హైకోర్ట్ బెంచ్ అంటే ఏమిటి? కర్నూలులో ఏర్పాటు చేస్తే రాయలసీమకు కలిగే ప్రయోజనం ఏమిటి

ఆంధ్రప్రదేశ్, హైకోర్టు, అమరావతి, కర్నూలు, హైకోర్టు బెంచ్, చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్, వైసీపీ

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ నవంబర్ 20న ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించి సీఎం కార్యాలయం నుంచి హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి వి. సునీత లేఖ రాశారు.

రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైన కేసులు వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి ఆ లేఖలో కోరారు.

బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి మూడింట ఒక వంతు కేసులు ఉండాలని కూడా పేర్కొన్నారు.

రాష్ట్ర మొత్తం జనాభా 4.95 కోట్లు ఉండగా అందులో రాయలసీమలో రీజియన్‌లో 1.59 కోట్ల మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో 25 శాతం మంది కంటే ఎక్కువ ఈ రీజియన్‌లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే రాష్ట్ర భూభాగంలో 43 శాతం రాయలసీమలో ఉందని పేర్కొంది.

రాయలసీమ రీజియన్ నుంచి నేరుగా రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేదని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమకు మధ్యలో ఉన్న కర్నూలు నుంచి ఒక్క రైలు కూడా అమరావతికి లేదు, వైఎస్సార్ జిల్లా నుంచి మాత్రం ఒక్క రైలు ఉందని ఆ లేఖలో తెలిపారు.

హైకోర్ట్‌లో ఈ రీజియన్ నుంచి వచ్చిన కేసుల్లో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్న వివరాలు కూడా ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయశాఖ కార్యదర్శి సునీత కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా గళంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాలు (తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం) హైకోర్ట్ బెంచ్‌లు ఏర్పాటు చేశారని అధికారులు ఆ లేఖలో తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హైకోర్ట్ బెంచ్ కంటే ముందు హైకోర్టు కోసం...

ఈ హైకోర్టు బెంచ్ అంటే ఏంటో తెలుసుకునేందుకు ముందుగా హైకోర్టు గురించి కొంత సమాచారం చూద్దాం.

ఈ విషయాలను విశాఖకు చెందిన సీనియర్ న్యాయవాది శ్రీలక్ష్మి బీబీసీతో చెప్పారు.

హైకోర్టు భారతదేశంలోని ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం. ప్రతి రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేలా పార్లమెంటులో చట్టం చేయవచ్చు.

రాజ్యాంగంలోని 6వ భాగం, 5వ అధ్యాయం, 214వ నిబంధనను అనుసరించి హైకోర్టులను ఏర్పాటుచేశారు.

మొత్తం భారతదేశంలో 25 హైకోర్టు‌లు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, హైకోర్టు, అమరావతి, కర్నూలు, హైకోర్టు బెంచ్, చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్, వైసీపీ
ఫొటో క్యాప్షన్, హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కర్నూలులోనే ఉంటాయని సీఎం చంద్రబాబు చెప్పారు.

హైకోర్ట్ బెంచ్ అంటే ఏంటి?

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ఇప్పుడు కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ప్రక్రియ మొదలుకావడంతో రాయలసీమకు ప్రయోజనమేనని కర్నూలుకి చెందిన న్యాయవాది దాశెట్టి శ్రీనివాసులు బీబీసీతో అన్నారు.

హైకోర్టు బెంచ్ అంటే మెరుగైన న్యాయ నిర్వహణ కోసం విస్తరించిన శాఖ అని చెప్పుకోవచ్చు.

హైకోర్టుకు మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసిన విభాగం లేదా శాఖనే ఆ హైకోర్టుకి సంబంధించిన "బెంచ్" అని పిలుస్తారు.

ఉదాహరణకు మధ్యప్రదేశ్ ప్రధాన హైకోర్టు జబల్‌పుర్‌లో ఉంది. ఆ రాష్ట్రంలోని ఇందోర్, గ్వాలియర్‌లలో ఉన్న హైకోర్టు బెంచులను శాఖలుగా చూడాలి. అంటే హైకోర్టు ప్రధాన కార్యాలయంలో కాకుండా వేరే చోట హైకోర్టు సిట్టింగులు (కేసుల ఫైలింగ్ తో పాటు ఇతర కోర్టు సేవలు) నిర్వహించేవే హైకోర్టు బెంచ్‌లు.

బెంచ్ అనేది న్యాయస్థానం లేదా న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు కోర్టులో కూర్చునే ప్రదేశం.

ఆంధ్రప్రదేశ్, హైకోర్టు, అమరావతి, కర్నూలు, హైకోర్టు బెంచ్, చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్, వైసీపీ

ఫొటో సోర్స్, Getty Images

హైకోర్ట్ బెంచ్ లు ఎలా ఉంటాయంటే..

ఒక హైకోర్టు బెంచ్‌లో ఏదైనా కేసును ఒక న్యాయమూర్తి విచారిస్తే...దానిని సింగిల్ బెంచ్ అంటారు. ఇద్దరు న్యాయమూర్తులు విచారిస్తే...దానిని డివిజన్ బెంచ్ అంటారు. అదే ముగ్గురు న్యాయమూర్తులైతే ఫుల్ బెంచ్ అని, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులుంటే దానిని రాజ్యాంగ ధర్మాసనం అంటారు.

మారుమూల ప్రాంతాల్లో లేదా ఆ రాష్ట్ర పరిధిని దాటి మరో ప్రాంతంలో కొన్ని ప్రత్యేక కేసుల నిమిత్తం ఏర్పాటైన బెంచ్‌లను సర్క్యూట్ బెంచ్ అంటారు. అంటే మరో ప్రాంతంలో విచారించడానికి ఒక న్యాయమూర్తి ఆ ప్రాంతానికి వెళతారు.

విడివిడిగా సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, ఫుల్ బెంచ్, రాజ్యాంగ ధర్మాసనం (కాన్సిస్ట్యూషనల్ బెంచ్), సర్క్యూట్ బెంచ్ అనే పేర్లు ఉన్నప్పటికీ వీటన్నింటిని కలిపి లేదా ఈ న్యాయమూర్తులందరినీ కలిపి స్థూలంగా బెంచ్ అంటారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 (3) ప్రకారం రాజ్యాంగ వివరణలు అవసరమయ్యే విషయాలను విచారించడానికి ఐదు మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్ నే రాజ్యాంగ బెంచ్ అంటారు.

దీనినే ప్రత్యేక బెంచ్ అని కూడా అంటారు. అలాగే ప్రజా ప్రాముఖ్యం ఉన్న చట్టపరమైన ప్రశ్నలను పరిష్కరించేందుకు అవరమైనప్పుడు ముగ్గురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసే బెంచ్‌ను ఫుల్ బెంచ్ అంటారు.

ఆంధ్రప్రదేశ్, హైకోర్టు, అమరావతి, కర్నూలు, హైకోర్టు బెంచ్, చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్, వైసీపీ

ఫొటో సోర్స్, https://mphc.gov.in/

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో ఏర్పాటు చేసిన హైకోర్టు బెంచ్

హైకోర్ట్ బెంచ్‌ను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారంటే

ఒక హైకోర్టు బెంచ్‌ను స్థాపించాలంటే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్ సమ్మతితో బెంచ్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఈ ప్రతిపాదన తప్పనిసరిగా జస్వంత్ సింగ్ కమిషన్ సిఫార్సు చేసిన విస్తృత మార్గదర్శకాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడు భారత ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఖర్చులను భరించాలి.

హైకోర్టు బెంచ్ పరిపాలన బాధ్యతను ఆ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తే వహిస్తారు. హైకోర్టు ప్రధాన కార్యాలయం నుంచి న్యాయమూర్తులను నియమించవచ్చు.

“న్యాయవాదులు, సాక్షులకు సులభంగా న్యాయం చేయడం ప్రభుత్వ విధానం. బెంచ్‌ల స్థాపనపై నిర్ణయాలు హేతుబద్ధమైన పరిశీలనల ఆధారంగా ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింది” అని విశాఖకు చెందిన సీనియర్ న్యాయవాది శ్రీలక్ష్మి బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, హైకోర్టు, అమరావతి, కర్నూలు, హైకోర్టు బెంచ్, చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్, వైసీపీ

ఫొటో సోర్స్, SCREENGRAB/SUPREME COURT OF INDIA

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం విచారణ

హైకోర్ట్ బెంచ్ ప్రయోజనాలు...

కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టుని కర్నూలుకి తరలిస్తామని చెప్పింది. అయితే ఐదేళ్లలో ఆ హామీని నెరవేర్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. అసలు హైకోర్టు బెంచ్ వలన కలిగే ప్రయోజనాలను సీనియర్ న్యాయవాది శ్రీలక్ష్మీ బీబీసీకి వివరించారు.

1. న్యాయ సేవలను పొందేందుకు ప్రయాణించాల్సిన దూరం తగ్గుతుంది. హైకోర్టు బెంచ్ స్థానికంగా ఉండటం వలన, ప్రజలు తమ న్యాయసమస్యలను పరిష్కరించుకోవడం కోసం రాజధాని వరకు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. ఇది న్యాయ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది. ఉదాహరణకు అనంతపురంలోని ఒక వ్యక్తి కేసు నిమిత్తం అమరావతిలోని హైకోర్టుకి రావాలంటే 450 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం, డబ్బు ఖర్చవుతుంది. అదే కర్నూలు బెంచ్ కి వెళ్లాలంటే 150 కిలోమీటర్ల ప్రయాణంతో సరిపోతుంది.

2. స్థానిక చట్ట పరిరక్షణ మెరుగవుతుంది. స్థానికంగా హైకోర్టు బెంచ్ ఉండటం వలన చట్టపరమైన సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.

3. ఆర్ధిక, వాణిజ్య అవకాశాలు పెరుగుతాయి. హైకోర్టు బెంచ్ ఆ ప్రాంతంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, మరియు ఇతర సహాయక సిబ్బందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఇది స్థానికంగా ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది.

4. మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. హైకోర్టు బెంచ్ ఒక ప్రాంతంలో ఏర్పాటవ్వడం వలన కొత్త కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, ఇతర వసతులు అభివృద్ధి చెందుతాయి.

ఆంధ్రప్రదేశ్, హైకోర్టు, అమరావతి, కర్నూలు, హైకోర్టు బెంచ్, చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్, వైసీపీ

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయశాఖ లేఖ రాసింది.

గుంటూరులో హైకోర్ట్ ఉండేది..

అక్టోబరు1,1953 నుండి అక్టోబర్ 31,1956 వరకు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. మళ్లీ వైసీపీ ప్రభుత్వ విధానమైన మూడు రాజధానుల్లో భాగంగా 2019లో కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడు ఇక్కడ హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం.

1953 నుంచి 1956 వరకు గుంటూరులో హైకోర్టు ఉండేది.

ఆంధ్ర, తెలంగాణలు కలవడంతో 1956లో హైకోర్టు హైదరాబాద్‌కు తరలించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి హైకోర్టు విభజన జరిగి అమరావతి కేంద్రంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019జనవరి 1 నుంచి 14 మంది న్యాయమూర్తులతో పనిచేయడం ప్రారంభించింది.

1956 నుంచి 2014 మధ్యలో తమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరుల్లో డిమాండ్లు వినిపించేవి. కానీ అవి ఎప్పటికప్పుడు బలహీనపడుతూనే ఉండేవి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబరులో నిర్ణయం తీసుకుంది.. కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ న్యాయపరమైన అంశాల కారణంగా మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వమే వెనక్కు తీసుకుంది. హైకోర్టు కూడా శాసన,కార్యనిర్వాహక,న్యాయ వ్యవస్థలను వేరువేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని తీర్పు చెప్పింది.

ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఏపీ న్యాయశాఖ...హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాసింది.

“లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి కర్నూలు లోనే ఉంటాయి.” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)