అమెరికా అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను మొదటిసారి రష్యా మీదికి ప్రయోగించిన యుక్రెయిన్..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మైయా డేవిస్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను యుక్రెయిన్ తొలిసారి రష్యా మీదికి ప్రయోగించింది.
ఈ క్షిపణుల ప్రయోగానికి యుక్రెయిన్‌కు అమెరికా అనుమతి ఇచ్చిన మరుసటిరోజే ఈ ఘటన జరిగింది. యుక్రెయిన్ ఈ దీర్ఘశ్రేణి క్షిపణిని ప్రయోగించినట్టు అమెరికా అధికారులు ధ్రువీకరించారు.
ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎంఎస్)తో రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ఉదయం యుక్రెయిన్ దాడి చేసిందని మాస్కోలోని రక్షణ శాఖ కార్యాలయం ప్రకటించింది.
ఐదు క్షిపణులను కూల్చివేశామని, ఒకటి తమకు నష్టం కలిగించిందని రష్యా తెలిపింది. క్షిపణి శకలాలు ఈ ప్రాంతంలోని తమ సైనిక స్థావరంలో అగ్నిప్రమాదానికి కారణమయ్యాయని వెల్లడించింది.
రష్యా భూభాగంలోకి అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులను యుక్రెయిన్ ప్రయోగించడం ఇదే తొలిసారి. రష్యాపైకి ఏటీఏసీఎంఎస్‌ను ప్రయోగించడానికి వాషింగ్టన్ అనుమతిచ్చిన కొన్ని గంటలకే యుక్రెయిన్ వాటితో దాడి చేసింది.
అయితే, ఇలాంటి ఆయుధాల ప్రయోగం జరిగితే తమ ప్రతిస్పందన సరైన రీతిలో, తీవ్రంగా ఉంటుందని ఈ దాడికి ముందే మాస్కో హెచ్చరించింది. ఈ చర్య.. నేటో నేరుగా యుద్ధంలో పాల్గొనడమే అవుతుందని పశ్చిమదేశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే హెచ్చరించారు.

మాస్కో స్పందన ఏంటి?
రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో యుక్రెయిన్ ఏడాదికి పైగా కాలం నుంచే ఏటీఏసీఎంఎస్‌లను ప్రయోగిస్తోంది.
300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణులు చేధించగలవు. వాటిని మధ్యలో అడ్డుకోవడం కష్టం.
ఇప్పుడు కర్క్స్ ప్రాంతంతో పాటు, రష్యా భూభాగంలోని సుదూర ప్రాంతాల్లోకి యుక్రెయిన్ మిస్సైళ్లను ప్రయోగించగలదు. కర్క్స్ ప్రాంతంలో 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై యుక్రెయిన్ బలగాలకు పట్టుంది. రష్యా ఈ ప్రాంతంలో ఎదురుదాడికి దిగే అవకాశముందని యుక్రెయిన్, అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం, ఉయదం 5 గంటల 55 నిమిషాలకు యుక్రెయిన్ దాడి జరిగింది. ఈ దాడిపై రష్యా రక్షణ శాఖ ప్రకటన చేసింది.
మిస్సైళ్ల దాడి వల్ల పడిపోయిన శిథిలాల నుంచి మంటలు చెలరేగాయని, అయితే వెంటనే ఆ మంటలు అదుపులోకి వచ్చాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.
రష్యాలోని బ్రయాన్స్క్‌లో మందుగుండు సామాగ్రి ఉన్నప్రాంతంపై దాడి చేశామని యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
ఈ దాడి జరగడానికి ముందు రష్యా అణు విధానంలో మార్పులకు పుతిన్ ఆమోదం తెలిపారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశం మద్దతున్న అణ్వాయుధరహిత దేశం నుంచి దాడి జరిగితే, దానిని తమపై జరిగిన ఉమ్మడి దాడిగా పరిగణిస్తామని రష్యా హెచ్చరించింది.

ఫొటో సోర్స్, White Sands Missile Range
ఏటీఏసీఎంఎస్ ప్రత్యేకత ఏమిటి?
యుక్రెయిన్ సరిహద్దుల ఆవల ఏటీఏసీఎంఎస్ క్షిపణులతో దాడి చేయడానికి కొన్ని నెలలుగా ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్‌స్కీ అనుమతి కోరుతున్నారు. అమెరికా ఆమోదం తెలిపిన తర్వాత మాట్లాడిన జెలియన్‌స్కీ.. "కొన్ని బహిరంగంగా ప్రకటించరు, క్షిపణులే మాట్లాడతాయి" అని అన్నారు.
ఏటీఏసీఎంఎస్ క్షిపణులు 300 కిలోమీటర్ల దూరం వరకు చేరుకోగలవు. అధిక వేగం కారణంగా వాటిని అడ్డుకోవడం కూడా కష్టం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














