సంభల్ మసీదు: సర్వే సమయంలో హింస.. నలుగురు మృతి

ఫొటో సోర్స్, Zaki Rehman
- రచయిత, చెరిలాన్ మోలాన్
- హోదా, బీబీసీ న్యూస్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ పట్టణంలో ఉన్న జామా మసీదు సర్వే విషయంలో వివాదం హింసకు దారితీయడంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
మొఘల్‌ల కాలం నాటి శాహీ జామా మసీదు వద్ద కోర్టు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న సర్వేను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నవారికి, పోలీసుల మధ్య ఘర్షణ ఏర్పడింది.
ఆలయాన్ని ధ్వంసం చేసి దానిపై మసీదును నిర్మించారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలవగా.. కోర్టు సర్వేకు ఆదేశించింది.
ఈ సర్వే ను స్థానికులు కొందరు వ్యతిరేకిస్తున్నారు.
సర్వే బృందం సంభల్‌కు చేరుకోగానే ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ హింసకు సంబంధించి ఇప్పటికే అధికారులు నాలుగు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితిని అదుపు చేసేందుకు 24 గంటల వరకు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం తో పాటు పాఠశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
ఈ ఘర్షణలో మసీదు చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న చెప్పులు, రాళ్లు, ఇటుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
పోలీసుల కాల్పులలోనే నలుగురు వ్యక్తులు మరణించారని ఆందోళనకారులు ఆరోపించారు.
ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు.
'ప్రాణాలను తీయగలిగే ఆయుధాలేవీ మేం వాడలేదు' అని సంభల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్రిషన్ కుమార్ ‘ది హిందూ వార్తాపత్రిక’తో చెప్పారు.
హిందూ దేవాలయాలను కూల్చివేసి వాటి మీద మొఘల్ పాలకులు మసీదులు నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. సంభల్ జామా మసీదు విషయంలో వివాదం కూడా అదే.
వీటికి సంబంధించి ముస్లింలు వివిధ కోర్టుల్లో పోరాడుతున్నారు.

ఫొటో సోర్స్, ANI
సంభల్‌లో ఈ ఉద్రిక్తత వాతావరణం మంగళవారం నుంచే మొదలైంది.
1520లో మొఘల్ రాజు బాబర్ ఇక్కడి హరిహర ఆలయాన్ని కూల్చివేయించి దానిపై శాహీ జామా మసీదు నిర్మించారంటూ స్థానిక కోర్టులో మంగళవారం ఒక పిటిషన్ దాఖలైంది.
పిటిషన్ దాఖలైన తరువాత అక్కడ సర్వే చేపట్టాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ సర్వేను వీడియో చిత్రీకరించాలనీ ఆదేశించింది.
అధికారులు అదే రోజు అక్కడ ప్రాథమిక సర్వే ప్రారంభించారు.
దీంతో తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా సర్వే ఎలా నిర్వహిస్తారంటూ కొన్ని ముస్లిం సంఘాలు నిరసన తెలిపాయి.

ఫొటో సోర్స్, ANI
ఆ తరువాత ఆదివారం అక్కడ మరోసారి సర్వే కోసం అధికారులు వెళ్లారు. దాంతో నిరసనకారులు పెద్దసంఖ్యలో అక్కడ చేరి నినాదాలు చేశారు. కొద్దిసేపట్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారని.. దాంతో సర్వే బృందానికి రక్షణ కల్పించడం కోసం ఆందోళనకారులపై బలప్రయోగం తప్పలేదని మురాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేేయ కుమార్ సింగ్ 'ది హిందూ వార్తాపత్రిక'తో చెప్పారు.
నిరసనకారులను తరిమేందుకు టియర్ గ్యాస్, ప్లాస్టిక్ బులెట్లను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ఈ హింసను వ్యూహాత్మకంగా ప్రేరేపించిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ ఆరోపణలను అధికార పార్టీ కొట్టివేసింది.
'చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపడతాం’ అని ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాథక్ మీడియాతో అన్నారు.
దేశవ్యాప్తంగా మసీదుల చుట్టూ రగులుతున్న హింస చట్టవిరుద్ధమని ‘జామియాత్ ఉలామా ఈ హింద్’ అధ్యక్షుడు మహమూద్ మదానీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














