సైనైడ్‌‌తో 14 మంది ఫ్రెండ్స్‌ను చంపేసింది - మరణ శిక్ష విధించిన కోర్టు

సరారత్ రంగసివూతపార్న్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, జోయెల్ గింటో, రిన్ జిరేనువాత్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

థాయిలాండ్‌లో 14 మంది స్నేహితులను సైనైడ్‌తో హత్య చేశారన్న కేసులలో ఒక మహిళకు మరణ శిక్ష పడింది.

గత ఏడాది సంపన్నురాలైన ఒక స్నేహితురాలితో కలిసి ట్రిప్‌కు వెళ్లిప్పుడు అక్కడ ఫుడ్, డ్రింక్స్‌లో విషం కలిపారన్న కేసులో సరారత్ రంగసివూతపార్న్ అనే 36 ఏళ్ల మహిళను బ్యాంకాక్ కోర్టు దోషిగా తేల్చింది.

మృతురాలిది సహజ మరణం కాదని ఆమె బంధువులు ఆరోపించారు, పోస్ట్‌మార్టంలోనూ మృతురాలి శరీరంలో సైనైడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఈ కేసులో సరారత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

2015లో ఇలాంటి కొన్ని మరణాల కేసులను కూడా పోలీసులు ఛేదించారు.

సరారత్ లక్ష్యంగా చేసుకున్నవారిలో ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సరారత్ గ్యాంబ్లింగ్‌కు బానిస అయ్యారని.. ఆమె తాను డబ్బులు బాకీ పడిన స్నేహితులను లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు చెప్పినట్లు థాయ్ మీడియా పేర్కొంది.

ఆ తర్వాత ఆమె వారిని చంపేసి, వారి ఆభరణాలను, విలువైన వస్తువులను దొంగలించేవారని తెలిపింది.

సరారత్ తన స్నేహితురాలు సిరిపార్న్ ఖాన్వాంగ్‌(32)తో కలిసి 2023 ఏప్రిల్‌లో వెస్ట్ బ్యాంకాక్‌లోని రచ్చబురి ప్రావిన్స్‌కు వెళ్లారు. అక్కడున్న నది వద్ద బుద్దిజం కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

సరారత్‌తో కలిసి భోజనం చేసిన తర్వాత సిరిపార్న్‌ కుప్పకూలిపోయి, చనిపోయారని కేసు దర్యాప్తు చేసిన అధికారులు చెప్పారు.

సిరిపార్న్‌కు సాయం చేసేందుకు సరారత్ కనీసం ప్రయత్నించలేదని తెలిపారు.

సిరిపార్న్ శరీరంలో సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాక, మృతదేహాన్ని గుర్తించినప్పుడు సిరిపార్న్ ఫోన్, డబ్బులు, బ్యాగు కనిపించలేదని పోలీసులు చెప్పారు.

వితూన్ రంగసివూతపార్న్‌

ఫొటో సోర్స్, BBC THAI

ఫొటో క్యాప్షన్, వితూన్

‘‘నీకు న్యాయం జరిగింది. ఈరోజు, ప్రపంచంలో న్యాయం ఉందని రుజువైంది’’ అని కోర్టు రూమ్ ఎదుట తన కూతురు ఫోటోను పట్టుకుని సిరిపార్న్ తల్లి థాంగ్‌పిన్ కైచానసిరి భావోద్వేగానికి గురయ్యారు.

న్యాయమూర్తి మరణ శిక్ష తీర్పు చదువుతున్నప్పుడు నవ్వుతూ కనిపించిన సరారత్‌ను చూసి తట్టుకోలేకపోయానని థాంగ్‌పిన్ కోపంతో అన్నారు. సరారత్ తనకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలను అంగీకరించలేదు.

న్యాయ విచారణ నుంచి ఆమె తప్పించేందుకు సాక్ష్యాలను దాచడంలో సాయపడిన మాజీ పోలీసు అధికారి అయిన ఆమె మాజీ భర్త, ఆమె వ్యక్తిగత న్యాయవాదికి కోర్టు జైలు శిక్ష విధించింది.

ఆమె మాజీ భర్త వితూన్ రంగసివూతపార్న్‌ను ఈ కేసులో గత ఏడాదే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ హత్యలు జరిగినప్పుడు రచ్చబురి ప్రావిన్స్‌లో సీనియర్ పోలీసు అధికారిగా ఆయన పనిచేస్తున్నారు.

అంతేకాక, సరారత్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ సుతిసక్ పూంక్వాన్‌కు పాయిజన్ ఇచ్చేందుకు కూడా ఆయన సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

పరిహారం కింద సిరిపార్న్ కుటుంబానికి 57,667 అమెరికన్ డాలర్లు అంటే సుమారు రూ. 48,69,248 చెల్లించాలని కూడా సరారత్‌ను కోర్టు ఆదేశించింది.

సైనైడ్.. శరీరంలోని ఆక్సిజన్ కణాలకు ఆహారం సరఫరా కాకుండా చూసి, గుండె పోటుకు గురి చేస్తుంది. ఇలా జరిగేటప్పుడు ముందు అలసటగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరంగా, వికారంగా అనిపిస్తూ వాంతులు అవుతాయి.

ఎక్కువ మొత్తంలో దీన్ని తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతిని, కోమాలోకి వెళ్లి సెకన్లలోనే చనిపోతారు. తక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్లినా అది హానికరమే.

థాయిలాండ్‌లో ఈ సైనైడ్‌ వాడకాన్ని కఠినంగా నియంత్రిస్తున్నారు. అనధికారికంగా ఎవరి వద్దనైనా ఇది ఉంటే, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)