‘ప్లీజ్.. గర్భాశయం తొలగించుకోనివ్వండి’

హిస్టెరెక్టమీకి సిద్ధమైన ఎమిలీ

ఫొటో సోర్స్, Emily Griffiths

ఫొటో క్యాప్షన్, తన సమస్యలకు హిస్టెరెక్టమీనే పరిష్కారం అనుకుంటున్న ఎమిలీ
    • రచయిత, జెన్నీ రీస్
    • హోదా, బీబీసీ వేల్స్ న్యూస్, హెల్త్ కరెస్పాండెంట్

ఎమిలీ గ్రిఫ్తీస్ అనే యువతి గర్భాశయం తొలగించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నారు. ఆ శస్త్ర చికిత్సను హిస్టెరెక్టమీ అని పిలుస్తారు.

ఇంకా పిల్లలు లేని ఓ యువతి, 26 ఏళ్ల వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద విషయమని ఆమెకు తెలుసు. కానీ, అడెనోమియోసిస్, ఎండోమెట్రియోసిస్ ఆమెను ఇంటికే పరిమితం చేశాయి. భరించలేని నొప్పితో సతమతమవుతున్న ఆమె, తాను అమ్మగా మారగల భవిష్యత్తును చూడలేకపోతున్నారు.

ప్రస్తుతం ఆమెకు ఉన్న చిన్ని కలలేంటంటే... ఎవరి సహాయం లేకుండా నడవగలగడం. అయితే ఈ కలను ఆమె నెరవేర్చుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఆమె వయసు వల్ల ఇలాంటి శస్త్రచికిత్స చేసే డాక్టర్లు ఆమెకు దొరకడం లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హిస్టెరెక్టమీతో అనేక సమస్యలు

ఫొటో సోర్స్, Emily Griffiths

ఫొటో క్యాప్షన్, తల్లితో ఎమిలీ

‘నా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు’

‘‘భవిష్యత్తులో నేను బిడ్డను కావాలనుకుంటానేమో అనే ఉద్దేశంతో.. అందుకు సంబంధించిన విషయాలు మాట్లాడడంలో డాక్టర్లు బిజీగా ఉంటున్నారు. కానీ నా ప్రస్తుత పరిస్థితిని వారు గుర్తించలేకపోతున్నారు’’ అని బ్రిటన్‌లోని కార్‌మార్థెన్‌షైర్‌కు చెందిన ఎమిలీ చెప్పారు.

ఎమిలీకి 12 ఏళ్ల వయసు నుంచి ఈ లక్షణాలు కనిపించడం మొదలైంది. పీరియడ్స్ సమయంలో ఆమెకు చాలా నొప్పి కలిగేది. స్కూలుకు వెళ్లలేకపోయేది. రక్తహీనతతో బాధపడేది.

నొప్పి అన్నది సహజమైన విషయమని పెద్దవాళ్లు చెప్పారు.

‘‘ఇదంతా మనసులో పెట్టుకుని నేను స్కూలుకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని వారు అన్నారు’’ అని ఎమిలీ తెలిపారు.

21 ఏళ్ల వయసులో ఎమిలీ ఓసారి కుప్పకూలి పడిపోయారు. అప్పుడు ఆమెకు ఎండోమెట్రియోసిస్ ఉన్నట్టు గుర్తించారు.

కార్డిఫ్‌ నగరంలో స్పెషలిస్టు దగ్గరకు వెళ్లాలని ఆమెకు సూచించారు. కానీ చాలా సమయం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండడంతో ఆమె కుటుంబం ఎమిలీకి సొంత ఖర్చులతో ప్రయివేట్‌గా చికిత్స చేయించింది.

అక్కడ అనుభవం, నైపుణ్యం ఉన్న వైద్యులు ఎమిలీకి కనిపించలేదు. లెక్కలేనన్ని ప్రయివేట్ ఆస్పత్రుల చుట్టూ ఆమె తిరిగారు. చివరకు ఆరోగ్యవిభాగం నుంచి ఎలాంటి మద్దతూ లేదన్న అభిప్రాయం ఆమెకు కలిగింది.

హిస్టెరెక్టమీ చేయించుకుంటే ఎమిలీ పిల్లలను కనలేరు. మెనోపాజ్ వస్తుంది. ఎముకలు బలహీనపడటం, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మానసిక అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది.

అయినప్పటికీ, గడచిన మూడేళ్లగా మెనోపాజ్‌ కోసం ఆమె నెలవారీ ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. భరించలేని నొప్పి, బాధ వంటి వాటి నుంచి ఉపశమనం పొందేందుకు పీరియడ్స్ రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఆమె ఎముకల్లో బలం తగ్గిపోయిందని స్కానింగ్‌ల ద్వారా అర్ధమవుతోంది.

‘‘హిస్టెరెక్టమీతో ఎండోమెట్రియోసిస్ నయం కాదు. కానీ అడెనోమియోసిస్‌కు ఇది బాగా పనిచేస్తుంది’’ అని ఆమె చెప్పారు. ఎమిలీ అడెనోమియోసిస్‌తో బాధపడుతున్నట్టు గుర్తించినప్పుడు ఆమె వయసు 23 ఏళ్లని తెలిపారు.

‘‘ఇది చాలా పెద్ద నిర్ణయం. కానీ ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ఆ నిర్ణయం వల్ల నేను కనీసం చిన్నగా నడిచే అవకాశమైనా ఉంటుంది. ఇప్పుడు నేను చిక్కటి చీకటి ప్రాంతంలో చిక్కుకుని ఉన్నట్టుంది’’ అని ఎమిలీ ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రైవేట్ ఆస్పత్రులో చికిత్స

ఫొటో సోర్స్, Emily Griffiths

ఫొటో క్యాప్షన్, ఎమిలీ

హిస్టెరెక్టమీ అంటే ఏంటి?

హిస్టెరెక్టమీ అనేది ఒక పెద్ద ఆపరేషన్. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. తక్కువ సమయంలో ముగిసే శస్త్రచికిత్సలు లేనప్పుడు మాత్రమే డాక్టర్లు దీనికి మొగ్గుచూపుతారు.

మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో కలిగే సమస్యలను నివారించేందుకు ఈ శస్త్రచికిత్స నిర్వహిస్తారు.

హిస్టెరెక్టమీ అంటే గర్భాశయాన్ని, గర్భాశయ ముఖద్వారాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం.

కొన్ని సందర్భాల్లో ఫాలోపియన్ ట్యూబులు, అండాశయం, శోషరసం గ్రంథులు, యోనిలో కొంత భాగాన్ని కూడా తొలగిస్తారు.

ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ నుంచి ఎమిలీకి గుర్తింపు

ఫొటో సోర్స్, Emily Griffiths

ఫొటో క్యాప్షన్, ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ నుంచి ఎమిలీకి ఉత్తరాలు

ఎండోమెట్రియోసిస్, అడెనోమియోసిస్‌ అంటే ఏంటి?

అడెనోమియోసిస్‌ అంటే గర్భాశయం అంచు, లోపలి కండరంలోకి చొచ్చుకుపోయి పెరుగుతుండడం.

దీనివల్ల పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి వస్తుంది. రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. కటి భాగంలో నొప్పి ఉంటుంది. సెక్స్ సమయంలో నొప్పి కలుగుతుంది.

ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయం అంచుమీద ఉండే కణాలు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా పెరుగుతుంటాయి.

అవి పగిలిపోయి రక్తం కారుతుంటాయి. తర్వాత కూడా అవి తగ్గవు. మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.

ఎమిలీ గర్భాశయం, మూత్రాశయం, ప్రేవుల్లో కొంత భాగం చుట్టూరా ప్రస్తుతం ఎండోమెట్రియోసిస్ వ్యాపించి ఉన్నాయి.

పీరియడ్స్ పూర్తవుతున్న సమయంలో కూడా ఆమెకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్ థెరపీ(హెచ్‌ఆర్‌టీ) ఆమె పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.

ఆమెకు ఉన్న విపరీత సమస్యల వల్ల హిస్టెరెక్టమీ నిర్వహించేందుకు ప్రస్తుతం ఎండోమెట్రియోసిస్ స్పెషలిస్ట్ కావాలి. ఈ శస్త్రచికిత్సలో ఎండోమెట్రియోసిస్ తొలగింపు కూడా ఓ భాగం.

ఎండోమెట్రియోసిస్, అడెనోమియోసిస్‌ కోసం బ్రిటన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ సూచించిన వైద్యవిధానాల్లో హిస్టెరెక్టమీ ఒకటి.

నొప్పి, అనారోగ్య లక్షణాలు మొత్తం హిస్టెరెక్టమీతో పోతాయన్న గ్యారంటీ లేదని ఎండోమెట్రియోసిస్ యూకే అనే సంస్థ చెప్పింది. ‘‘కానీ ఒక విషయం గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇది మీ శరీరం. దానికి సంబంధించిన అంతిమ నిర్ణయం మీదే అయ్యుండాలి’’ అని తెలిపింది.

కానీ, తన అనుభవం ఈ సెంటిమెంట్‌కు భిన్నమైనదని ఎమిలీ చెప్పారు.

తమ శరీరాలపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉందా?

‘‘నాకు తెలిసినంతవరకు తమ శరీరాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉంటుందని నేను అనుకోవడం లేదు.

‘జీవితంలో స్థిరపడిన తర్వాత మీ భర్తతో బిడ్డను కనాలని మీరు అనుకోవచ్చు’ అని నాకు చెబుతుంటారు. ఇప్పుడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో గమనించకుండా భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటారు.

ఇప్పుడు నేను పడుతున్న బాధలు, నా అనారోగ్యంతో పోలిస్తే... పిల్లలను కనలేకపోవడం అనేది నాకు చాలా చిన్న విషయం’’ అని ఎమిలీ అన్నారు.

పీరియడ్స్‌ను ఆపడానికి కెమికల్ ఇంజెక్షన్లు తీసుకోవడం, గర్భనిరోధక మాత్రలు వాడడం, డిప్రెషన్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం, రన్నింగ్, యోగాసనాలు వంటివి ప్రయత్నించాలని తనకు సలహాలొచ్చినట్టు ఎమిలీ చెప్పారు.

‘‘ఎవరిదన్నా సాయం లేకుండా నేను నడవలేను. అలాంటప్పుడు నన్ను రన్నింగ్ చేయమని, యోగాసనాలు వేయమని చెప్పడం ఎలా ఉంటుందో ఆలోచించండి’’ అని ఎమిలీ అన్నారు.

తాను ఎదుర్కొంటున్న సమస్యలపై అందరికీ అవగాహన కల్పించడానికి ఎమిలీ చేస్తున్న కృషి ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ గుర్తింపు పొందింది.

‘‘నాకు చాలా అద్భుతమైన అవకాశాలు లభించాయి. అదే నన్ను కాస్త ఆశలు నిలబెట్టుకునేలా చేస్తోంది’’ అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)