‘మీరు నా ఇద్దరు బిడ్డల్ని చంపేశారు. మూడో బిడ్డనూ చంపేస్తారా?’ - తుర్కియేలో ప్రకంపనలు సృష్టిస్తున్న శిశు మరణాలు..

తుర్కియే, శిశువుల హత్యలు, ఆసుపత్రులు, హెల్త్ స్కామ్, డాక్టర్లు, నర్సులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంక్యుబేటర్‌లో ఉన్న చిన్నారిని పరీక్షిస్తున్న వైద్యురాలు
    • రచయిత, ఎగే టట్లిసి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అప్పుడే పుట్టిన శిశువుల్ని ఆసుపత్రుల మధ్య తిప్పుతూ, వారి మరణానికి కారణమైనట్టుగా చెబుతున్న స్కామ్ ఒకటి తుర్కియేలో సంచలనం రేపుతోంది.

ఈ కుంభకోణం కారణంగా 10 మంది చిన్నారులు చనిపోయారని లాయర్లు తెలిపారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహం చెలరేగడంతో ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.

ఆరోగ్యరంగానికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటని అంటున్నారు. ఇందులో డాక్టర్లు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లపై ఆరోపణలు వచ్చాయి.

అప్పుడే పుట్టిన శిశువులను తప్పుడు డయాగ్నసిస్ రిపోర్టులతో 19 ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారని, వారిని అక్కడ అనవసరంగా ఎక్కువ సమయం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉంచేవారని ఆరోపణలు వచ్చాయి.

2016 నవంబర్‌లో టొల్గా వైమక్ భార్య నుకెత్ తుర్కియేలోని ఒక ఆసుపత్రిలో ముగ్గురు పిల్లలకు (ట్రిప్లెట్స్) జన్మనిచ్చారు.

ఈ ముగ్గురు పిల్లలు నెలలు నిండక ముందే జన్మించారు. ఆ సమయంలో వారిని ఉంచేందుకు ఆసుపత్రి ఐసీయూలో మూడు ఇంక్యుబేటర్లు అందుబాటులో లేవు.

దీంతో ముగ్గురు పిల్లల్ని వెంటనే ఆ కుటుంబం మరో ఆసుపత్రి కోసం వెతకాల్సి వచ్చింది.

“మూడో రోజు ముగ్గురిలో ఓ బేబీ చనిపోయింది” అని టోల్గా బీబీసీతో చెప్పారు.

శ్వాస తీసుకోవడంలో సమస్యలు, పుట్టిన తర్వాత 90 రోజుల్లోపు రక్తంలో వచ్చే ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల వల్ల తమ బిడ్డ చనిపోయినట్లు ఆయన చెప్పారు.

“మాకింకా ఇద్దరు బిడ్డలు మిగిలారు. వాళ్లిద్దరి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు మాకు చెబుతూ వచ్చారు. అయితే ఐదు రోజుల తర్వాత, ఓ డాక్టర్ ఫోన్ చేసి ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరి పరిస్థితి బాగా లేదని శ్వాస తీసుకోవడంలో బేబీ ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించామని, త్వరగా ఆసుపత్రికి రావాలని చెప్పారు. మేము ఐసీయూ లోపలికి వెళ్లలేకపోయాం. అయితే ఆ రోజు మా పాప చనిపోవడాన్ని అక్కడే ఉన్న ఓ కిటికీలోంచి మేం చూశాం” అంటూ ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు టోల్గా.

“మీరు ఇప్పటికే నా ఇద్దరు బిడ్డల్ని చంపేశారు. ముడో బిడ్డను కూడా చంపేస్తారా ఏంటి? అని నేను అక్కడున్న వైద్య సిబ్బందితో అన్నాను. వాళ్లు నన్ను ప్రశాంతంగా ఉండమని అన్నారు” అంటూ ఆయన వాపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తుర్కియే, శిశువుల హత్యలు, ఆసుపత్రులు, హెల్త్ స్కామ్, డాక్టర్లు, నర్సులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్కామ్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య సిబ్బందిని "ది న్యూ బార్న్ గ్యాంగ్" అని అభివర్ణించిన తుర్కియే మీడియా

డబ్బుల కోసం మోసాలు?

పిల్లల ఆరోగ్యం బాలేదని చెప్పడం, వారిని 19 ఆసుపత్రుల్లో ఏదో ఒక దానికి పంపించి అనవసరమైన చికిత్సల పేరుతో ప్రభుత్వ నిధుల్ని కొల్లగొట్టే ప్రయత్నంలోనే పిల్లల ప్రాణాలు పోయినట్లు 1,400 పేజీల నేరారోపణ పత్రంలో పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో పాల్గొన్న వైద్య సిబ్బందికి తుర్కియే మీడియా “ది న్యూ బార్న్ గ్యాంగ్” అని పేరు పెట్టింది. ఒక్కో శిశువును ఒక రోజు ఐసీయూలో ఉంచినందుకు వీరికి రోజుకు 8 వేల లిరాలు (దాదాపు రూ. 20 వేలు) అందేవనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ నెట్‌వర్క్ బారిన పడి కనీసం 10 మంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ సంఘటనలపై ఇస్తాంబుల్‌లో జరుగుతున్న దర్యాప్తుకు 47 మంది వైద్య సిబ్బంది హాజరయ్యారు. వీరిలో 22 మందిని ఆరెస్ట్ చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తాము ఎలాంటి తప్పు చెయ్యలేదని చెప్పారు.

ఈ వ్యవహారంలో కీలక నిందితుడు డాక్టర్ ఫిరత్ సారి మీద నేర పూరిత ఆలోచనతోనే ఒక ముఠాను ఏర్పాటు చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దీంతో పాటు ప్రభుత్వ విభాగాలను మోసం చెయ్యడం, అధికారిక పత్రాలను ఫోర్జరీ చెయ్యడం, నిర్లక్ష్యంగా వ్యవహరించి పిల్లల ప్రాణాలు తియ్యడం వంటి అభియోగాలను ఆయనపై మోపారు.

ఈ నేరాలన్నీ నిరూపణ అయితే ఆయన 583 ఏళ్లపాటు జైల్లో ఉండాల్సి వస్తుంది.

“అన్నీ పద్దతి ప్రకారమే జరిగాయి” అని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు.

తుర్కియే, శిశువుల హత్యలు, ఆసుపత్రులు, హెల్త్ స్కామ్, డాక్టర్లు, నర్సులు, ఐసీయూ, ఇంక్యుబేటర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ నిధుల్ని కొల్లగొట్టే ప్రయత్నంలోనే పిల్లల ప్రాణాలు పోయినట్లు 1,400 పేజీల నేరారోపణ పత్రంలో పేర్కొన్నారు.

లైసెన్స్‌ల రద్దు

ప్రభుత్వం నుంచి డబ్బులు దోచుకునేందుకు కొన్ని అవకతవకలకు పాల్పడటంతో పాటు రోగుల వైద్య నివేదికలను తారుమారు చేసినట్లు డోషుకన్ టస్కీ అనే నర్సు అంగీకరించారు.

“ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎంత నిండితే, మాకు అంత డబ్బు వస్తుంది” అని ఆమె విచారణలో తెలిపారు.

2023 మార్చిలో అజ్ఞాత వ్యక్తులు అందించిన సమాచారంతో పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.

అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఆసుపత్రుల్లో పది ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేశారు. అందులో ఒకటి మాజీ ఆరోగ్య శాఖ మంత్రికి చెందినది. ఆయన ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు. విచారణ పూర్తైన తర్వాత మాజీ మంత్రికి చెందిన ఆసుపత్రి లైసైన్స్ రద్దు చేశారు.

ఇప్పటి వరకు బిడ్డల్ని పోగొట్టుకున్న కుటుంబాలు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా డిమాండ్ చేసినట్లు ప్రభుత్వ మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది.

అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు ఆసుపత్రుల్ని జాతీయం చేయాలని, ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పిల్లల మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యప్ ఎర్దోవాన్ చెప్పారు. దీనికి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ కారణమని ఆరోపిస్తున్న వారిని హెచ్చరించారు.

“ఎక్కడో కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగాయని, మొత్తం వ్యవస్థను నిందించడాన్ని మేము అనుమతించబోం” అని ఆయన అన్నారు.

తుర్కియే, శిశువుల హత్యలు, ఆసుపత్రులు, హెల్త్ స్కామ్, డాక్టర్లు, నర్సులు, ఐసీయూ, ఇంక్యుబేటర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఆసుపత్రుల్లో ఒకటి మాజీ ఆరోగ్య శాఖ మంత్రికి చెందినది

ఈ కుంభకోణం బయటపడిన తర్వాత ఇందులో బాధితులుగా మారిన కుటుంబాలకు కొత్త రకం పీడకలలు మొదలయ్యాయి.

“నేను మొదటి సారి ఈ కుంభకోణం గురించి వార్తల్లో చదివిన తర్వాత, దీని గురించి నా భార్యతో మాట్లాడలేకపోయాను” అని టోల్గా చెప్పారు.

“నా పిల్లలు చనిపోయిన ఆసుపత్రి కూడా ఈ స్కామ్‌లో ఉన్నట్లు వార్తల్లో చూసినప్పుడు నా రక్తం మరిగిపోయింది” అని ఆయన బీబీసీతో అన్నారు.

“మాకు జరిగిన నష్టానికి న్యాయం జరుగుతుందా? అని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మా పిల్లల్ని హత్య చేశారా? అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అని టోల్గా అన్నారు.

టోల్గాకు మిగిలిన ఒక్క చిన్నారి వయసు ఇప్పుడు ఎనిమిదేళ్లు. ఆయన, ఆయన భార్య మళ్లీ పిల్లల కోసం ప్రయత్నించాలని ఎన్నడూ ఆలోచించలేదు.

“మేము చాలా బాధపడ్డాం. ఇద్దరు పిల్లలు చనిపోవడాన్ని నా భార్య ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. మాకు మళ్లీ అలాంటి నరకపు రోజులు వస్తాయేమోనని భయపడుతూ జీవిస్తున్నాం” అని టోల్గా చెప్పారు

అదనపు సమాచారం: ఎమ్రే తెమెల్, ఫుండనుర్ ఓజ్‌తుర్క్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)