యుక్రెయిన్‌కు అమెరికా మందుపాతరలు.. సరఫరాకు బైడెన్ ఆమోదం

ఫొటో సోర్స్, EPA
- రచయిత, జరోస్లావ్ లుకివ్, డేవిడ్ విల్లిస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
యుక్రెయిన్‌కు యాంటీ-పర్సనల్ ల్యాండ్ మైన్స్ సరఫరా చేసేందుకు జో బైడెన్ అంగీకరించినట్లు అమెరికా రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి ‘బీబీసీ’తో చెప్పారు.
ఈ మందుపాతరల సరఫరా త్వరలోనే ప్రారంభమవుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు.
వాటిని యుక్రెయిన్ తన భూభాగంలో మాత్రమే ఉపయోగిస్తుందని అమెరికా భావిస్తోందని ఆ అధికారి అన్నారు. అలాగే, జనావాసాల్లో వీటిని వినియోగించబోమని యుక్రెయిన్ చెప్పిందన్నారు.
ఇటీవల కొద్ది నెలలుగా యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా బలగాలు స్థిరంగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఈ ‘యాంటీ-పర్సనల్ ల్యాండ్ మైన్స్’ వాడకానికి సిద్ధపడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఫొటో సోర్స్, Reuters
ఎప్పుడు పేలతాయి?
డోనల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న వైట్‌హౌస్‌కు రావడానికి ముందే యుక్రెయిన్ యుద్ధ సన్నాహాలను మరింత బలోపేతం చేయడానికి బైడెన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు భావిస్తున్నారు.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి దిగిన తరువాత రష్యా మందుపాతరలను విరివిగా ఉపయోగించింది. కానీ.. అలాంటి ఆయుధాల వినియోగంపై అంతర్జాతీయంగా అభ్యంతరాలు ఉండడంతో యుక్రెయిన్‌కు వాటిని ఇచ్చే ఒప్పందంపై బైడెన్ ప్రభుత్వం సంతకం చేయలేదు.
అయితే.. కొద్దికాలం పాటు మాత్రమే యాక్టివ్‌గా ఉండే మందుపాతరలనే వినియోగిస్తామని యుక్రెయిన్ హామీ ఇచ్చిందని ‘బీబీసీ’తో ఆ అమెరికా రక్షణ అధికారి చెప్పారు.
రష్యా వాడే మందుపాతరల కంటే ఈ అమెరికా మందుపాతరలు భిన్నమైనవి. ఇవి ముందే నిర్ణయించిన ప్రకారం కొద్ది కాలం పాటు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి.
ఇవి 4 గంటల నుంచి 15 రోజుల వరకు యాక్టివ్‌గా ఉండేలా సెట్ చేసుకోవచ్చు. వీటిని పేల్చడానికి బ్యాటరీ నుంచి అందించే శక్తి అవసరం అవుతుంది.
బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే ఇవి పేలవు.

ఫొటో సోర్స్, White Sands Missile Range
అమెరికా ఇప్పటికే యుక్రెయిన్‌కు ‘యాంటీ ట్యాంక్ మైన్స్’ అందిస్తోంది. తాజాగా అందించనున్న ‘యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్’ గ్రౌండ్ ఫోర్సెస్ ముందుకు రాకుండా అడ్డుకోవడానికి ఉపయోగిస్తారు.
ఇప్పటికే అమెరికా అందించిన లాంగ్ రేంజ్ మిసైళ్లను యుక్రెయిన్ రష్యాపై తొలిసారి ప్రయోగించింది.
ఇలాంటి క్షిపణుల ప్రయోగానికి అమెరికా అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే యుక్రెయిన్ వాటితో రష్యాపై దాడి చేసింది.
కాగా ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ఏటీఏసీఎంఎస్)తో రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంపై యుక్రెయిన్ దాడి చేసిందని మాస్కోలోని రష్యా రక్షణ శాఖ కార్యాలయం ప్రకటించింది.
అయితే, ఇలాంటి ఆయుధాల ప్రయోగం జరిగితే తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఈ దాడికి ముందే మాస్కో హెచ్చరించింది. ఈ చర్య.. నేటో నేరుగా యుద్ధంలో పాల్గొనడమే అవుతుందని పశ్చిమదేశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














