‘ఎట్సీ’లో అడల్ట్ టాయ్స్, శృంగార వస్తువుల విక్రయంపై నిషేధం, వ్యాపారులు ఏమంటున్నారంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్ వాలెన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సెక్స్ టాయ్స్, ఇతర శృంగార వస్తువులను ఆన్‌లైన్ మార్కెట్ వెబ్‌సైట్ ఎట్సీ నిషేధించింది.
దీంతో అలాంటి వస్తువులను విక్రయించే సంస్థలు ఈ నిషేధంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
జులై 29 నుంచి ఎట్సీ తన ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లో నిషేధించనున్న వస్తువుల జాబితా, కొత్త నిబంధనలు విడుదల చేసింది.
అందులో.. చనుమొనలు, ఇతర గుప్త శరీర భాగాలు కొట్టొచ్చినట్లు కనిపించేలా ఉండే బొమ్మలను చేర్చింది.
చేతితో తయారు చేసిన పాతకాలపు, హస్తకళా సామగ్రిని తమ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించుకునేందుకు అవకాశం ఇచ్చే ఎట్సీ, మారిన పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా విక్రయాలపై కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.
అయితే ఈ విధానంలో మార్పు వల్ల తాము నిరుత్సాహానికి గురయ్యామని, దీని వల్ల తమ ఆదాయం తగ్గుతుందని సెక్స్ టాయ్స్ విక్రయించేవారు అంటున్నారు.
"ఎట్సీ ఈ రోజు ఇంత పేరు సంపాదించుకోవడానికి మేమే కారణం. ఈ ప్లాట్‌ఫామ్‌కు ఇన్నేళ్ల నుంచి విధేయులుగా ఉన్నందుకు బాధపడుతున్నాం. దీన్ని నమ్మకద్రోహంగా భావిస్తున్నాం" అని అన్నా (పూర్తిపేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు) అన్నారు.
ఆమె సెక్స్ బొమ్మలను తయారు చేసే సింప్లీ ఎలిగెంట్ గ్లాస్ వ్యవస్థాపకులు.
అయితే ఇది వినియోగదారుల భద్రత కోసమేనని ఎట్సీ అంటోంది. ఈ నిర్ణయం పరిశ్రమలో మారుతున్న ధోరణులను ప్రతిబింబిస్తుందని తెలిపింది.
"అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటూ సృజనాత్మక వ్యక్తీకరణను, మా మార్కెట్ ప్లేస్ స్ఫూర్తిని కొనసాగించాలనే లక్ష్యంతో ఈ విధానాలను ఎంతో జాగ్రత్తగా రూపొందించాం" అని ఎట్సీకి చెందిన ఆలిస్ పౌలస్ ప్రకటించారు.


ఫొటో సోర్స్, Getty Images
పేమెంట్ ప్రాసెసర్‌లు కూడా సెక్స్ ఆధారిత వ్యాపారాన్ని నిర్వహించే ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పని చేయడంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి.
అయితే ఎట్సీలో అడల్ట్ ప్రొడక్ట్స్ జాబితాలను మరింత స్పష్టంగా లేబుల్ చేయడం, వర్గీకరించడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చని అన్నా సూచించారు.
దానికి బదులుగా అన్నిటినీ గంపగుత్తగా నిషేధించడం సరి కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను 18 ఏళ్ల క్రితం గ్లాస్-బ్లోయింగ్ నేర్చుకున్నానని "కళాత్మక వ్యక్తీకరణ సాధనంగా" 2015 నుండి అడల్ట్ గ్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయడంపై దృష్టి సారించానని ఆమె అన్నారు.
సింప్లీ ఎలిగెంట్ గ్లాస్ ఆర్డర్‌లలో ఎక్కువ భాగం ఎట్సీ ద్వారానే వస్తుంటాయని అన్నా అన్నారు.
షాపిఫై లాంటి మరొక ప్లాట్‌ఫామ్‌కు వెళ్లడం తనకు కష్టంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఎట్సీకి బహిరంగ లేఖను పోస్ట్ చేశారు.
ఈ నిర్ణయం వల్ల ఎట్సీపై ఆధారపడిన అనేక వ్యాపారాల ఆదాయంలో గణనీయమైన తగ్గుదల ఉంటుందని చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రీమియం సిలికాన్ సెక్స్ టాయ్‌ల విక్రయ సంస్థ (తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు) అంటోంది.
"దీని వల్ల చాలామంది కొత్త ఉద్యోగాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం మా వెబ్‌సైట్‌కు మాత్రమే వచ్చే ట్రాఫిక్‌తో వ్యాపారం చేయలేం" అని ఆ సంస్థ బీబీసీకి తెలిపింది.
అంతేకాకుండా ఈ పరిణామం కొత్తగా ఉద్యోగాలు వెతక్కోవాల్సిన వారికి సమస్యగా మారనుంది.
‘‘ఎందుకంటే రెజ్యుమెలో 'సెక్స్ టాయ్ వ్యాపారం' అని పేర్కొనడం వల్ల చాలామందిని ఉద్యోగాలలోకి తీసుకోకపోవచ్చు" అని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఇలాంటి వయోజన ఉత్పత్తులను తయారు చేసే సంస్థలను సమర్థించే ఫ్రీ స్పీచ్ కోయలిషన్ సంస్థకు చెందిన మైక్ స్టెబిల్, ఇలా అన్నిటినీ నిషేధించడం సెన్సార్‌షిప్‌గా పేర్కొంటూ ఎట్సీ ధోరణిని తప్పుబట్టారు.
కానీ కొంతమంది విక్రేతలు మాత్రం ఎట్సీ చేసిన ఈ మార్పుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఎట్సీ ఫోరమ్‌లలో మద్దతు ప్రకటించారు.
అయినప్పటికీ కొత్త నియమాలను ఎలా అమలు చేస్తారు అన్నదానిపై వారూ సందేహం వ్యక్తం చేశారు.
సెక్స్ యాక్సెసరీస్
ఈ నూతన విధానం ఏయే ఉత్పత్తులను అనుమతించరో, "మెచ్యూర్’" ఉత్పత్తులను ఎలా వాడాలో వివరిస్తుంది.
విక్రయానికి అనుమతించే సెక్సువల్ యాక్ససరీస్, అడల్ట్ టాయ్స్ ఏమిటో ఈ విధానం ఉదహరిస్తుంది. రిస్ట్రెయింట్స్, హ్యాండ్‌కఫ్స్, సెక్స్ ఫర్నిచర్ వంటివాటి విక్రయానికి అనుమతి ఉంది.
వీటిపై నిషేధం:
- శరీరంలోకి చొప్పించడానికి ఉద్దేశించిన అడల్ట్ టాయ్స్.
- పాతకాలపు అడల్ట్ మ్యాగజీన్‌లు, చలనచిత్రాలతో కూడిన పోర్నోగ్రఫీ మెటీరియల్.
- జననేంద్రియాలు, చనుమొనలు కనిపించేలా ఉన్న బొమ్మలు
- సెక్స్ సేవల అడ్వర్టైజ్ చేయడానికి ఉపయోగించే నగ్న ఫొటోలు, వీడియోలు వంటి మెటీరియల్.
- లైంగిక చర్యను సూచించే నాన్ ఫొటోగ్రాఫిక్ ఆర్ట్.
ఎట్సీ విధానాలకు సంబంధించిన అప్‌డేట్‌లు వివాదాస్పదం కావడం ఇదే మొదటిసారి కాదు.
2015లో తాంత్రిక సంబంధిత అమ్మకాలపై నిబంధనలను మార్చినప్పుడూ వివాదాస్పదంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్‌లో లేబర్ పార్టీ ఘన విజయానికి కారణమైన 11 కీలక అంశాలు..
- నుస్రత్ ఫతే అలీ ఖాన్: ఇంతవరకు ఎవరూ వినని 4 ఖవ్వాలీల రిలీజ్ ఎప్పుడంటే
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- ‘మా ముత్తాత విశాఖపట్నానికి తొలి ఎంపీ. కానీ మాకు తినడానికి తిండి లేదు. పనసపళ్లు తిని బతుకుతున్నాం’
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














