జీబ్రా మూవీ ఎలా ఉంది, సత్యదేవ్ హిట్ కొట్టాడా?

ఫొటో సోర్స్, X/OldTownPictures
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
సత్యదేవ్ మంచి ప్రతిభ గల నటుడు అనిపించుకున్నప్పటికీ హీరోగా ఆయనకు సరైన బ్రేక్ రాలేదు. తాజా చిత్రం 'జీబ్రా'తో ఆ బ్రేక్ వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు.
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో ప్రధాన పాత్రలో నటించిన జీబ్రా చిత్రం ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి 'జీబ్రా' సత్యదేవ్ కోరుకున్న బ్రేక్ ఇచ్చిందా ?
సూర్య(సత్యదేవ్) ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో రిలేషన్ షిప్ మేనేజర్. ఓ రోజు అనుకోకుండా తన ఖాతాలోకి రూ.5 కోట్లు జమ అవుతాయి. వెంటనే ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. నిజానికి అది సూర్యపేరుతో వున్న నకిలీ అకౌంట్. అయితే అందులో జమయిన రూ. 5 కోట్లు తనవేనని ఆది (డాలీ ధనుంజయ) అనే గ్యాంగ్‌స్టర్ సూర్య వెంటపడతాడు. నాలుగు రోజుల్లో డబ్బు తిరిగివ్వాలని డెడ్ లైన్ పెడతాడు.
మరి సూర్య ఆ డబ్బుని తిరిగిచ్చాడా ? అసలు సూర్య పేరుతో నకిలీ అకౌంట్‌ని సృష్టించి ఆ డబ్బుని మాయం చేసింది ఎవరు? ఇవన్నీ తెరపై చూడాలి.


ఫొటో సోర్స్, X/Dhananjayaka
ఆర్థిక నేరాల చుట్టూ అల్లిక
ఆర్థిక నేరాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. బ్యాంకుల్లో లూప్ హోల్స్, ఓ గ్యాంగ్ స్టర్, మనీ లాండరింగ్ ఇలా మూడు విషయాలు ప్రధానాంశంగా కథ ముందుకు సాగుతుంది.
చెక్‌ని తప్పుగా డిపాజిట్ చేసిన తీరు, ఆ డబ్బుని మళ్లీ వెనక్కి తీసుకురావడంలో సూర్య వేసిన ఎత్తుగడ కథనంపై ఆసక్తిని పెంచుతాయి.
అయితే గ్యాంగ్‌స్టర్ ఆది పాత్ర ప్రవేశించిన తరవాత కథ గందరగోళానికి గురవుతుంటుంది. మరోవైపు సునీల్ పాత్ర నేపథ్యంలో వచ్చే మనీ లాండరింగ్ ఎపిసోడ్ ఇందులో అతకలేకపోయింది.
వేలకోట్ల రూపాయలు వెనకేసుకున్న ఆది, తన పరువు పోయిందని ఐదు కోట్ల రూపాయల కోసం సూర్య వెంటపడిన సన్నివేశాలు అంత బలంగా రాలేదు. ఆ సంఘర్షణ కూడా సరిగ్గా కుదరలేదు.
సెకండ్ హాఫ్‌లో వచ్చే బ్యాంక్ దోపిడీ ఎపిసోడ్‌ని కామెడీగా మలిచారు. అది లాజిక్‌కి దూరంగా ఉన్నప్పటికీ తెరపై వినోదాత్మకంగా కనిపించింది. ఇలాంటి కథలకు ముగింపు బలంగా వుండాలి. కానీ దర్శకుడు ఓ ఎమోషనల్ టచ్‌తో ముగించడం మైనస్‌గా మారింది.

ఫొటో సోర్స్, X/Old Town Pictures
ఎవరెలా నటించారు?
బ్యాంకర్ పాత్రలో సత్యదేవ్ చలాకీగా కనిపించాడు. సిచ్యుయేషన్ సీరియస్‌గా ఉన్నప్పటికీ కూల్‌గా కనిపించే క్యారెక్టర్ తనది. తన నటనతో ప్రేక్షకులని కథలో లీనం చేయడానికి గట్టి ప్రయత్నమే చేశాడు.
ఇందులో సత్యదేవ్ కంటే డాలీకి ఎక్కువ స్క్రీన్ టైం వుంది. అయితే ఆ పాత్రని దర్శకుడు స్పష్టంగా తీర్చిదిద్దలేకపోయారు. ఆ క్యారెక్టర్‌కు ఇచ్చిన బిల్డప్‌కి, రాసుకున్న సీన్లకి పొంతన వుండదు.
ప్రియాభవానీ శంకర్‌ది కూడా బ్యాంకర్ పాత్రే. ఇందులో ప్రేమకథకు పెద్ద ప్రాధాన్యం లేకపోయినా బ్యాంక్ దోపిడీ ఎపిసోడ్‌లో ఆ పాత్ర కీలకంగా మారింది. కమెడియన్ సత్య నటన కూడా దోపిడీ ఎపిసోడ్‌లోనే మెరుస్తుంది.
జెన్నిఫర్ నటన ఓకే గానీ తన డబ్బింగ్ వింతగా అనిపిస్తుంది. బహుశా నార్త్ నుంచి వచ్చిన బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోవాలి. సత్యరాజ్ క్యారెక్టర్ రొటీన్‌కి భిన్నంగా వుంటుంది. సునీల్ క్యారెక్టర్‌కు మంచి స్క్రీన్ టైం వుంది. తనదైన నటన కనబరిచారు. కేజీఎఫ్ గరుడ రామ్ ఒక్క సీన్‌కే పరిమితం అయ్యాడు.

ఫొటో సోర్స్, X/Oldtownpictures
సరికొత్తగా పాటలు
ఇది క్రైమ్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే కథ. అయితే ఇందులో దాదాపు ఆరు చిన్న పాటలు వినిపిస్తాయి. ఏదీ పూర్తి పాటలా వుండదు కానీ మాంటేజ్‌లా సమయాన్ని ముందుకు నడిపే పాటలే. ట్యూన్ పరంగా ఏదీ రిజిస్టర్ అవ్వదు. రవిబస్రూర్ ఆర్ఆర్ కొన్నిచోట్ల మెరుస్తుంది.
కెమెరా పనితనం డీసెంట్‌గా వుంది. బ్యాంక్ సెట్ నేచురల్‌గా కుదిరింది. ఎడిటర్ సెకండ్ హాఫ్‌లో కత్తెరకి పని చెప్పాల్సింది. దాదాపు ఓ పదిహేను నిమిషాలు సినిమాని సాగదీసిన వైనం కనిపిస్తుంది.
కథగా చూసుకుంటే జీబ్రా ఆసక్తిని కలిగించే క్రైమ్ డ్రామానే. అయితే ఆ కథలోని ఆసక్తిని తెరపై తీసుకు రావడంలో దర్శకుడిలో తడబాటు కనిపించింది. తను ఆనుకున్న అంశాలన్ని థ్రిల్ ఇవ్వకపోగా చాలా వరకూ గందరగోళాన్నే మిగిల్చాయి.
చాలా కాలంగా ఓ మంచి హిట్టు కోసం చూస్తున్న సత్యదేవ్ నిరీక్షణని జీబ్రా మరింత పొడిగించింది.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














