ఆంధ్రప్రదేశ్: ఉన్నత పాఠశాలల పని గంటల్లో మార్పులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏమంటున్నారు, విద్యార్థులపై ఒత్తిడి పడుతుందా?

- రచయిత, తులసీప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని ఉన్నత పాఠశాలల్లో పని గంటలు పెరగనున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇది ఇప్పటికే ప్రారంభం కాగా, మిగతా పాఠశాలల్లో త్వరలోనే అమలు చేయనున్నారు. దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ విద్యాశాఖ రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల పని గంటల్లో మార్పులు చేస్తూ ఒక కొత్త టైం టేబుల్ కూడా సిద్ధం చేసింది.
ఈ నిర్ణయం ముందుగా నెల్లూరులో నవంబర్ 20 నుంచే అమల్లోకి రాగా, మరి కొన్ని జిల్లాలలో నవంబర్ 25 నుంచి మండలానికి ఒక స్కూల్ చొప్పున పైలట్ ప్రాజెక్టు కింద ఈ టైం టేబుల్‌ను అమలు చేయనున్నారు.
స్కూళ్లలో పని గంటలు పెంచడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్తామని అధికారులు చెబుతున్నారు.
అయితే, ఎందుకీ మార్పు? ఉన్నత పాఠశాలల్లో పనివేళల్లో ఎలాంటి మార్పులు చేస్తున్నారు? దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నాయి.


పని గంటల్లో మార్పు ఎందుకు?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఒక గంట పెంచనుంది. అంటే, సాయంత్రం 5 గంటల వరకు ఆ పాఠశాలలు నడుస్తాయి.
ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైం టేబుల్‌ను అమలు చేసి, దానిపై ఫీడ్ బ్యాక్‌ను నివేదిక రూపంలో అందించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.
కొత్త టైం టేబుల్ అమల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు పని చేసే పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ 5 నిమిషాలు పెంచి మధ్యాహ్నం భోజన విరామ సమయాన్ని కూడా 15 నిమిషాలు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
45 నిమిషాలు ఉన్న ఉదయం మొదటి పీరియడ్ మాత్రం 50 నిమిషాలు చేయాలని నిర్ణయించారు. ఉన్నత పాఠశాలల్లో ఏడు పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మార్పు అందుకే..
ఉన్నత పాఠశాల పని గంటల మార్పు ఎందుకని అడిగినప్పుడు, విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తిరుపతి జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ కేవీఎన్ కుమార్ చెప్పారు.
ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూస్తూ సమయం గడుపుతున్నారని, అలాంటివాటిని తగ్గించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
“ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నడుస్తున్నాయి. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలు సెల్ ఫోన్లు చూడడం లాంటివి చేస్తున్నారు. చదువుపై శ్రద్ధ చూపించడం లేదు. అదే వారు పాఠశాలల్లో ఎక్కువ సమయం ఉంటే చదువుకుంటారు. ఈ ఉద్దేశంతోనే కొత్త టైం టేబుల్‌ను పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేసేందుకు మండలానికి ఒక హైస్కూల్‌ను ఎంపిక చేశాం” అని కేవీఎన్ కుమార్ చెప్పారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సాయంత్రం 5 గంటల వరకూ స్కూల్లో ఉంచడమే మంచిదని అనుకుంటున్నారని ఆయన తెలిపారు.
“ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు 5 గంటల వరకు తరగతులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సాయంత్రం 5 గంటల వరకూ స్కూల్లో ఉండడమే మంచిదని అనుకుంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు కూడా పెరిగే అవకాశం ఉంది” అని ఆయన అన్నారు.
విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్స్ లాంటివి కూడా చేయడం లేదని, ఇప్పుడు సాయంత్రం 5 వరకూ స్కూళ్లలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి వారి సిలబస్ సమయానికి పూర్తి చేయడానికి, వర్క్ బుక్స్ కరెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుందనే పని గంటలు పెంచుతున్నామని కేవీఎన్ కుమార్ చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంపై కొందరు తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పని వేళలు గంట పెంచినంత మాత్రాన ఏం నష్టం లేదని చెబుతున్నారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సొరకాయల పాలెంకు చెందిన ఉమా మహేశ్.
“పెంచడం మంచిదే. ఆ గంట సేపు స్కూల్లో ఉంటే నాలుగు అక్షరాలు నేర్చుకుంటారు. ఇంటికి వచ్చి ఏం చేస్తారు. చేసేది ఏమీ ఉండదు. వీధుల్లో తిరుగుతారు. లేదంటే సెల్ ఫోన్లు చూస్తూ ఇంకా చెడిపోతారు. అందుకే ఒక గంట ఎక్కువ సేపు పాఠశాలలో ఉంచుకోవడం ఎంతో మంచిది. మాకు ఎలాంటి సమస్య ఉండదు. అర గంటలో ఇంటికి వచ్చేస్తారు” అని అన్నారు.

భిన్నాభిప్రాయాలు
విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో మాత్రం విముఖత కనిపిస్తోంది. కొంతమంది టీచర్లు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలా హైస్కూల్ పని గంటలు పెంచడం అనేది అసంబద్ధమైన చర్య అని ఎస్‌టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కె.ధనుంజయ నాయుడు అన్నారు.
ప్రస్తుత పనివేళలనే కొనసాగించడం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మంచిదని తమ సంఘం భావిస్తోందని చెప్పారు.
“70 శాతం పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం వల్ల రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తిరిగి ఇళ్లకు వెళ్లాలన్నా కూడా సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల్లోనే ఉంచడం అనేది చాలా శోచనీయం. చీకటి పడక ముందే పిల్లలు తమ ఇళ్లకు చేరుకుంటే బాగుంటుంది. అందులోనూ అమ్మాయిలు కూడా ఇంటికి వెళ్లాలంటే ఐదు లోపు అయితేనే బాగుంటుంది” అని ధనుంజయ నాయుడు అన్నారు.
ఈ పని వేళల పెంపు వల్ల విద్యార్థులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
“చాలా ఏళ్లుగా ఇప్పుడున్న పద్దతిలోనే సిలబస్ కవర్ చేస్తున్నాం. విద్యార్థులకు విద్య పరంగా అవసరమైన వాటికోసం ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటూనే సిలబస్ కవర్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి పనివేళల పెంపు వల్ల విద్యాభివృద్ధికి పెద్దగా ఒరిగేది అంటూ ఏమీ లేదు” అని అన్నారు.
గ్రామీణ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవడం చాలా తక్కువగా ఉంటుందని, ఉదయం పాఠశాలలకు పంపిస్తే తిరిగి సాయంత్రం వచ్చే వరకు వారిని పట్టించుకోని పరిస్థితి ఉందని ఆయన చెప్పారు.

విద్యార్థులపై మానసిక ఒత్తిడి ఉంటుందా?
పాఠశాలల్లో పని గంటలు పెంచడం వల్ల విద్యార్థుల్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి, వారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, చదువుపైన కూడా ఆసక్తి తగ్గే అవకాశం ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
“రోజులో గంట పెరుగుతుంది. దానివల్ల పిల్లల్లో శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఏకాగ్రత లోపించి ఒత్తిడికి లోనవుతారు. పిల్లలకు స్లీపింగ్ డిజార్డర్ కూడా వస్తుంది. ఇన్నాళ్లూ పిల్లలు ఒక మైండ్ సెట్‌కు అలవాటుపడ్డారు. ఇప్పుడు కొత్తగా దీనికి అలవాటు పడాలంటే కష్టం. శారీరక వ్యాయామాలు చేయించకుండా వారిని అలా కంటిన్యూగా క్లాసులోనే కూర్చోబెడితే వాళ్లకి చదువుపై ఆసక్తి కూడా తగ్గుతుంది” అని డాక్టర్ ఏవీ కిరణ్ కుమార్ చెప్పారు.
సైకాలజీ ప్రకారం పదేళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లలు ఏ పాఠమైనా కేవలం 22 నిమిషాలు మాత్రమే వినగలరని, దీనిపై పరిశోధనలు జరిగాయని, శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు.
“కానీ అదే 13 నుంచి 15 ఏళ్ల పిల్లలు 27 నిమిషాల వరకూ వినగలుగుతారు. అది కూడా ఉపాధ్యాయులు ఎలా బోధిస్తారనేదాన్ని బట్టి ఉంటుంది. కానీ పని గంటలు పెరగడం వల్ల పిల్లలు కచ్చితంగా ఒత్తిడికి గురవుతారు. గరిష్ఠంగా 30 నిమిషాలు బోధించాలి. ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాలి. లేదంటే క్వాలిటీ తగ్గుతుంది. ఎందుకంటే ఒత్తిడితో చదవడం అనేది కుదరదు. ఆసక్తి తగ్గడంతోపాటూ, ఏకాగ్రత లేకపోతే చదువు రాదు కదా. 27 నిమిషాలే వినగలిగేవారికి 45 నిమిషాలు వినండి అంటే వారి ‘బాడీ ప్రజంట్, మైండ్ ఆబ్సెంట్’ అవుతుంది. ఏమీ శ్రద్ధగా వినలేరు. అలాంటి సమయంలో వారికి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి పోదామా అనే ఆలోచన ఉంటుంది" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













