ఆమిర్‌ ఖాన్ తన కుమార్తెతో కలిసి తీసుకుంటున్న ‘జాయింట్ థెరపీ’ అంటే ఏమిటి, కుటుంబ బంధాలను ఈ చికిత్స నిలుపుతుందా?

ఆమిర్ ఖాన్, ఫ్యామిలీ థెరపీ, జాయింట్ థెరపీ, మానసిక ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుమార్తె ఇరాతో కలిసి "జాయింట్ థెరపీ" తీసుకుంటున్నట్లు ఆమీర్ ఖాన్ చెప్పారు.
    • రచయిత, అనఘా పాఠక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘నేను మా నాన్నతో మాట్లాడను, నేను చెప్పేది ఆయనకు అర్థం కాలేదు.’’

‘‘గతంలో నా అన్న చెల్లెళ్లతో నా సంబంధాలు బాగానే ఉండేవి. అయితే ఇప్పుడవి అంత బావున్నట్టుగా అనిపించడంలేదు’’

ఎలాంటి బంధంలోనైనా సరే అభిప్రాయభేదాలు ఉండటం సహజం. కొన్నిసార్లు ఇవి తారస్థాయికి చేరి ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. దీంతో వారి మధ్య బంధానికి బీటలు వారతాయి. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా?

కుటుంబ చికిత్స లేదా ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి చేసే చికిత్స దీనికి పరిష్కారం కావచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో వివేక్ మూర్తికి ఆమీర్ ఖాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను, తన కూతురు ఇరా 'జాయింట్ థెరపీ' తీసుకుంటున్నట్లు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆమిర్ ఖాన్, ఫ్యామిలీ థెరపీ, జాయింట్ థెరపీ, మానసిక ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్యామిలీ థెరపీలో భాగంగా నిపుణులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

‘జాయింట్ థెరపీ’ అంటే ఏమిటి?

కుటుంబ సమస్యలకు సంబంధించి ఏదైనా థెరపీ తీసుకోవడం లేదా సైకియాట్రిస్ట్‌ను కలవడంపై మన సమాజంలో అంతగా సుముఖత లేదు. ఇటీవల కాలంలో దీనిపై కొద్దిగా చైతన్యం పెరుగుతోంది.

వివాహాలు విచ్ఛిన్నం అయ్యేటప్పడు, విడాకుల కోసం పట్టుబడుతున్నప్పుడు జంటలు కౌన్సెలింగ్ తీసుకోవాలని తరచుగా సలహా ఇస్తుంటారు. విడిపోవాలనుకున్నవారు కొంత కాలం కలిసి ఉండాలని కూడా చెబుతారు. దీని వల్ల వారి మధ్య సంబంధాలు గాడిన పడతాయని భావిస్తారు.

అయితే దైనందిన జీవితంలో భాగంగా బంధాలను మెరుగుపరుచుకోవడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, అంతరాలను తగ్గించడానికి మాత్రం ఎవరూ ఎవరికీ ఎలాంటి చికిత్సను సూచించరు.

టాక్ థెరపీలో ఫ్యామిలీ థెరపీ ఒక భాగం. ఇందులో కుటుంబం లేదా కుటుంబంలోని వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి నిపుణులు సాయం చేస్తారు.

ఈ చికిత్స లక్ష్యం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మెరుగుపరచడం, ఒకరి మీద ఒకరికున్న కోపాన్ని, ద్వేషాన్ని తగ్గించడం.

జీవితంలో జరుగుతున్న ప్రతి పరిణామానికి ఎవరైనా తన కుటుంబాన్ని లేదా కుటుంబంలో వ్యక్తులను నిందిస్తున్నప్పుడు ఈ చికిత్స ఉపయోగపడుతుంది.

కుటుంబంలో ఓ వ్యక్తి వల్ల ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు లేదా కుటుంబ సభ్యుల వల్ల ఆ వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పడు, అందరూ కలిసి కూర్చుని సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడుకోవడం వల్ల కూడా వారి మధ్య ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి వస్తే ఈ థెరపీని పొందడానికి కౌన్సెలర్‌ని సంప్రదించాలి.

ఆమిర్ ఖాన్, ఫ్యామిలీ థెరపీ, జాయింట్ థెరపీ, మానసిక ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుటుంబంలో అంతరాల పరిష్కారానికి ఫ్యామిలీ థెరపీ ఉత్తమమని నిపుణుల మాట.

నిపుణులు ఏం చెబుతున్నారు?

నికిత మూలే ముంబైలో క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

"భారతదేశంలో కుటుంబ ఆధారిత వ్యవస్థ ఉంది. కుటుంబ అంటే మీరు ఒకే సమయంలో అనేక మంది వ్యక్తులతో బంధాలను కొనసాగించడం" అని ఆమె చెప్పారు.

"కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఒకరు భావోద్వేగాలు, ఆర్థిక బంధాలు, ఇంకా ఇతర అనుబంధాలు ఉంటాయి. అందువల్ల మన దేశంలో ఫ్యామిలీ థెరపీ చాలా అవసరం” అని నికిత చెప్పారు.

మనం సాధారణంగా కుటుంబ సభ్యులతో ఈ రోజు వంట ఏంటి?, టీవీలో ఏం వస్తోంది? మన ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడుకుంటాం. అయితే కుటుంబంలో ఎవరైనా మానసికంగా కలత చెంది ఉన్నారా? ఏదైనా చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతున్నారా? అలాంటి వాటిని పంచుకోలేనప్పుడు ఏం చేయాలి?

మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయనేది నిజమే కానీ, మాట్లాడుకోలేని పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ?

ఫ్యామిలీ థెరపీలో భాగంగా కుటుంబంలోని అనేక మంది సభ్యులు బృందాలుగా వెళ్లి నిపుణులను సంప్రదించవచ్చని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ చెబుతోంది.

ఉదాహరణకు పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, రెండు మూడు తరాలకు చెందిన వాళ్లు కూడా ఒక చోట కూర్చుని వారి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు.

ఫ్యామిలీ థెరపీ ఈ క్రింది సందర్భాల్లో ఉపయోగపడుతుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వెబ్‌సైట్ తెలిపింది.

  • ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఒకరినొకరు నిందించుకోకుండా దాన్నుంచి ఎలా బయటపడాలి?
  • పెద్దవారైన తల్లిదండ్రులు, వారి సంతానం, మనవళ్లు, మనవరాళ్ల మధ్య బంధాన్ని పెంచేలా మాట్లాడుకోవడం.
  • తల్లిదండ్రులు విడిపోవాల్సి వస్తే దాని ప్రభావం పిల్లల మీద పడకుండా ఏం చేయాలి?
  • కుటుంబంలో ఎవరైనా మానసిక అనారోగ్యంతో పోరాడుతుంటే ఈ థెరపీ ద్వారా కుటుంబమంతా వారికి అండగా ఉండటాన్ని నేర్చుకోవచ్చు.

డాక్టర్ ఓంకార్ జోషి షిర్డీలో మానసిక వైద్యుడు. ఆయన వద్దకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. డాక్టర్ జోషి పేషెంట్లకు, వారి కుటుంబాలకు 'శుభర్తి', 'శుభంకర్' లాంటి రెండు పదాలు వాడుతున్నారు.

ఉదాహరణకు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తిని 'శ్రేయోభిలాషి' అని, ఆ వ్యక్తిని చూసుకునే వ్యక్తిని 'మస్కట్' అని ఆయన పిలుస్తున్నారు.

మానసిక వేదనతో బాధపడుతున్న రోగిని ఎవరూ న్యూనతా భావంతో చూడకూడదని డాక్టర్ జోషి ఇలా చేస్తుంటారు.

“ఇంట్లో మానసికంగా బాధ పడుతున్న వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతని ప్రవర్తన సరిగ్గా ఉండదు. ఆ సమయంలో వారు కౌన్సెలింగ్‌కు సిద్ధంగా ఉండరు. అలాంటప్పుడు అతనితో వ్యవహరించాల్సిన తీరు గురించి మేం కుటుంబంతో మాట్లాడతాం. నిజం చెప్పాలంటే అతని వ్యాధి కూడా ఫ్యామిలీ థెరపీలో భాగం” అని డాక్టర్ జోషి చెప్పారు.

ఆమిర్ ఖాన్, ఫ్యామిలీ థెరపీ, జాయింట్ థెరపీ, మానసిక ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్యామిలీ థెరపీకి అంగీకరించేవారి సంఖ్య చాలా తక్కువ

బాధితులు చికిత్సకు సిద్ధంగా ఉన్నారా?

తమ మధ్య సంబంధం దెబ్బ తిందని, దాన్ని చక్కదిద్దుకోవడానికి తమకు ఒక కౌన్సెలర్ అవసరమని ఎంత మంది అంగీకరిస్తారు?

“ఒక మహిళ విడాకులు తీసుకుని డిప్రెషన్‌లోకి జారి పోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని తల్లి చెప్పింది. ఈ విషయమై వారి మధ్య నిత్యం గొడవలు మొదలయ్యాయి. ఇది బాగా పెరగడంతో తన తల్లి చనిపోయినా ఫర్వాలేదని ఆ యువతి చెప్పింది" అని డాక్టర్ జోషి తన వద్దకు వచ్చిన ఓ కేసు గురించి వివరించారు.

"బాగా చదువుకున్న ఆ అమ్మాయి తనకు సాయం అవసరమని అంగీకరించడం లేదు. పైగా తన తల్లికి ఏదో సమస్య ఉందని, ఆమెకు చికిత్స అందించాలని వాదిస్తోంది. వాస్తవం ఏంటంటే ఆ యువతికి ఉన్న డిప్రెషన్‌కు చికిత్స అందించాలి. ఫ్యామిలీ థెరపీ ద్వారా వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు" అని జోషి చెప్పారు.

అసలు సమస్య ఏంటంటే తమకు థెరపీ అవసరమని ఎవరూ అంగీకరించరు. ఫ్యామిలీ థెరపీకి అంగీకరించేవారి సంఖ్య చాలా తక్కువ. అందుకే, నిపుణులు మొదట చికిత్స కోసం వచ్చిన వారితో ప్రారంభిస్తారు.

వారికి మొదట కొన్ని క్లినికల్ టెస్టులు చేస్తారు. వీటిని సైకోమెట్రిక్ పరీక్షలు అని కూడా పిలుస్తారు. పరీక్షల ద్వారా ఆ వ్యక్తి మానసిక స్థితిని తెలుసుకుంటారు.

దీంతో ఆ రోగికి ఎలాంటి చికిత్స అందించాలో తెలుస్తుంది.

“ఇదంతా వ్యక్తి స్వభావం, అనేక అంశాల్లో అతని ప్రతిచర్యలపై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి ఇంట్రావర్ట్ లేదా ఎక్స్‌ట్రావర్ట్ ఏదైనా కావచ్చు” అని జోషి చెప్పారు.

"పరీక్షల తర్వాత, రోగి లక్షణాలు, దోషాలు తెలుస్తాయి. ఆ తర్వాత థెరపీలో భాగంగా రోగి చుట్టూ ఉండే వ్యక్తులకు అతనికి ఎలా అండగా నిలవగలరో మేం వివరిస్తాం” అని తెలిపారు.

ఆమిర్ ఖాన్, ఫ్యామిలీ థెరపీ, జాయింట్ థెరపీ, మానసిక ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సమాజ మార్పులకు అనుగుణంగా కుటుంబ సభ్యుల్లో మార్పు రాకపోవడం కలతలకు దారి తీస్తోంది.

తరాల అంతరంతో సమస్యలు

సైకాలజీలో జనరేషన్ ట్రోమా అనే భావన ఉంది.

కోడలితో అత్తగారు ఎలా ప్రవర్తిస్తారో, కోడలు అత్తగా మారిన తర్వాత తనకోడలితో అలాగే ప్రవర్తిస్తారు. తండ్రి చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని కొడుకుని కొడితే, ఆ కొడుకు తండ్రిగా మారిన తర్వాత తన పిల్లల విషయంలో అలాగే ప్రవర్తించవచ్చు.

అంటే ఒక తరం గాయపడితే, సమాధానాలు కనుగొనే బదులు, ఆ గాయం తరువాతి తరానికి సంక్రమిస్తుంది.

“జనరేషన్ ట్రోమాగా పిలిచే ఇలాంటి పరిస్థితులకు ఏకైక సమాధానం కుటుంబ చికిత్స. గాయం ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించకుండా నిరోధించడానికి కుటుంబ చికిత్స ముఖ్యం, ఎందుకంటే మనం ప్రవర్తించే విధానం, దాని వెనుక ఉన్న ఆలోచనలు మన గత అనుభవాల ద్వారా ఏర్పడతాయి." అని పుణేకు చెందిన సైకాలజిస్టు శుకృతి ఫడణవీస్ చెప్పారు.

తండ్రి కోపంగా ఉంటే, తండ్రి అంటే అలాగే ఉండాలని పిల్లవాడు అనుకుంటాడు. అప్పుడు అతను తన పిల్లలతో కూడా అలాగే ప్రవర్తిస్తాడు.

"మన ఆలోచనా విధానం తప్పని మనం భావిస్తే, సరైనదేంటో ఎవరైనా మనకు చెబితే మంచిదని భావిస్తాం. ఈ చికిత్స ద్వారా, జనరేషన్ ట్రోమాను నయం చేయడం, తరువాతి తరంతో ఎలా మమేకం కావాలోమనం నేర్చుకుంటాం." అని ఆమె అన్నారు.

జాయింట్ థెరపీ

ఫొటో సోర్స్, Getty Images

థెరపీతో జీవితంలో ముందుకు..

కుటుంబ సంబంధాలు క్షీణించడానికి కారణమేంటి?

కొంతమంది తాము అనుకోనిది జరిగితే వారిలో కోపం కలిగితే అది కొన్నేళ్ల పాటు అలాగే ఉంటుంది. వాళ్లు దాన్ని మర్చిపోలేరు.

"అటువంటి సందర్భాల్లో మేం తప్పును అంగీకరించడం, ముందుకు సాగిపోవడం అనే థెరపీ ఉపయోగిస్తాం. అంటే, ఏం జరిగిందో అంగీకరించండి, భవిష్యత్తులో మరింత మెరుగ్గా చేయాలని నిర్ణయించుకోండి. ఇదే ఈ థెరపీలో కీలకం" అని డాక్టర్ శ్రుతి కీర్తి చెప్పారు.

"మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యను వదిలేయండి, భవిష్యత్ మరింత మెరుగ్గా ఉండటానికి ఏం చేయాలో మేం మీకు సాయం చేస్తాం" అని ఆమె చెప్పారు.

డాక్టర్ జోషి మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు.

“మనం భరించగలిగిన వాటికి పరిమితులను విధించుకోవడం, ఉదారణకు పిల్లల ముందు ఏదైనా జరిగితే భరించలేకపోవడం లాంటివి" అని ఆయన అన్నారు.

సైకాలజిస్ట్ శ్రుతికీర్తి కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నారు " మనకు మనం హద్దుల్ని ఏర్పాటు చేసుకోలేం. అలాగే ఇతరులకు ఏర్పాటు చెయ్యలేం" అని ఆమె చెప్పారు.

"ఇలా హద్దుల్ని ఏర్పాటు చేసుకుంటే వ్యక్తులంతా స్వార్థపరులుగా అనిపిస్తుంది. అయితే ఎవరి హద్దుల్లో వారు ఉండటం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి"

కానీ, ఫ్యామిలీ థెరపీపై సమాజంలో తగినంత అవగాహన లేదని నిపుణులంతా ఏకగ్రీవంగా చెబుతున్నారు.

“మనం ఇంటి విషయాల గురించి బయట ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలి అనే ఆలోచనను పక్కన పెట్టాలి. మీరు చికిత్స కోసం నిపుణుల వద్దకు వెళుతున్నారని గుర్తుంచుకోండి" అని నికిత మూలే చెప్పారు.

"నిపుణులు మీ వ్యవహార శైలిని మార్చరు. అయితే మీరు మార్గాన్ని కనుక్కోవడంలో సహాయం చేస్తారు" అని ఆమె తెలిపారు.

మీరు మీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు, స్నేహితులతో గొడవలు పడుతూ ఉంటే వాదనలు, గొడవలు తీవ్రమవుతాయి. అవి మీ జీవితంలో చాలా విలువైన వాటిని మీకు దూరం చేస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)