గాలి కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారు? ఏక్యూఐ ఏ స్థాయికి పెరిగితే మనుషులకు ప్రమాదకరం?

విషపూరితమైన గాలి, పొగ కమ్మేసి, ఏమీ కనిపించని పరిస్థితులతో దేశ రాజధాని దిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, సురక్షిత స్థాయిగా భావించే గాలి నాణ్యత (ఏక్యూఐ) కన్నా దిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో 30 నుంచి 35 రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంది.
నాసా అంతరిక్షం నుంచి తీసిన శాటిలైట్ చిత్రాల్లో ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్‌ను కూడా దట్టమైన పొగ కమ్మేసినట్టు కనిపిస్తోంది. దట్టమైన పొగతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలు రద్దవుతున్నాయి.
స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)మానిటరింగ్ గ్రూప్ లెక్కల ప్రకారం, 2023లో ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన రాజధాని దిల్లీ. అత్యంత కాలుష్యపూరితమైన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉన్నాయి.
ఏటా భారత్‌లో అక్టోబరు నుంచి జనవరి వరకు శీతాకాలంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం, పొగ, దుమ్ము, చల్లని గాలులు, వాహనాల నుంచి వచ్చే వ్యర్థాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వచ్చే పొగ కలిసి ఈ పరిస్థితిని సృష్టిస్తాయి.
భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 99శాతం మంది నాణ్యత లేని గాలిని పీల్చుకుంటున్నారు. పేద, వెనకబడిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
గాలి కాలుష్యం ఎలా లెక్కిస్తారు?
మనుషులు చేసే పనుల వల్ల కొంతమేర గాలి కలుషితమవుతోంది. వాహనాలకు ఉపయోగించే ఇంధనం, వంట నుంచి వచ్చే ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఇక ధూళి తుపాను, కార్చిచ్చులు, అగ్నిపర్వతాలు పేలడం వంటివి గాలి కాలుష్యానికి ప్రకృతి పరమైన కారణాలు.
కాలుష్య స్థాయిని అంచనా వేయడానికి ఎయిర్ క్వాలిటీ మానిటర్లు సెన్సర్లను ఉపయోగిస్తాయని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ తెలిపింది. గాలి కాలుష్యం తీవ్రతను గుర్తించడానికి కొందరు లేజర్లను ఉపయోగిస్తే, మరికొందరు భూమి నుంచి విడుదలయ్యే శక్తిని అంచనావేయడానికి శాటిలైట్ చిత్రాలపై ఆధారపడతారు.
మనుషుల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాలలో పీఎం 2.5, పీఎం 10, ఓజోనో, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటివి ఉన్నాయి.
పీఎం 2.5లో 2.5 మైక్రోమీటర్లు అంతకన్నా తక్కువ మందమైన సూక్ష్మ రేణువులు ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ సూక్ష్మ రేణువులు మన రక్తనాళాల్లోకి ప్రవేశించి అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) స్కేల్ సున్నా స్థాయి నుంచి 500 వరకు ఉంటుంది.
ఏక్యూఐ సున్నా ఉంటే గాలిలో ఎలాంటి కాలుష్యం లేదని అర్థం. 500 ఉంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టు లెక్క.
గాలి నాణ్యతకు సంబంధించిన సంక్లిష్ట సమాచారాన్ని, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకోగలిగే సమాచారంగా మార్చే కమ్యూనికేషన్ సాధనం ఏక్యూఐ అని ఐక్యూఎయిర్ సంస్థ ప్రతినిధి అర్మన్ అరరాడియన్ బీబీసీతో చెప్పారు.

కచ్చితత్వం ఉందా?
ప్రభుత్వ కేంద్రాలు, ఇతర మార్గాలు, శాటిలైట్ మానిటర్ల నుంచి వచ్చే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సమాచారాన్ని సమ్మిళితం చేసి కాలుష్యాన్ని లెక్కిస్తారని యూఎన్‌ఈపీ తెలిపింది. వాస్తవ పరిస్థితులు, కాలుష్య కారకం ఆధారంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రీడింగ్స్ ఉంటాయి.
2001లో యూఎన్‌ఈపీ, ఐక్యూఎయిర్ కలిసి తొలి రియల్ టైమ్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్‌పోజర్ క్యాలిక్యులేటర్‌ను ప్రారంభించాయి. ఇది 117 దేశాలకు చెందిన 6,475 మానిటర్ల నుంచి వచ్చే రీడింగ్‌లను ఒకేసారి లెక్కించగలదు.
‘‘పీఎం 2.5స్థాయి పెరిగేకొద్దీ వృద్ధులు, పిల్లలు, శ్వాస, గుండెసంబంధమైన సమస్యలున్నవారిపై మొదట ప్రభావం పడుతుంది’’ అని అరరాడియన్ చెప్పారు.
‘‘పీఎం 2.5 రేణువుల స్థాయి ఇంకా పెరిగే కొద్దీ జనాభాలో ఎక్కువమంది ఆరోగ్యంపై నాణ్యతలేని గాలి ప్రభావం పడుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదముంది’’ అని ఆయన చెప్పారు.
ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాల నుంచి తీసుకున్న లెక్కల ఆధారంగా ఏక్యూఐ ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బిజీ రోడ్లు, పారిశ్రామిక జోన్‌ల వంటి ప్రాంతాల్లో గాలికాలుష్యం భిన్నంగా ఉంటుంది.
బిజీగా ఉన్న ప్రాంతాల్లో గాలి కాలుష్యం స్థాయిని లెక్కించడానికి నగరమంతా విస్తృత నెట్‌వర్క్ ఉన్న మానిటరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అరరాడియన్ సూచించారు.

ఏ స్థాయి కాలుష్యం మనుషులకు ప్రమాదకరం?
డబ్ల్యుహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏఐక్యూ) వందలోపు ఉంటే... ఆ గాలి మనిషికి సురక్షితమైనది. ఏఐక్యూ 400 నుంచి 500 ఉంటే గాలిలో కాలుష్యం చాలా ఎక్కువ ఉన్నట్టు.
ఈ వారంలో దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 500కు చేరింది. నోయిడా, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో కూడా ఏక్యూఐ లెవల్స్ 500కి దగ్గరలో ఉన్నాయి.
2021లో యూఎన్‌ఈపీ రిపోర్ట్ ప్రకారం, గాలి నాణ్యత పర్యవేక్షణ ప్రపంచంలోని 37శాతం దేశాల్లో చట్టపరమైన అంశంలా లేదు. అనేక పద్ధతుల్లో గాలి నాణ్యత లెక్కించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గాలి కాలుష్యాన్ని గుర్తించడం ప్రభుత్వాల బాధ్యతగా మారేలా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, సమాచారంలో కచ్చితత్వాన్ని పెంచడానికి మౌలిక సదుపాలయాలు కల్పించాలని యూఎన్‌ఈపీ తెలిపింది.

ఫొటో సోర్స్, Sakib Ali/Hindustan Times via Getty Images
గాలి కాలుష్యం వల్ల ఎలాంటి జబ్బులొస్తాయి?
సూక్ష్మకణాలు, ఇతర కాలుష్య కారకాలు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయని, రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయని, రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
పిల్లలు, వృద్ధులు, పోషకాహారలోపం, సౌకర్యాల లేమితో బాధపడే పేదల్లో శ్వాసకోససమస్యలు, గుండె సంబంధిత రోగాలు, గుండెపోటు, లంగ్ క్యాన్సర్ వంటివి వస్తాయని ఆయన తెలిపారు.
ఉదాహరణకు ఆస్తమాపై ఓజోన్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్ వంటివి ఊపిరితిత్తుల వాపు, ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వంటి వాటికి కారణమవుతాయి.
గర్భస్థ శిశువుల ఆరోగ్యంపైనా నాణ్యత లేని గాలి ప్రభావం ఉంటుందని, కొన్నిసార్లు చనిపోయిన పిల్లలు పుడతారని, అబార్షన్లు జరుగుతాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
గాలి కాలుష్యం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది తమ ఆయుర్దాయం కన్నా ముందే చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
అందులో దాదాపు 85 శాతం మంది గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా, సీఓపీడీ, డయాబెటిస్, వంటి కారణాలతో మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
పొగాకు తర్వాత ఎక్కువ మరణాలకు కారణమవుతోంది గాలి కాలుష్యమని, బహిరంగ ప్రదేశాల్లో గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నవారిలో 90శాతం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారని తెలిపింది.
ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో దిల్లీ, చుట్టపక్కల నగరాల్లో 81 శాతం కుటుంబాల్లో ఎవరో ఒకరు గడిచిన మూడువారాల నుంచి కాలుష్యం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు.
దిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. బొగ్గు, కట్టెలు కాల్చడాన్ని, అత్యవసర సేవలకు మినహా డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం విధించింది.
కానీ ఇవేమీ నగరం విషపూరిత కాలుష్యం బారిన పడకుండా రక్షించలేకపోయాయి.
ప్రజలు వీలైనంతగా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వాహన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రజారవాణా ఉపయోగించాలని కోరారు.

ఫొటో సోర్స్, Sanchit Khanna/Hindustan Times via Getty Images
వాయుకాలుష్యం ఎక్కువగా, తక్కువగా ఉన్న ప్రాంతాలేవి?
బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్, తజకిస్తాన్, బుర్కినా ఫాసో, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, ఈజిప్ట్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 2023లో కాలుష్యం ఎక్కువగా నమోదైన దేశాలు.
స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్న దేశాల జాబితాలో ఫ్రెంచ్ పొలినేషియా, ఆస్ట్రేలియా, ఈస్తోనియా, ఫిన్‌లాండ్, స్వీడన్ ఉన్నాయి.
సగటు వార్షిక పీఎం 2.5 స్థాయిల ఆధారంగా దేశాలకు ఈ ర్యాంకులు ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














