పార్వతీపురం మన్యం: ‘‘రాత్రివేళ నిద్రపట్టదు, ఏనుగులు వస్తాయేమోనని గంటకోసారి చూస్తుంటాం’’

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
“రాత్రివేళ నిద్ర పట్టదు. భయంతో మా వాహనాలు, బడ్డీలు, పంట పొలాలు ఎలా ఉన్నాయోనని గంటకోసారి చూసుకుంటాం. ఏనుగులు రాకూడదనే భయంతోనే నిద్రపోతాం. వాటి భయంతోనే నిద్రలేస్తాం”
“ఏనుగులు మా ఊళ్లో ఇద్దరు ముగ్గుర్ని చంపేయడంతో చీకటి పడితే పొలాల వైపు వెళ్లడానికే వణుకు వస్తోంది’’.
“పంటవేసినా, ఏనుగుల వల్ల మా చేతికి వస్తుందనే గ్యారంటీ లేక పంట వేయడమే మానేశాను’’
ఆరేళ్లుగా ఏనుగులతో తాము పడుతున్న బాధలను చెబుతూ పార్వతీపురం మన్యం జిల్లాలోని కళ్లికోట, కొమరాడ, దుర్గి, నర్సిపురం గ్రామస్థులు చెప్పిన మాటలివి.

“పార్వతీపురం మన్యం జిల్లాను ఏనుగులు విడిచిపోవు. ఒకవేళ ఏదైనా ఏనుగుల గుంపు వెళ్లిపోయినా, మరొకటి ఇక్కడికి వస్తుంది. ఏనుగులు సంచరించే గ్రామాల వాసులు వాటి కదలికలను గమనిస్తూ, వాటికి ఎటువంటి హాని కలిగించకుండా, వాటి బారిన పడకుండా బతకడం నేర్చుకోవాలి.” అని జిల్లా అటవీ అధికారి ప్రసూన చెప్పారు.
ఏనుగు బాధిత గ్రామాలుగా పేరొందిన పార్వతీపురం మన్యం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో బీబీసీ పర్యటించింది. ఏనుగుల భయంతో వణికిపోతున్న గ్రామస్థులతో మాట్లాడింది.
గ్రామస్థులు చెప్పిన విషయాలను బీబీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది... మరి అధికారులు ఏమన్నారు? బాధిత గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏనుగుల దాడిలో సాధారణ ప్రజలే కాకుండా అటవీ శాఖ ఉద్యోగులు కూడా మరణించడానికి కారణాలేంటి?
ఈ విషయాలపై బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్...

ఆరేళ్లుగా ఏనుగుల బాధ
పార్వతీపురం మన్యం జిల్లాలోని దుర్గి, కళ్లికోట, కొమరాడ, నర్సిపురం గ్రామాల ప్రజలు గత ఆరేళ్లుగా ఏనుగులతో బాధపడుతున్నారు.
దుర్గి గ్రామంలోకి వెళ్లినప్పుడు ఏనుగులు ధ్వంసం చేసిన కిరాణా బడ్డీలు, పంచాయితీ బోర్డులు, ఆటోలు కనిపించాయి.
కొన్ని ఇళ్ల గోడలను, పైకప్పులను కూడా ఏనుగులు ధ్వంసం చేశాయని గ్రామస్థులు చెబుతున్నారు.
దుర్గి గ్రామానికి చెందిన రైతు నాయుడిని ఈ విషయం గురించి పలకరిస్తే...
“పంట వేయడం మానేశాను. కూరగాయలు, జొన్న, పామాయిల్, టమాటా ఇలాంటి పంటలు వేయడం, వాటిని ఏనుగులు నాశనం చేయడం, డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరగడంతోనే సమయం గడిచిపోతుంది. ఆ డబ్బులు రావు. ఏనుగులు పంటలను నాశనం చేయడం మానవు. అందుకే ప్రాణమైనా సుఖంగా ఉంటుందని పంటలు వేయడం మానేసి...ఊళ్లో టైమ్ పాస్ చేస్తున్నా.” అని బీబీసీతో చెప్పారు.

దుర్గి గ్రామానికే చెందిన ఆటోడ్రైవర్ చిన్నారావు ఏనుగులు ధ్వంసం చేసిన తన ఆటోను చూపించారు.
అర్ధరాత్రి ఏనుగులు ఆటోని ధ్వంసం చేస్తుంటే... తన పిల్లలను కాపాడుకోవడానికి వారిని తీసుకుని పరుగులు పెట్టానని చెప్పారు.
“ఆటోకు పదివేలు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించాను. ఇంకా కొన్ని చేయించాలి. ఇది జరిగి నెలన్నర అయ్యింది. ఆరేళ్లుగా ఏనుగుల భయంతోనే ఉన్నాం.” అని చిన్నారావు చెప్పారు.

ఉదయం నుంచి రాత్రివరకు..
రాత్రివేళల్లో నిద్రపోయినా ఏనుగుల భయం కారణంగా గంటగంటకు నిద్రలేచి రోడ్డుపై పార్కింగ్ చేసిన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, బడ్డీలను ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందేనని కళ్లికోట గ్రామానికి చెందిన సుధీర్ చెప్పారు.
“ఉదయం లేవగానే నా ఆటోకి ఏం జరగక్కుండా చూడు దేవుడా అంటూ నమస్కారం పెట్టుకుని బయటకు వచ్చి ఆటోను చూసుకుంటాను. వీధుల్లో కుక్కలు అరిచినా ఏనుగులు వచ్చాయోమోననే ఆలోచన వస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు కూడా ఏనుగుల సమాచారం ఏదైనా ఉందో, లేదో ఏనుగుల ట్రాకర్లను అడిగి తెలుసుకుంటాం. అలాగే ఏనుగులు మా ఊళ్లోకి రాకుండా చూడమని దేవుడిని మొక్కుకుంటాం.” అని సుధీర్ బీబీసీకి చెప్పారు.
దుర్గి గ్రామానికి చెందిన దాలమ్మ మాట్లాడుతూ... ‘‘రెండు బడ్డీలను ఏనుగులు ధ్వంసం చేశాయి. మరో పక్క 30 సెంట్లలో వేసిన టమాటా పంటను నాశనం చేశాయి. అందుకే పంట వేయడం మానేశాను.” అని చెప్పారు.

ఏనుగులు ఎక్కడినుంచి వచ్చాయి?
ఉత్తరాంధ్ర ప్రాంతం ఏనుగులకు ఆవాసం కాదు. ఇక్కడి అడవుల్లో ఏనుగులకు అనుకూల స్థావరాలు లేవు. అయినా 17 ఏళ్లుగా ఇక్కడ ఏనుగుల సంచారం కనిపిస్తోంది.
ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తరుచూ కనిపిస్తున్న ఏనుగుల గుంపులు ఎక్కడ నుంచి వచ్చాయి?
“ఒడిశా నుంచి ఈ ఏనుగుల గుంపు వచ్చింది.” అని పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ అధికారి జీఏపీ ప్రసూన బీబీసీతో చెప్పారు. వాటి రాకకు గల కారణాలను వివరించారు.
“పార్వతీపురం జిల్లా ఏనుగుల ఆవాసం కాదు. ఇది ఒడిశా సరిహద్దుకు అనుకుని ఉంటుంది. ఆంధ్ర, ఒడిశా అటవీ ప్రాంతాలను కలుపుతూ ఒక ప్యాచ్ ఉండటం వల్ల ఏనుగులు ఇక్కడికి రాగలుగుతున్నాయి. దీనికి కారణం ఏనుగులు ఎక్కువగా ఉన్న ఒడిశాలోని లకేరి ప్రాంతంలో అటవీ నిర్మూలన, మైనింగ్ వల్లనే. దీంతో ఏనుగులు అక్కడ నుంచి మరో ఆవాసాన్ని వెతుక్కుంటూ 2007లో శ్రీకాకుళంలోకి ప్రవేశించాయి.” అని తెలిపారు.
“ఆ తర్వాత అవి అటూ ఇటూ సంచరిస్తూ శ్రీకాకుళంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో కనిపించాయి. వీటి కదలికలు 2017లో ఎక్కువయ్యాయి. 2019లో విజయనగరం జిల్లాలోకి ఈ ఏనుగులు వచ్చాయి. ఇప్పుడు జిల్లాల విభజన జరగడంతో ఏనుగులు తిరిగే ప్రాంతాలన్నీ పార్వతీపురంమన్యం జిల్లా పరిధిలోకి వచ్చినట్లయింది. జిల్లాలోని జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, భామిని మండలాల్లోని 15 గ్రామాల్లో ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది.” అని చెప్పారు.

ఏనుగులు ఇక్కడే ఉండిపోతాయా..?
పార్వతీపురం మన్యం జిల్లాలో నాగావళి, వంశధార నదుల నీరు పుష్కలంగా అందుబాటులో ఉండటం వలన ఏనుగులు ఇక్కడికి వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు తిరుగుతున్నాయి.ఈ రెండు గుంపులలో మొత్తం 11 ఏనుగులున్నాయి. ఒకదానిలో 7, మరో దానిలో 4 ఏనుగులు ఉన్నాయి. ఇవ్వన్నీ కూడా ఆడ ఏనుగులేనని డీఎఫ్ఓ ప్రసూన బీబీసీకి తెలిపారు.
“పార్వతీపురం జిల్లాలో ఏనుగు లేకుండా ఉండదు. ఈ ఏనుగులను తరలించినా, మళ్లీ రావు అని గ్యారంటీగా చెప్పలేం. మనుషులు, అడవి జంతువులు కలిసి జీవించే పరిస్థితులే సరిహద్దుల్లో ఉంటాయి. ఒడిశాకు మనకు ఫారెస్ట్ ప్యాచ్ ఉండటం వలన ఏనుగులు వస్తూనే ఉంటాయి. అందుకే ఈ జిల్లాలోనే ఏనుగుల ఆవాసం తయారు చేయాలి. వాటిని అక్కడే నియంత్రించాలి. దీని కోసం డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తున్నాం.” అని ప్రసూన వివరించారు.

‘పొలానికి వెళితే ఏనుగులు చంపేశాయి’
నా భర్త మూడేళ్ల క్రితం ఏనుగు దాడిలో మరణించారు. ఆయన రాత్రి సమయంలో పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లారు. ఎంత సమయం గడిచినా ఇంటికి రాలేదు. పొలంలోనే ఉండిపోయారనుకున్నాం. కానీ, ఏనుగులు చంపేసినట్టు ఉదయం తెలిసిందని కళ్లికోటకు చెందిన పాలమ్మ బీబీసీతో చెప్పారు.
“ ఏనుగుల దాడిలో మా ఆయన చనిపోవడంతో ఇప్పుడు మా ఊరిలో చీకట్లో పొలం పనులకు వెళ్లేందుకు చాలా మంది భయపడుతున్నారు.” అని పాలమ్మ చెప్పారు.
ఉత్తరాంధ్రలోకి ఏనుగులు ప్రవేశించిన 2007 నుంచి అధికారిక లెక్కలు తీసుకుంటే, ఇప్పటివరకు 13 మంది ఏనుగుల దాడిలో చనిపోయారు.
అందులో అటవీశాఖలో ట్రాకర్లుగా పని చేసేవారు ఇద్దరున్నారు. 19 పశువులు చనిపోగా, దాదాపు 5 వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన తెలిపారు.

‘పని చేయడానికి ఎవరూ రావడంలేదు’
అక్టోబర్ చివరి వారంలో నర్సిపురం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దుర్గి గ్రామంలో నెల రోజుల క్రితం కనిపించిన ఏనుగులే నర్సిపురంలో పంటలను నాశనం చేశాయి.
“ఏనుగులు వచ్చాయి. నాలుగు రోజులు నా తోటలోనే ఉండి మొత్తం ఆరు ఎకరాల కొబ్బరి తోటలను నాశనం చేశాయి. వాటర్ డ్రిప్ సిస్టమ్, వాటి పైపులు, సోలార్ ప్యానళ్లు ఇలా అన్నింటిని ధ్వంసం చేసేశాయి.” అని భానుమూర్తి చెప్పారు.
“మా వరి చేలు కోతకొచ్చాయి. మనుషులని పెడదామంటే ఏనుగులున్నాయనే భయానికి మనుషులు రావట్లేదు. మీ ఊర్లో ఏనుగులు తిరుగుతున్నాయి. మేం వస్తే చచ్చిపోతామని వాళ్లు రావట్లేదు.” అని నర్సిపురం గ్రామ వాసి రాము చెప్పారు.
పంటకు నష్టపరిహారం అటవీశాఖ ఇస్తుందని ఎదురు చూస్తున్నామని అన్నారు.
“పంట నష్టాన్ని మేమే చెల్లిస్తాం. కాకపోతే అది స్థానిక వీఆర్వో, వ్యవసాయశాఖాధికారి నిర్ధరిస్తే అప్పుడు అటవీశాఖ ఆ సొమ్ముని చెల్లిస్తుంది. ఎకరాకి రూ. 6 నుంచి రూ. 12 వేలు చెల్లిస్తాం.” అని డీఎఫ్ఓ ప్రసూన తెలిపారు.

‘ఏనుగుని అదిలించినా కేసు పెడుతున్నారు’
ఏనుగుని అదిలించినా, చిన్న కర్రతో బెదిరించినా కూడా అటవీశాఖ అధికారులు కేసులు పెడుతున్నారని దుర్గి గ్రామానికి చెందిన ప్రవీణ్ బీబీసీతో చెప్పారు.
“దీంతో మాపై ఏనుగులు దాడి చేసినా కూడా... ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నాం.” అని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో సంచరించే ఏనుగులను మరోవైపు తరలించేందుకు శిక్షణతో కూడిన స్థానిక గ్రామస్థులను కొందర్ని ట్రాకర్లుగా అటవీశాఖ నియమించుకుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఇలాంటి ఇద్దరు ట్రాకర్లు ఏనుగుల దాడిలో మరణించారు.
“ట్రాకర్లు ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటారు. మన మాట వింటున్నాయి కదా అని ఎప్పుడూ అవి మన మాట వింటాయని అనుకోకూడదు. అవి వన్యప్రాణులు. చిన్న పొరపాట్ల వల్లే ఇద్దరు ట్రాకర్లు చనిపోయారు.” అని ప్రసూన బీబీసీతో చెప్పారు.
“ఇక్కడి ఏనుగులను లొంగదీసుకోడానికి త్వరలో నాలుగు కుంకీ ఏనుగులు రానున్నాయి. అందులో రెండు చిత్తూరు, మరో రెండు పార్వతీపురానికి వస్తాయి” అని చెప్పారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఏనుగుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎఫ్ఓ ప్రసూన చెప్పారు. అవేంటంటే...
- ఏనుగులకి ఎప్పుడూ 200 నుంచి 300 మీటర్ల దూరం ఉండాలి.
- ఏనుగులు సంచరించే ప్రాంతాల వారు తెల్ల బట్టలు ధరించవద్దు. వాటికి రాత్రుళ్లు తెలుపు స్పష్టంగా కనిపిస్తుంది. ఏనుగులు నల్లగా ఉండటంతో మనకు కనిపించవు.
- రాత్రుళ్లు బయటకు వెళ్లాల్సి వస్తే ఏనుగుల ట్రాకర్లతో మాట్లాడి ఏనుగుల సంచారంపై సమాచారం తీసుకుని వెళ్లాలి.
- సెంటు వాడకూడదు. ఆ వాసనని కూడా ఏనుగులు పసిగట్టి దాడి చేస్తాయి. మద్యం తాగిన వారిని కూడా ఏనుగులు వాసన వలన గుర్తిస్తాయి.
- ఏనుగులు తిరిగే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది.
- ఏనుగులు తారసపడితే అగ్గి చూపించడం, జువ్వలు ఎగరవేయడం చేస్తే అవి అక్కడ నుంచి వెళ్లిపోతాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














