కొడంగల్ ఫార్మా విలేజ్:లగచర్ల,పోలేపల్లి భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా విలేజ్ భూసేకరణను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల పరిధిలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట గ్రామాల పరిధిలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకుగాను గతంలో సుమారు 1,314 ఎకరాలు సేకరించాలని రెవిన్యూ అధికారులు నిర్ణయించారు. దీనిపై స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఇప్పటివరకు భూసేకరణకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని దుద్యాల మండలం తహసీల్దారు కిషన్ నాయక్ బీబీసీకి చెప్పారు.
‘‘లగచర్లలో 632 ఎకరాలు, పోలేపల్లి పరిధిలోని 122 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. హకీంపేట పరిధిలో 560 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.
లగచర్ల, పోలేపల్లి గ్రామాలకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ఇచ్చింది’’ అని కిషన్ నాయక్ అన్నారు.

‘‘మా ఆయన్ను ఘోరంగా కొట్టారు’’
‘‘మా ఆయన్ను చాలా ఘోరంగా కొట్టారు సారూ.
తొమ్మిది రోజులు అవుతోంది.. పిల్లలు డాడీ.. డాడీ అని ఏడుస్తున్నారు.
రేపు వస్తాడు.. ఎల్లుండి వస్తాడు.. అని చెప్పుకుంటూ పోతున్నా.
మా బాధ ఘోరంగా ఉంది. ఇంట్లో తినడానికి బియ్యం లేవు. ఏదైనా కొందామంటే రూపాయి లేదు.’’
లగచర్ల దాడి కేసులో అరెస్టు అయిన రవి భార్య అనిత కన్నీళ్లతో చెప్పిన మాటలివి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులపై దాడి ఘటన సంచలనమైంది.
దాడి ఘటన జరిగిన లగచర్ల సహా రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా, హకీంపేట గ్రామాల్లో నవంబరు 19న బీబీసీ పర్యటించింది.
అధికారులపై దాడి ఘటన జరిగి పది రోజులు కావొస్తున్నా, గ్రామంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు.
లగచర్లకు వెళ్లినప్పుడు హనుమాన్ ఆలయం వద్ద కొందరు వ్యక్తులు కూర్చుని కనిపించారు.
‘‘దాడి చేయడం మా వాళ్లది తప్పే. కానీ అలా జరుగుతుందని ముందుగా అనుకోలేదు. అధికారులు కూడా పోలీసు సెక్యూరిటీతో వస్తే ఘటన జరిగేది కాదు’’ అని అక్కడున్న ఓ దివ్యాంగుడు మాతో చెప్పారు. తన పేరు వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు.
అంతకుముందు మరో మహిళ కూడా ఆ రోజు జరిగిన దాడి గురించి మాట్లాడారు. ఆమె కూడా తన పేరు వెల్లడించేందుకు ఇష్టపడలేదు.

పోలీసుల నిఘాలో లగచర్ల
లగచర్ల సహా చుట్టుపక్కల గ్రామాలపై పోలీసుల నిఘా కొనసాగుతోంది.
తుంకిమెట్ల, బాపల్లి, దుద్యాల నుంచి లగచర్లకు వచ్చే రహదారుల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. బారికేడ్లు కూడా పెట్టి ఉన్నాయి.
అక్కడే కొంతమంది కానిస్టేబుళ్లు పహారా కాస్తున్నారు.
ఎవరైనా ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు వస్తే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరుతో లగచర్లకు వస్తున్న కొన్ని ప్రజా సంఘాల నాయకులను తుంకిమెట్ల వద్ద అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయ పార్టీల నాయకులను, ప్రజా సంఘాలను అటు రానివ్వడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది.
లగచర్లలో మేం బాధితులతో మాట్లాడుతున్న సమయంలోనే పోలీసు వాహనం (మినీ బస్సు) గ్రామంలో తిరుగుతూ కనిపించింది.

‘‘మా భర్తలను తీవ్రంగా కొట్టారు’’
హైదరాబాద్‌కు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది లగచర్ల గ్రామం. తుంకిమెట్ల, హకీంపేట నుంచి వెళ్లే దారులను వెడల్పు చేసే పనులు నడుస్తున్నాయి.
లగచర్ల నుంచి రోటిబండ తండా వెళ్లే దారిలో పత్తి చేనులో పత్తి తీస్తూ కనిపించారు ముగ్గురు మహిళలు.
వారిలో ఒకరు అనిత. మరొకరు బుజ్జి.
దాడి ఘటనతో సంబంధం ఉందని ఆరోపిస్తూ వీరి భర్తలను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
‘‘ఆ రోజు (నవంబరు 11) రాత్రి వచ్చి మా ఆయన్ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లాక కూడా కొట్టారట. మాకు అర ఎకరం పొలం ఉంది. దాన్ని కూడా లాక్కుమంటాని అంటున్నారు. దానికి సంబంధించి మీటింగ్ ఉందంటేనే మా ఆయన వెళ్లాడు. కలెక్టర్‌ను కొడుతుంటే ఆపుదామని అనుకున్నాడు’’ అని బీబీసీతో చెప్పారు అనిత.
దాడి ఘటనలో ప్రమేయం ఉందంటూ తన భర్త మదరయ్యను అరెస్టు చేశారని చెప్పారు బుజ్జి. ఆ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత చేను వద్దకు వెళ్తున్న మదరయ్యను అరెస్టు చేశారని ఆమె చెప్పారు.

‘‘మా ఆయన దాడి చేయలేదు. వీడియోలో ఉన్నాడని అరెస్టు చేశారట. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఎవరూ అడిగేవాళ్లు లేరు. ఊళ్లో పెద్ద మనుషులు వచ్చి మాట్లాడటం లేదు. మా ఆయన్ను పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పుడు నేనేం తిని బతకాలి? వండుకోవడానికి గిద్దెడు బియ్యం కూడా లేవు. నేను ఎక్కడి నుంచి తెచ్చుకుని తినాలి? పిల్లలు బువ్వ బువ్వ అని ఏడుస్తున్నారు. రెండు రోజుల నుంచి వంట కూడా చేయలేదు’’ అని చెప్పారు బుజ్జి.
అరెస్టు అయినప్పటి నుంచి మదరయ్య ఆచూకీ తెలయడం లేదని బీబీసీతో చెప్పారు బుజ్జి.
‘‘ఆయన ఎక్కడున్నాడో ఎవరూ చెప్పడం లేదు. తీసుకెళ్లిన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. మాకెలాంటి సమాచారం లేదు. చంపారో.. కొట్టారో కూడా తెలియడం లేదు. మేం కూడా పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లి మందు పోసుకుని చస్తం’’ అని ఆవేదనతో చెప్పారు బుజ్జి.
‘‘మా ప్రాణం పోయినా భూములు ఇవ్వం. భూములు ఇచ్చి మేం ఎక్కడికి వెళ్లాలి?’’ అని ఆమె ప్రశ్నించారు.
ముగ్గురు వ్యక్తులకు ఉమ్మడిగా మూడు ఎకరాల భూమి ఉందని, మరో ఎకరం కౌలుకు తీసుకుని పత్తి వేసినట్లు బుజ్జి చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ఆ రోజు లగచర్లలో ఏం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా, పోలేపల్లి, హకీంపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు 1,314 ఎకరాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూసేకరణకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది.
నవంబరు 11న ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్లకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వాహనంపై దాడి జరిగింది.
అక్కడే ఉన్న కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డిని తీవ్రంగా కొట్టారు. ప్రభుత్వ అధికారుల వాహనాలను రాళ్లు, కర్రలతో ఆందోళనకారులు పగలగొట్టారు.
ఈ ఘటనతో సంబంధం ఉన్న 70 మందిని గుర్తించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి బీబీసీకి చెప్పారు.
‘‘దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి, ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశాం. వారిలో ఏ1గా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. వీరందరిన్నీ జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించాం. మిగిలిన వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి’’ అని చెప్పారు నారాయణ రెడ్డి.
ఇదే కేసులో ఏ2గా ఉన్న దుద్యాల మండలం బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొగమోని సురేశ్ రాజ్ నవంబరు 19న కొడంగల్ కోర్టులో లొంగిపోయారు.

రైతులు ఏమంటున్నారు?
ఫార్మా విలేజ్ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు చెబుతున్నారు.
బీబీసీ ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడి భూములు సాగులో ఉన్నాయి. వరి, కంది, వేరుశెనగ, మినుము, పత్తి వంటి పంటలు వేశారు.
కొన్నిచోట్ల పంటలకు స్ప్రింక్లర్ల సాయంతో నీటిని అందిస్తున్నారు.
ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు, ఇక్కడ భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.పది లక్షలు, ఇంటిస్థలం లేదా ఇల్లు, అర్హత ఉన్న వారికి ఫార్మా కంపెనీల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు.
‘‘మా దగ్గర భూముల ధర రోడ్డు పక్కన ఎకరం రూ.40-50 లక్షలు ఉంది. కాస్త లోపలికి వెళ్తే రూ.25లక్షలు ఉంది. రూ.10 లక్షలు ఇస్తామంటే ఎలా? భూమి మాకు తరతరాలుగా ఉన్న ఆస్తి. అలాంటి భూమిని లాక్కొంటే మేమెలా బతకాలి? మాకు ఆధారమేంటి? ప్రభుత్వం ఇచ్చే పది లక్షలు ఎన్ని రోజులు ఉంటాయి? అదే భూమి ఉంటే మా జీవితాంతం బతకొచ్చు కదా’’ అని బీబీసీతో చెప్పారు రోటిబండ తండాకు చెందిన సోనీబాయి.
భూములు ఇచ్చేది లేదంటూ పది నెలలుగా తమ పోరాటం కొనసాగుతోందని, చచ్చినా సరే భూములు ఇచ్చేది లేదని ఆమె చెప్పారు.
‘‘మాకు భూమి తల్లి ఉంటే చాలు’’ అని చెప్పారు పులిచెర్లకుంట తండాకు చెందిన భోజ్యనాయక్.
తనకున్న రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నారు భోజ్యనాయక్. వడ్లు బస్తాల్లో నింపుకొంటున్న ఆయన్ను బీబీసీ పలకరించింది.
‘‘వాళ్లు ఇస్తామన్న డబ్బులు వద్దు.. ఆ ఉద్యోగాలు మాకొద్దు. మా భూములు మాకు ఉంటే చాలు’’ అని చెప్పారు భోజ్యనాయక్.
మీ భూమి పోతుందని మీకు అధికారులు చెప్పారా? అని అడిగితే “ఇప్పటివరకు మాకు ఎలాంటి నోటీసు అందలేదు” అని చెప్పారు.
‘‘లీడర్లు మా భూములు పోతాయని చెప్పారు. టీవీల్లో చూసినం. ఫోన్లలో చూసినం. మా భూములు పోతాయని ధర్నాలు చేశాం’’ అని బీబీసీతో చెప్పారు భోజ్యనాయక్.

‘‘అర్ధరాత్రి వచ్చి కరెంటు తీసి పట్టుకెళ్లారు..’’
ఆడవాళ్లతో పోలీసులు అర్ధరాత్రి ఇష్టానుసారంగా ప్రవర్తించారని ఆరోపించారు రోటిబండ తండాకు చెందిన లక్ష్మీబాయి.
‘‘మా మరిదిని అర్ధరాత్రి వచ్చి పోలీసులు తీసుకెళ్లారు. కాళ్ల మీద పడి బతిమిలాడినా వదల్లేదు. అర్ధరాత్రి తండాలో కరెంటు తీసేసి ఇళ్లల్లోకి చొరబడ్డారు. మేం అడిగితే ఆడవాళ్లని కూడా చూడకుండా పట్టుకోరాని చోట్ల పట్టుకున్నారు’’ అని బీబీసీ వద్ద చెప్పారు లక్ష్మీబాయి.
‘‘రేవంత్ రెడ్డి సర్‌కు చేతులెత్తి మొక్కుతున్నాం. మా భూములు తీసుకుని మా పొట్టమీద కొట్టకండి’’ అని అన్నారామె.

ఆ ఆరోపణలు నిరాధారమైనవి: వికారాబాద్ ఎస్పీ
పోలీసులపై వస్తున్న ఆరోపణలను ఖండించారు వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి.
‘‘అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. దాడిలో పాల్గొన్న వ్యక్తులు గ్రామంలో ఉన్నారని సమాచారం రావడంతో తెల్లవారుజామున పోలీసులు వెళ్లారు. మొత్తం 57 మందిని అదుపులోకి తీసుకున్నాం. విచారణ తర్వాత దాడితో ప్రమేయం లేని 45 మందిని వెనక్కి పంపించేశాం. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని పక్కా ఆధారాలతో అరెస్టు చేశాం. ఆడవాళ్లను ఇబ్బంది పెట్టడం ఎలాంటి పరిస్థితుల్లోనూ జరగలేదు’’ అని బీబీసీకి చెప్పారు నారాయణ రెడ్డి.
పోలీసుల వైఫల్యం వల్ల దాడి జరిగిందనే ప్రచారం సరికాదని చెప్పారు నారాయణరెడ్డి.
‘‘ఘటన కేవలం 90 సెకన్ల వ్యవధిలో జరిగింది. అభిప్రాయ సేకరణ కోసం 250 మంది పోలీసుల భద్రత కల్పించాం. దాడి కేసులో ఏ2గా ఉన్న సురేశ్ రాజ్ అనే వ్యక్తి ఆహ్వానం మేరకు కలెక్టర్ మంచి ఉద్దేశంతో అక్కడికి వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు’’ అని చెప్పారు ఎస్పీ.

ఫొటో సోర్స్, UGC
రాజకీయంగా దుమారం
దాడి వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్.
లగచర్ల బాధితులను తీసుకుని ఆయన దిల్లీకి వెళ్లారు. జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు బాధితులు.
‘’50-60 ఏళ్లుగా రైతులు భూమిపై ఆధారపడి బతుకుతున్నారు. ప్రాణం పోయినా భూములు ఇచ్చేది లేదని వాళ్లు చెబుతున్నారు. కొడంగల్‌లో ఓటు వేసి ముఖ్యమంత్రిని చేసినందుకు మమ్మల్ని అర్ధరాత్రి కరెంట్ తీసేసి అరెస్ట్ చేస్తారా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తాగి వచ్చి తమను ఇష్టానుసారంగా తిట్టారని చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన అఘాయిత్యాలను మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్‌ను కలిసి, వివరించి, న్యాయం చేయాలని బాధితులు విజ్జప్తి చేశారు. భూములు ఇవ్వకుంటే బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. రైతులను కొట్టిన, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. గిరిజన మహిళలపై పోలీసుల అఘాయిత్యాలు, రైతులపై దమనకాండ, భూములను లాక్కోవడంపై రాహుల్ గాంధీ మాట్లాడాలి’’ అని దిల్లీలో మీడియాతో చెప్పారు కేటీఆర్.
లగచర్ల గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
‘‘గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఫార్మా సిటీని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. కొడంగల్‌లో ప్రజలు ఫార్మా విలేజ్ వద్దని చెబుతున్నా ఎందుకు ఏర్పాటు చేస్తోంది? తమ గ్రామాల్లో చిచ్చుపెట్టొద్దని చెబుతూ, భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. ప్రజలు వ్యతిరేకించినా జిల్లా కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారు. భూములు ఇచ్చేది లేదని 8 నెలలుగా వ్యతిరేకిస్తున్నందుకు రైతులపై పోలీసులు కేసులు పెడుతున్నారు’’ అని ఈటల రాజేందర్ ఆరోపించారు.
లగచర్లలో రైతులను ఉసిగొల్పి దాడులు చేయించింది బీఆర్ఎస్ పార్టీయేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు.
‘‘పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత, గిరిజన ప్రజల కోసం ఏం చేశారో వారు చెప్పాలి. లగచర్లలో జరిగిన దాడులకు బీఆర్ఎస్ కారణమని తేలడంతో కొత్త డ్రామాలు ఆడుతున్నారు. కలెక్టర్, అధికారులపై దాడులను బీజేపీ, బీఆర్ఎస్ సమర్థిస్తోందా? కొడంగల్‌లో అమలవుతున్న పథకాలతో ఎక్కువగా దళిత, గిరిజన బిడ్డలే లబ్ధి పొందుతున్నారు’’ అని రవి అన్నారు.

‘అనుమానాలు తొలగించే బాధ్యత ప్రభుత్వానిదే’
ఫార్మా విలేజ్ విషయంలో ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ (సిఫా) సలహాదారు కె.ప్రభాకర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
‘‘ఫార్మా కంపెనీలు ఎలాంటివి వస్తాయి? వాటి వల్ల కాలుష్యం ఉంటుందా? కాలుష్యం రాకుండా తీసుకుంటున్న చర్యలేంటి? ఇవన్నీ వివరించాలి. అవసరమైతే ఇప్పటికే ఫార్మా కంపెనీలు ఉన్న చోటుకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలి. అలాగే పరిహారం విషయంపై స్పష్టత ఇవ్వాలి. రైతులు భూమి కోల్పోవడం అంటే భూమితో ఉన్న అనుబంధం కోల్పోతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వపరంగా ఎలాంటి పరిహారం ఇస్తామంటున్నారో స్పష్టంగా వివరించాలి’’ అని ప్రభాకర రెడ్డి అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














