మహారాష్ట్ర ఎన్నికలు: ఐదు నెలల్లో ఏం జరిగింది? గాలి బీజేపీకి అనుకూలంగా ఎలా మారింది?

    • రచయిత, సుశీలా సింగ్, మొహమ్మద్ షాహిద్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఈ ఇంటరాక్టివ్ చూసేందుకు అధునాతన బ్రౌజర్, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమి, బీజేపీ, కాంగ్రెస్, శివసేన, దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాధ్ శిందే, ముంబయి, హిందూత్వ, ఆరెస్సెస్

ఫొటో సోర్స్, ANI

2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధిక్యం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని అనుకున్నారు.

అయితే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేడా ఉంటుందని ఈ ఏడాది జరిగిన హరియాణా అసెంబ్లి ఎన్నికలు నిరూపించాయి. మహారాష్ట్రలోనూ ఇప్పుడు అదే జరిగింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 231 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసి 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఐదు నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఈ ఐదు నెలల్లోనే బీజేపీ మాహారాష్ట్ర రాజకీయాన్ని మార్చేసింది.

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడి 30 స్థానాలను సొంతం చేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి 18 సీట్లు వచ్చాయి.

పొత్తుల్లో భాగంగా బీజేపీ మహారాష్ట్రలో 23 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి 9 సీట్లు మాత్రమే గెలిచింది.

బీబీసీ న్యూస్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమి, బీజేపీ, కాంగ్రెస్, శివసేన, దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాధ్ శిందే, ముంబయి, హిందూత్వ, ఆరెస్సెస్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, లోక్‌సభ ఎన్నికల్లో (మహారాష్ట్రలో) ఓటమి నుంచి కోలుకుని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.

బీజేపీ ఎలా కోలుకుంది?

లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆ పార్టీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి ఓటమి తప్పదని రాజకీయ పరిశీలకులు భావించారు.

అయితే, అందుకు విరుద్ధంగా ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంతో పాటు, ముఖ్యమంత్రి పదవి కూడా ఆ పార్టీకే దక్కుతుందనే చర్చ మొదలైంది.

ఐదు నెలల్లో బీజేపీ మహారాష్ట్ర రాజకీయాన్ని ఎలా మార్చివేయగలిగింది?

ఈ ప్రశ్నకు ముంబయికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సమర్ ఖడస్ స్పందిస్తూ.. “మహాయుతి కూటమి వ్యూహామే ఇందుకు కారణం. లాడ్లీ బహీన్ యోజన, హిందుత్వ, కులాలను ఏకం చేసే వ్యూహం బీజేపీకి ఈ విజయాన్ని అందించాయి” అని చెప్పారు.

“ఐదు నెలల్లో చాలా జరిగింది. మొదట లాడ్లీ బహీన్ పథకాన్ని తెచ్చారు. ఇందులో 2.5 కోట్ల మంది మహిళల ఖాతాల్లో నాలుగు నెలల డబ్బులు జమ చేశారు. దీనితో పాటు, 'బంటేంగే టు కటేంగే' (విడిపోతే పడిపోతాం), ‘ఏక్ రహేంగేతో సేఫ్ రహేంగే’ ( ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం) అనే నినాదాలు వచ్చాయి. దీంతో హిందువుల ఓట్లు ఏకమయ్యాయి” అని సమర్ చెప్పారు.

“బీజేపీ చాలా ప్రయోగాలు చేసింది. ఇది కాకుండా ఆరు వేర్వేరు పార్టీలు ఉండడంతో గందరగోళం నెలకొంది. బీజేపీ ఓట్ల శాతం పెద్దగా ఉండకపోవచ్చు కానీ మహావికాస్ అఘాడి ఓట్ షేర్ మాత్రం తక్కువే” అని సమర్ ఖదస్ వివరించారు.

“లోక్‌సభ ఎన్నికల్లో చేసిన తప్పుల నుంచి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గుణపాఠం నేర్చుకుంది” అని బీబీసీ మరాఠీ ఎడిటర్ అభిజీత్ కాంబ్లే చెప్పారు.

“మహాయుతి కూటమి ఓబీసీ ఓటర్లను తమ వైపుకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించడంతో ఉత్తర మహారాష్ట్రలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం విధానపరమైన మార్పులు చేసింది. అదే సమయంలో బీజేపీ తన ఓటు బ్యాంకును కాపాడుకుంది” అని అభిజీత్ చెప్పారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమి, బీజేపీ, కాంగ్రెస్, శివసేన, దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాధ్ శిందే, ముంబయి, హిందూత్వ, ఆరెస్సెస్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో “గేమ్ ఛేంజర్”గా మారిన ‘లాడ్లీ బహీన్ స్కీమ్’

‘లాడ్లీ బహీన్ పథకం’ మొత్తం పరిస్థితిని మార్చేసిందా?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘లాడ్లీ బహీన్ స్కీమ్’ ను “గేమ్ ఛేంజర్”గా అభివర్ణిస్తున్నారు.

ట్రెండ్స్ చూస్తే ఈ స్కీమ్ మొత్తం పరిస్థితిని మార్చేసిందని చెప్పవచ్చని అభిజీత్ కాంబ్లే చెప్పారు.

ఈ పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెలా 1,500 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రతిపాదించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ స్కీము లబ్ధిదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

“మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని రెండున్న నెలల కిందటే చెప్పాను. అయితే ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. లాడ్లీ బహీన్ యోజన, ఇతర ప్రభుత్వ పథకాలు గేమ్ ఛేంజర్‌గా పనిచేశాయి. వీటి ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లోనూ కనిపించింది” అని ప్రముఖ పాత్రికేయుడు జితేంద్ర సింగ్ బీబీసీ ప్రతినిధి సుమేధ పాల్‌తో చెప్పారు.

“మరాఠా ఉద్యమం, రైతులకు ఉపశమనం కలిగించింది. వారి సమస్యలపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇవే కాకుండా ‘బాటేంగేతో కాటేంగే’, ‘ఏక్ హోతో సేఫ్ హై’ అనే నినాదాల తరహాలో పోలరైజేషన్ రాజకీయాలు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేశాయి. ఆర్‌ఎస్‌ఎస్ ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో మహాయుతికి మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారం చేసింది. ఓటింగ్ రోజు కూడా, ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది" అని ఆయన వివరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్కువ ర్యాలీలు నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధాని ఎక్కడ ర్యాలీలు నిర్వహించారో అక్కడ బీజేపీ ఓడిపోయింది. ఈ కారణంగానే ఈసారి వ్యూహం మార్చి ర్యాలీలను తగ్గించారు.

ఈసారి ఎన్నికలు స్థానిక సమస్యలపైనే జరుగుతున్నాయని, స్థానిక నేతలే ఎక్కువగా ర్యాలీల్లో ప్రసంగించారని జితేంద్ర సింగ్ చెప్పారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమి, బీజేపీ, కాంగ్రెస్, శివసేన, దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాధ్ శిందే, ముంబయి, హిందూత్వ, ఆరెస్సెస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హిందుత్వ రాజకీయాలను ఎదుర్కోడం, తిప్పి కొట్టడంలో రాహుల్ గాంధీ విఫలం అవుతున్నారని నిపుణుల అభిప్రాయం.

మహా వికాస్ అఘాడి , రాహుల్ గాంధీ వ్యూహాం ఎక్కడ విఫలమైంది?

అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ ఆఘాడి కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కనబరిచిన తన పనితీరును పునరావృతం చేస్తుందని, అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు.

మహావికాస్ అఘాడి వ్యూహం ఎక్కడ విఫలమైంది?

“మహాయుతి ప్రభుత్వం లాడ్లీ బహీన్ పథకాన్ని తీసుకువచ్చినప్పుడు, మహావికాస్ అఘాడి దానిని విమర్శించింది. ఈ పథకాన్ని కొనసాగించలేరని ఆరోపించింది. ఆ తర్వాత మహావికాస్ అఘాడీ తన మేనిఫెస్టోలో మహిళలకు 3 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది” అని సమర్ చెప్పారు.

“మహావికాస్ అఘాడి కూటమిలోని పార్టీలు కలిసి పనిచేయడం పెద్దగా కనిపించలేదు. కూటమిలో తమ బలం ఎక్కువ కాబట్టి తమకు ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ భావించింది. దీంతో కాంగ్రెస్, శివసేన మధ్య దూరం పెరిగింది. మరోవైపు, రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేని అదాని, ధారావి, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై దృష్టి సారించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యల ఆధారంగా ఎన్నికల్లో విజయం సాధించేట్లైతే, వామపక్షాలు దేశాన్ని పాలిస్తూ ఉండేవి. ఎందుకంటే వాళ్లు ఈ సమస్యల మీద ఎక్కువగా పోరాడుతూ వస్తున్నారు” అని సమర్ చెప్పారు.

టిక్కెట్ రాలేదని పోటీకి దిగిన తిరుగుబాటు అభ్యర్థుల వల్ల మహావికాస్ అఘాడీకి ఎక్కువ నష్టం జరిగిందని సీనియర్ జర్నలిస్టు జితేంద్ర దీక్షిత్ అన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమి, బీజేపీ, కాంగ్రెస్, శివసేన, దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాధ్ శిందే, ముంబయి, హిందూత్వ, ఆరెస్సెస్

ఫొటో సోర్స్, ANI

హిందుత్వ కార్డు ఎలా పని చేసింది ?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు 'బంటేంగే తో కటేంగే' నాదాన్ని విస్తృతంగా ఉపయోగించారు. 'కలిసి ఉంటేనే సురక్షితం' అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదాలు చేశారు. ఈ నినాదాలు హిందుత్వానికి, కులాల ఏకీకరణకు ముడిపడి ఉన్నట్లు కనిపించింది.

“ఇది హిందుత్వ లేదా ప్రధాని మోదీ విజయం కాదు, వ్యూహాత్మక విజయం” అని సమర్ ఖదాస్ అభిప్రాయపడ్డారు.

“హిందుత్వ రాజకీయాల విషయానికొస్తే, దేశం అంతటా బీజేపీ హిందుత్వ రాజకీయాలు చేస్తోంది. వీటిని ఎదుర్కోవడంలో, గట్టిగా తిప్పి కొట్టడంలో కాంగ్రెస్ విఫలం అవుతోంది” అని సమర్ అభిప్రాయపడ్డారు.

“మహా వికాస్ అఘాడికి బీజేపీ హిందుత్వ వ్యూహం గురించి అవగాహన లేదు. రాహుల్ గాంధీ జేఎన్‌యూ ప్రొఫెసర్‌లాగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనకు ఎలాంటి వ్యూహాలు ఉండటం లేదు. కాంగ్రెస్ నేతలి ఓబీసీల గురించి మాట్లాడతారు. అయితే దేశ ప్రధానమంత్రి సహా అనేక మంది ఓబీసీలు కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్నారు” అని ఆయన గుర్తు చేశారు.

“మహావికాస్ అఘాడి మతతత్వ అంశంపై బహిరంగంగా మాట్లాడి ఉండాలి. హిందువుల ఓట్లు చీలిపోతాయని కాంగ్రెస్ ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు హిందువుల ఓట్లు చీలలేదు. అదానీ వ్యవహారం స్టాక్ మార్కెట్లు, వ్యాపార వర్గాలు, దర్యాప్తు సంస్థలకు సంబంధించినది. దానితో మహారాష్ట్ర ప్రజలకు ఏం అవసరం ఉంది? కాంగ్రెస్ హయాంలో టాటా, అంబానీ లాంటి ఎందరో వ్యాపారవేత్తలు పుట్టారు. ఇప్పుడు ప్రధాని మోదీ హయాంలో అదానీ ఉన్నారు. ఇది ఏ లాజిక్? సామాజిక సిద్ధాంతం వ్యక్తిగత సాపేక్షంగా ఉండకూడదు” అని సమర్ ఖడస్ చెప్పారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమి, బీజేపీ, కాంగ్రెస్, శివసేన, దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాధ్ శిందే, ముంబయి, హిందూత్వ, ఆరెస్సెస్

ఫొటో సోర్స్, ANI

ఠాక్రే కుటుంబం భవిష్యత్ ఏం కానుంది?

రెండున్నరేళ్ల కిందట ఏక్‌నాథ్ శిందే శివసేనను విచ్ఛిన్నం చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన గెలిచి, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే భవిష్యత్తుపై ఊహాగానాలు వినిపించడం ఎక్కువైంది.

‘మీరు ఎలా పోరాడుతారనే దానిపైనే రాజకీయాల్లో మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి? ఆంధ్రప్రదేశ్‌లో కాలినడకన తిరిగి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించారు. ఇప్పుడు చంద్రబాబు దెబ్బకు జగన్ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. కాబట్టి రాజకీయాల్లో భవిష్యత్ గురించి ఏమీ చెప్పలేం” అని సమర్ చెప్పారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి మెజారిటీ మార్కును దాటింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కూటమిలోని పార్టీల మధ్య పోరాటం జరుగుతుందా? అన్నది చూడాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)