బాల్ ఠాక్రే వారసుడు ఏక్‌నాథ్ శిందేయేనా? ఉద్ధవ్ ఠాక్రే ‘బాలా సాహెబ్ సిద్ధాంతాలు వదిలేయడం’ వల్లే దెబ్బతిన్నారా

ఫొటో సోర్స్, VIKAS KHOT/Hindustan Times via Getty Images
- రచయిత, రజనీష్ కుమార్, జాస్మిన్ నిహలానీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేన పార్టీల చీలిక తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు ఎదురుదెబ్బ తగిలింది.
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య 75 స్థానాల్లో ప్రత్యక్ష పోటీ నెలకొంది.
ఈ 75లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేసింది. కేవలం 11 సీట్లు మాత్రమే ఆ పార్టీ గెలుచుకోగలిగింది. 64 సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న స్థానాల్లో విదర్భ నుంచి 35, కొంకణ్ ప్రాంతం నుంచి 12 ఉన్నాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీల మధ్య 53 స్థానాల్లో ప్రత్యక్ష పోటీ జరిగింది.
వాటిలో శిందే నేతృత్వంలోని శివసేన సుమారు 70 శాతం అంటే 37 సీట్లు గెలుచుకోగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 14 సీట్లు గెలుచుకోగలిగింది.
వీరిద్దరి మధ్య ప్రత్యక్ష పోటీ జరిగిన చాలా స్థానాలు కొంకణ్‌లో (27) ఉన్నాయి. మరాఠ్వాడాలో 11 సీట్లలో ఈ రెండు పార్టీలు ముఖాముఖి పోటీపడ్డాయి.
బుల్దానా, సిల్లోడ్‌లలో ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ జరిగింది.
ఇక్కడ శిందే శివసేన అభ్యర్థులు సంజయ్ గైక్వాడ్, అబ్దుల్ సత్తార్‌లకు వచ్చిన ఓట్లు.. ఉద్ధవ్ శివసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల మధ్య తేడా ఒక శాతం కంటే తక్కువ.


ఫొటో సోర్స్, ANI
బాల్ ఠాక్రే వారసుడు శిందేయేనా?
బాల్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనపై రాజ్ ఠాక్రే 2005లో తిరుగుబాటు చేసి విడిపోయారు. ఆ సమయంలో బాల్ ఠాక్రే వయస్సు సుమారు 80 సంవత్సరాలు.
రాజ్ ఠాక్రే విడిపోవడంతో బాలా ఠాక్రే తన కొడుకు ఉద్ధవ్‌తోనే ఎక్కువగా గడిపారు.
2006లో రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని స్థాపించారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 13 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత రాజ్ ఠాక్రే పార్టీ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లలేకపోయింది.
ఇక 2022లో శివసేన నుంచి ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేయడంతో పార్టీ రెండుగా చీలిపోయింది.
ఓవైపు ఏక్‌నాథ్ శిందే శివసేన పార్టీ బీజేపీ, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సీపీతో పొత్తు పెట్టుకోగా.. మరోవైపు ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పార్టీ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంది.
తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన పార్టీ అభ్యర్థులు 95 స్థానాల్లో పోటీ చేయగా 20 స్థానాల్లో మాత్రమే గెలుపొందారు.
ఏక్‌నాథ్ శిందే 81 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టారు.. వారు 57 సీట్లు గెలుచుకున్నారు.
బాల్ ఠాక్రే జీవించి ఉండగా శివసేనను వీడిన వారైనా, పార్టీపై తిరుగుబాటు చేసిన వారైనా ‘మాతోశ్రీ’ని సవాలు చేయలేకపోయారు. మాతో శ్రీ అంటే బాల్ ఠాక్రే, ఆ తరువాత ఉద్ధవ్ ఉంటున్న నివాసం.
రాజ్ ఠాక్రే కాకుండా నారాయణ్ రాణే, ఛగన్ భుజ్‌బల్ కూడా శివసేనను వీడారు. కానీ, ఏక్‌నాథ్ శిందేలా నిలదొక్కుకోలేకపోయారు.
బాల్ ఠాక్రే బతికుండగా బీజేపీ కూడా శివసేనకు మద్దతుగా ఉండేది.
ఠాక్రే మరణానంతరం బీజేపీ ప్రాబల్యం పెంచుకుంది.
ఏక్‌నాథ్ తిరుగుబాటుతో ఉద్ధవ్ శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు అయిన బాణం, విల్లు రెండింటినీ వదులుకోవాల్సి వచ్చింది.

బీజేపీదే కీలక పాత్ర
శిందే సాధించిన ఈ విజయం శివసేన, బాల్ ఠాక్రేల వారసత్వంతో పాటు వారి భావజాలంపై ఆయన వాదనను బలపరిచింది.
2022లో శివసేనపై తిరుగుబాటు చేసి, ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చారు శిందే. ఆ సమయంలో ఆయనతో పాటు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు, కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
అయితే, అసలు శివసేన ఎవరిదో, బాల్ ఠాక్రే వారసత్వానికి సరైన వారసుడు ఎవరో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని పలువురు అంటున్నారు.
అయితే, బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వం ఇప్పుడు కుటుంబం నుంచి బయటికి వచ్చేసిందా?
దీనిపై సీనియర్ జర్నలిస్ట్, '2024 ది ఎలక్షన్ దట్ సర్ ప్రైజ్డ్ ఇండియా' రచయిత రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ.. బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వం ఇకపై అటు ఉద్ధవ్ శివసేన లేదా ఇటు ఏక్‌నాథ్ శిందే శివసేనలోనూ ఉండకపోవచ్చని.. రాజ్ ఠాక్రే ఇప్పటికే ఈ రేసు నుంచి వెళ్లిపోయారని చెప్పారు.
బాల్ ఠాక్రే వారసత్వాన్ని బీజేపీ చేజిక్కించుకుందని భావిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీతో కలవడం వల్లే ఏక్‌నాథ్‌కు విజయం దక్కిందని, బయటకి వెళ్లి శివసేన ఉనికిని కాపాడుకోవడం శిందేకు కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఉద్ధవ్‌కి బీఎంసీ ఎన్నికల్లో ఒక అవకాశం ఉందని భావిస్తున్నా. తండ్రి వారసత్వంపై బలమైన వాదనను వినిపించేందుకు ఉద్ధవ్‌కు ఇదే చివరి అవకాశం కావచ్చు కానీ, ఇది కూడా చాలా కష్టం" అని రాజ్‌దీప్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఉద్ధవ్ అయోమయంగా కనిపించారా?
బాల్ ఠాక్రే వారసత్వాన్ని కైవసం చేసుకునేందుకు ఠాక్రే కుటుంబం బీజేపీకి ఎందుకు అవకాశం ఇచ్చింది?
"బాల్ ఠాక్రే కుటుంబీకులు ఆయన సిద్ధాంతాలను అనుసరించలేదు. రాజ్ ఠాక్రే కొన్నిసార్లు మోదీని పొగిడేవారు, మరికొన్నిసార్లు విమర్శించేవారు. రాజ్ ఠాక్రే సిద్ధాంతం చాలా అనిశ్చితంగా ఉంది. ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. హిందూత్వ, సెక్యులరిజం రాజకీయాల్లో ఉద్ధవ్ చాలా గందరగోళంగా కనిపించారు. కానీ బాల్ ఠాక్రే భావజాలంలో ఎలాంటి గందరగోళం ఉండేది కాదు’’ అని రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు.
"సావర్కర్ పిరికివాడని రాహుల్ గాంధీ అన్నారు. కానీ, ఉద్ధవ్ ఆయనతోనే పొత్తు పెట్టుకున్నారు. హిందూత్వ రాజకీయాల గురించి శివసైనికులు ఎన్నడూ తికమకపడలేదు. ఠాక్రే కుటుంబం తప్పిదాల కారణంగా బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వాన్ని నియంత్రించడంలో బీజేపీ విజయం సాధించిందని అనుకుంటున్నా" అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఎన్సీపీ సంగతేంటి?
రాష్ట్రంలోని 41 స్థానాల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) గెలిచింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 10 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది.
రెండు పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేసిన 41 స్థానాల్లో దాదాపు 70 శాతం.. అంటే 29 సీట్లు అజిత్ వర్గమే గెలుచుకుంది. శరద్ పవార్ వర్గం ఏడు సీట్లకే పరిమితమైంది.
పశ్చిమ మహారాష్ట్రలో రెండు పార్టీల మధ్య 16 స్థానాల్లో పోటీ జరిగింది. ఖాందేష్, మరాఠ్వాడాలో మరో ఏడు స్థానాల్లో జరిగాయి.
కోపర్‌గావ్ స్థానంలో అజిత్ ఎన్సీపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి దాదాపు 60 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు.
శరద్ పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతిలో యుగేంద్ర పవార్‌ను అజిత్ పవార్ సులభంగా ఓడించారు. లక్షకు పైగా ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














