మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు?

- రచయిత, వినాయక్ హొగాడె
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
‘మహాయుతి’ పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోవడంతో ఆ కూటమి ప్రభుత్వమే అక్కడ ఏర్పడనుందని తేలిపోయింది.
అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న.. ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారు? అనేదే.
కూటమిలోని బీజేపీ, ఎన్సీపీ, శివసేనల్లో ఏ పార్టీకి ఆ పదవి దక్కుతుంది? ఏ నేత ఆ కుర్చీలో కూర్చుంటారనేది ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న.
శివసేన నేత ఏక్‌నాథ్ శిందే ఆ పదవిని వదులుకుని అత్యధికంగా 132 సీట్లు గెలిచిన బీజేపీకి చెందిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు మద్దతుఇస్తారా?
ఒకవేళ ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీకే సీఎం పదవి ఇస్తే ఫడణవీస్‌కే అవకాశం దొరుకుతుందా? లేదంటే కొత్తవారికి చాన్స్ వస్తుందా?
కూటమిలోని మరో పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ నేత అజిత్ పవార్ కూడా రేసులోకి వస్తారా?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికితే కొత్త సీఎం ఎవరనే ప్రశ్నకు జవాబు చెప్పడం సులభమవుతుంది.


ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించని కూటములు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిందే ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు కూటమి ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు.
మహా వికాస్ అఘాడి పరిస్థితీ అదే.
ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే తమ మధ్య గొడవలు రావచ్చని పార్టీల నేతలు ఆందోళన చెంది ఉండవచ్చు. అందుకే ఈ వ్యవహారాన్ని ఎన్నికల తర్వాత తేల్చుకోవాలని భావించి ముందుగా ప్రకటన చేయలేదు.
కానీ, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది.
ఎన్నికలకు ముందు మహా వికాస్ అఘాడిలో ముఖ్యమంత్రి పదవి మీద చాలా గందరగోళం ఉంది.
ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా ముఖ్యమంత్రి పదవికి ముందుకు రావడానికి ఆసక్తి చూపించారు. అయితే కూటమిలోని మరో రెండు పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు.
ఇక ‘మహాయుతి’లో ఎన్నికలకు ముందు అలాంటి గందగోళం లేదు. ఈ కూటమి కూడా సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించనప్పటికీ నేతలెవరూ దానిపై ఆసక్తి కనబరుస్తూ ప్రకటనలేమీ చేయలేదు.
అయితే.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి అనేక ‘ఆప్షన్స్’ ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు అభయ్ దేశ్‌పాండే ‘బీబీసీ మరాఠీ’తో చెప్పారు.
బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి ఆ పార్టీ నేత సీఎం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభయ్ అభిప్రాయపడ్డారు.
అయితే, త్వరలో ముంబయి కార్పొరేషన్ సహా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో అవన్నీ దృష్టిలో పెట్టుకుని బీజేపీలోనే కొత్త ముఖాలను తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అదే నేతను సీఎంగా కొనసాగించడం లేదాఎన్నికల ఫలితాల తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడం కూడా జరగొచ్చని అభిప్రాయపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, మరాఠా రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఏక్‌నాథ్ శిందేను ముఖ్యమంత్రిగా కొనసాగించడం మరో ప్రత్యామ్నాయం అని చెప్పారు.
'మళ్లీ వస్తా' అని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఫడణవీస్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమని అభయ్ చెప్పారు.
బీజేపీ నుంచే కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఫడణవీస్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశాలూ ఉండొచ్చన్నారు.
‘అనేక ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఏక్‌నాథ్ శిందే, ఫడణవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని అభయ్ దేశ్‌పాండే చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏక్‌నాధ్ శిందే
శివసేన అధినేత ఏక్‌నాథ్ శిందే ప్రస్తుత ముఖ్యమంత్రి. 2022లో శివసేనలో తిరుగుబాటు చేసి 40 మంది ఎమ్మెల్యేలను తనతో పాటు గౌహతికి తీసుకెళ్లారు. ఆయన చేపట్టిన 'గౌహతి తిరుగుబాటు' కారణంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది.
ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోగానే దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ విశ్లేషకులు కొంతమంది భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఏకనాథ్ శిందేకు ముఖ్యమంత్రి పదవి దక్కింది.
'ఏకనాథ్ శిందే నామమాత్రపు ముఖ్యమంత్రి, నిజమైన అధికారం దేవేంద్ర ఫడణవీస్ చేతిలో ఉంది' అని అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి.
అయితే గత రెండున్నరేళ్ల అధికారంలో రాష్ట్రాన్ని స్వతంత్రంగా నడపగలనని నిరూపించడంలో శిందే విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికల్లో శివసేన తరఫున ఏకనాథ్ శిందే 7ఎంపీ సీట్లు గెలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని శివసేన 57 స్థానాల్లో గెలిచింది.
ఫలితాల అనంతరం శిందే విలేకరులతో మాట్లాడినప్పుడు.. ‘మూడు పార్టీల నాయకులం కలిసి కూర్చుంటాం. ఎన్నికల్లో ఎలా కలిసి పోరాడామో అలాగే కలిసి నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/devendra.fadnavis
దేవేంద్ర ఫడణవీస్
ముఖ్యమంత్రి ఎవరనే చర్చలో దేవేంద్ర ఫడణవీస్ పేరు బలంగా వినిపిస్తుంది.
నిజానికి 2022లో ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేసి కూటమిలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత దేవేంద్ర ఫడణవీస్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే చర్చ జరిగింది.
కానీ శిందేకు పదవి దక్కింది అప్పుడు.
అయితే ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో ఫడణవీస్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే చర్చ జోరందుకుంది.
బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ ఇటీవల మాట్లాడుతూ.. ‘కూటమిలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారు. అది ఫడణవీస్ అని నేను అనుకుంటున్నాను’ అన్నారాయన.
ఫలితాలు వస్తున్న సమయంలో ఫడణవీస్ స్పందిస్తూ.. ‘ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఫార్ములా లేదు. మూడు పార్టీల జాతీయ నేతలు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదు. ఈ విషయాన్ని అమిత్‌షా స్పష్టం చేశారు. మూడు పార్టీల నేతలు కలిసి తీసుకునే నిర్ణయాన్ని అందరూ ఆమోదిస్తారు’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Facebook/Ajit Pawar
అజిత్ పవార్
మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అజిత్ పవార్.
2022లో ఏక్‌నాథ్ శిందే శివసేన నుంచి విడిపోగా... 2023లో అజిత్ పవార్ ఎన్‌సీపీ నుంచి వేరుపడ్డారు.
శరద్ పవార్‌ను సవాలు చేస్తూ, 2023 జులైలో 8 మంది ఎమ్మెల్యేలతో శిందే ప్రభుత్వంలో చేరారు.
అజిత్ పవార్ మరోసారి ఉపముఖ్యమంత్రి అయిన మాట వాస్తవమే కానీ, ముఖ్యమంత్రి కావాలనే తన కోరికను ఆయన దాచుకోవడం లేదు.
‘కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో అజిత్ పవార్ ముఖ్యమంత్రి కాలేరని ఎవరూ చెప్పలేరు.
ఎవరి అంచనాలకు అందని రీతిలో మహా కూటమి అజిత్‌పవార్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చు’ అని అభయ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Vinod Tawde
బీజేపీలో ఇంకెవరు?
శివసేన, ఎన్సీపీలో సీఎం అభ్యర్థులు ఒక్కొక్కరే ఉన్నారు కానీ బీజేపీలో ఆ సంఖ్య పెద్దదే.
ఫడణవీస్ కాకుండా వినిపించే మరో పేరు వినోద్ తావ్డే.
మహారాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు 'ఎదిగిన' వినోద్ తావ్డే 2014 నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.
ఆయన ఈసారి ముఖ్యమంత్రి కాగలరా? ఎన్నికలకు కేవలం ఒక రోజు ముందు, గోరేగావ్‌లోని వివంతా హోటల్ దగ్గర తావ్డే డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ బహుజన్ వికాస్ అఘాడి కార్యకర్తలు వినోద్ తావ్డేను చుట్టుముట్టారు.
ఈ కేసు జనం నోళ్లలో నానింది. ఈ కేసు కారణంగా వినోద్ తావ్డేతో పాటు బీజేపీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి
ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు, మహాయుతి కూటమి అధికారంలోకి వస్తే పాత ముఖాన్ని తిరిగి తీసుకురావచ్చు లేదా పూర్తిగా కొత్త ముఖాన్ని ఇవ్వవచ్చు అని తావ్డే అన్నారు.
ఆయన ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వినోద్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆసక్తిగా ఉన్నారని ఊహాగానాలు వచ్చాయి.
అయితే, వినోద్ తావ్డే ఇప్పుడు ముఖ్యమంత్రి కాగలరా అనేది కాలమే నిర్ణయించాలి.

ఫొటో సోర్స్, Facebook/Pankaja Munde
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు వినోద్ తావ్డే, ఏక్‌నాథ్ ఖడ్సే, పంకజ ముండే పేర్లు చర్చలో ఉన్నాయి.
ఖడ్సే ప్రస్తుతం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో ఉన్నారు. దాంతో ఆయనకు ఇప్పుడు ఎలాంటి అవకాశం లేదు.
పంకజ ముండేకు కూడా అవకాశం రావొచ్చని అంటారు కొందరు విశ్లేషకులు.
లోక్‌సభ ఎన్నికలలో పంకజ ముండే ఓడిపోయారు. అయినప్పటికీ మహారాష్ట్ర బీజేపీలో ఆమె కీలక మహిళా నేత.
ముఖ్యమంత్రి పదవికి మహిళా నేతలను పరిగణనలోకి తీసుకుంటే ఆమె ముందుంటారు.
మహారాష్ట్రలో బీజేపీ కొత్త ముఖంతో ప్రయోగాలు చేస్తుందా అన్న ప్రశ్నకు అభయ్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్య పోరు ఉంది. మహారాష్ట్రలో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














