తెలంగాణ- మహారాష్ట్ర: ‘రెండు రాష్ట్రాల్లో ఓటు వేస్తాం, రెండు రాష్ట్రాల రేషన్ తీసుకుంటాం, కానీ...’

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామంలో మహిళ
ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వివాదం ఉన్న ఒక గ్రామానికి చెందిన మహిళ
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వివాదంలో చిక్కుకున్న 14 గ్రామాల ప్రజల ఎడతెగని కథ ఇది.

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత కొద్ది కాలానికే తలెత్తిన వివాదం ఇది. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే ఈ గ్రామాలపై పాలనాధికారం ఎవరిదన్న వివాదం అనేక మలుపులు తిరిగింది. చివరకు ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాల రికార్డుల ప్రకారం.. ఈ గ్రామాలు తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పరిధిలో ఉన్నాయి.

సాధారణంగా దేశ పౌరులు ఏదో ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికో చెందిన వారై ఉంటారు. అయితే “సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సరిహద్దు వివాదం తేలేంత వరకు ఈ గ్రామాల ప్రజల సంక్షేమం బాధ్యత రెండు రాష్ట్రాలది” అని గతంలో బీబీసీతో మాట్లాడుతూ రాజురా (మహారాష్ట్ర) ఎమ్మెల్యే వామన్ రావ్ చటాప్ చెప్పారు.

దీంతో వీరికి రెండు రేషన్ కార్డులు, రెండు ఓటరు కార్డులున్నాయి. వీరు రెండు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఓటు కూడా వేస్తారు.

ఇప్పుడు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో (నవంబర్ 20న పోలింగ్) మరోసారి ఈ గ్రామాలు చర్చలోకి వచ్చాయి.

నవంబర్ 13న పరందోలి, ముఖద్దం గూడ, మహారాజ్ గూడ గ్రామాలకు వెళ్లిన బీబీసీ అక్కడి ప్రజలతో మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు వివాదం

సరిహద్దు వివాదం ఎప్పుడు మొదలైంది?

ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులతో ఆంధ్రప్రదేశ్ (1956), మహారాష్ట్ర (1960) తెలుగు, మరాఠీ మాట్లాడే ప్రజలతో భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.

స్థానికుల కథనం ప్రకారం, రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చేనాటికి ఈ 14 గ్రామాలు ఏర్పడలేదు. కొండలు, గుట్టలతో జనావాసాలు పెద్దగా లేని అటవీప్రాంతం కావడంతో సరిహద్దు విషయంలో అప్పటికి స్పష్టత లేదు. ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాల కార్యకలాపాలు అక్కడికి ఇంకా చేరలేదు.

సుప్రీంకోర్టు, పోరాటం
ఫొటో క్యాప్షన్, రాందాస్ రణవీర్

“చంద్రపూర్ జిల్లా జివితి తాలుఖాలో దట్టమైన అడవి ఉండేది. 1965 నాటికి నాందేడ్, పర్బణి, లాతూర్, ఉస్మానాబాద్ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడి అడవి నరికి వ్యవసాయంలో స్థిరపడ్డారు. దీంతో ఈ 14 గ్రామాలు ఏర్పడ్డాయి. వీటిలో సుమారు 8 వేల వరకు జనాభా ఉంది’’ అని ముఖద్దంగూడకు చెందిన రాందాస్ రణవీర్ బీబీసీతో చెప్పారు.

తమ బాగోగులను మహారాష్ట్రకే అప్పగించాలని ఆయన పోరాటం చేస్తున్నారు.

“1978లో రెండు రాష్ట్రాల సంయుక్త కమిటీ నిర్ణయించిన సరిహద్దుల ప్రకారం ఈ గ్రామాలన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయి. ఆ విషయం తెలిశాక మేం ఆందోళనలు చేశాం. దీంతో 1983లో ఇరు రాష్ట్రాల ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో ఏర్పడ్డ మరో సంయుక్త కమిటీ (కెకె.నాయుడు కమిటీ) మా గ్రామాలను ఏపీకి అప్పగించాలని నిర్ణయించింది. స్థానికుల నుంచి ఒత్తిడి పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీనిపై అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ హైకోర్టులో కేసు వేస్తే వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 1996లో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది” అని రాందాస్ రణవీర్ వివరించారు.

 నాందేడ్, పర్బణి, లాతూర్, ఉస్మానాబాద్
ఫొటో క్యాప్షన్, ఆడె సంతోష్

రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలు

‘‘ఈ సరిహద్దు వివాదం కొనసాగుతుండగానే, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామాల్లో క్యాంపులు పెట్టి ఆధార్ కార్డులను ఇచ్చింది. ఈ విషయాన్ని కొందరు మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అవే బయోమెట్రిక్ వివరాలతో కేవలం తమ రాష్ట్రం పేరు ఉండేలా అడ్రస్ మార్చి ఆధార్ కార్డులు ఇచ్చింది. రెండు రాష్ట్రాలు ఇచ్చిన కార్డులపై ఒకే ఆధార్ నంబర్ ఉంటుంది’’ అని రాందాస్ రణవీర్ చెప్పారు.

అయితే ఈ మధ్య ఏదో ఒక రాష్ట్ర ప్రజలుగా ఒకే కార్డును తీసుకుంటున్నామని ఈ గ్రామాల్లో ఒకటైన పరందోలికి చెందినవారు కొందరు బీబీసీతో చెప్పారు.

ప్రస్తుతం ఈ గ్రామాల్లో రెండు రాష్ట్రాల వైపు నుంచి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండు ప్రభుత్వాలకు చెందిన అంగన్వాడీ, స్కూలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, రక్షిత తాగు నీటి ట్యాంకులున్నాయి.

సరిహద్దు గ్రామాల వివాదంపై 1994లో అప్పటి ఏపీ ప్రభుత్వానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాసిన ఒక లేఖ
ఫొటో క్యాప్షన్, సరిహద్దు గ్రామాల వివాదంపై 1994లో అప్పటి ఏపీ ప్రభుత్వానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాసిన ఒక లేఖ

“మూడు దశాబ్దాల కిందటే మహారాష్ట్ర ప్రభుత్వం మాకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ లైన్ వేసింది. తెలంగాణలో పరిమిత యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఉంది కాబట్టి మేము తెలంగాణ విద్యుత్ వాడుతున్నాం. దీంతో మహారాష్ట్ర తన లైన్లలో విద్యుత్ సరఫరా నిలిపివేసింది’’ అని మహారాష్ట్ర నుంచి ఎన్నికైన పరందోలి ఉప సర్పంచ్ ఈశ్వర్ ఆడె బీబీసీతో చెప్పారు.

రేషన్ సరుకులు ఇరు రాష్ట్రాల నుంచి ఇక్కడి ప్రజలకు అందుతున్నాయి.

“రెండు రాష్ట్రాల నుంచి మేం రేషన్ తీసుకుంటాం. రెండు వైపుల నుంచి తీసుకుని తింటున్నాం అని బయటి గ్రామాల్లోని మా బంధువులు గేలి చేస్తుంటారు. ప్రభుత్వాలు ఇస్తున్నాయి, మేము తీసుకుంటున్నాం. అందులో తప్పేముంది?” అని అన్నారు పరందోలికి చెందిన ఆడె సంతోష్.

పరందోలి గ్రామానికి బీబీసీ వెళ్లినప్పుడు అక్కడ రెండు వైపుల ప్రభుత్వాల యంత్రాంగాలు వేర్వేరు పనుల్లో నిమగ్నమై కనిపించాయి.

తెలంగాణ ప్రభుత్వం తరపున సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోంది. అదే సమయంలో మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ బృందం ఓ గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తోంది.

ఇద్దరు మహిళలు

“నేను ఇక్కడి పాఠశాలలో చేరిన కొత్తలో అంతా ఆశ్చర్యంగా అనిపించేది. ప్రభుత్వ సదుపాయాలన్నీ రెండు ప్రభుత్వాలవి ఉంటాయి. ఇలాంటిది నా జీవితంలో ఇక్కడే చూశాను” అని అన్నారు పరందోలి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రవణ్ కుమార్.

సంకీత్ రాజే భోంస్లే మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలోని సభ్యుడు.

“ఈ సరిహద్దు గ్రామాల్లో ఎన్నికల వేళ చట్టవ్యతిరేకంగా మద్యం, డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రెగ్యులర్‌గా పెట్రోలింగ్ చేస్తున్నాం’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.

“ఈ సరిహద్దు గ్రామాల సమస్యకు ఇంతవరకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. అభివృద్ధి కోసం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఇక్కడి ప్రజలను కోరుతున్నాం’’ అని నీతి ఆయోగ్ ‘ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్’ కార్యక్రమ జివితి తాలుకా బ్లాక్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గణేష్ చింతల్ వార్ అన్నారు. ఎన్నికల సందర్భంగా డిప్యుటేషన్‌పై ఆయన ఎలక్షన్ కమిషన్ కోసం పనిచేస్తున్నారు.

‘రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటాం. సాధారణంగా రెండు రాష్ట్రాల పోలింగ్ షెడ్యూల్ వేరుగా ఉంటుంది’’ అని ఆడె సంతోష్ చెప్పారు.

ఒకసారి రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్ జరిగినప్పుడు ఒత్తిడికి గురయ్యామని పరందోలికి చెందిన రంగారావ్ పవార్ తెలిపారు.

‘‘ఒకసారి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రెండు రాష్ట్రాల్లో ఒకే రోజు జరిగింది. అప్పుడు గ్రామంలోని ఓటర్లు మహిళలు, పురుషులుగా వీడిపోయి చెరో రాష్ట్రం వైపు పోలింగ్‌లో పాల్గొన్నాం. ఎటు వేయకపోతే ఏం జరుగుతుందో, పథకాలు ఆగిపోతాయేమో అన్న భయంతో ఇలా చేశాం’’ అని ఆయన చెప్పారు.

ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు,ట్రైబ్స్

దళితులు వర్సెస్ ఎస్టీలు

వివాదం ఉన్న 14 గ్రామాల్లో మెజార్టీ జనాభా లంబాడ(బంజార), దళిత వర్గాలది. పోడు భూములకు పట్టాల విషయంలో వీరు రెండు వర్గాలుగా విడిపోయినట్టుగా బీబీసీ పరిశీలనలో అనిపించింది.

మహారాష్ట్రలో డీనోటిఫైడ్ ట్రైబ్స్ (డీఎన్డీ)గా వెనుకబడిన వర్గాల జాబితాలో (బీసీ) ఉన్న లంబాడాలు తెలంగాణలో ఎస్టీ వర్గంలో ఉన్నారు.

1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎస్టీల ఆధీనంలోని పోడు భూములకు హక్కు పత్రాలను ఇచ్చింది. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందన్నది ఎస్సీల వాదన.

“ఇక్కడ ఎస్టీలుగా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి అందుకే మేము తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఉండాలనుకుంటున్నాం. మహారాష్ట్రలో మాకు ఏ సౌకర్యాలు రావు’’ అని అన్నారు లంబాడ వర్గానికి చెందిన ఆడె సంతోష్.

‘‘మా భూములకు ఫారెస్ట్ పట్టాలు వచ్చాయి. తెలంగాణలో మాకు రైతుబంధు (కేసీఆర్ హయాంలో), పంట రుణాలు, పెన్షన్ ఇలా అన్నీ లభిస్తున్నాయి. రెండు రాష్ట్రాల వివాదం లేకుండా మమ్మల్ని ఒకవైపే ఉంచాలి. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు వద్దు. మాకు తెలంగాణ కావాలి’’ అని రంగారావ్ పవార్ అన్నారు.

వృద్ధులు

ఎస్సీ వర్గం వారి అభిప్రాయాలు ఎస్టీలతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి.

‘ఏజెన్సీ చట్టాల పేరుతో మా భూములకు పట్టాలు ఇవ్వలేదు. పట్టా లేదని మా భూములకు పంట రుణాలు ఆపేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ బావులు తవ్వించి మోటార్లు ఇచ్చింది. ఇప్పుడు అవన్నీ బంద్ చేసేందుకు సిద్దమైంది. మా వర్గం రైతుల అభివృద్ది తెలంగాణలో అయ్యే పని కాదు. రెంటికీ చెడ్డ రేవడిలా మా పరిస్థితి ఉంది’’ అని అన్నారు లక్ష్మణ్ కాంబ్లే.

పరందోలి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా మహారాష్ట్ర, తెలంగాణ వైపు నుంచి వేర్వేరు సమయాల్లో ఆయన గతంలో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

“ఇక్కడ వంద శాతం మరాఠీ మాట్లాడే ప్రజలే ఉన్నారు. మాకు తెలుగు భాష అర్థం కాదు. ఇక్కడ భూసర్వే పూర్తి చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా రానున్న రోజుల్లో పట్టాలు వస్తాయన్న ఆశ మాకు ఉంది. అందుకే మేమంతా మహారాష్ట్రలో ఓటు వేసేందుకు సిద్దం అయ్యాం’’ అని లక్ష్మణ్ కాంబ్లే చెప్పారు.

మహారాష్ట్ర, తెలంగాణ,మరాఠీ, తెలుగు

‘రెండు వైపుల నుంచి నిధులు వస్తున్నా అభివృద్ధి లేదు’

రెండు రాష్ట్రాల నుంచి నిధులు వస్తున్నాయన్న మాటే కానీ అభివృద్ధి మాత్రం పెద్దగా కనిపించడం లేదని ఈ గ్రామాల ప్రజలు అంటున్నారు. సరిహద్దు వివాదానికి ముగింపు పలకాలని వారు కోరుతున్నారు. అయితే, తమ భూములకు పట్టాలిచ్చిన రాష్ట్రం వైపే తమ మొగ్గు ఉంటుందని అంటున్నారు.

“మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు భూ సర్వేలు చేశాయి. అయితే ఈ గ్రామాల్లో ఎస్సీలకు పట్టాలు రాలేదు. ఎన్నికల తర్వాత అంతా మర్చిపోతారు. ఎవరు భూమి పట్టాలిస్తే వారి వైపు వెళ్లాలని ఉంది. కానీ మా మాతృభాష మరాఠీ కాబట్టి మహారాష్ట్ర మాకు పట్టాలిస్తే బాగుంటుంది’’ అని భరత్ కుంజారామ్ బిరాదే అన్నారు.

మా ఇష్టానుసారం మహారాష్ట్ర లేదా తెలంగాణ కావాలంటే కుదరదని మాకు తెలుసు. అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అటో ఇటో తేల్చేయాలి. ఏదో ఒకవైపు ఉంచి అభివృద్ది చేయాలి అని అభిప్రాయపడ్డారు రంగారావ్ పవార్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)