ఝాన్సీ: ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు ఎందుకు పెరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన శిశువుల్లో ముగ్గురిని ఇంకా గుర్తించలేదు.
మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మరో 16 మంది నవజాత శిశువులు గాయపడ్డారు.
దేశంలో నవజాత శిశువుల వారోత్సవాలు (నవంబర్ 15-21) జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.
‘‘షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎన్‌ఐసీయూలో శుక్రవారం రాత్రి 10:35-10:45 గంటల మధ్య మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎన్‌ఐసీయూలో 49 మంది చిన్నారులు ఉన్నారు’’ అని కాలేజీ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సచిన్ మహోర్ చెప్పారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు చిన్నారులను గుర్తించలేకపోయామని ఆయన తెలిపారు.
సచిన్ మహోర్ అందించిన వివరాల ప్రకారం.. మంటలు చెలరేగిన యూనిట్‌లో చాలామంది పిల్లలు ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నారు. మంటలు వ్యాపించడానికి ఇది కూడా ఒక కారణమని అని ఆయన అన్నారు.
2024 మే నెలలో దిల్లీలోని వివేక్ విహార్‌లో ఉన్న బేబీ కేర్ ఆసుపత్రిలో కూడా ఇలాగే మంటలు చెలరేగాయి. దీనికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. ఆ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు చనిపోయారు.
ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల కారణంగా చిన్నారుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా జరిగాయి.
తాజా ప్రమాదం నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఇలా మంటలు ఎందుకు చెలరేగుతున్నాయనే ప్రశ్న వినిపిస్తోంది.
నవజాత శిశువులను ఉంచే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో అగ్ని ప్రమాదాలు ఈ స్థాయిలో ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి ప్రమాదాలను అడ్డుకోవడానికి ఏమి చేయాలి?

నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఏంటి?
పుట్టిన తర్వాత ఇంటెన్సివ్ మెడికల్ కేర్ అవసరమయ్యే శిశువులను ఎన్‌ఐసీయూలో ఉంచుతారు.
ఎన్‌ఐసీయూలో అధునాతన సాంకేతికత ఉంటుందని, అందులోని నవజాత శిశువుల పట్ల ఆరోగ్య నిపుణులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని దిల్లీలోని బాత్రా హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ మోనిషా గుప్తా చెప్పారు.
‘‘నెలలు నిండకుండా జన్మించిన లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న చిన్నారులు, తక్కువ బరువుతో పుట్టిన, ఏదైనా ఆపరేషన్ అవసరమున్న నవజాత శిశువులను ఎన్‌ఐసీయూలో ఉంచుతారు. పుట్టిన పిల్లలను దాదాపు ఒక నెల రోజుల పాటు అందులో ఉంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంటారు’’ అని ఆమె తెలిపారు.
తీవ్రంగా అనారోగ్యం పాలైన పెద్దలకు ఐసీయూ ఉన్నట్లే, నవజాత శిశువులకు ఎన్‌ఐసీయూ పని చేస్తుంది.
‘‘ఎన్‌ఐసీయూ చాలా సున్నితమైన ప్రదేశం. ఎందుకంటే అందులోని పరికరాలన్నీ విద్యుత్‌తో నడుస్తాయి. పిల్లలకు వెచ్చదనాన్ని ఇచ్చే వార్మర్, వెంటిలేటర్, పిల్లలకు ద్రవాలను ఇచ్చే పంపుల నుంచి మానిటర్ల వరకు అన్నీ విద్యుత్‌తోనే పని చేస్తాయి. ఒకవేళ కరెంట్ లేకపోతే ఆ పరికరాలు బ్యాటరీలతో పనిచేస్తుంటాయి’’ అని ఆమె వివరించారు.
ఎన్‌ఐసీయూలో వైరింగ్ సరిగా లేకపోవడం వల్ల లేదా ఓవర్‌లోడ్ కారణంగా షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చని ఆమె తెలిపారు.
ఎన్‌ఐసీయూలో పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ సమయంలో ఈ ఆక్సిజన్ వల్ల మంటల తీవ్రత పెరుగుతుందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసుపత్రుల్లో ఆగ్ని ప్రమాదాలకు కారణాలు
దిల్లీలో 99 శాతం అగ్ని ప్రమాదాలకు విద్యుత్ సంబంధిత లోపాలే కారణమని దిల్లీ అగ్ని మాపక దళం డైరెక్టర్ అతుల్ గర్గ్ చెప్పారు.
‘‘ఆసుపత్రుల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలను విశ్లేషిస్తే అందులో చాలా వరకు షార్ట్ సర్క్యూట్ వల్ల, ఓవర్‌లోడ్ కారణంగా, మెషీన్లు అధికంగా వేడెక్కడం వల్ల జరిగినట్లు తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్‌కు చాలా కారణాలు ఉంటాయి. వైరింగ్ పాతది అయినప్పుడు విద్యుత్ దానిలోంచి ప్రవహించినప్పుడు ఇన్సులేషన్ కరిగిపోయి షార్ట్ సర్క్యూట్ కావొచ్చు. ఎంసీబీ సరిగ్గా పనిచేయకపోయినా షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది’’ అని ఆయన వివరించారు.
అగ్ని ప్రమాదాలను నివారించడానికి ఎప్పటికప్పుడు వైరింగ్‌ను తనిఖీ చేయాలని అతుల్ గర్గ్ సూచించారు.
‘‘అన్నింటికంటే ముఖ్యంగా ఎలక్ట్రిక్ మీటర్ల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రమాదాలు జరిగిన చాలా సందర్భాల్లో ఎలక్ట్రిక్ మీటర్లు మెట్ల కింద లేదా ప్రమాదం సంభవించిన ప్రదేశం లోపల ఉన్నట్లు తేలింది. ఒకవేళ మీటర్‌ను బయట ఉంచినట్లయితే అగ్ని ప్రమాదాలను 50 శాతం తగ్గించవచ్చు’’అని గార్గ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
గుర్తింపు లేకపోవడం
గత కొన్ని దశాబ్దాలుగా నేషనల్ నియోనాటాలజీ ఫోరమ్ (ఎన్‌ఎన్‌ఎఫ్) దేశవ్యాప్తంగా నవజాత శిశువులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి కృషి చేస్తోంది .
నవజాత శిశువుల కోసం ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు పాటించాల్సిన సంరక్షణ ప్రమాణాలను వివరించే టూల్‌కిట్‌ను యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో నేషనల్ నియోనాటాలజీ ఫోరమ్ తయారు చేసింది.
ఎన్‌ఎన్‌ఎఫ్ ఆసుపత్రుల్లోని ఎన్‌ఐసీయూలు, నర్సింగ్ హోమ్‌లకు గుర్తింపు ఇస్తుంది.
నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ (ఎన్‌ఏబీహెచ్), నేషనల్ నియోనాటాలజీ ఫోరమ్ వంటి ఏజెన్సీల ద్వారా గుర్తింపు పొందని వందలాది నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు దేశవ్యాప్తంగా ఉన్నాయని ఫోరమ్ జనరల్ సెక్రటరీ సురేంద్ర సింగ్ బిష్ట్ చెప్పారు.
ఇలాంటి యూనిట్లలో భద్రత తనిఖీలు సాధ్యం కాదని, అవి ప్రమాదాలకు కేంద్రంగా మారాయని అన్నారు.
‘‘దేశవ్యాప్తంగా పిల్లల చికిత్సలో నిర్ణీత ప్రమాణాలు పాటించే 300కి పైగా ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లకు ఎన్‌ఎన్‌ఎఫ్ గుర్తింపు ఇచ్చింది. ఈ యూనిట్లను మేం ఎప్పటికప్పుడు సందర్శించి తనిఖీలు చేస్తున్నాం. దీనికి రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు ఖర్చు అవుతుంది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యంత్రాలపై ఒత్తిడి
నేషనల్ నియోనాటాలజీ ఫోరమ్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న 100 మంది నవజాత శిశువుల్లో 30 మంది భారతదేశానికి చెందినవారు.
భారత్‌లో జన్మించిన 1000 మంది శిశువుల్లో 37 మంది పిల్లలు పుట్టిన కొన్ని రోజుల్లోనే మరణిస్తున్నారని ఫోరమ్ వెల్లడించింది.
‘‘మారుమూల ప్రాంతాల్లో నవజాత శిశువులకు ఇంటెన్సివ్ కేర్ సదుపాయాలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. యంత్రాలు నిరంతరం పనిచేస్తాయి. వాటి సామర్థ్యానికి మించి పని చేసినప్పుడు వేడెక్కుతాయి. దీని కారణంగా ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది" అని బిష్త్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసుపత్రుల్లో అగ్నిప్రమాద ఘటనలు
దిల్లీ, మే 2024: వివేక్ విహార్‌లోని ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు.
మధ్యప్రదేశ్, నవంబర్ 2021: భోపాల్‌లోని కమలా నెహ్రూ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు మరణించారు.
మహారాష్ట్ర, జనవరి 2021: భండారా జిల్లా ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించారు.
పశ్చిమ బెంగాల్, డిసెంబర్ 2011: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఏఎమ్‌ఆర్‌ఐ విభాగంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 89 మంది మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














