అదానీ గ్రూప్‌తో ఒప్పందాలను రద్దు చేసుకున్న కెన్యా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డనై నెస్టా కుపెంబా, రిచర్డ్ కాగో
- హోదా, బీబీసీ న్యూస్ లండన్, నైరోబీ
భారత బిలినీయర్ గౌతమ్ అదానీ గ్రూప్‌తో ఉన్న రెండు కీలక ఒప్పందాలను కెన్యా అధ్యక్షుడు విలియం రూటో రద్దు చేశారు.
గౌతమ్ అదానీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అమెరికా ప్రాసిక్యూటర్లు కేసు నమోదు చేయడంతో కెన్యా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమ విచారణ సంస్థలు, భాగస్వామ్య దేశాలు అందించిన కొత్త సమాచారం ఆధారంగా ఒప్పందాలను రద్దు చేసినట్లు చెప్పారు.
ఈ మేరకు రూటో గురువారం కెన్యా ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు.


ఫొటో సోర్స్, Getty Images
గౌతమ్ అదానీ భారత్‌లో 25 కోట్ల డాలర్లు(సుమారు రూ.2,112 కోట్లు) లంచాలు ఇచ్చారని, తప్పుడు సమాచారంతో అమెరికాలో నిధులు సేకరించారని ఆరోపిస్తూ అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేసిన మరుసటి రోజే కెన్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గౌతమ్ అదానీ భారత్‌లో రెండో అత్యంత సంపన్న వ్యక్తి.
అయితే, అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణలను అదానీ గ్రూప్ ప్రతినిధులు ఖండించారు. అవన్నీ నిరాధార ఆరోపణలని అదానీ గ్రూప్ అంటోంది.
‘‘సాక్ష్యాలు బలంగా ఉన్నప్పుడు లేదా అవినీతిపై కచ్చితమైన సమాచారం ఉన్నప్పుడు, నిర్ణయాత్మక చర్య తీసుకునే విషయంలో నేనెక్కడ తలొగ్గను’’ అని రూటో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కెన్యాలో ప్రధాన విమానాశ్రయంలో 1.85 బిలియన్ డాలర్లు(సుమారు రూ.15,631 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ పెట్టుబడుల తరువాత 30 ఏళ్ల పాటు ఈ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ నిర్వహించేలా ఒప్పందం ఉంది.
అలాగే, పవర్ లైన్ల నిర్మాణానికి ఇంధన మంత్రిత్వ శాఖతో 73.6 కోట్ల డాలర్ల (రూ.6,218 కోట్ల) ఒప్పందం చేసుకుంది.
ఈ రెండు ఒప్పందాలను కెన్యా అధ్యక్షుడు ఇప్పుడు రద్దు చేశారు.
విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ ఒప్పందం ప్రకారం అదానీ గ్రూప్ అక్కడ కొత్త రన్‌వేలు నిర్మించడం, జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ టర్మినల్‌ను మెరుగుపరచడం వంటి పనులు చేపట్టాల్సి ఉంది.
అదానీ గ్రూప్‌తో జరిగిన ఒప్పందాల విషయంలో ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు నిరసనలు తెలిపారు.
సెప్టెంబర్‌లో విమానాశ్రయ సిబ్బంది ఈ డీల్ విషయంలో నిరసన కూడా చేశారు.
అదానీ గ్రూప్‌తో జరిగిన ఒప్పందం వల్ల ఉద్యోగాలు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
పవర్ లైన్ల ప్రొక్యూర్‌మెంట్ విషయంలో ఎలాంటి లంచాలు, అవినీతి లేవని పార్లమెంటరీ కమిటీకి అక్కడి ఇంధన శాఖ మంత్రి ఓపియో వాండయి చెప్పారు.
అవినీతిపై తగిన చర్యలు తీసుకుంటామని కెన్యా అధ్యక్షుడు రూటో వాగ్దానం చేశారు. ఆయన పాలనపై పదేపదే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
విమానాశ్రయం, ఎనర్జీ డీల్స్ కోసం ప్రత్యామ్నాయ భాగస్వాముల కోసం తమ ప్రభుత్వం చూడటం ప్రారంభిస్తుందని రూటో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














