స్టాక్ మార్కెట్: 50 లక్షల కోట్ల సంపద ఆవిరి నిజమేనా, ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా?

భారత స్టాక్ మార్కెట్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నాగేంద్రసాయి కుందవరం
    • హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం

అమెరికా తుమ్మితే, ఇండియాకు జలుబు చేస్తుంది అనే నానుడి స్టాక్‌ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. అమెరికాలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, అక్కడి ఇన్వెస్టర్లు మనసు మార్చుకున్నా దాని ప్రభావం పడేది ముందుగా మన మార్కెట్లపైనే.

పదేళ్ల నుంచి కొద్దిగా ఈ పద్ధతికి విరామం వచ్చినప్పటికీ మళ్లీ మూడు నెలలుగా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సెన్సెక్స్‌ 85,978 పాయింట్ల జీవితకాల గరిష్ఠ స్థాయిని చేరింది. అక్కడి నుంచి లక్ష మార్కును చేరుకోబోతోందని రిటైల్‌ ఇన్వెస్టర్లంతా సంబరపడే లోపు మార్కెట్లు జారుడుబల్ల ఎక్కినట్టు కిందికి జారుతూనే ఉన్నాయి. జీవిత కాల గరిష్ఠ స్థాయిల నుంచి సెన్సెక్స్‌, నిఫ్టీ 10 శాతం వరకూ పడిపోయాయి.

దీంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం సుమారు రూ.50 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ నష్టాలు ఇక్కడితో ఆగేలా లేవని చాలా అంశాలు చెప్పకనే చెబుతున్నాయి.

ఇంతకీ స్టాక్‌ మార్కెట్‌లు ఎందుకు అంతగా కిందకు పడిపోతున్నాయి. ఏం మార్పులు వచ్చాయి?

దీనికి ప్రధానంగా ఐదు కారణాలను మనం విశ్లేషించుకోవచ్చు.

మన మార్కెట్లు గత నాలుగేళ్లుగా దూసుకుపోతున్నాయి. నిఫ్టీ 2020 కరోనా సమయంలో 8,084 పాయింట్ల కనిష్ఠ స్థాయికి దిగివచ్చింది. అక్కడి నుంచి నాలుగేళ్లలో 26,178 పాయింట్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. అక్కడి నుంచి ఇప్పుడు పది శాతం పడిపోయినప్పటికీ ఈ ఏడాదిలో ఇయర్‌ టు డేట్‌ లాభాలు 8 శాతం వరకూ ఉన్నాయి. అదే ఏడాది కాలంలో 19 శాతం, రెండేళ్లలో 28 శాతం, 3 ఏళ్లలో 32 శాతం, నాలుగేళ్లలో 81 శాతం లాభాలను అందించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ఏడాది ప్రారంభంలో సెన్సెక్స్ లక్ష మార్కు దాటుతుందని అంచనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జీవితకాల గరిష్టస్థాయి నుంచి మార్కెట్లు 10 శాతం వరకూ పడిపోయాయి.

చైనాలో పెట్టుబడులు

వాస్తవానికి మన మార్కెట్లు ఈ స్థాయిలో పెరిగితే, చైనా మార్కెట్లు మాత్రం రెండు నెలల కిందటి వరకూ అక్కడక్కడే ఉన్నాయి. కరోనా తర్వాత చైనా మార్కెట్లు కోలుకోనే లేదు.

చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 2007లో 5,818 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ మళ్లీ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేయలేదు.

కరోనా టైంలో సగానికి పైగా పడిపోయిన షాంఘై ఇండెక్స్‌, అక్కడి నుంచి ఈ సెప్టెంబర్‌ వరకూ దాదాపుగా అదే స్థాయిలో ఉంది. ఇప్పుడిప్పుడే 3,300 పాయింట్లకు చేరింది. ఈ టైంలోనే మన మార్కెట్లు ఏకంగా మూడు రెట్లు పెరిగాయని గమనించాలి.

అక్కడ కొద్దిగా వృద్ధి పుంజుకోవడం, చైనా ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజీలు వంటివి కొద్దిగా ఊతమిచ్చినప్పటికీ, అక్కడి ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉంది.

అయితే అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో భారత మార్కెట్లు రికార్డుల దిశగా దూసుకుపోతూ, ఖరీదుగా (ఓవర్ వేల్యూడ్‌) మారాయి. దీంతో ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన మార్కెట్ల నుంచి లాభాలు పొంది, చైనా వైపు పెట్టుబడులు మళ్లించారు. మన సూచీలు నష్టపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్కెట్ వర్గాలను నిరాశ పర్చిన కార్పొరేట్ ద్వితీయ త్రైమాసిక ఫలితాలు

ట్రంప్‌ గెలుపు, డాలర్‌ బలపడడం

యూఎస్‌ అధ్యక్షుడిగా డోనల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో మన మార్కెట్లు కొద్దిగా తడబడ్డాయి. ట్రంప్‌ గెలుపు తర్వాత యూఎస్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అక్కడి డాలర్‌ మరింత బలపడింది.

విపరీతంగా ఉన్న వడ్డీ రేట్లను కూడా ట్రంప్‌ నియంత్రించేందుకు వెనుకాడబోరనే సంకేతాల వల్ల, మన మార్కెట్ల నుంచి కొద్దిగా నిధులు అటువైపు మళ్లాయి.

ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి వరుసగా 34వ సెషన్‌లో కూడా (నవంబర్‌ 14న) నెట్‌ సెల్లర్స్‌గానే ఉన్నారు. అంటే వరుసగా 34 రోజులుగా వాళ్ల పెట్టుబడులను మన మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంటూనే వస్తున్నారు.

జనవరి నుంచి పరిస్థితులు అనుకూలంగా మారతాయని అంచనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ లాభాలను ఆశించవద్దని ఇన్వెస్టర్లు చెబుతున్నారు.

ఫారిన్‌ ఇన్వెస్టర్ల అమ్మకాలు

ఒక్క అక్టోబరులోనే రికార్డ్‌ స్థాయిలో రూ.94,017 కోట్ల విలువైన స్టాక్స్‌ను ఎఫ్‌పీఐలు అమ్మేశారు. నాలుగేళ్లలో ఇదే అత్యధిక విక్రయం. నవంబర్‌ నెలలో కూడా ఇప్పటివరకూ రూ.22,420 కోట్ల డబ్బును మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ ఏడాది మొత్తంలో వాళ్లు విత్‌డ్రా చేసిన మొత్తం (దేశంలోకి వచ్చిన పెట్టుబడి, ఉపసంహరించుకున్న సొమ్ము మధ్య తేడా) రూ.15827 కోట్లుగా ఉంది. మొత్తంగా చూస్తే, నెట్‌ సెల్లర్స్‌గానే ఉన్నారు.

కార్పొరేట్ లాభాలు తగ్గుదల

మార్కెట్‌ పెరగడానికైనా, పతనానికైనా మరో ముఖ్య కారణం కార్పొరేట్‌ ఫలితాలు. ఇవి సరిగ్గా లేకపోతే, ఎంత డబ్బు వచ్చినా స్టాక్స్‌లో పతనం తప్పదు. ఈసారి రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను తీవ్ర నిరుత్సాహపరిచాయి.

ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్, రిటైల్‌, రియల్ ఎస్టేట్‌, మైక్రో ఫైనాన్స్‌, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, పెయింట్స్‌, సిమెంట్‌, సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌, ఆయిల్‌ అండ్ గ్యాస్‌, కెమికల్స్‌ వంటి రంగాల ఫలితాలు గట్టి ప్రభావం చూపించాయి.

జేఎం ఫైనాన్షియల్‌ సంస్థ తాను కవర్‌ చేసే 275 కంపెనీలను విశ్లేషించి నివేదిక ఇచ్చింది. అందులో 44 శాతం కంపెనీలు లాభాల అంచనాలను అందుకోలేకపోయాయని తేల్చింది. రెవెన్యూ గ్రోత్, లాభాలు గణనీయంగా తగ్గినట్టు నివేదిక చెబుతోంది. 66 శాతం కంపెనీలు ఈపీఎస్‌ డౌన్‌గ్రేడ్‌ అయ్యాయి. వీటి వల్ల కూడా మార్కెట్లు గట్టి ప్రభావాన్నే ఎదుర్కొన్నాయి.

సిప్ పద్ధతి ఇన్వెస్ట్‌మెంట్‌కు సరైన సమయం అంటున్న ఎనలిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్వాలిటీ స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెట్టాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు

రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రస్తుతం 14 నెలల గరిష్ట స్థాయి దగ్గర ఉంది. అక్టోబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.21 శాతంగా నమోదైంది. ముఖ్యంగా కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ లెక్కల కంటే మార్కెట్‌లో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంది.

ఆర్బీఐ అంచనాలను తలకిందులు చేస్తూ, ద్రవ్యోల్బణం దడపుట్టిస్తోంది. దీంతో వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆర్బీఐ సుముఖంగా లేదు. 2020 మే లో 4 శాతంగా ఉన్న రెపో రేటు ఇప్పుడు 6.5 శాతంగా ఉంది. వచ్చే ఏడాది మాత్రమే వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి. ఇది కూడా మార్కెట్లకు ప్రతికూల వార్తే.

వీటికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (యుక్రెయిన్‌-రష్యా, ఇరాన్‌-ఇజ్రాయెల్‌), ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు కూడా మార్కెట్ల పతనానికి మరో కారణం.

వరుస నష్టాలతో కుదేలవుతున్న ఇన్వెస్టర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెప్టెంబరు 27 నుంచి రూ.50లక్షల కోట్ల సంపద ఆవిరి అయినట్టు అంచనా

నిజంగా రూ.50 లక్షల కోట్ల సంపద పోయిందా?

బీఎస్ఈలో ఉన్న లిస్టెడ్‌ సంస్థల మార్కెట్‌ విలువను మొత్తంగా లెక్కగట్టి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌గా పరిగణిస్తారు. మార్కెట్‌ పడిపోయినప్పుడు సాధారణంగా స్టాక్స్‌ ధరలు పతనమవుతాయి. అప్పుడు వీటి మార్కెట్‌ విలువ కూడా తగ్గిపోతుంది.

అయితే ఇప్పుడు ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో నష్టాలు కనిపిస్తాయి కానీ వీటిని ఊహాత్మక నష్టం కింద చూడాలి. సెప్టెంబర్‌ 27 నుంచి ఇన్వెస్టర్లు సుమారు రూ.50 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయారు.

2024 సెప్టెంబర్‌ 27న బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 478 లక్షల కోట్ల రూపాయిలుగా ఉంది. అది ఇప్పుడు రూ.429 లక్షల కోట్లుగా ఉంది. అంటే సుమారు రూ.50 లక్షల కోట్ల వరకూ మార్కెట్‌ క్యాప్‌ హరించుకుపోయినట్టు లెక్కించుకోవాలి.

ఇక మార్కెట్ల పరిస్థితేంటి?

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. జీడీపీ వృద్ధి రేటు 6-7శాతం చేరుకోవడంలో భారత్ సఫలీకృతమవుతోంది. అందుకే సూచీలు కూడా అదే స్థాయిలో వృద్ధిని నమోదు చేశాయి.

దీనికి తోడు రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున మార్కెట్లోకి నిధుల వరద పారించడం వల్ల కూడా సూచీలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచమంతా రెండు, మూడు శాతం వృద్ధికే పరిమితమైన తరుణంలో భారత్ రెట్టింపు జీడీపీని నమోదు చేయడంతో పాటు కరోనా తర్వాత ప్రజల వినిమయ రూపాలు అనూహ్యంగా మారిపోయాయి.

ఇళ్ల అమ్మకాలు, కార్లు, బయట తినే ఆహారం, దుస్తులు, బంగారం.. ఇలా వినియోగదారులు అప్పటి వరకూ దాచుకున్న డబ్బును ఒక్కసారిగా బయటికి తీయడంతో చాలా వ్యాపారాలు మంచి లాభాలను నమోదు చేశాయి.

వరుసగా నాలుగేళ్ల పాటు వృద్ధి నమోదు చేసిన ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు కాస్త నీరసించింది.

కానీ ముడిచమురు ధరలు 70 డాలర్ల దగ్గరే ఉండడం (భారత్‌కు రష్యా నుంచి మరింత తక్కువకే క్రూడ్‌ లభిస్తోంది), యుక్తవయసు జనాభా, వీళ్ల వినిమయ ఖర్చు గణనీయంగా పెరగడం, పొదుపు నుంచి మెల్లిగా ఖర్చు వైపు మళ్లడం, తలసరి వినియోగం పెరగడం, ఇన్వెస్టర్లలో పరిణితి పెరగడం, స్టాక్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం అధికం కావడం, సంప్రదాయ పెట్టుబడి విధానాల నుంచి మెల్లిగా జనం ఆలోచనా ధోరణి మారడం వంటివి భారత్‌కు అనేక ప్రోత్సాహక అంశాలు.

ఐపీఓలకు దూరంగా ఉండాలంటున్న ఎనలిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 10-12 శాతం లాభాలతోనే సంతృప్తి పడాల్సిన పరిస్థితి

ఎనలిస్టులు ఏమంటున్నారు ?

‘‘మూడేళ్ల క్రితం వచ్చిన లాభాలను దృష్టిలో పెట్టుకని, రిటైల్‌ ఇన్వెస్టర్లు అదే స్థాయి లాభాలను ఆశించవద్దు. ఈ పరిస్థితుల్లో ఏడాదికి 10-12 శాతం లాభాలు వచ్చినా సంతృప్తి పడాల్సిన పరిస్థితి. రాబోయే జనవరి నుంచి మాత్రమే పరిస్థితులు మనకు అనుకూలంగా మారొచ్చు. డోనల్డ్‌ ట్రంప్‌ జనవరిలో అధికారం చేపట్టిన తర్వాత, ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి.

రిటైలర్‌ ఇన్వెస్టర్‌ చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వాలిటీ స్టాక్స్‌కు మాత్రమే పరిమితం కావాలి. బ్రోకింగ్‌ కంపెనీలు ఇచ్చే మార్జిన్ ట్రేడింగ్‌ ఫెసిలిటీ (ఎంటీఎఫ్)ను వాడుకునే పద్ధతులను తగ్గించుకోవాలి. మన దగ్గర రూ.10 ఉంటే, వాళ్లు రూ.50 వరకూ ఎక్స్‌పోజర్‌ ఇస్తున్నారు. దీనివల్ల ఏ చిన్న నష్టాలు వచ్చినా, వాటిని పూడ్చుకునేందుకు నెలల సమయం పడుతుంది. పైగా, వడ్డీ కూడా భారీగా కట్టాలి. అందుకే మీ దగ్గరున్న నిధులతోనే మీరు ఇన్వెస్ట్, ట్రేడ్‌ చేయండి కానీ, ఎంటీఎఫ్‌ తీసుకోవద్దు. ఇక్కడి నుంచి మార్కెట్లలో ఇన్వెస్టర్లకు అంత తేలిక కాదు’’ అని సీనియర్ మార్కెట్ అనలిస్ట్ బాలసుబ్రమణ్యం ప్రభల సూచించారు.

‘’నిఫ్టీ ఇక్కడి నుంచి భారీగా పడకపోవచ్చు. కానీ స్టాక్స్‌ మాత్రం పడే అవకాశం ఉంది. స్టాక్‌ స్పెసిఫిక్‌ కరెక్షన్‌ రావొచ్చు. ఇక్కడి నుంచి దశల వారీగా మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌ మొదలుపెట్టొచ్చు. సేవలు, ఆరోగ్యం, నిర్మాణ రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంది. వాటివైపు దృష్టి పెట్టండి. కొద్దిగా రక్షణ ఉంటుంది. క్వాలిటీ స్టాక్స్‌లో ఉంటే.. ఎప్పటికీ టెన్షన్‌ అవసరం లేదు. మార్కెట్‌ కోలుకున్నప్పుడు ఆ స్టాక్సే ముందుగా లాభాల్లోకి వస్తాయి.

ఐపీఓలకు దూరంగా ఉండడం మంచిది. ఇక్కడి నుంచి వచ్చే ఐపీఓల్లో భారీ లిస్టింగ్‌ లాభాలు ఉండకపోవచ్చు. ఇప్పటికే తాజా ఐపీఓల్లో స్టాక్స్ అలాట్‌ అయి ఉంటే, వాటిల్లో ప్రాఫిట్‌ బుక్ చేసుకోవడం మంచిది. సిప్‌ పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు, ఇది సరైన సమయం’’ అని మార్కెట్ అనలిస్ట్ ఎ.శేషు వివరించారు.

‘’సాధారణంగా ఇన్ని రోజుల పతనం తర్వాత కోలుకోవడం మొదలు కావాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు. స్టాక్స్ పడినప్పుడు యావరేజ్‌ కోసం వేచి చూడొద్దు. క్వార్టర్లీ కార్పొరేట్ ఫలితాలు బాగోలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మీ పోర్ట్‌ఫోలియోలో ఫలితాలు బాగున్న కంపెనీల షేర్లను గుర్తించండి. వాటిల్లోనే మళ్లీ ఇన్వెస్ట్‌ చేయచ్చు. మీరు రూ.100 ఇన్వెస్ట్‌ చేద్దామని అనుకుంటే, అందులో ఇప్పుడు రూ.20 మాత్రమే పెట్టుబడి పెట్టండి. దశల వారీగానే స్టాక్స్ కొనండి’’ అని మార్కెట్ అనలిస్ట్ సి.శేఖర్‌ సూచిస్తున్నారు.

(గమనిక: ఈ సమాచారం అంతా అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలైనా ఆర్థిక నిపుణులను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)