అమ్మో! పొల్యూషన్.. దశాబ్దాలుగా దిల్లీని వణికిస్తున్న సమస్యకు పరిష్కారమే లేదా?

Delhi air Pollution, AQI, దిల్లీ వాయు కాలుష్యం, కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ సర్కారు, ఆతిషీ, సుప్రీంకోర్టు, హర్యానా, పంజాబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో గాలి కాలుష్యం పెరగడంతో రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

దిల్లీలో చలికాలం వచ్చేసింది. దీంతో పాటు నగరాన్ని దట్టమైన పొగమంచు దుప్పటి నలువైపుల నుంచి కమ్మేసింది.

మీరు కాసేపు ఆరుబయట నిల్చుంటే బూడిద రుచి చూసినట్లుగా ఉంటుంది. పొగమంచులో పరుగెత్తాలని ప్రయత్నించినా, వేగంగా నడిచినా సరే నిమిషాల్లోనే మీకు ఊపిరి అందనట్లుగా అనిపిస్తుంది.

వార్తా పత్రికలు తమ పతాక శీర్షికల్లో మళ్లీ ‘విషపూరితం’, ‘ప్రాణాంతకం’ వంటి పదాలు ఉపయోగిస్తున్నాయి.

చాలా స్కూళ్లు మూతపడ్డాయి. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు.

కానీ బయటకు వెళ్లి పని చేస్తే తప్ప పూట గడవని వారికి ఇళ్లలోనే ఉండటం సాధ్యం కాని పని.

2024 నవంబర్ 18,19 తేదీల్లో దిల్లీ గాలి నాణ్యత స్కోర్ 1,200 నుంచి 1500 మధ్య ఉందని వేర్వేరు పర్యవేక్షణ సంస్థలు చెప్పాయి. గాలి నాణ్యత స్కోర్ 100 కంటే తక్కువ ఉండాలి. లేదంటే కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు.

గాలిలో ఉండే చిన్నచిన్న ధూళి కణాలు ఊపిరితిత్తులోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాయి.

దిల్లీలో గాలి నాణ్యత పడిపోవడంపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

15 ఏళ్లుగా ఇవే పరిస్థితులను పదేపదే చూస్తున్నామంటూ తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Delhi air Pollution, AQI, దిల్లీ వాయు కాలుష్యం, కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ సర్కారు, ఆతిషీ, సుప్రీంకోర్టు, హర్యానా, పంజాబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విషపూరిత గాలుల మధ్య ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న దిల్లీ వాసులు

ఏమీ మారలేదు

2017లో నేను ఆఫీసుకు వెళుతున్నప్పుడు ఈ వీడియో రికార్డు చేశాను. అప్పట్లో పొగమంచు వల్ల 2 మీటర్లకు అవతల ఏముందో కనిపించలేదు.

2024 నవంబర్ 19న, మంగళవారం ఆఫీసుకు వెళుతున్నప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

అలాగే పిల్లల్ని ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే దాని గురించి ఈ కథనం.

ఈ సంక్షోభం ఎక్కువగా పేదవారిని బాధిస్తోంది. పొగమంచులో బయటకు వెళ్లి పనిచేస్తే తప్ప, కడుపు నిండని వారి గురించి ఈ కథనాల్లో రాశాం.

దీనిపై ఏటా రాజకీయ నాయకులు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. వారి గురించి కూడా బీబీసీ తన కథనాల్లో వివరించింది.

ఈ సమస్యకు కారణం ఏంటి, పరిష్కారాలు ఏంటనే దాని గురించి రాసిన కథనాలివి. పరిష్కారాల్లో కూడా కొన్ని కొంత మేరకే పని చేశాయని, మరి కొన్ని దారుణంగా విఫలం అయ్యాయని రాసిన కథనాలివి.

Delhi air Pollution, AQI, దిల్లీ వాయు కాలుష్యం, కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ సర్కారు, ఆతిషీ, సుప్రీంకోర్టు, హర్యానా, పంజాబ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, దిల్లీలో కాలుష్య నియంత్రణకు చేపట్టిన చర్యల్లో భాగంగా రోడ్ల మీద నీటిని స్ప్రే చేస్తున్నారు.

ఎందుకని ఏమీ మారడం లేదు?

దిల్లీలో గాలి కాలుష్యం మధ్య జీవిస్తూ, వాటి గురించి కథనాలు రాయడం అనేది ఒక అరాచక, వినాశకర సినిమాను ఏటా చూస్తున్నట్లుగా ఉంది.

అవే క్యారెక్టర్లు, అదే కథ, అదే స్క్రిప్టు. వాటి వల్ల వచ్చే ఉత్పత్తి కూడా అదే. ఏమీ మారడం లేదు.

పార్కులు మళ్లీ ఖాళీగా మారాయి. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, ముసలివాళ్లు ఇళ్లలోనే ఉండాలని చెబుతున్నారు.

రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు, డెలివరీ రైడర్లు దగ్గుతూనే బయటకు వెళుతున్నారు.

శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రులకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.

ఈ పరిస్థితుల మధ్య, మళ్లీ అదే ప్రశ్న తలెత్తుతోంది- ఎందుకని ఏమీ మారడం లేదు?

సులువైన సమాధానం ఏంటంటే దిల్లీ వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి స్థిర నిశ్చయం, సమన్వయం అవసరం.

వాయు కాలుష్యం ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి రైతులు తర్వాతి పంట వెయ్యడానికి, తమ పొలాల్ని సిద్ధం చేయడంలో భాగంగా అందులో ఉన్న గడ్డిని తగలబెట్టడం.

ఇది ప్రధానంగా దిల్లీ పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతోంది. ఏటా శీతాకాలంలో పంట పొలాల్లో గడ్డిని తగలబెట్టడం వల్ల వచ్చే పొగ దిల్లీని కమ్మేస్తోంది. శీతాకాలంలో గాలులు లేకపోవడం, గాలి వేగం తక్కువగా ఉండటంతో ఈ పొగంతా దిల్లీ వాతావరణంలో కలిసిపోతోంది.

అయితే దీనికి పూర్తిగా రైతుల్ని బాధ్యుల్ని చెయ్యడం కూడా సరికాదు. ఎందుకంటే పొలాల్ని శుభ్రం చెయ్యడానికి వారి ముందున్న సులభమైన, చౌకైన మార్గం గడ్డిని తగలబెట్టడమే.

గడ్డిని తగలబెట్టకుండా ఆపేందుకు రైతులకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని, యంత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాలు రకరకాల ప్రతిపాదనలు తెరపైకి తెచ్చాయి.

క్షేత్ర స్థాయిలో వీటి అమలు చాలా తక్కువగా ఉంది.

Delhi air Pollution, AQI, దిల్లీ వాయు కాలుష్యం, కేంద్ర ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ సర్కారు, సుప్రీంకోర్టు, హర్యానా, పంజాబ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దిల్లీలో వాయు కాలుష్యానికి వాహనాల పొగ కూడా కారణమే.

ఆగ్రహం సామాజిక మాధ్యమాలకే పరిమితం

దిల్లీలోనే భారీ స్థాయిలో కాలుష్యం ఉత్పత్తి అవుతోంది. వాహనాల కాలుష్యంతో పాటు నిర్మాణ రంగం, ఫ్యాక్టరీలు గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి.

ఏటా శీతాకాలంలో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. జర్నలిస్టులు కథనాలు రాస్తున్నారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. న్యాయస్థానాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తర్వాతి ఏడాది శీతాకాలం వచ్చిన తర్వాత మళ్లీ ఇదే తంతు.

ప్రజాస్వామ్య దేశాలలో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారి తీసే ఇలాంటి పరిస్థితులు ప్రజా ఉద్యమాలను ప్రేరేపిస్తున్నాయి.

అయితే, దిల్లీలో ప్రజాగ్రహం సామాజిక మాధ్యమాలకే పరిమితమైంది.

గాలి కాలుష్యం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు వెంటనే కనిపించవని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

పీఎం 2.5 కాలుష్యం వల్ల ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తుంది. వాయు కాలుష్యం వల్ల 2019లో 23 లక్షల మంది అకాల మరణం చెందారని లాన్సెట్ అధ్యయనంలో తేలింది.

వాయు కాలుష్యం బాధితుల్లో కూడా సామాజిక విభజన ఉంది. కాలుష్యం పెరిగిన తర్వాత తాత్కాలికంగా దిల్లీ వదిలేసి వెళ్లగలిగిన వాళ్లు వెళుతున్నారు. ఎయిర్ ఫ్యూరిఫయర్లు కొనుక్కోగల స్తోమత ఉన్నవాళ్లు కొనుక్కుంటున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేని మిగిలిన వాళ్లు తమ జీవితాల్ని అలాగే కొనసాగిస్తున్నారు.

ఎంతోమందిలో ఉన్న ఈ సామూహిక ఆందోళన ఇప్పటి వరకు భారీ నిరసనకు దారి తీయలేదు. రాజకీయ నాయకులు తమ బాధ్యతలను వదిలేసి ఈసారికి సమయం గడిచిపోతే చాలులే అన్నట్లుగా ఉంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

కేంద్ర స్థాయిలో ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రాలతో కలిసి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

రాజకీయ నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాలుష్యం తీవ్రం కాకముందే చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

ఈ ఏడాది కూడా దిల్లీ ప్రజలంతా దట్టమైన వాయు కాలుష్యం మధ్య చిక్కుకున్నారు. ప్రభుత్వాలు ఏటా చేస్తున్నట్లే నిర్మాణ పనుల్ని నిలిపివేయడం లాంటి తాత్కాలిక చర్యల్ని ప్రకటించాయి.

పాలకులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దిల్లీ గగనతలంలో నీలి మేఘాలు కనిపిస్తాయా? ఇటీవలి సంవత్సరాల్లో జరిగినదాన్ని చూస్తే, పెద్దగా ఆశించడానికి ఏమీ కనిపించడం లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)