రష్యాపై యుక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులు చేసేందుకు అమెరికా అనుమతి, పుతిన్ హెచ్చరిక ఏమిటి?

ఫొటో సోర్స్, White Sands Missile Range
- రచయిత, పాల్ ఆడమ్స్, కాథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అమెరికా అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై దాడికి ఉపయోగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుక్రెయిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమెరికా పాలసీలో పెద్ద మార్పు జరిగిందని ఆ దేశ అధికారి ఒకరు బీబీసీ భాగస్వామి సీబీఎస్ వార్తా సంస్థ వద్ద ధ్రువీకరించారు.
యుక్రెయిన్ సరిహద్దుల ఆవల ఏటీఏసీఎంఎస్ క్షిపణులతో దాడి చేయడానికి కొన్ని నెలలుగా ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్ స్కీ అనుమతి కోరుతున్నారు. ఇందుకు అమెరికా ఆమోదం తెలిపిందనే వార్తలపై జెలియన్ స్కీ స్పందిస్తూ "కొన్ని బహిరంగంగా ప్రకటించరు, క్షిపణులే మాట్లాడతాయి" అని అన్నారు.
ఈ చర్య.. నేటో నేరుగా యుద్ధంలో పాల్గొనడమే అవుతుందని పశ్చిమదేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే హెచ్చరికలు పంపారు.
తాజాగా క్షిపణుల వినియోగానికి 'అమెరికా గ్రీన్ సిగ్నల్' వార్తలపై పుతిన్ ఇంకా స్పందించలేదు కానీ సీనియర్ రష్యన్ అధికారులు మాత్రం దీనిని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నారు.


ఫొటో సోర్స్, EPA
ఎందుకీ ఆకస్మిక నిర్ణయం?
అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోని యుక్రెయిన్ దళాల రక్షణ కోసం అని చెబుతున్నారు. ఈ ప్రాంతంపై ఆగస్టులో యుక్రెయిన్ ఆకస్మిక దాడి చేసింది.
యుక్రెయిన్ తన వద్ద ఉన్న ఈ చిన్న రష్యన్ భూభాగంపై నియంత్రణను కొనసాగించడానికి బైడెన్ ప్రభుత్వం మద్దతిస్తున్నట్లుగా ఇది చూపుతోంది. ఇది భవిష్యత్తు శాంతి చర్చలలో యుక్రెయిన్‌కు ప్రయోజనాన్ని ఇవ్వవచ్చు.
బైడెన్ నిర్ణయం దేశానికి చాలా ముఖ్యమైనదని కీయేవ్‌లోని యుక్రెయిన్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ సెంటర్ చైర్మన్ సెర్హి కుజాన్ బీబీసీకి తెలిపారు. ఇది యుద్ధ గమనాన్ని మార్చే విషయం కాకపోయినా రష్యన్ దళాల సామర్థ్యాలను ఎదుర్కోవడానికి తమ దళాలకు సరిపడినంత బలం ఇస్తుందని భావిస్తున్నామని చెప్పారు.
యుక్రెయిన్‌తో పోరాడేందుకు రష్యా తరపున ఉత్తర కొరియా సైనికులు రావడంతో, దీనికి ప్రతిస్పందనగా ఏటీఏసీఎంఎస్ వినియోగానికి బైడెన్ ఆమోదం లభించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారులు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్‌లకు తెలిపారు.
యుక్రెయిన్ బలగాలపై రష్యా, ఉత్తర కొరియా దళాల భారీ దాడిని ఎదుర్కొనేందుకు ఆదివారం నాడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని కుజాన్ చెప్పారు. రష్యాలోని కుర్స్క్ నుంచి యుక్రెయిన్ బలగాలను బయటకు పంపే లక్ష్యంతో రష్యా, ఉత్తరకొరియా దళాలు రెండు రోజుల్లో ఈ దాడిని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.
కుర్స్క్‌లో 11,000 మంది ఉత్తర కొరియా సైనికులు ఉన్నారని యుక్రెయిన్ గతంలో అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏటీఏసీఎంఎస్ ప్రత్యేకత ఏమిటి?
బైడెన్ నిర్ణయం మరొక ముఖ్యమైన ప్రభావం చూపనుంది ‘లాంగ్ రేంజ్ స్టోర్మ్ షాడో’ క్షిపణులను రష్యాపైకి ప్రయోగించేలా యుక్రెయిన్‌ను అనుమతించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్‌లు నిర్ణయం తీసుకోవడాన్ని ఇది సులభతరం చేస్తుంది. అయితే, బైడెన్ నిర్ణయంపై ఈ రెండు దేశాలు ఇంకా స్పందించలేదు.
ఏటీఏసీఎంఎస్ క్షిపణులు 300 కిలోమీటర్ల దూరం వరకు చేరుకోగలవు. అధిక వేగం కారణంగా వాటిని అడ్డుకోవడం కూడా కష్టం.
తూర్పు యుక్రెయిన్‌లోని రష్యా స్థావరాలే లక్ష్యంగా యుక్రెయిన్ మొదటిసారిగా అమెరికా సరఫరా చేసిన సుదూర క్షిపణులను ప్రయోగించినట్లు జెలియన్ స్కీ గత నెలలో ధ్రువీకరించారు.
తూర్పు డొనెట్స్క్ ప్రాంతం నుంచి పోక్రోవ్స్క్ వస్తున్న రష్యన్ దళాలను వెనక్కి పంపడానికి యుక్రెయిన్ నెలల తరబడి పోరాడుతోంది.
యుక్రెయిన్ దళాలకు పోక్రోవ్స్క్ కీలకమైన సరఫరా కేంద్రంగా ఉంది.
దాడులు తీవ్రతరం చేసిన రష్యా
యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు తీవ్రమయ్యాయి. అక్టోబరులో రష్యా 2,000 డ్రోన్‌లను ప్రయోగించింది. యుక్రెయిన్ జనరల్ స్టాఫ్ ప్రకారం ఇప్పటివరకు ఈ యుద్ధంలో ప్రయోగించిన అత్యధిక డ్రోన్లు ఇవి.
రష్యా శనివారం రాత్రి యుక్రెయిన్‌పై దాడి చేసింది. గత కొద్దినెలల్లో రష్యా చేసిన పెద్ద దాడి ఇదే. యుక్రెయిన్‌పై సుమారు 120 క్షిపణులు, 90 డ్రోన్లు ప్రయోగించారని, దాడుల్లో దాదాపు 10 మంది మరణించారని జెలియన్ స్కీ ప్రకటించారు.
ఆదివారం సాయంత్రం కూడా దాడులు కొనసాగాయి. రష్యా సరిహద్దుకు సమీపంలోని సుమీ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో ఇద్దరు పిల్లల సహా మరో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
అయితే, తనను తాను రక్షించుకోవడానికి మిత్రదేశాలు తగినంత మద్దతు ఇవ్వడంలేదని యుక్రెయిన్ అసంతృప్తి వ్యక్తంచేసింది. జనవరిలో పదవీ విరమణ చేయనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ యుక్రెయిన్‌కు సహాయాన్ని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
యుక్రెయిన్‌కు సైనిక సహాయం అందించడమంటే యుఎస్ వనరులను హరించడమేనని గతంలో డోనల్డ్ ట్రంప్ చెప్పారు. దీంతో ఆయన చేతికి అధికార పగ్గాలు వచ్చిన తరువాత అమెరికా యుక్రెయిన్‌కు మద్దతును తగ్గించడమో,నిలిపివేయడమో చేయవచ్చనే ఆందోళనలు ఉన్నాయి.
జర్మనీ పరిశోధనా సంస్థ కీల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వరల్డ్ ఎకానమీ ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 2024 జూన్ వరకు అమెరికా దాదాపు రూ.4.6 లక్షల కోట్ల విలువైన ఆయుధాలు, పరికరాలను పంపిణీ చేసింది లేదా పంపడానికి కట్టుబడి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














