అదానీపై అమెరికాలో కేసు.. భారీగా పడిపోయిన షేర్లు

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ
    • రచయిత, నటాలీ షెర్మన్
    • హోదా, బీబీసీ న్యూస్

భారత్‌‌‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ మోసాలకు పాల్పడ్డారంటూ అమెరికాలో కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో నిధుల సమీకరణ కోసం 25 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 2,100 కోట్లు) లంచంగా ఇవ్వజూపారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నుంచి పునరుత్పాదక ఇంధన రంగాల (రెన్యూవబుల్ ఎనర్జీ) వరకూ వ్యాపారాలను విస్తరింపజేసిన 62 ఏళ్ల అదానీపై న్యూయార్క్‌లో బుధవారం నేరారోపణలు నమోదయ్యాయి.

వచ్చే 20 ఏళ్లలో 200 కోట్ల డాలర్ల (సుమారు 16,880 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ ఆదాయం తెస్తాయని అంచనాలు ఉన్న కాంట్రాక్టులను దక్కించుకోవడానికి.. అదానీ, ఆయన కంపెనీల్లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారత అధికారులకు చెల్లింపులు చేయడానికి అంగీకరించారని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ

అవి నిరాధార ఆరోపణలు : అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, నిరాధారమైనదిగా పేర్కొంటూ గురువారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటనలో "అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మేం వాటిని తిరస్కరిస్తున్నాం" అని వెల్లడించింది.

అవి కేవలం నేరారోపణలు మాత్రమే, దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందని చెప్పింది.

న్యాయపరంగా ముందుకెళ్లే అంశాలను పరిశీలిస్తామని కంపెనీ తెలిపింది.

''పాలనా వ్యవహారాల్లో, పారదర్శకత విషయంలో అదానీ గ్రూపు ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుంది. కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే ప్రతిచోటా వీటిని పాటిస్తూ వస్తోంది. చట్టాలను గౌరవిస్తూ, వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'' అని తెలిపింది.

భారీగా పడిపోయిన అదానీ షేర్లు

గురువారం భారత స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. అదానీ ఎనర్జీ షేర్లు ఈ ఏడాది అతిపెద్ద పతనంతో ముగిశాయి.

అదానీ ఎనర్జీ సొల్యూషన్ షేర్లు 20 శాతం (174.3 పాయింట్లు) పడిపోయి 697.25 విలువ వద్ద ముగిశాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 22.61 శాతం (637.85 పాయింట్లు) పతనమై 2,181.55 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇది కాకుండా, అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ 18.90 శాతం క్షీణతతో, అదానీ పోర్ట్స్ స్టాక్ 13.57 శాతం క్షీణతతో ముగిసింది.

మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ వివరాలు కూడా రావాల్సి ఉంది.

మనీకంట్రోల్ వెబ్‌సైట్ ప్రకారం.. 2024 జులైలో 10 అదానీ గ్రూపు కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ రూ. 41,814 కోట్ల పెట్టుబడులు పెట్టగా, అక్టోబర్‌లో ఇది రూ.43,455 కోట్లకు పెరిగింది. నేటి వార్తల తర్వాత మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ విలువ తగ్గుదల ఎంత అనేది నవంబర్ 22న తెలియనుంది.

అసలు ఏం జరిగింది?

అదానీ సంస్థలు మోసాలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ ఓ హైప్రొఫైల్ కంపెనీ 2023లో విడుదల చేసిన రిపోర్టుతో అదానీ గ్రూపు కంపెనీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఆరోపణలను అదానీ ఖండించినప్పటికీ, మార్కెట్‌లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి.

ఈ లంచాల వ్యవహారంపై కూడా విచారణ జరుగుతోందంటూ కొన్ని నెలలుగా వార్తలొస్తున్నాయి.

2022లోనే అమెరికా ఈ కేసు విచారణ ప్రారంభించిందని, అయితే విచారణకు అడ్డంకులు సృష్టించారని న్యాయవాదులు తెలిపారు.

రుణాలు, బాండ్ల రూపంలో అదానీ సంస్థల ప్రతినిధులు 300 కోట్ల డాలర్లు (దాదాపు 25 వేల కోట్ల రూపాయలు) సేకరించారని... లంచాలు, తప్పుడు ప్రకటనల ద్వారా ఈ నిధులు సేకరించారని వారు ఆరోపించారు.

అమెరికా, ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులు సేకరించారన్నది ఆరోపణ.

‘ఆరోపణల్లో పేర్కొన్నట్లుగా.. బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం భారత అధికారులకు లంచం ఇచ్చేందుకు భారీ పథకానికి తెరలేపారు. అమెరికా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించే సమయంలో ఈ లంచాల గురించి అబద్ధాలు చెప్పారు'' అని యూఎస్ అటార్నీ బ్రియాన్ పీస్ అభియోగాల గురించిన ప్రకటనలో తెలిపారు.

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

''అంతర్జాతీయ మార్కెట్‌లో అవినీతి కార్యకలాపాల నిర్మూలనకు నా కార్యాలయం కట్టుబడి ఉంది. అంతేకాకుండా, మన మార్కెట్ల విశ్వసనీయతను పణంగాపెట్టి తమకు తాము సంపన్నులు అయిపోవాలనుకునే వారి నుంచి ఇక్కడి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాలి'' అని బ్రియాన్ పీస్ పేర్కొన్నారు.

ఈ లంచాల వ్యవహారాన్ని ముందుకు నడిపించేందుకు ప్రభుత్వ అధికారులను అదానీ వ్యక్తిగతంగా కలిశారని అధికారులు తెలిపారు.

అదానీకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. తన రాజకీయ సంబంధాల ద్వారా అనేక ప్రయోజనాలు పొందారని ప్రతిపక్ష పార్టీలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే, వాటిని ఆయన ఖండించారు.

అమెరికాలో యూఎస్ అటార్నీ పోస్టులను అధ్యక్షుడే నియమిస్తారు. అమెరికా న్యాయ శాఖను ప్రక్షాళన చేస్తానని డోనల్డ్ ట్రంప్ చెప్పిన కొద్దివారాల్లోనే ఈ కేసు తెరమీదకొచ్చింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌కు అదానీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో 1000 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)