రష్యా,యుక్రెయిన్ యుద్ధం: ప్రపంచం సంక్షోభం ముంగిట నిలుస్తోందా?

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌పై రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం, వెయ్యిరోజుల యుక్రెయిన్, రష్యా యుద్ధంలో కీలకపరిణామంగా మారింది. ఈ యుద్ధంలో రష్యా ఇంతటి శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించడం ఇదే మొదటిసారి.
యుక్రెయిన్‌లోని దినిప్రో నగరంపై రష్యా ఈ దాడిచేసింది. రష్యా హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌తోపాటుగా ఏడు క్రూయిజ్ మిసైళ్లను కూడా ప్రయోగించిందని యుక్రెయిన్ చెబుతోంది. అయితే, వీటిల్లో ఆరు క్షిపణులను కూల్చివేసినట్టుగా ప్రకటించింది.
అంతకుముందు అమెరికా అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యాపై యుక్రెయిన్ దాడిచేసింది. యుక్రెయిన్ దాడికి ప్రతిగా రష్యా కూడా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగడం ఇప్పుడు పశ్చిమదేశాలను కుదిపేస్తోంది.
ఒక ఆయుధ ప్రయోగం ఇంతటి చర్చకు దారితీయడం ఈ యుద్ధంలో ఇదే మొదటిసారి. గురువారం తెల్లవారుఝామున దినిప్రో నగరం కంపించేలా చేసిన భారీపేలుళ్ల శబ్దం అక్కడ ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది.


ఫొటో సోర్స్, White Sands Missile Range
రష్యాపైకి తమ క్షిపణులతో దాడి చేసేందుకు యుక్రెయిన్‌కు బ్రిటన్, అమెరికా అనుమతి ఇవ్వడంపై మాస్కో బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో యుద్ధం నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించినట్టు పోలాండ్ ప్రధాని డోనల్డ్ టస్క్ తెలిపారు. ఇది ప్రపంచ సంక్షోభమని, ఇది నిజమైనదని, తీవ్రమైనదని ఆయన చెప్పారు.
మరోపక్క యుక్రెయిన్‌కు తమ బేషరతు మద్దతు కొనసాగుతుందని స్వీడన్ రక్షణ మంత్రి పాల్ జాన్సన్ చెప్పారు.
రష్యా యుద్ద ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్న చైనా, అన్ని పక్షాలు శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.
తాజాగా రష్యా మరో పదునైన ఆయుధాలతో కూడిన డ్రోన్లతో యుక్రెయిన్‌పై దాడికి దిగింది. ఉత్తర యుక్రెయిన్ నగరమైన సుమీలోని ఓభవంతిపై ఈ దాడిచేసినట్టు అధికారులు తెలిపారు. యుద్ధంలో ఇలాంటి ఆయుధాలను వాడటం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
ప్రపంచ సంక్షోభమేనా?
అమెరికా సాయంతో రష్యా మీదకు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన యుక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి చేయడం యుక్రెయిన్‌కు దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడితో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒక ‘ప్రపంచ సంక్షోభంగా’ గా మారిందని పుతిన్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ దాడి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదంపై నిపుణులు చర్చించుకుంటున్నారు.
యుక్రెయిన్‌లోని దినిప్రో ప్రాంతం మీద రష్యా ప్రయోగించిన క్షిపణి శబ్ద వేగానికి పదింతల వేగంతో ప్రయాణిస్తుంది. సెకనుకు 3 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ క్షిపణి అత్యంత మెరుగైన హైపర్ సోనిక్ రకాల్లో ఒకటి అని పుతిన్ ప్రకటించారు.
యుద్ధ ఆయుధాల ప్రయోగంలో వేగం అతి ముఖ్యమైన అంశం. ఆయుధం ఎంత వేగంగా భూతలాన్ని చేరుకుంటే దాన్ని ఎదుర్కోవడం అంతే కష్టంగా మారుతుంది.
అయితే యుక్రెయిన్‌కు మద్దతు పలుకుతున్న పశ్చిమదేశాలకు హెచ్చరికగా ఈ దాడిని రష్యా తలపెట్టిందని నేటోలో అమెరికా మాజీ రాయబారి ఇవో దాల్డర్ బీబీసీతో అన్నారు.
ఈ దేశాల తోడ్పాటుతో యుక్రెయిన్ ఆధునిక క్షిపణులను రష్యా పై ప్రయోగిస్తే, అణ్వాయుధ దాడికి కూడా వెనకాడబోమని రష్యా ఆయా దేశాలను హెచ్చరిస్తోందని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, State Emergency Service of Ukraine
రష్యా దాడిపై పలు దేశాలు స్పందించాయి. రష్యా దాడి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంబంధాల్లో కలకలాన్ని సృష్టించింది.
దాడి జరిగిన తక్షణమే నేటోతో యుక్రెయిన్ అత్యవసర సమావేశాన్ని కోరిందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో అధికారులు తెలిపారు. ఈ అత్యవసర సమావేశం వచ్చే వారం బ్రస్సెల్స్ నగరంలో జరగనుంది.
దాడిపై చైనా స్పందిస్తూ 'ఇరు దేశాలు శాంతియుతంగా ఉండాలి, నిగ్రహాన్ని పాటించాలి' అని కోరింది. సంప్రదింపులు చర్చల ద్వారా పరిస్థితి సద్దుమణిగేలా చూసుకోవాలి అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లైన్ జియాన్ అన్నారు.
మరోవైపు నేటో ప్రతినిధి 'యుక్రెయిన్ మిత్ర దేశాలను భయపెట్టేందుకు రష్యా వేసే ఎత్తుగడలకు మేం జంకం. ఈ దాడి నేటో యుక్రెయిన్‌కు చూపుతున్న మద్దతుపైగానీ, ఈ యుద్ధం సాగుతున్న తీరుపై గాని ఎలాంటి ప్రభావం చూపించదు' అని వ్యాఖ్యానించారు.
రష్యా ఖండాంతర క్షిపణుల ప్రయోగం రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో ఒక ప్రమాదకర పరిణామాన్ని సూచిస్తోందని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షాల్జ్ అన్నారు. జర్మనీ మద్దతు యుక్రెయిన్‌కే అనడంలో సందేహం లేదు. కానీ ఆయుధ సాయం మాత్రం చేయమని అధికారికంగా ప్రకటించారు.
యుక్రెయిన్‌కు అండగా ఉండటమే కాక, ఆ దేశం కోసం ఏం చేయటానికైనా సిద్ధమే అని యూకే, ఫ్రాన్స్ ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్ ఖండంలో జరుగుతున్న అతిపెద్ద యుద్ధానికి రష్యా ఆజ్యం పోస్తోందని, ప్రపంచ దేశాల శాంతి భద్రతలకు రష్యా విఘాతం కలిగిస్తోందని యూకే, ఫ్రాన్స్ ఆరోపించాయి.
ప్రభుత్వ కార్యాలయాలకు నెలవైన కీయేవ్ ప్రాంతంపై రష్యా మరికొన్ని క్షిపణులను రష్యా ప్రయోగించవచ్చనే ఊహాగానాలతో శుక్రవారం జరగాల్సిన పార్లమెంట్ సమావేశాన్ని యుక్రెయిన్ ప్రభుత్వం రద్దు చేసింది.
రష్యా దాడితో ఈ యుద్ధం తార స్థాయికి చేరుకుందని, ప్రపంచ దేశాలు తప్పనిసరిగా స్పందించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్ స్కీ కోరారు .
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














