్పారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిన 45 కోచింగ్ సెటర్లకు నోటీసులు ఇచ్చామని, 18 కోచింగ్ సెంటర్ల నుంచి రూ.54.60 లక్షల జరిమానా వసూలు చేసినట్లు నిధి ఖరే తెలిపారు.

‘‘2023 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 2024 ఆగస్ట్ 31 మధ్య ఒక కోటి 15 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇప్పించాం’’ అని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కోచింగ్ సెంటర్లు
ఫొటో క్యాప్షన్, తప్పుడు ప్రకటనలు చేసినా.. తప్పుదోవ పట్టించేలా ఉన్న ప్రకటనల్లో నటించినా కోచింగ్ సెంటర్లతోపాటు ప్రచారకర్తలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది

తాజా మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?

కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చేసే ప్రకటనల విషయంలో కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

  • కోర్సుల వివరాలు, కాలవ్యవధి, ఫ్యాకల్టీ అర్హతలు, ఫీజు, రీఫండ్ పాలసీలను కచ్చితంగా చెప్పాలి.
  • విద్యార్థుల సంఖ్య, సక్సెస్ అయినవాళ్ల సంఖ్య, పరీక్షల్లో ర్యాంకులు, ఉద్యోగానికి సంబంధించి ఇచ్చిన హామీల్లో తప్పులు ఉండకూడదు.
  • కోచింగ్ సెంటర్ల నాణ్యత, సేవలు.. అంటే సదుపాయాలు, వనరుల వంటి వాటి గురించి కచ్చితమైన సమాచారం అందించాలి.
  • పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయని విద్యార్థులపై ఒత్తిడి చేసేలా ప్రకటన చేయకూడదు. లేని డిమాండ్ ఉన్నట్లు చెబితే చర్యలు తీసుకునే వీలుంటుంది.
  • జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ నంబర్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి.
  • కోచింగ్ సెంటర్ల తరఫున సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు ప్రచారం చేస్తుంటారు. విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రచారం చేయడమే కాదు, వారు చేసే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీసీపీఏ స్పష్టం చేసింది.

ఈ విషయంపై నిధి ఖరే మాట్లాడుతూ.. ‘‘ప్రకటనల్లో నటించే వారు క్లెయిమ్స్ నిర్ధరించుకోవాలి. అప్పుడే ప్రమోట్ చేయాలి.

ఒకవేళ తప్పుడు ప్రకటనలు చేసినా.. తప్పుదోవ పట్టించేలా ప్రకటనల్లో నటించినా కోచింగ్ సెంటర్లతోపాటు ప్రచారకర్తలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.

కోచింగ్ సెంటర్ల ప్రకటనల విషయంలో సీసీపీఏ తీసుకొచ్చిన నిబంధనలు ఆహ్వానించదగినవే అయినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు.

ఈ విషయంపై బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కోచింగ్ సెంటర్లు కనీస వసతులు కల్పించడం లేదు. వెయ్యి మంది విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టి శిక్షణ ఇస్తున్నారు. తరగతి గదికి 35-40 మంది అనే నిబంధన ఎక్కడా పాటించడం లేదు. దానివల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. సరైన గాలి, వెలుతురు, టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల విషయంపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి’’ అని సూచించారు నాగేశ్వరరావు.

టర్మ్స్ అండ్ కండిషన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏవైనా షరతులు ఉంటే ప్రకటన ఉన్న ఫాంట్ సైజులోనే ప్రచురించాలి

‘షరతులు’ చిన్నగా చూపిస్తామంటే కుదరదు..

సీసీపీఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. కోచింగ్ సెంటర్లు విడుదల చేసే ప్రకటనల్లో విద్యార్థి పేరు, ర్యాంకు, కోర్సు వివరాలను విద్యార్థి ఫోటో పక్కన వెల్లడించాలి.

ఇప్పటివరకు ఏవైనా షరతులు ఉంటే చిన్నగా స్టార్(*) గుర్తు పెట్టి.. ప్రకటన చివర్లో కనిపించీ, కనిపించకుండా వాటిని చూపించేవారు.

ఇకపై అలా కాకుండా, ఏవైనా షరతులు ఉంటే ప్రకటన ఉన్న ఫాంట్ సైజులోనే ప్రచురించాలి.

ఎవరైనా విద్యార్థికి ర్యాంకు వస్తే, అతని వివరాలు ప్రచురించాలంటే అనుమతి తప్పకుండా తీసుకోవాలి. రాతపూర్వకంగా అనుమతి తీసుకున్నాకే వారి పేర్లు, ఫోటోల వివరాలు ప్రకటనల్లో వాడాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో ఉంది.

విద్యార్థులు ఫీజు కట్టి చదివారా? లేదా మెరిట్ ఆధారంగా వచ్చి చదివి ర్యాంకు సాధించారా? అనే విషయాన్ని కోచింగ్ సెంటర్లు వెల్లడించాల్సి ఉంటుందని సివిల్స్ పరీక్షల నిపుణులు, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నిర్వాహకులు శరత్ చంద్ర బీబీసీతో చెప్పారు.

‘‘కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారా? లేదా సొంతంగా ప్రిపేర్ అయ్యారా? వంటి వివరాలు చెప్పాలి. విద్యార్థులకు ఎగ్జిట్ పాలసీ కూడా మార్గదర్శకాల్లో ఉంది. ఏదైనా ప్రకటన చూసి విద్యార్థి లేదా అభ్యర్థి కోచింగ్‌కు వస్తే.. ఆ తర్వాత అక్కడ సరిపడా సదుపాయాలు లేవని భావిస్తే విద్యార్థి ఎగ్జిట్ కావొచ్చు. అందుకు తగ్గట్టుగా విద్యార్థికి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఫీజును రీఫండ్ చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

శరత్ చంద్ర

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, శరత్ చంద్ర

మార్గదర్శకాలపై అభ్యంతరాలేంటి?

సీసీపీఏ మార్గదర్శకాలు విద్యార్థులకు మేలు చేసేవిగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నట్లు శరత్ చంద్ర చెప్పారు.

‘‘ర్యాంకుల వారీగా ప్రకటించడం కారణంగా పెయిడ్ ర్యాంకులకు వీలుపడదు. కోర్సులకు సంబంధిత బోర్డుల నుంచి అప్రూవల్ ఉందా.. లేదా ప్రకటించాలి. ఎగ్జిట్ పాలసీ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరైనా విద్యార్థి కోర్సు చాలా వరకు చదివి, మరో రెండు నెలలు ఉందనగా మానేస్తే పరిస్థితి ఏమిటి? అప్పటికీ కోర్సు దాదాపు పూర్తవుతుంది. అలాంటప్పుడు మళ్లీ మిగిలిన ఫీజు రీఫండ్ చేయడమంటే సాధ్యమవుతుందా?’’ అని ప్రశ్నించారు శరత్ చంద్ర.

మార్గదర్శకాలు కోచింగ్ సెంటర్లు అమలు చేస్తాయా? లేదా? అనే విషయం అటుంచితే, విద్యార్థులు ఫిర్యాదు చేస్తారనే భయం కారణంగా నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని శరత్ చంద్ర అభిప్రాయపడ్డారు.

నాగేశ్వరరావు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పీడీఎస్‌యూ నేత నాగేశ్వరరావు

అయితే, కోచింగ్ సెంటర్ల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ విభాగం లేదని చెప్పారు ఎస్.నాగేశ్వరరావు.

‘‘ కోచింగ్ సెంటర్లు విద్యాశాఖ పరిధిలోకి రావడం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి.

సీసీపీఏ జారీ చేసిన మార్గదర్శకాల అమలును ఈ విభాగం పర్యవేక్షించేలా ఉండాలి. నెలకోసారి క్వాలిటీ చెక్ చేయాలి. ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేసే నిర్వాహకులపై కచ్చితమైన చర్యలు ఉండాలి’’ అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)