మంచిర్యాల యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌లో శునకాలు ఆకలితో చనిపోయాయా?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
గమనిక: కొన్ని విషయాలు మిమ్మల్ని కలచివేయవచ్చు
మంచిర్యాలలోని ప్రభుత్వ పశు సంరక్షణ కేంద్రంలో శునకాలు తిండి లేక ఆకలితో మరణించాయని ఈ మధ్య పత్రికల్లో వార్తలు వచ్చాయి.
సమయానికి ఆహారం అందకే వాటి ప్రాణాలు పోయాయని అక్కడ పనిచేసిన కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు.
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావ్ ‘ఎక్స్’ వేదికగా నవంబర్ 8న స్పందించారు.
'అధికారుల అలసత్వంతో మంచిర్యాల పశుసంరక్షణ కేంద్రంలో పది రోజులుగా ఆకలితో అలమటించి 8 శునకాల ప్రాణాలు పోయాయి. మరో 12 శునకాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ఘటనకు కారణమైన వారి పట్ల చర్యలు తీసుకోవాలి' అని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, ఆ శునకాలు ఆకలితో చనిపోయాయనే వార్తలు అవాస్తవం అని అధికారులు, ఈ కేంద్ర నిర్వాహకులు అంటున్నారు.


అసలేం జరిగింది?
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాళమ్మ కాలనీలో మున్సిపాలిటీ నిధులతో నిర్మించిన పశు సంరక్షణ కేంద్రం 2024 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. వీధి కుక్కల సంఖ్య నియంత్రణకు ఇక్కడ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ (ఏబీసీ) నిర్వహిస్తున్నారు. దీని నిర్వహణ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన ‘యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’ సంస్థకు అప్పగించారు.
ఈ కేంద్రంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిని వివిధ కారణాలతో ఈ సంస్థ ఇటీవల పని నుంచి తొలగించింది. ఆ తర్వాత ఇక్కడ తిండి లేక శునకాలు చనిపోయాయన్న వార్తలు వచ్చాయి.
మంచిర్యాల యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌లో ఏం జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు బీబీసీ (నవంబర్ 8న) అక్కడికి వెళ్లింది.
జనసంచారం అంతగా ఉండని ఒక గుట్ట ప్రాంతంలో ఈ కేంద్రం ఉంది. ఆ సమయంలో అక్కడ ఇద్దరు సిబ్బంది ఉన్నారు. కాసేపటికి నిర్వహణ సంస్థకు చెందిన వెటర్నరీ డాక్టర్‌తో పాటు సూపర్ వైజర్ అక్కడికి వచ్చారు. ఈ సెంటర్లో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు కొందరు కూడా అక్కడికి వచ్చారు.

అక్కడి కెన్నెల్స్‌లో (శునకాలను ఉంచే ప్రదేశం) దాదాపు 20 వరకు శునకాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి ముందు ఆహారం, నీరు ఉంది. సెంటర్ లోపల ఆ రోజు లేదా అంతకుముందు రోజో అంతా శుభ్రం చేసినట్టుగా అనిపించింది.
అయితే, శునకాలను ఉంచిన కొన్నికెన్నెల్స్‌లో మలమూత్రాలు, ఆహారం, నీరు అంతా ఒకే దగ్గర కలిసి అపరిశుభ్ర వాతావరణం ఉంది.

'ఉద్యోగం నుంచి తొలగించారు'
మంచిర్యాల ఏబీసీ కేంద్రంలో జరిగిన ఘటనపై అక్కడ పనిచేసిన కొంతమంది మాజీ ఉద్యోగులు బీబీసీతో (నవంబర్ 8న )మాట్లాడారు.
జీతాలివ్వకుండా వాచ్ మెన్, వంట మనిషి, ఇద్దరు వెటర్నరీ సహాయకులు, హెల్పర్ ఇలా మొత్తం ఐదుగురిని ఇటీవల తొలగించారని వారు చెప్పారు.
‘’పది రోజుల కిందట మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అప్పటి నుంచి శునకాలకు అన్నపానీయాలు లేవు. సెంటర్‌ను క్లీన్ చేయడం లేదు. ఈ మధ్య కాలంలో 15 శునకాలు చనిపోయాయి’’ అని మాడెం మధుకర్ అన్నారు.

‘’బియ్యం అయిపోయాయని ఫోన్ చేస్తే ఐదు రోజులకు గానీ డబ్బులు పంపలేదు. అప్పుడు సెంటర్లో సుమారు 70 శునకాలున్నాయి. వాటిని బంధించే వ్యక్తులే వాటికి వండి పెడతారని, వారే వాటికి మత్తు మందు ఇస్తూ, క్లీనింగ్ పనులు చేస్తారని నన్ను పని నుంచి తీసేశారు’’ అని వాచ్‌మెన్‌గా పనిచేసిన కొమురయ్య చెప్పారు.
'ఈ రెండు మూడు రోజుల్లో ఏడు శునకాలు చనిపోయాయి. అంతకుముందు 15 వరకు చనిపోయాయి. వాటిని మేమే తీసుకువెళ్లి పారేశాం' అని ఆయన అన్నారు.
అక్కడ వంట మనిషిగా పనిచేసిన కుంచపు లక్ష్మి బీబీసీతో మాట్లాడుతూ.. ‘శునకాలకు ఆహారం తయారీ, ఆపరేషన్ల తర్వాత వచ్చే జీవ వ్యర్థాలను తొలగించే పని చేసేదాన్ని. జీతం ఇవ్వడం లేదని రెండు నెలల కిందట పని మానేశాను. సమయానికి తిండి దొరక్క, శుభ్రత లేక, కెన్నెల్స్‌లో మోతాదుకు మించి శునకాలను ఉంచడంతో ఘర్షణ పడి చనిపోయాయి' అని అన్నారు.

అలాంటిదేం జరగలేదు: వైద్యులు
'ఈ సెంటర్లో సుమారు 700 ఆపరేషన్లు నిర్వహించాం. ఈ మధ్య చనిపోయిన శునకాల ఆపరేషన్ చేయడానికి ముందే క్యాప్ఛర్ మయోపతి, వృద్ధాప్యం, అనారోగ్యం ఇలా వివిధ కారణాలతో చనిపోయాయి' అని ఈ కేంద్రంలో పనిచేస్తున్న వెటర్నరీ డాక్టర్ కల్యాణ్ బీబీసీతో చెప్పారు.
బీబీసీ ఈ కేంద్రాన్ని సందర్శించిన మరునాడు (శనివారం, నవంబర్ 9) ఈ సెంటర్‌ను అధికారులు మూసివేశారు. అందులోని శునకాలను అక్కడి నుంచి తరలించారు.
తిండి లేక శునకాలు చనిపోయాయనే వార్తలను మంచిర్యాల ఏబీసీ కేంద్రం నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ‘యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ ఖండించారు. నాలుగు శునకాలే చనిపోయాయని ఆయన అన్నారు.
‘అన్నం పెట్టక శునకాలు చనిపోయాయన్నది అవాస్తవం. చనిపోయిన నాలుగు శునకాలవి సహజ మరణం. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన, అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగించాం. సెంటర్లో సిబ్బంది లేరన్నది అవాస్తవం’’ అని శ్రీనివాస్ అన్నారు.
''గత మూడు నెలలుగా మున్సిపాలిటీ నుంచి రావాల్సిన సుమారు రూ. 8 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులను అడిగితే సమగ్ర సర్వేలో ఉన్నాం, బడ్జెట్ లేదు వంటి కారణాలు చెబుతున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్స్ క్లియర్ కావాలి. అలా జరగడం లేదు. బిల్లులు వస్తేనే సప్లయర్స్, వర్కర్స్‌కు చెల్లింపులు సక్రమంగా జరుగుతాయి. ప్రస్తుతానికి కార్యకలాపాలు నిలిపివేశాం. ఇక్కడి శునకాలను మంచిర్యాల మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించాం. బిల్లులు వచ్చాక యథావిధిగా కేంద్రాన్ని కొనసాగిస్తాం'' అని అన్నారు డాక్టర్ శ్రీనివాస్.

ఈ మొత్తం ఎపిసోడ్‌పై మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతి ప్రసాద్ స్పందనను బీబీసీ కోరింది.
‘’జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీల నుంచి వచ్చే శునకాలకు ఈ కేంద్రంలో సర్జరీలు నిర్వహిస్తున్నాం. కేంద్రంలో ఆహారం అందుబాటులో ఉందని మా విచారణలో తేలింది'' అని ఆయన చెప్పారు.
‘’శారీరకంగా బలంగా లేని నాలుగు శునకాలు చనిపోయాయని వెటర్నరీ డాక్టర్ మాకు చెప్పారు. సహజ మరణంగా పరిగణించి వాటికి పోస్ట్ మార్టం నిర్వహించలేదు. అక్కడ సీసీ కెమెరాల నిఘా ఉంది. చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాన్ని మూసివేసి అందులోని శునకాలను తీసుకొచ్చిన ప్రాంతాల్లోనే వదిలేశాం’’ అని మారుతి ప్రసాద్ తెలిపారు.

‘పేరుకే జంతు సంరక్షణ బోర్డులు’
మంచిర్యాల యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌లో శునకాల మరణాలపై జంతు ప్రేమికులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
“నిజానికి జంతు సంరక్షణ బాధ్యత ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో లేదు. పశుసంవర్థక శాఖలో సిబ్బంది కొరత ఉంది. జిల్లా స్థాయి బోర్డులు పనిచేయడం లేదు. తెలంగాణలో నిబద్దత కలిగిన జంతు సంరక్షణ సంస్థల కొరత ఉంది. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో (కార్పొరేషన్లను కలుపుకుని) కేవలం మూడు సంస్థలే పనిచేస్తున్నాయి. వాటిపై పర్యవేక్షణ కరువైంది’’ అని మేడ్చల్ జిల్లా జంతు సంరక్షణ బోర్డ్ సభ్యులు, హైకోర్ట్ న్యాయవాది ఎన్. ప్రవళిక అన్నారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘బిల్లులు రావడం లేదని మంచి సంస్థలు ముందుకు రావడం లేదు. జంతు హింసపై ఫిర్యాదులు చేస్తే అధికారులు, పోలీసుల నుంచి సరైన స్పందన ఉండటం లేదు. ఈ విషయంలో హైకోర్టులో పోరాడితే ఐజీ (లా అండ్ ఆర్టర్)ని రాష్ట్ర జంతు హింస నివారణ నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశాలు వచ్చాయి. కోర్టుల ఒత్తిడితో ఏబీసీ సెంటర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారే తప్ప అందులో సరైన సదుపాయాలు ఉండటం లేదు. జంతు హింసపై సంస్థలే కాదు పౌరులు కూడా ధైర్యంగా ఫిర్యాదులు చేయొచ్చు’’ అని తెలిపారు.
యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే..
‘జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం-1960’ ప్రకారం మూగజీవాల పట్ల హింస నేరం, శిక్షార్హం.
వీధి కుక్కల సంక్షేమం, పరిరక్షణ , వాటి సంఖ్య నియంత్రణ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2023 రూపొందించింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. డీవార్మింగ్, యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), యాంటీ రేబిస్ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత స్థానిక సంస్థలది ( పంచాయతీ, మున్సిపాలిటీలది).
దీనికి అవసరమయ్యే స్టెరిలైజేషన్ (కు.ని ఆపరేషన్లు), టీకాలు, సంరక్షణ (షెల్టర్)కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
స్థానిక సంస్థలు తమ వెటర్నరీ సిబ్బంది ద్వారా లేదా ఇతర జంతు సంరక్షణ సంస్థల ఆధ్వర్యంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లను నిర్వహించవచ్చు.
యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు చెందిన 'ప్రాజెక్ట్ రికగ్నిషన్ కమిటీ' అనుమతి పొందిన సంస్థల ద్వారా మాత్రమే ఏబీసీ కార్యక్రమం అమలు చేయాలి.
ప్రతి మూడేళ్లకు అనుమతులను బోర్డ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రెన్యువల్ చేసుకోవాలి.
ఏబీసీ కార్యక్రమ నిర్వహణ అమలు తీరును కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో పర్యవేక్షిస్తూ మానిటరింగ్ కమిటీలు పనిచేస్తాయి.
శునకాలు, మనుషుల మధ్య ఘర్షణ పరిస్థితుల నివారణ, వాటి సంఖ్యను నియంత్రించడం, రేబిస్ నివారణ అంశాలపై ఈ కమిటీలు ఆయా స్థాయిల్లో పనిచేస్తాయి.

ఏబీసీ కేంద్రం నిర్వహణ, నిబంధనలు
ఏబీసీ సెంటర్‌లో కెన్నెల్, శిక్షణ పొందిన పశువైద్యులు, ఆపరేషన్ థియేటర్, ఎలాంటి హానీ కలగకుండా శునకాలను బంధించి, తరలించేందుకు ప్రత్యేక వాహనం, శిక్షణ పొందిన సిబ్బంది, ఇతర సౌకర్యాలు ఉండాలి.
కెన్నెల్‌లో గాలి, వెలుతురు ప్రసరణ ఉండాలి. వాటిని శుభ్రపరిచేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి. ఒంటరిగా లేదా 3 నుంచి 5 శునకాలను కలిపి ఉంచొచ్చు. అయితే ప్రతి శునకానికి 3*4*6 పొడవు, వెడల్పు, ఎత్తు కొలతలో స్థలం ఉండాలి.
జంతువులను ఈ సెంటర్లకు తెచ్చే ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2023 వివరిస్తున్నాయి.
కేంద్రానికి తెచ్చిన శునకాల మధ్య ఘర్షణ లేకుండా ఒక దఫాలో ఒకే ప్రాంతానికి సంబంధించిన శునకాలనే తేవాలి. ఆడ, మగలను వేర్వేరుగా ఉంచాలి. ఆరోగ్యంగా ఉన్న వాటికే ఆపరేషన్లు నిర్వహించాలి. గాయపడ్డ, అనారోగ్యంతో ఉన్న వాటిని వేరుచేసి చికిత్స అందించి కోలుకున్నాక స్టెరిలైజేషన్ చేయాలి. 6 నెలలలోపు వయస్సు కుక్క పిల్లలు, రెండు నెలల వయసున్న పిల్లల తల్లులను కేంద్రానికి తీసుకురావొద్దు.
సెంటర్ సామర్థ్యానికి మించి శునకాలను తరలించవద్దు. సర్జరీకి ముందు 12 గంటల పాటు ఆహారం, నీరు లేకుండా ఉంచాలి. సర్జరీ తర్వాత నాలుగు రోజుల వరకు రెండు పూటల ఆహారం, నీరు అందించి ఆ తర్వాత వాటిని తెచ్చిన ప్రాంతంలోనే తిరిగి వదిలేయాలి.
కేంద్రంలో వివిధ కారణాలతో చనిపోయిన శునకాల కళేబరాలు ఇన్సినెరేటర్ల ద్వారా డిస్పోజ్ చేయడం లేదా లోతుగా తవ్వి పూడ్చిపెట్టే పద్దతి అవలంబించాలి.
ఈ కేంద్రం కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు (సర్జరీలు, ఆహారం, వాక్సినేషన్, ఆపరేషన్ ముందు, తర్వాత చనిపోయిన శునకాల సంఖ్య ఇతర) నిర్వహించాలి. సీసీ కెమెరాల నిఘా ఉండాలి. కేంద్రంలో ఎల్లప్పుడూ శుభ్రత పాటించాలి.
స్థానిక సంస్థలు ఈ కేంద్రాల నిర్వహణలో ఇతర సంస్థల సహకారం తీసుకుంటే స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ కు సంబంధించిన డబ్బులు క్రమం తప్పకుండా వారికి రీయింబర్స్ చేయాలి.
యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2023లోని 18వ నిబంధన ప్రకారం నిర్వహణ లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదుల మీద విచారణ తర్వాత సంస్థల గుర్తింపు రద్దు, బ్లాక్ లిస్టులో చేర్చడం, కేసుల నమోదుకు కేంద్ర బోర్డ్ నేరుగా లేదా జిల్లా కలెక్టర్, జిల్లా జంతు హింస నివారణ సొసైటీలు ఆదేశించవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














