లావోస్: ఆరుకు చేరిన పర్యటకుల మరణాలు, వీరి మృతికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Beaumaris Football Club
- రచయిత, కో ఇవే, రిన్ జిరేనువాట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
లావోస్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన పర్యటకుల సంఖ్య ఆరుకు పెరిగింది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన హోలీ బౌల్స్ (19) అనే యువతి మరణించారు. మిథనాల్ కలిపిన కల్తీ మద్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హోలీ బౌల్స్ కుటుంబ సభ్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించారు. ఆమె వారం కిందట పర్యటక పట్టణమైన వాంగ్ వియెంగ్‌కి వెళ్లి, అనారోగ్యానికి గురయ్యారు.
హోలీ స్నేహితురాలు బియాంకా జోన్స్ (19) కూడా మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు గురువారం ధ్రువీకరించారు. అదే రోజు ఆగ్నేయ లండన్‌కు చెందిన బ్రిటిష్ న్యాయవాది సిమోన్ వైట్ (28) కూడా మరణించారు.
దీనికి కొన్ని గంటల ముందే ఒక అమెరికన్ వ్యక్తి వాంగ్ వియెంగ్‌లో మరణించినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.
గతవారం 19, 20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు డానిష్ యువతులు కూడా లావోస్‌లోనే మరణించారు. డెన్మార్క్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు కానీ పూర్తి వివరాలు అందించలేదు.
మృతిచెందిన ఆరుగురిలో ఇద్దరు ఆస్ట్రేలియన్ యువతులు, ఇద్దరు డానిష్ యువతులు, ఒక బ్రిటిష్ మహిళ, మరొకరు అమెరికన్ ఉన్నారు.
“హోలీ బౌల్స్ మృతి ఆస్ట్రేలియన్లకు బాధ కలిగించేది. ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ అన్నారు.
పర్యటకుల మరణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పర్యటకులు మిథనాల్ కలిసిన పానీయాలను తాగి ఉండవచ్చని అక్కడి పలు ఆన్‌లైన్ పోస్ట్‌లు, వార్తాకథనాలు చెబుతున్నాయి.
అక్రమ మద్యంలో మిథనాల్ అనే విష రసాయనాన్ని కలుపుతుంటారు. చౌక మద్యంలో మిథనాల్ ప్రయోగం అనేది ఆగ్నేయాసియాలో ఎక్కువగా ఉన్న సమస్య. ఇండోనేషియాలో దీని కారణంగా కొన్నేళ్లుగా అనేకమంది ఆసుపత్రిలో చేరారు, పలువురు మరణించారు. అయితే, పర్యటకులు దీనికి చాలా అరుదుగా ప్రభావితమయ్యారు.
వాంగ్ వియెంగ్ అనేది సెంట్రల్ లావోస్‌లోని ఒక చిన్న నదీతీర పట్టణం. ఆగ్నేయాసియా గుండా ప్రయాణించే యువ పాశ్చాత్య బ్యాక్‌ప్యాకర్ల(బ్యాగుతో టూర్‌కు వెళ్లేవారు)కు ప్రసిద్ధ గమ్యస్థానం ఇది. ఈ పట్టణం బనానా పాన్‌కేక్ ట్రైల్‌లో భాగంగా ఉంది.
బనానా పాన్‌కేక్ ఆగ్నేయాసియాలో ప్రసిద్ధి చెందిన బ్యాక్‌ప్యాకింగ్ మార్గం. థాయిలాండ్, వియత్నాం, లావోస్, కంబోడియాలలోని ప్రసిద్ధ గమ్యస్థానాలకు ఇది మార్గంగా ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
న్యూజీలాండ్, డచ్ ప్రభుత్వాల ప్రకటన
తమ పౌరులలో ఒకరు అనుమానాస్పద మిథనాల్ కలిసిన మద్యసేవనం కారణంగా అనారోగ్యానికి గురయ్యారని న్యూజీలాండ్ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఒక డచ్ టూరిస్ట్ ఆసుపత్రిలో ఉన్నారని, ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని నెదర్లాండ్స్ విదేశీ వ్యవహారాల శాఖ ధ్రువీకరించింది. అయితే, పర్యటక ప్రాంతంలో బాధితుల సంఖ్య అస్పష్టంగానే ఉంది.
బియాంకా జోన్స్ మరణాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ధ్రువీకరించిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. బియాంకా జోన్స్ కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.
అమెరికన్ మరణానికి కారణంపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
లావోస్‌లో ఆల్కహాల్ తాగేటప్పుడు జాగ్రత్త వహించాలని ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూకే అధికారులు తమ పౌరులను హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉచితంగా లావో వోడ్కా..
బాధిత ఆస్ట్రేలియన్ మహిళలు బస చేసిన వాంగ్ వియెంగ్‌లోని 'ది నానా బ్యాక్‌ప్యాకర్ హాస్టల్'ను ప్రస్తుతం పోలీసులు విచారణ కోసం మూసివేశారు.
హాస్టల్ మేనేజర్ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. లావో వోడ్కా ఉచిత షాట్‌లు తీసుకున్న 100 మంది అతిథులలో ఈ మహిళలు ఉన్నారని చెప్పారు. అనంతరం వారు రాత్రి బయటకు వెళ్లారని తెలిపారు.
అక్కడ ఉన్న ఇతర అతిథులెవరూ ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఫిర్యాదు చేయలేదన్నారు. హాస్టల్ ప్రమేయం ఏమీ లేదని విచారణలో తేలుతుందని మేనేజర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఉచిత షాట్‌లను అందించడం ఆపివేసినట్లు చెప్పారు.
కొంతమంది అక్రమ మద్యం తయారీదారులు ఆల్కహాల్ చౌకగా, ఎక్కువగా అమ్మడానికి అందులో మిథనాల్‌ను కలుపుతుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ ఏడాది ప్రారంభంలో మిథనాల్ కలిపిన మద్యం తాగి భారతదేశంలో దాదాపు 57 మంది మరణించారు. ఫిలిప్పీన్స్, పెరూలోనూ ఇలాంటి వార్తలు వచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














