కమలాపురంలో ఎద్దులు, ఆవులు ఎందుకు చనిపోతున్నాయి.. సీసీ టీవీ విజువల్స్‌లో ఏం కనిపించింది?

ఎద్దులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక వ్యక్తి గోడ దూకి వేరొకరి ఇంటి పశువులు కట్టేసిన చోటకు వెళ్లి వచ్చాడు. కాసేపటికే కోడె దూడ చనిపోయింది.

ఏ పామో కరిచి చనిపోయిందేమో అనుకున్న గ్రామస్థులు సీసీటీవీ విజువల్స్ చూసి ఆశ్చర్యపోయారు.

ఇలా గత నాలుగైదేళ్లలో సుమారు 80 ఎద్దులు, ఆవులు, కోడె దూడలు చనిపోయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా డోన్ మండంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో శంకరాచారి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

బాడుగకు తన వద్ద ఉన్న ఎద్దులే తీసుకోవాలనే ‘దుర్బుద్ధి’తో అదే గ్రామానికి చెందిన శంకరాచారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు గ్రామస్థులు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీసీటీవీ ఫుటేజీ

ఫొటో సోర్స్, Sivaramireddy

ఫొటో క్యాప్షన్, సీసీ టీవీ ఫుటేజ్

అసలేం జరిగిందంటే..

డోన్ మండలం కమలాపురంలో నవంబరు 14న బుగ్గన శివరామిరెడ్డికి చెందిన కోడెదూడ చనిపోయింది.

అప్పటికే వరుసగా ఆవులు, ఎద్దులు, కోడెదూడలు చనిపోతునట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

పాము కరిచి కోడెదూడ చనిపోయి ఉంటుందని మొదట అనుకున్నామని బీబీసీతో చెప్పారు బుగ్గన శివరామిరెడ్డి. కానీ శంకరాచారి వచ్చి వెళ్లాకే కోడెదూడ చనిపోయిందని ఆరోపించారు.

‘‘మేం ఆ రోజు ఉదయం మొక్కజొన్న పనిలో ఉన్నాం. ఉదయం ఇంటి వద్ద కోడెదూడను కట్టేశాం. మధ్యాహ్నం తర్వాత వచ్చి చూసేసరికి చనిపోయి ఉంది. మొదట ఏ పామో కరిచిందని అనుకున్నాం. మాకు ముందుగా ఎవరిపైనా అనుమానం రాలేదు’’ అని చెప్పారు శివరామిరెడ్డి.

రెండు రోజుల తర్వాత సీసీ కెమెరా పరిశీలిస్తున్నప్పుడు శంకరాచారి వల్లే జరిగినట్లు అర్థమైందని ఆయన చెప్పారు.

గతంలో పంపుసెట్ మోటార్లు దొంగతనం కావడంతో ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించినట్లు శివరామిరెడ్డి చెప్పారు.

‘‘శంకరాచారి మా ఇంట్లోకి గోడదూకి వచ్చాడు. మేం ఇంటి వద్ద లేమని గమనించి వచ్చినట్లుగా ఉంది. గోడ దూకి వచ్చేప్పుడు చేతిలో ఏదో పట్టుకుని వచ్చాడు. వెళ్లేటప్పుడు లేదు. వచ్చేటప్పుడు ఏదో విషం పట్టుకుని వచ్చాడు. అది పెట్టడం వల్లే కోడె చనిపోయింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది’’ అని బీబీసీతో అన్నారాయన.

సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజీని బీబీసీ పరిశీలించింది.

నవంబరు 14 ఉదయం 11.33 గంటల సమయంలో శంకరాచారి గోడ దూకి వచ్చి కోడె దూడ వద్దకు వెళ్లినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.

ఆయన చేతిలో ఏదో ఉన్నట్లుగా సీసీ కెమెరాలో రికార్డు అయినప్పటికీ, అది ఏమిటనేది స్పష్టంగా తెలియట్లేదు. ఈ ఘటన తర్వాతే కోడె చనిపోయిందని శివరామిరెడ్డి ఆరోపిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజీ

ఫొటో సోర్స్, sivaramireddy

కారణం అదేనా?

శివరామిరెడ్డి సహా కమలాపురం గ్రామస్థుల ఫిర్యాదు మేరకు డోన్ పోలీసులు ఈ నెల 22న కేసు నమోదు చేశారు.

‘‘శంకరాచారికి ఎద్దులున్నాయి. రైతులు కూడా తమ వద్ద ఎద్దులు, పశువులు ఉండటంతో పొలం దున్నడం, ఆవుల సంతానోత్పత్తి, ఇతర అవసరాలకోసం శంకరాచారి వద్దకు వెళ్లడం లేదు. దానివల్ల అతనికి వచ్చే బాడుగ రావడం లేదనే కోపంతో ఊళ్లోని మిగిలిన పశువులను చంపుతూ వచ్చాడు. ఊళ్లో ఎద్దులు, ఆవులు చనిపోతే, చుట్టుపక్కల ఊళ్లలో ఉన్నవారు ఏ అవసరం ఉన్నా తన వద్దకే వస్తారని కుట్ర చేసి మా పశువులకు విషం ఇచ్చారు’’ అని పోలీసులకు ఫిర్యాదు చేశారు కమలాపురం గ్రామస్థులు.

ఈ ఫిర్యాదు మేరకు శంకరాచారిని డోన్ పోలీసులు అరెస్టు చేశారు.

ల్యాబ్ టెస్టులో కారణాలు తెలుస్తాయి

గత నాలుగైదేళ్ల కాలంలో కమలాపురం సహా చుట్టుపక్కల దాదాపు 80 ఎద్దులు, ఆవులు, దూడలు ఉన్నట్టుండి చనిపోయాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

విషాహారం తినడం కారణంగా అవి చనిపోయాయని వారు చెబుతున్నారు.

చనిపోయిన పశువుల సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డోన్ సీఐ రాకేశ్ బీబీసీకి చెప్పారు.

‘‘కేసు దర్యాప్తులో ఉంది. ప్రస్తుతం అనుమానాస్పదంగా చనిపోయినట్లుగా కేసు నమోదు చేశాం. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తేనే కోడెదూడ ఎందుకు చనిపోయిందో తెలుస్తుంది. ఎముకలు దొరికాయి. అందులో ఎముక మజ్జ (బోన్ మ్యారో)లో విష పదార్థాల అవశేషాలు ఉంటే గుర్తించవచ్చని పశు సంవర్థక శాఖ అధికారులు చెప్పారు. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించాం’’ అని సీఐ రాకేశ్ చెప్పారు.

‘‘గత నాలుగైదేళ్లలో 70-80 ఎద్దులు, ఆవులు, కోడెలు చనిపోయినట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు. అవి ఎందుకు చనిపోయాయో తెలియదు. దీనిపై విచారణ చేయాల్సి ఉంటుంది. పశువులు చనిపోవడానికి శంకరాచారినే కారణమా అనే విషయంపై విచారణ చేస్తున్నాం’’ అని బీబీసీతో చెప్పారు సీఐ రాకేశ్.

విష పదార్థాలు తీసుకువచ్చారని గ్రామస్థులు చెబుతున్న విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.

‘‘గోడ దూకి వచ్చినప్పుడు అతని చేతిలో ఏదో అనుమానాస్పద వస్తువు/మెటీరియల్ ఉందని సీసీ కెమెరాలో స్పష్టంగా ఉంది. అతన్ని ప్రశ్నిస్తే అది సెల్ ఫోన్ అని చెబుతున్నాడు. నీళ్లు తాగడానికి వెళ్లానని, ఇనుప కడ్డీల దొంగతనానికి వెళ్లానని... ఇలా రకరకాలుగా చెబుతున్నాడు. మరింత విచారణ జరుగుతోంది. అతను ఏ ఉద్దేశంతో గోడ దూకి వచ్చాడో విచారణలో తెలుస్తుంది’’ అని సీఐ చెప్పారు.

ఫోరెన్సిక్ రిపోర్టు రావడానికి సమయం పడుతుందన్నారు.

గ్రామస్థులు

ఫొటో సోర్స్, UGC

పోస్టుమార్టంలో ఏం తెలిసింది?

కోడె దూడ ఎముకలు,జీర్ణాశయం, వెంట్రుకలు, గిట్టలను సేకరించి విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని డోన్ మండల పశు సంవర్థక శాఖాధికారి నాగరాజు బీబీసీకి చెప్పారు.

‘‘మాకు సమాచారం రాగానే గ్రామానికి వెళ్లి పోస్టుమార్టం చేశాం. ప్రాథమికంగా మేం గుర్తించిన దాని ప్రకారం గుళికలు (ఆర్గానో ఫాస్ఫరస్) అనే విష పదార్థం కారణంగా కోడె చనిపోయినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలో దీనిపై స్పష్టత వస్తుంది’’ అని నాగరాజు బీబీసీకి చెప్పారు.

వరుసగా పశువులు చనిపోతుండటంతో ఏదైనా వ్యాధి ఉందేమోనని గతంలో కమలాపురంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసింది పశుసంవర్థక శాఖ.

‘‘మెడికల్ క్యాంపులో పశువులను పరీక్షించాం. ఎలాంటి అనారోగ్య సమస్యలూ ఈ ప్రాంతంలో మాకు కనిపించలేదు. అయినప్పటికీ పశువులు చనిపోతున్నాయని మాకు గ్రామస్థులు చెబుతూనే ఉన్నారు. 80 వరకు చనిపోయాయని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది’’ అని నాగరాజు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)