హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ, అసలు ఈ క్షిపణులేంటి? రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా ఎలా దూసుకెళ్తాయి?

ఫొటో సోర్స్, EPA
దేశంలోనే తొలి దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణిని ఒడిశా తీరంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) విజయవంతంగా పరీక్షించింది.
వివిధ రకాల పేలోడ్స్‌ను 1,500 కి.మీ.ల దూరానికి పైగా మోసుకెళ్లగలిగేలా ఈ హైపర్‌సోనిక్ క్షిపణిని రూపొందించింది డీఆర్‌డీఓ.
ఈ క్షిపణిని గాలి, నీరు, భూమిపై ప్రయోగించవచ్చు.
పలు ప్రత్యేక వ్యవస్థలతో ఈ క్షిపణి ప్రయాణాన్ని ట్రాక్ చేశారు. అలాగే, వివిధ రకాల డొమైన్లలో దీన్ని వాడి చూశారు.
ఈ క్షిపణిని దేశీయంగా హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌కు చెందిన ల్యాబొరేటరీలు, వివిధ ఇతర డీఆర్‌డీఓ ల్యాబొరేటరీలు, పరిశ్రమ భాగస్వాములతో కలిసి తయారు చేశారు.
డీఆర్‌డీఓ సీనియర్ శాస్త్రవేత్తలు, సాయుధ దళాల అధికారుల సమక్షంలో ఈ హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించారు.
డీఆర్‌డీఓ సుదీర్ఘకాలంగా హైపర్‌సోనిక్ క్షిపణులను తయారు చేయడంపై పనిచేస్తోంది.
2020లోనే డీఆర్‌డీఓ విజయవంతంగా హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికిల్ (హెచ్ఎస్టీడీవీ)ను పరీక్షించింది.
ప్రస్తుతం హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

ఈ పరీక్షను చరిత్రాత్మక విజయంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ విజయంతో ఇలాంటి కీలక, అధునాతన సైనిక సాంకేతిక సామర్థ్యాలు ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనందుకు డీఆర్‌డీఓ బృందానికి, సాయుధ దళాలకు, రక్షణ పరిశ్రమకు రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
అసలు హైపర్‌సోనిక్ క్షిపణి అంటే ఏమిటి? దీని ప్రత్యేకతలేంటి?
హైపర్‌సోనిక్ క్షిపణులు అత్యాధునిక ఆయుధాలు. ఇవి Mach 5 మించి ప్రయాణించగలవు. అంటే ధ్వని వేగానికి ఐదు రెట్ల వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తాయి. గంటకు 3,400 మైళ్లు (దాదాపు 5,471 కి.మీ.) అంటే సెకనుకు 1 నుంచి 5 మైళ్ల (8 కి.మీ.) వేగంతో ఈ క్షిపణులు ప్రయాణించగలవు.
‘హైపర్‌సోనిక్’ అనే కేటగిరీ వెహికిల్స్ అత్యధికంగా Mach 25 అంటే సుమారు గంటకు 17,500 మైళ్లు (దాదాపు 28163 కి.మీ.) వేగాన్ని కూడా అందుకోగలవు. వీటి వేగాలు భిన్నంగా ఉంటాయి.
ఇదే సమయంలో, సబ్‌సోనిక్ క్షిపణులు ధ్వని వేగాన్ని దాటి ప్రయాణించలేవు. సూపర్‌సోనిక్ క్షిపణులు ధ్వని వేగానికి రెండు నుంచి మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు.
క్షిపణి లేదా విమానం ఎంత వేగంతో వెళుతుందో చెప్పడానికి దాని వేగాన్ని ధ్వని వేగంతో పోల్చి చూస్తారు.
ధ్వని వేగాన్ని ప్రామాణికంగా ‘మాక్’లో కొలుస్తారు. ఒక మాక్ అంటే గంటకు సుమారు 1,235 కిలోమీటర్లు.
ప్రస్తుతం మూడు రకాల హైపర్‌సోనిక్ క్షిపణులు ఉన్నట్లు అట్లాంటిక్ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొంది. అవి.. బూస్ట్ గ్లైడ్, ఎయిర్‌బ్రీతింగ్, గన్ లాంచ్డ్.
ఈ క్షిపణిలో అణ్వాయుధాలను కూడా అమర్చవచ్చా?
సంప్రదాయ ఆయుధాలతో పాటు, అణ్వాయుధాలను కూడా హైపర్‌సోనిక్ క్షిపణులలో అమర్చవచ్చని రక్షణ నిపుణులు రాహుల్ బేడీ చెప్పారు. ‘‘ఇది గేమ్ ఛేంజర్ కానుంది’’ అని ఆయన అన్నారు.
భారత్‌లో హైపర్‌సోనిక్ క్షిపణి ఆపరేషన్‌లోకి రావడానికి రెండు నుంచి మూడేళ్లు పట్టొచ్చని రక్షణ నిపుణులు, మాజీ ఎయిర్ కమోడోర్ (డా.) అశ్మిందర్ సింగ్ బహల్ చెప్పారు.
‘‘కారు మాదిరిగానే, తొలుత ప్రొటోటైప్‌ను తయారు చేస్తారు. ఆ తర్వాత పరీక్షిస్తారు. అప్పుడు ప్రొడక్షన్ చేపడతారు. ఇలాగే, ఈ క్షిపణిని కూడా. అందుకే, ఇది ఆపరేషన్‌లోకి వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, X/rajnathsingh
హైపర్‌సోనిక్ క్షిపణులపై పరిశోధనలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
‘‘హైపర్‌సోనిక్’’ అనే దానిపై రక్షణ, సైన్య వ్యవస్థలలో గత కొన్నేళ్లుగా బాగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ టెక్నాలజీపై పరిశోధన ప్రారంభమై 75 ఏళ్లు దాటాయని అట్లాంటిక్ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొంది. ఆపరేషన్ సామర్థ్యాలకు ఇది ఇప్పుడిప్పుడే చేరుకుంటోందని తెలిపింది.
హైపర్‌సోనిక్ క్షిపణుల అభివృద్ధిపై 1930ల నుంచే పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. ఈ పరిశోధనలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ సాధించిన ఎన్నో రాకెట్ విజయాలకు కారణమయ్యాయి.
రష్యా, చైనాలు హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థలో స్థానిక శక్తులుగా ఉన్నాయి. అమెరికా కూడా భారత్ మాదిరే ఇలాంటి టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది.
‘‘మరికొన్ని దేశాలు కూడా ఈ క్షిపణులు ఉన్నాయని చెప్పుకుంటున్నాయి. కానీ, వాటిల్లో కచ్చితత్వం లేదు. ఈ లెక్కన చూస్తే, ఈ అధునాతన టెక్నాలజీ ఉన్న మూడవ దేశం భారత్‌నే’’ అని రక్షణ నిపుణులు బహల్ చెప్పారు.
‘‘రష్యా, చైనా, భారత్‌ల వద్ద మాత్రమే కాకుండా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్ వద్ద కూడా హైపర్‌సోనిక్ క్షిపణులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇరాన్ కూడా హైపర్‌సోనిక్ క్షిపణి తయారు చేసినట్లు చెబుతోంది’’ అని రక్షణ నిపుణులు రాహుల్ బేడీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్‌సోనిక్ క్షిపణుల మధ్య తేడా ఏంటి?
క్రూయిజ్ క్షిపణులు భూమి ఉపరితలానికి దగ్గరగా ఎగురుతూ, తక్కువ దూరాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు.
బాలిస్టిక్ క్షిపణులు భూవాతావరణం నుంచి బయటకు వెళ్లి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా గురిపెట్టగలవు.
లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడానికి, శత్రువులు వీటి జాడను పసిగట్టకుండా ఉండేందుకు ఆకాశంలో తన కదలికలను నియంత్రించుకోవడం క్షిపణులకు అవసరం.
ఆధునిక హైపర్‌సోనిక్ క్షిపణులు ఈ పని చేయగలవని అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో రీసర్చ్ ఫెలో డాక్టర్ లారా గ్రెగో అంతకుముందు బీబీసీకి తెలిపారు.
"ఏరోడైనమిక్స్ ఫోర్స్ ఉపయోగించి ఇవి తమ దారి మళ్లించుకోగలవు. ఆకాశంలో చాలా వేగంగా ఎగురుతున్నప్పుడు కూడా పైకి, కిందకు జరగడానికి, కుడి, ఎడమలకు తిరగడానికి సులువుగా వీటిని డిజైన్ చేశారు. దీనివల్ల శత్రువు కన్నుగప్పి దాడి చేసే అవకాశం ఉంటుంది’’ అని లారా వివరించారు.
బాలిస్టిక్ మిసైళ్లలా అది ఆర్క్, ప్రొజెక్టైల్ ఏర్పడేలా చేయదు. అందుకే దాని లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అలా సూపర్‌సోనిక్ మిసైల్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌కు కూడా చిక్కదు.
సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఒక దేశం హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినపుడు, యాంటీ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ సాయంతో దానిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతుంది.
‘‘ఒకవేళ హైపర్‌సోనిక్ క్షిపణిని గుర్తించినా, దాన్ని కూల్చేయడం కష్టం. అది వెళ్లే వేగంతోనే యాంటీ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. దీని కోసం యారో-3 సిస్టమ్ కావాల్సి ఉంటుంది’’ అని బహల్ అన్నారు.
‘‘హైపర్‌సోనిక్ మిసైళ్లను నేలకూల్చడమనే విషయాన్ని మర్చిపోండి. ఇప్పటివరకు అసలు దానికన్నా తక్కువ వేగంతో వెళ్లే సూపర్‌సోనిక్ మిసైల్‌నే నేలకూల్చిన ఆధారాలు లేవు’’ అని డీఆర్‌డీఓ (ఆర్ అండ్ డీ) బ్రహ్మోస్ ఏరోస్పేస్ వ్యవస్థాపక సీఈవో, చీఫ్ కంట్రోలర్ డాక్టర్ శివథాను పిళ్లై అంతకుముందు బీబీసీ ప్రతినిధికి చెప్పారు.
హైపర్‌సోనిక్ టెక్నాలజీతో క్షిపణుల తయారీ తమ ముందున్న అతిపెద్ద ప్రాజెక్టు అని రెండేళ్ల క్రితమే శివథాను పిళ్లై బీబీసీకి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














